పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Srikanth Kantekar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Srikanth Kantekar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జూన్ 2014, ఆదివారం

Srikanth Kantekar కవిత

దశకంఠుడి చెరలో నువ్ ఓ సీతా.. ఓ సాథ్వీ దుఃఖ అ'శోక' వనంలో నువ్వు ఓ తామసి.. ఓ తపస్విని.. విముక్తినివ్వలేని దుఃఖగీతాన్ని నేను రాతిని పడతిగా మార్చలేని రాముడిని నేను ఈ ధర్మధరిత్రిపై ఓ అబల ఆక్రందనకు వలువలు ఇచ్చి విలువ కాపాడలేని శ్రీ కృష్ణుడిని నేను ఓ అరుంధతి.. ఓ విషాదస్మృతి! రాముడు రాడు! రాక్షస రాజ్యం కూలదు ఏ కమల వానరమూ తన తోకను అంటించి.. ఈ కామాంధుల లంకను దహించదు ఓ సత్యభామా, రుద్రమా కత్తికొక కండగా నరికేయ్ ఈ ఉన్మాదులను నా హృదయాన్ని,అక్షరాన్ని నీకు కరవాలంగా బహుకరిస్తాను - శ్రీకాంత్ కాంటేకర్

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kNWap0

Posted by Katta

30, మే 2014, శుక్రవారం

Srikanth Kantekar కవిత

కెరటం (m) ------------ రోజూ తప్పిపోతుంటాం ఆలోచనదారుల్లో బతుకుపట నుంచి పక్కకు జరిగినట్టు ఏ వివరం లేని అనాసక్తిలోకి జారిపోతాం కాసిన చెట్టుమీద రాళ్లుపడ్డట్టు కుదుపుతున్న ఆలోచనలు శాంతంలేని మనసుకు ఎత్తుపల్లాల ఎదురుదారిలో లాక్కెళుతుంటాం బతుకురథాన్ని గజిబిజి కాలం రచించే ప్రతి సందర్భం కావ్యం కాదేమో ఆశించనదేది దొరకదని చెప్పే ప్రేమ గురించి ఆశలు వదులుకోలేని మనసు గురించి స్థూలంగా గ్రహించడమే జీవిత సూత్రమేమో ప్రతి బతుకు కథలో అంతర్లీనంగా దుఃఖముంటుందన్న స్పృహ కలుగడమే దర్శించాల్సిన సూక్ష్మ సత్యమేమో బతుకుబాటలో కిందామీద పడిపోయే సంక్షోభాన్ని గుండె ధైర్యంతో ఎదురొడ్డి ఎదురీదాలి ప్రవాహానికి ఎదురుపడ్డ ప్రతి తీరం గురిగా వెన్నుతట్టి సంధించాలి కెరటాన్ని - శ్రీకాంత్ కాంటేకర్ 30-5-14

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6uyfA

Posted by Katta

21, మే 2014, బుధవారం

Srikanth Kantekar కవిత

రోజూ తప్పిపోతుంటాం ఆలోచన దారుల్లో ఏ విషయంలోకి వివరంగా వెళ్తామో ఏ అనాసక్తి పట్టీపట్టి నెట్టుకుపోతుందో కాసిన చెట్టు మీదే రాళ్లు పడ్డట్టు కుదుపుతున్న ఆలోచనల అలజడి మనసుకింత ప్రశాంతత కావాలిప్పుడు ఎత్తుపల్లాల ఎదురుదారిలో బతుకుబండి పయనం గజిబిజితనాల్లో గడిచిపోతుంటే కాలమెక్కడ దారితప్పుతుందో ప్రేమించినది దొరకదని.. ఆశించుట భంగపాటు కొరకని తత్వమెప్పుడూ చెప్తుంటుంది! ధిక్కరించు.. సమాజమెప్పుడు నీకు నచ్చినట్టు ఉండనివ్వని సిద్ధాంతమే సత్యముందని నమ్మి.. ఆచరించి దాని కొన అంచు అయినా పట్టుకొని ముందుకేవెళ్లు.. బతుకుబాటలో బెంగటిల్లుతామో..బెజారెత్తుతామో గుండెధైర్యం సడలిపోతే కిందామీదా అయిపోయి సంక్షోభించుకుంటామో ఏదేమైనా ప్రవాహానికి ఎదురీదాలి ప్రవాహంలా ముందుకే డొల్లిపోతూ.. కెరటం వెన్నుతట్టి.. తీరం గురిగా ప్రతిసారి సంధిస్తూనే ఉండాలి - శ్రీకాంత్ కాంటేకర్ date: 20/5/14

