పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Phani Kumar Sarma Bhamidipati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Phani Kumar Sarma Bhamidipati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2012, సోమవారం

భమిడిపాటి || నీ కలాన్నై పుడితే


మరు జన్మంటూ వుంటే
నీ కలాన్నై పుడతాను ,కవితగా జీవిస్తాను

నీ మనసులో భావాన్ని
లోకం చూడక ముందు

ప్రతి పదంలో అందాన్ని
నేనై లిఖిస్తుంటే మురిసిపోతూ

పదాలు చిక్కక పెదాల్ని కసిరి
మునుపంటితో నన్ను చేసే గాయానికి నొచ్చుకుంటూ

రూపం దాల్చిన నీ కవిత
లోకం చూస్తూ వుంటే ఆ పొగడ్తల సగపాలు నాకని మైమరచిపోతూ

ఇట్లు
ఈ జన్మలో నీ అభిమాని
మరుజన్మలో కవితై వచ్చే కలాన్ని ...09/22/12

15, సెప్టెంబర్ 2012, శనివారం

భమిడిపాటి || నీ మనసే కవిత

నిద్ర రానంటోందా
రెప్పల మాటున దాగి
కనురెప్పలు మూయనంటోందా
మోరాఇస్తున్నదా ..!

పదాలు దొరక్క పెదాలు
అలసిపోతే
నీ కవితను చూడాలనే ఆశతో
నీ కనురెప్పలు విచ్చుకుంటున్నాయా ..!

పోనీ
పెదాలు అలసి పోనీ
మనసుమాత్రం ఊరుకోదు
ఊపిరిని కలంగా మార్చి నీ మనసునే కవిత చేస్తుంది ...

అప్పుడేం చేస్తావ్ ..? 09/14

30, ఆగస్టు 2012, గురువారం

భమిడిపాటి // బికారి బ్రతుకు //


వేకువ దుప్పటిని దులిపేస్తూ
అప్పుడే రేగుతున్న దుమ్మును
రోడ్డున పోయే జనాల తిట్లను
గాలి పాటలా వింటూ మొదలైంది ....

మా దారి తెన్నులు లేని
యాచక దారి
సొంత పేరున్నా చెప్పుకోలేని
అందరికి తెలిసిన ఈ బికారి !

ఎవరి కన్న బిడ్డలమో ?
తెలియని అమ్మని
తెలిసి ఎంతో మంది అమ్మలాంటి అమ్మలని
ధర్మం చేయండంటూ ఛీ కొట్టినా వెంటపడుతూ ...

ఒక్కోసారి సిగ్గేస్తుంది
ఏ ఇంటి గడప తొక్కాలో తెలీని మా స్థితిని
ఇలాంటి జీవితాన్నిచ్చిన ఆ దేవుణ్ణి
దయలేని ఆ పైవోడి విదిరాతని !

మాకు మేమే అయ్యేమా !
ఎవరి ఆవేశపు ఆనందానికి రోడ్డున పడ్డామా
మా ఆవేశాన్ని అణుచుకోలేక
మా వారసులకి కూడా ఈ వారసత్వాన్ని కట్టబెడుతున్నామా !

మాలో ఎవరిని తట్టినా
గతంలేని తన జ్ఞాపకానికి మాలో మేమే సాక్షులమంటారు
ఆకలి మంటల కేకల చల్లార్చటానికి
చిల్లర డబ్బుల చప్పుళ్ళకి అలవాటుపడ్డం అని వెర్రిగా నవ్వుతారు ......

రానే వచ్చిన రాత్రికి
దొరికిన జాగాపై మాటేసి
చీకటి దుప్పటి కప్పేసి
రాత్రి చుక్కలకి రాజులం మేమే అంటూ ..మురిసిపోతూ ..కలలో మైమరచిపోతూ ..
.29-08-12

28, ఆగస్టు 2012, మంగళవారం

భమిడిపాటి //నాలో మార్పు //......

అమ్మ చెప్పింది
పెద్దదానివయ్యవ్
హద్దుల్లో ఉండమని
వంచినతల ఎత్తోద్దని ....

నిన్ననే
పసిడి ప్రాయాన్ని పలకిరిస్తూ
కొత్తగా వచ్చిన
నాకే అర్థం కాని చిన్న మార్పు !

ఎందుకో
పదహారు ప్రాయాన్ని పలకరిస్తూ
ఆశగా చూసే కళ్ళు
అర్థం కాని ఎన్నో ప్రశ్నల ముళ్ళు

పొరపాటున కూడా పట్టించుకోని
పక్కింటి అంకుల్
కొత్తగా ప్రేమ ఒలకబోస్తో
ఏదైనా కావాలంటే మొహమాట పడద్దని మరీచెపుతూ

ఎప్పుడూ నడిచే సందు మొగలో
చూసే వింత చూపులు
వెక్కిరించే కొత్త సైగలు
వినీ వినపడనట్టు ఏవో కొత్త మాటలు

ఎప్పుడో ఒక్కసారి గుర్తొచ్చినప్పుడు
హోం వర్క్ తప్పుల్ని
బెత్తంతో చేతిమీద దిద్దే మాస్టారు
తప్పుల సాకుతూ ఒంటి మీద చేతితో పెట్టె కితకితలు

అమ్మ పక్కలో దూరి
చిన్నప్పుడు వినే కధల్లో
పెద్ద దానివైతే కొత్త ప్రపంచాన్ని చూస్తావ్
స్వేచ్చగా జీవిస్తావ్ ...!