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1thX3bF

Posted by Katta

18, మే 2014, ఆదివారం

Srikanth Kantekar కవిత

ష్..! నిజంగానే అనిపిస్తుందెందుకో! ఏంటో ఈ జీవితమని!! కరుకుచూపులేవో తాకినప్పుడు గాలికి వణికిన చిగురాకులా.. అప్పుడప్పుడు అనిపించినా తప్పేమీ కాదేమో! పిడికెడు రాళ్లకు పెట్టుకున్న తాకట్టు జీవితాలకు పొడుచుకొచ్చే కోపాల విలువేందని?! ఉన్నదున్నట్టు ఈడ్చుకెళ్లడమో గుంజుకెళ్లడమో బడిలోనో, గుడిలోనో బోధించని ఒక విద్య అని..! గుడ్ల నీళ్లు గుడ్లలోనే దిగమింగుకుపోవాలి.. ష్..! తిట్లు పొరలిరాకూడని నిశ్శబ్ద క్షేత్రమిది!! షట్! అంత కాల్పనికం.. బూటకం! బతుకులకు, మెతుకు తలరాతలకు లింకు లేదు.. అక్షరాలను తవ్వింది చాలు.. వెళ్లి పనిచూస్కోండి ఎవడన్నా రాసుకున్న ఊహల్లో చీకటి తొవ్వలెవన్నా ఉంటే వెతుక్కోండి!

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jHviSq

Posted by Katta

10, మే 2014, శనివారం

Srikanth Kantekar కవిత

అనర్హ మౌనం ---------------- ఏ అర్హత లేని మౌనంతో, దుఃఖంతో నన్ను నేను కప్పిపెట్టుకుంటాను అరడుగుల నిశ్శబ్దంలో చేయమని, వద్దని.. చెప్పలేక కూరుకుపోతాను పీకల్లోతు సందిగ్ధంలో ఇక నా సమ్మతో, తిరస్కృతో ఎందుకంటాను? నువ్ ముందుకెళ్లే దారిలో ఏ అడ్డూ కాలేను? నీ సంకల్పానికి ఆటంకమయ్యే మూర్ఖత్యాన్ని ఎందుకవుతాను? నీ అమితమైన మంచితనాన్ని చూడలేని దృష్టిలోపమేమో? ఈ అకారణ దుఃఖ ఆవేశానికి ఏ అర్థంపర్థం లేదేమో? కానీ... అభిజాత్యంతో, స్వీయ అస్తిత్వ అహంతో నాకంటూ ఒక ఆత్మ ఉంటుందని నాకంటూ ఒక దేహం ఉంటుందని పంపకం కాని ప్రేమ తరగల్లో పునర్జన్మలు పోసుకుంటానని.. ఎందుకీ పిచ్చితనం? ఇది అనర్హ మౌనం! ఇది అనర్హ దుఃఖం!! - శ్రీకాంత్ కాంటేకర్

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kTH6mQ

Posted by Katta

9, మే 2014, శుక్రవారం

Srikanth Kantekar కవిత

నువ్వెదో రాసేస్తే అదేదో అద్భుతమని నీ అంతరంగమెప్పుడూ మెచ్చుకుంటుంది పొంగిపోతున్నవ్ కదూ! నీ అక్షరాలు నీవి కావు అవి నీ హృదయ స్పందనలై నీ ప్రతిరూపాలై వ్యక్తంకావు జీవితాన్ని ఎంత చదివితేనేమీ దుఃఖాన్ని వ్రతంగా చేస్తున్నవ్ ఎవరి అంతర్మథనంలోనో ముక్కలు ముక్కలుగా కూలిపోతున్నావ్ అద్దంలోంచి దూకేసి.. నదిలో ఎవరి ప్రతిబింబాన్నో తాగేసి నీ నీడను ఎక్కడో పడేసి వచ్చావ్ ఇక నీ రక్తంలో తడిసి.. నీ జీవంతో మెరిసి ఈ పదాలెలా పునర్జన్మలెత్తుతాయ్ కాగితాలను తిరగేస్తూ పోతే నువ్వూ కనిపించవు.. నీ రక్తమూ కనిపించదు తన కోసం తపిస్తూ చేసిన దేవులాట తప్ప ఇక తన దుఃఖంలో నిండా తడిసినప్పుడు ఈ కాగితాలపై నీ చిక్కని సిరా చుక్కల ఘాటు అక్షరాలే సజీవ శ్వాసలై కనిపిస్తుంటాయ్ - కాంటేకర్ శ్రీకాంత్

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l6T0vu

Posted by Katta

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Srikanth Kantekar కవిత

కొత్త అసందర్భం.. ----------------- అస్పందన అద్దుకొని.. మౌనాన్ని తృప్తిగా పుక్కిలించాలి రాయడం వ్యసనమో..పిచ్చో అయినప్పుడు ఇ.. న్ని.. అక్షర పుక్కిలింతలెందుకు? మార్మిక కాలం మంత్ర దీక్షకు మౌనం ఒక కంకణమవ్వాలి పొడి పొడి అక్షరాలతో తడి ఇసుక ఒడ్డును చదును చేసి .. కెరటాలు మోహించే రెండు పేర్లను రాసి.. ఇక అంతర్థానం కావాలి చేరని అదూర తీరంలో చెరిగిపోని అమర స్పర్శగా..!! - శ్రీ..

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bKSq5N

Posted by Katta

5, ఫిబ్రవరి 2014, బుధవారం

Srikanth Kantekar కవిత

నేను-4 --------- ఎవరో నువ్వు ఎల్లలులేని ప్రపంచంలో ఎదురుపడి ఎగిసిపడే నన్ను పట్టుకుంటావ్ ఎలా నువ్వు యెదలోకి చేరి యేదో మాయ చేసి అసంకల్పితంగా నాకు సంకెళ్లు వేస్తావ్ నీ మాటల దారిలో నన్నొక ప్రతిస్పందనగా మలుస్తావ్ ఊహకందవ్ మరెందుకో ఊపిరిలో ఒదుగుతావ్ మరెలాగో నా ఉద్వేగంలోనూ, ఉద్రేకంలోనూ నీకే లొంగిపోతాను విజయపు కిరీటాన్ని తీసి గర్వపు ఖడ్గప్రహరాన్ని పడవేసి ఓ వనదేవత! నన్ను స్వీకరించు అని సమర్పించకుంటాను మల్లెపూల నీ వాలుజడ నా మెడ చుట్టు చుట్టి వెన్నెల జల్లు చుట్టు పరిచి పరుచుకున్న నీ ఒడిలో ఒదుగుతాను చెప్తూ చెప్తూ పోతావ్ మన కథను చివరి అంచు వరకు లాక్కెళ్లి మరణం గురించీ చెప్తావ్ మరణించనిదంటావ్ మన ప్రేమ విడదీయలేనిదంటావు మన స్నేహం పిచ్చిదానా! నీ తల నిమిరి నీ నుదిటన తిలకమై పూస్తాను నిన్ను నమ్మకంగా గుండెలోకి తీస్కోని ఈ బంగారు క్షణాల్లో నిన్ను బతికించుకుంటాను మృతప్రాయమై నిత్యం ప్రవహించే కాలం చింత మనకెందుకు ఈ బతికిన క్షణాల్లో భయం దరిచేరని బహ్యా ప్రపంచం గోల తెలియని అమృత కథనం మనం అమరగానం మనం నిరామయ, నిర్వాణ చిదానంద ఆత్మలం మనం - శ్రీకాంత్ కాంటేకర్

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bpp0Ef

Posted by Katta

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Srikanth Kantekar కవిత

19 --------------- పంతాలకో పట్టుదలలకో పట్టుబడిపోతాం అహల అడ్డగీతలను అడ్డుపెట్టుకుంటాం స్నేహాలకు సంకుచిత సున్నాలు చుట్టి వ్యక్తిగత దర్పాలకు విజయపు గర్వాలను తొడుగుతాం హితురాలా!! సహజచిత్తంతో సంచరించే మనిషి కనలేడు ఎదుటివాడి ఏడ్పును వాంఛించడు తన సుఖాల కొంతమాని లోకపు దుఃఖాల ధారలను తుడవాలని.. మనిషి మనిషి కాలేడు పరమేలు కాంక్షించనప్పుడు హితురాలా! ఆధిపత్యమే విజయమనుకుంటే అడుగులకు అడ్డుకట్టలే స్వేచ్ఛగా చెలామణైతే వ్యక్తిగత అహమే వేడుక అవుతుంది వాదనలో పైచేయ్యే వరమనిపిస్తుంది సత్యం.. ప్రేమ.. మానవతా తాలూకు చివరి పత్రహరితమూ మోడుబారుతుంది హితురాలా! స్నేహంలో జయాపజయాలకు తావులేకుంటేనే త్యాగాల తీగలకు పువ్వులుగా పూయగలం! - కాంటేకర్ శ్రీకాంత్

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MKqDHn

Posted by Katta

1, ఫిబ్రవరి 2014, శనివారం

Srikanth Kantekar కవిత

20 ----------- మూసిన గదినిండా నీ ఆలోచన ఉంది రాసిన పేజీల నిండా నీ జ్ఞాపకాలున్నాయ్ విచ్చుకొని మది నిండా నువ్వు విసిరిన నవ్వులున్నాయ్ పిచ్చి..! ఐ మిస్ యు అంటావేం నన్నెప్పుడు తొలగిపోని ఒంటరితనంలా నువ్ పదిలమైవుంటే! - శ్రీ

by Srikanth Kantekar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1beqAJa

Posted by Katta

22, సెప్టెంబర్ 2012, శనివారం

కాంటేకార్ శ్రీకాంత్ // ఇప్పుడు //

ఇప్పుడు
కన్నీళ్లలో ఉప్పదనం తగ్గిపోయింది
ప్రేమలో చిక్కదనం తగ్గిపోయింది
బంధాలలో గట్టిదనం తగ్గిపోయింది
వ్యవస్థలో గొప్పదనం తగ్గిపోయింది
చివరాఖరుకు.. మానవత్వానికి విలువ తగ్గిపోయింది

అందుకే ఈ ఇప్పుడు నాకు అనవసరం
అసంగతి, నచ్చని వ్యవహారం

olden days are golden days
అవును, పాత రోజులు, పాత మనుషులు,
పాత కాలం.. అవే ఆ పాత మధురాలు
గడిచిన స్మృతి అంతా గొప్పదిగా నిలిచిపోతుంది
ఆ రోజుల్లో అని చెప్పుకుంటే
గొప్ప భావాలు పొంగుకొస్తున్నాయి
నడుస్తున్న కాలం తన విలువను కోల్పోయి
నిస్సారంగా మారుతోంది
ఈ రోజుల గురించి మాట్లాడటానికి మనసొప్పడం లేదు
మాటలూ రావడం లేదు

ఎందుకు,
తోటి మనిషిని చూసి
ఆత్మీయంగా పలకరించి
కొన్ని ఊసులాడేందుకు నీకు సమయం లేదు
కాంక్రీట్ జంగల్లో.. మహా విశాలమైన అపార్ట్ మెంట్లలో
నీదొక ఇరుకు బతుకు
ఇరుగుపొరుగు సంబంధం లేని బతుకు
పక్క ఇంటి కష్టనష్టాలు, సుఖదుఃఖాలు
నీ చెవికి సొకవు.. నీకు ఆసక్తి రేపవు
నీ పొరుగువారితో ముఖ పరిచయమూ ఉండదు
ఈ జనారణ్యంలో తెలిసిన ముఖాలే కనిపించవు
సాయం చేయాలన్నా తలంపూ రాదు
వచ్చినా అందరూ పరాయివాళ్లే..
నీకు చేతులు రాని పరిస్థితి
నువ్వు నాకు ఎంత దూరమో..నేను నీకు అంతేదూరం
కనుక నీకు-నాకు ఎప్పుడు పొత్తే కుదరదు
మాట కలవదు.. ముచ్చటకు సమయం దొరకదు
పక్కపక్కనే ఉన్నా రైలు పట్టాలలాగా ఎప్పుడూ కలవకుండా
జీవన ప్రవాహంలో కొట్టుకుపోతాం
ఎంత విచిత్రం, నిత్యం కిటకిటలాడుతూ
కాలు పెట్టడానికి సందు దొరికని మహా నగరంలో
మనుషుల మధ్య ఎంతో దూరం

ఇక ప్రస్తుత విలువలు, మానవతా దృక్పథం, రాజకీయాల గురించి
తక్కువే మాట్లాడుకోవాలి మిత్రమా
బురదలో రాయి వేయడం వల్ల మనకూ అడుసు అంటకపోదు
ఈ వ్యవస్థతో రాసుకుపూసుకు తిరుగుతున్నవారమే కదా
ప్రస్తుతం ప్రబలుతున్న అనాగరిక, ఆధునిక బతుకులో
మనకు లేశమాత్రమైనా పాత్ర ఉంది కదా
కనుక ఈ ఇప్పుడు గురించి నేనేమీ చెప్పలేను
నిన్నమొన్నటి.. ఆ పాత రోజుల గురించి అడుగు
నా కవిత్వం, నా భావాలు వెల్లువెత్తుతాయి.. కీర్తిస్తాయి

15, సెప్టెంబర్ 2012, శనివారం

కాంటేకార్ శ్రీకాంత్ // పొక్కిలైన నేల //


తెలంగాణలాగే
నాదీ ఒక ఒడవని సంభాషణ
ఏమని మొదలుపెట్టను
ఎక్కడి నుంచి చెప్పుకురాను
తొలి పోరాటంలో అసువులు బాసిన
370 మంది వీరుల త్యాగాలను కీర్తించనా!
మలి పోరాటంలో
నిప్పుకు మలమల మాడిన
ఉరితాడుకు బిగిసిన
850 మంది అమరుల ఆకాంక్ష గురించి చెప్పనా!
ఏది చెప్పినా ఆగని దుఃఖమే
నా మాటల కన్నా
జలజలరాలే నా కన్నీళ్లు ఎక్కువగా చెబుతయి
తెలంగాణల ఆవరించిన వేదనాభరిత జీవితం గురించి
ఎదిగివచ్చిన కన్నబిడ్డలు దూరమైన
అమ్మల దుఃఖాన్ని వివరించనా?
ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి
అంధకారం అలుముకున్న
కుటుంబాల శోకాన్ని వర్ణించనా?
శ్రీకాంతచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, యాదిరెడ్డి
ఇలా ఒక్కరా.. ఇద్దరా.. ఎందరెందరో
ఒకే ఒక ఆకాంక్ష కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు
మా చావుతోనైనా పాలకులు కళ్లు తెరుస్తారేమో!
అనైతిక ద్వంద్వ నీతిని వీడి ధర్మపక్షమైన
తెలంగాణకు సై అంటారెమో!
మా మరణంతోనైనా రాజకీయ నాయకులు ఒక్కతాటిపైకి వస్తారెమో!
తెలంగాణ కోసం ఒక్క అడుగైనా పడుతుందేమో!
అన్న ఆశతో 850కి పైగామంది అమరుల జాబితాలో చేరారు
త్యాగాల దారిలో పొద్దుపొడుపులయ్యారు

ఏం జరిగింది
త్యాగాల బలిపీటం
తెలంగాణ యదపై ఆరని నిప్పుల కుంపటిగా ఎందుకు మారింది
ముక్కు పచ్చాలారని విద్యార్థులు,
యువకుల ప్రాణాలను ఎందుకు హరిస్తోంది
యదనిండా గాయాలతో తెలంగాణ
పొక్కిలైన వాకిలిలా ఎందుకు వలపోస్తోంది

కారణం తెలుసా?
ఒక ఘనమైన ప్రజాస్వామ్యం
ఒక ఘనమైన పార్లమెంటు
ఒక ఘనమైన కాంగ్రెస్ ప్రభుత్వం
ఒక ఘనమైన సోనియా పుట్టిన రోజు
ఒక ఘనమైన డిసెంబర్ 9 ప్రకటన

అంతకన్నా ఘనమైన బూటకపు నీతి
ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని నిలువెత్తు దౌర్భాగ్యం
ప్రజా ఆకాంక్షను నిలబెట్టలేని నీచమైన రాజకీయ వ్యవస్థ
పెట్టుబడిదారులు, మాటమార్చే దగాకోరు రాజకీయ నేతలకు
వంగి వంగి సలాం కొడుతూ
గులాములైన పాలకులు, నాయకులు

తెలంగాణ ఎన్నిసార్లు తర్కించుకొని ఉంటుంది
ఎన్నిమార్లు ఆవేదన చెంది ఉంటుంది
ఘనమైన పార్లమెంటు ముందు
ఘనంగా చేసిన ప్రకటనను కూడా నిలబెట్టుకోరా?
అప్పటిలాగే ఇప్పుడు ఎప్పుడూ
మా పట్ల ద్రోహమే మీ పాలకుల నీతా?
ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని
ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వం, ఈ నాయకులు
చీము, నెత్తురు లేకుండా
సిగ్గు, శరం లేకుండా
అవే తలలతో ఎలా తిరుగుతున్నారు?
అమ్మా, అయ్యకు పుట్టలేదా?

తెలంగాణకు వెలుగు పంచాల్సిన
ఎన్ని చిరుదివ్వెలు చీతాభస్మాలవుతున్నా
తెలంగాణ ఇంకా ఒక నెరవేరని స్వప్నమే!
త్యాగాల సాలులో రాజకీయ మోసాల జిల్లేళ్లు మొలుస్తున్నాయి
ఢిల్లీ పాలకుల్లో ఉలుకూపలుకూ లేదు
ఇచ్చిన తెలంగాణ తెచ్చుకోవడంలో ఇక్కడి నాయకుల్లో చలనం సచ్చిపోయింది
మళ్లీ పోరాటమే శరణ్యం
కలెబడి, తెగబడి కదం తొక్కితేనా తెలంగాణ
ఇంట్లో గూకుంటే రాదు

12, సెప్టెంబర్ 2012, బుధవారం

కాంటేకార్ శ్రీకాంత్ // అచ్చమైన స్వచ్ఛమైన మనిషి //


నా హృదయంలోని కొన్ని భావాలు ఒలుకుతాయి
అక్షరాలు ఒకచోట చేరి పదాలవుతాయి
నా భావాలకు ఒక రూపాన్నిస్తాయి
నన్ను స్వచ్ఛంగా చూపే ప్రయత్నం
ముసుగు తొలగించి
గజిబిజి జీవిత పరుగులాపీ కొన్ని క్షణాలు మీతో పంచుకునే తాపత్రయం
కాగితంపై చేరిన అక్షరాల్లో లీలామాత్రంగా నైనా నేను అచ్చం నాలాగే ఉంటాననే ఆశ
అందుకే ఈ అక్షరాలను పోగేసి
నన్ను ప్రదర్శనకు పెట్టాను
యద లోలోపల ఏదో మూలకు భయం భయంగా నక్కిన నన్నులేపి మీముందు నిలిపాను
సమాజ పరిమితులు.. ఎవరో విధించిన కట్టుబాట్లు
పెరిగిన వాతావరణం నేర్పిన సంకుచిత భావజాలం
డౌట్ లేదు.. ఈ సమాజం తనకు అనువుగా మలుచుకున్న తోలుబొమ్మను నేను
కొన్ని పరిమితులకు లోబడి స్పందిస్తాను
అందరిలాగే నేనూ నటిస్తాను
అందరినీ అనుకరిస్తూ
కొందరిపై గౌరవం నటిస్తూ
ఇంకొందరి నుంచి తప్పుకుంటూ
ఎందరెందరికో దూరంగా ఉంటూ
ఏమీ పట్టనట్టు
తెలిసీతెలియనట్టు
ఉండీ లేనట్టు
నా మానాన నన్ను బతకమంటూ
నా నరనరాల్లో నూరిపోస్తోంది ఈ సమాజం
కులాల రొచ్చులోనో
మతాల ఉచ్చులోనో
బతుకు వెళ్లదీయమంటోంది
అడుగడుగునా హద్దులు
దాటిరావద్దనే సంకెళ్లు
కొన్ని బలవంతపు నవ్వులు
మరికొన్ని నాటకాలు..
అన్నింటినీ అధిగమించు
అక్షరాల్లో దూరినప్పుడు
నేను కనిపిస్తాను
లీలామాత్రంగా అయినా మనిషిలాగా
ఈ మహా జనారణ్యంలో ి మనసుతో పోల్చుకుంటే ఎప్పడోసారి ఎదురయ్యే అచ్చమైన స్వచ్ఛమైన మనిషిలాగా
www.naachittiprapancham.blogspot.in/2012/09/blog-post_10.html?m=1

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

కాంటేకార్ శ్రీకాంత్ // నీరు దాహం //


ఇప్పుడు చెప్పు
కొంటె గుట్టు కొంచెం కొంచెం విప్పు
ఎప్పుడూ మేల్కొని వుండే సమాజంపై పరదా కప్పు
నక్కినక్కి చూసే దొంగచూపుల రెప్పాలు దింపు
ఏవో రహస్యాలు వినేందుకు గోడలకున్న చెవులను మెలితిప్పు
తెచ్చుకో మరపు
లోకం పట్టని వెరపు
మన కలయికకు తెరలేపు
నీ హృదయ భావాలు నాలోకి వంపు
దాగిన నీ మనసును నాకు చూపు
అణచుకున్న కోరిక నాకు తెలుపు
మనిద్దరిది ఈ మాపు
నడచి రా నీకు నీవు విధించుకున్న సరిహద్దుల ఆవలి వైపు
రెక్కలు విచ్చుకున్న విహంగమై నీ కలల తీరం దరిదాపు
నేను నీరు
నీవు దాహం
నేను పవనం
నీవు పరిమళం
నేను వణికించే చలిని ి
నువ్వు భగభగలాడే సెగవు
ఐక్యమవుతున్న ఈ క్షణంఅమరతీరాన ఆనందనాట్యం

1, సెప్టెంబర్ 2012, శనివారం

కాంటేకార్ శ్రీకాంత్ ||మౌనం నా సంభాషణ||



మౌనం నా సంభాషణ
ఏకాంతం నా అన్వేషణ
నీవు చూసినప్పుడు చిరునవ్వయినా
బదులివ్వలేదని నొచ్చుకోకు..
అలా అర్థం కాకుండా ఉండటమే నా తత్వం
ఎన్నో సమయల్లో వ్యక్తం కాకపోవడమే నా నైజం

నామమాత్రమైన స్పందించనందుకు
నాలో ప్రేమలు లేవని అనుకోకు
సాగరమంతా ప్రేమను దాచుకొని కూడా
బయటపడకపోవడమే నా తీరు
గంభీరత నా లక్షణం
మగాడు నా పేరు

కఠినంగా.. కరుకుగా ఉండటమే
ఎన్నో కష్టాలను పంటి బిగువున భరించడమే
గుండె తడులను దాచుకొని
ఆవేశాన్ని ప్రదర్శించడమే
నాలో నాకు నిర్వచనం
అలాగే
కఠినుడిలా కనిపిస్తాను
కన్నీళ్లను దిగమింగుకొని
బాధను అణచుకొని
ఇతరులను అనునయిస్తాను
ఏ ఓదార్పూ ఆశించకుండా

31, ఆగస్టు 2012, శుక్రవారం

కాంటేకార్ శ్రీకాంత్ !!నేనేంటి?!!


నేనేంటి
నాకేంటి
ఈ సమాజం గురించి స్పందించడమేంటి
నాలో ఇన్ని భావ తరంగాలా?
ఆలోచనా సుడులూ.. ఆవేదన తడులా?
ఎవరికోసం.. ఎందుకోసం

పారిపోతాను
నన్నెవరు పట్టించుకోవద్దు
తప్పించుకుపోతాను
నా గురించి ఏమీ మాట్లాడవద్దు
సమూహంలో ఒంటిరి నేను
ఒంటిరిగా సాగే సమూహాన్ని నేను
నాదొక ప్రపంచం
ఎవరి గురించి పట్టదు
ఏ ఆలోచనలూ రావు
జఢంగా, మూఢంగా ఉంటాను
మౌనం నాకిష్టం
కదలకుండానే ప్రవహించాలనుకుంటాను
మాట్లాడకుండానే గడిచిపోవాలనుకుంటాను
ఎవరికీ తెలియకుండానే నిష్ర్కమించాలనుకుంటాను
నాకు ఏమీ వద్దు
వెంట తీసుకుపోవాలని లేదు
వదలివెళ్లడానికి కూడా లేదు
నేను.. అంతే
అసలే ఇరుకు ప్రపంచంలో
నాది మహా ఇరుకు జీవితం
అందులోనే మరింతగా కుంచించుకుపోతాను
ఏ స్పందనలు లేకుండా నా మానాన నేనుండిపోతాను
బయట సాగుతున్న కోలాహలం
బయట రేగుతున్న కల్లోలం
నాకు సంబంధం లేనిది
నన్ను అంటరానిది
అన్నింటినీ పరిత్యజించి దూరమయ్యాను

ఇరుకు గుడారంలాంటి నా ప్రపంచంలో
ఎప్పుడో కొన్ని చక్షువులు మొలుస్తాయి
అందులోంచి బయటి ప్రపంచాన్ని చూస్తాను
చుట్టుపక్కలంతా సంక్షుభితమే
మునిగిపోతున్న ప్రపంచం
ఎటూ చూసినా దుర్గంధం

కనురెప్పాలు వాలుతాయి..
దూరదూరాన ఆశా తరంగాలు
ఎర్రని వెలుగు కాంతులు
కొన్ని పచ్చని బయళ్లు
జంటగా ఎగిరే గువ్వలు
అక్కడో అందమైన ప్రపంచమున్నట్టు కనిపిస్తుంది
దరి చేరేందుకు తపిస్తాను
నా ఇరుకు ప్రపంచాన్ని మోసుకొని
ముక్కుతూ..ములుగుతూ అక్కడికి వెళతాను
ఈ ప్రపంచమే తప్ప మరేమీ కనిపించదు
అంతటా మనుషులు.. అవే కష్టాలు
అంతటా సామాన్యులు.. అవే కన్నీళ్లు
అంతటా అన్యాయలు.. అవే మౌనాలు

మళ్లీ నేను స్పందించడం మానేస్తాను
మౌనంగా.. జఢంగా మారిపోతాను
కదలిక నాకిష్టం
పారే నదిలా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలనుకుంటా
కానీ మెసిలే కొద్దీ, రగిలే కొద్దీ
బురదలో కూరుకుపోతుంటే..
అందుకే మొండిగా, మొద్దుగా, మొరటుగా
నేను.. నేను.. నేనుగా మారిపోతాను
నాదసలే ఇరుకు జీవితం

http://naachittiprapancham.blogspot.in/2012/08/blog-post_9007.html

30, ఆగస్టు 2012, గురువారం

శ్రీకాంత్ కాంటేకార్ || మానవత్వం ఖాయిల పడ్డ కార్ఖానా ||

మానవత్వమే ఓ ఖాయిల పడ్డ కార్ఖానా
ఇంకా మనిషికి విలువ ఏ పాటి?
కల్లోల జీవన సాగరంలో అనునిత్యం
ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సామాన్యుడిని చూసి చలించదేవరు?
నీతి బాట వీడక
కత్తుల వంతెనపై పడుతూ లేస్తూ
నెత్తురోడుతూ
గాయాలను ఓర్చుకుంటూ
బతుకు బండి లాగుతున్న ఒంటరిజీవి గుర్తున్నాడా?
తడారిపోయిన నీ హృదయ చలిమెల్లో
రెండు కన్నీటిబొట్లయినా అతడి కోసం మిగిలివున్నాయా?
నయా అభివృద్ధి ముసుగులో
రంగురంగుల విద్యుత్ వెలుగులో
సంపన్నవర్గాలను, విజేతలను మాత్రమే
కీర్తిస్తున్న నీలో ఇంకా అతడి గురించి భావాలు ఊరుతున్నయా?
అతడి జీవితం సంఘర్షణభరితం
తప్పు చేసే అవకాశం ఉన్నా
గీత దాటే గుండె ధైర్యం లేదు
బహుశా అమ్మ చెప్పిన నీతికథాసారం
చెవుల్లో మారుమోగుతున్నదేమో
పాపపు కూడుతో పైకి రాలేవన్న
బడిపంతుల పాఠాలు గుర్తుకొచ్చెనేమో!
పాపభీతి.. పైవాడు గమనిస్తున్నాడన్న భయం వెంటాడుతుందేమో!
(అందుకోసమే సామాన్యుడిగా మిగిలాడనుకుంటే
ఈ సమాజంలో మంచితనపు చివరిజ్యోతి కూడా ఆరినట్టే
అంతటా అన్యాయం అంధకారమే)

అటు చూడు చెడి బతికిన వాడి వైభవం
వాడి చుట్టూ చేరిన భజనమేళా సందోహం
వాడు ఎందరికి చెరుపు చేశాడో ఎవడికి పట్టింది
ఎన్ని అడ్డదారులు తొక్కి పైకి వచ్చాడో
ఎవడు అడుగుతాడు
ఎవడికి మాత్రం అంత ధైర్యం తీరిక ఉన్నాయి కనుక

వాడు విజయం సాధించాడా లేదా? అన్నదే కావాలి
ఎంతమంది నోళ్లు కొట్టి
ఎందరి జీవితాలను బలిపెట్టి
ఎన్ని గుడిసెలకు అగ్గిపెట్టి
తన మహాసౌధాలను నిర్మించుకున్నాడో
ఎవడు మాత్రం శోధించి కనుక్కోగలడు

ఎందరి వెన్నెముకలు విరిచి
ఎంతమంది ఆశలను చిదిమేసి
తన విజయానికి మెట్లుగా మార్చుకున్నాడో
నువ్వేమైనా ఎరుగుదవా

మృగరూపం దాచేసి
సాధు తోలు కప్పుకొని
చెబుతున్న నీతి మాటలకు
మైమరచిపోతున్న మానవుడా
రాజకీయమే రాచబాటగా
అధికారమే ఆలంబనగా
నిర్మించిన మహా సామ్రాజ్యాల కింద
ఎన్ని జీవితాలు విధ్వంసమయ్యాయో
ఎన్ని బతుకులు బలిపీఠం ఎక్కాయో

నీకూ నాకూ మాత్రం ఎందుకు పట్టింపు
నువ్వు నేను బాగానే ఉన్నాం
తగలబడుతున్న సమాజం
మన గుడిసెల దాకా రాలేదు కదా
మన కాలి కింద నేల కదిలిపోవడం లేదు కదా
అభివృద్ధి పేరిట జరుగుతున్న జీవన విధ్వంసం
నువ్వూ నేనూ రుచి చూడలేదు కదా
అందుకే స్పందించొద్దు
నరనరాలలో ఉడుకు నెత్తురు మరగకూడదు
పక్కవాడి అన్యాయంపై మన రోమాలు నిక్కబొడుచుకోవద్దు
అయినా నాకెందుకొచ్చిన గొడవ
పక్కవాడి గుడిసెగా తగలబడుతోంది
రేపొద్దున నీ పక్కవాడు కూడా ఇలాగే అనుకుంటాడు
కాంటేకార్ శ్రీకాంత్