అంటే ఏదో అనుకున్నా !
ఎంతో ఆశ మనసులో దాచుకున్నా
కాని వింత ప్రపంచాన్ని చూస్తున్నా
నాలో మార్పుకి నేనే నాలోనే కుచించుకు పోతున్నా

26-08-12

11, ఆగస్టు 2012, శనివారం

భమిడిపాటి || మిత్రుడు ||


మంచి మిత్రుడు
ఒక్కడు చాలు

నాలోని ఒంటరి తనాన్ని
పోగొట్టటానికి

మూలకూర్చున్న ఆత్మా విశ్వాసాన్ని
తట్టి లేపడానికి

నన్ను నేను
గెలవడానికి

నే ఓడిన ప్రతిసారి
గెలుపు చేయి అందించటానికి

ఈ ప్రపంచాని
జయించడానికి

జీవితపు వీలునామాలో చివరి సంతకం
మిత్రుడని చెప్పడానికి

నా స్నేహాన్ని ఆస్తిగా ఇవ్వడానికి
*11-08-2012

8, ఆగస్టు 2012, బుధవారం

భమిడిపాటి || నిట్టూర్పుల రాత్రి: ||


నిట్టూర్పుల రాత్రి
పడమటి రాగం

పాడుతున్న
సంధ్యా సూర్యుడికి వీడ్కోలు చెప్తూ !

చీకటి ప్రపంచం చేసే
మౌన సంభాషణకి తను సాక్షిగా
మానవ మృగాల పైశాచిక క్రీడకి
తనే వేదికగా !

నల్ల బట్ట కట్టుకుని
అలసిన గుండెను నిద్రపుచ్చుతూ
కాలే కడుపుకి
ఇదిగో తెల్లవారు అని ఓదార్చుతూ .....

పగటి పని దొరకని
రాత్రి పని తప్ప వేరే దారిలేని
సమాజం పట్టని
సమాజానికి పట్టని కొందరి కొమ్ముకాస్తూ

ఆకలి అందాన్ని
నిశి రాత్రికి హారతి లిస్తూ
తాము కరుగుతూ కరిగిస్తున్న
తరుణీమణుల కాటుక కళ్ళను ముస్తాబు చేస్తూ

నిట్టూర్పుల రాత్రీ
రోదిస్తోంది
విలువలు విప్పుకుని
చీకటి వలువలు కప్పుకుని

నిట్టూర్పుల రాత్రి
ఉదయ రాగం
పాడుతున్న
అరుణ సూర్యుడికి స్వాగతం పలుకుతూ ...!

*07-08-2012

31, జులై 2012, మంగళవారం

ఫణి కుమార్ శర్మ భమిడిపాటి || ఏడున్నది నీ కులం ! ||

నా కులం
మా కులం
మేమే కామందులం అంటావ్
ఏడున్నది నీ కులం !

నీఇంటి ఆడపిల్లలు
తోబుట్టవులు పసిమోగ్గలా !
నీ కీచక చూపుల ఆకలి కళ్ళకు
ముడుచుకు పోతున్న ఎన్నో సుమాలలో ...ఏడున్నది నీ కులం

వారసత్వపు ముసుగులో
చేతగాని నీ వారసులకు అందలాలు
స్వేదం రక్తం చిందించి
నీ ప్రగతి పునాదుల గోడలకు లోకం చూపెట్టిన

నీ వాళ్ళు
నిను నమ్మిన వాళ్ళు
నీ కల్లబొల్లి మాటలకు
వాళ్ళ జీవితం జీతం గా ఇచ్చే శ్రామికులు కారా వారసులు !....ఏడున్నది నీ కులం

రాచరికాన్ని చీల్చి
ప్రజాస్వామ్య దీపం వెలిగించి
మనమంతా ఒకటని నమ్మించి
కులం చమురుతో రంగుల చీకటిని చిమ్ముతున్నావ్ ! ......ఏడున్నది నీ కులం
*30-07-2012

29, జులై 2012, ఆదివారం

భమిడిపాటి ఫణి కుమార్ శర్మ || నువ్వే నేను ......||

నువ్వు నేను
నా నువ్వుగా
నీ నేనుగా
ఇద్దరి మనసులు ఒకటిగా....

నీ మాటల్లో
నా మౌనం
నా కోపంలో నీ కన్నీళ్ళ
ఓదార్పుల వెచ్చతనం ...

కలనైనా నీ ఎడబాటు
తెచ్చే కలను కనలేను
ఘడిఐనా భారంగా
నీ దూరాన్ని భరించలేను

నీవు లేవన్న ఆ క్షణం
నిన్ను దాటి నన్ను
ఒంటరిని చేసే మరుక్షణం
నేను లేనన్నది అంతే నిజం.
*28-07-2012

22, జులై 2012, ఆదివారం

ఫణికమార్ శర్మ భమిడిపాటి॥నీ నీడనై॥

రమ్మంటూనే వద్దంటావ్
వద్దంటూనే రారమ్మంటావ్

రమ్మని పొమ్మన్నా
పొమ్మని రమ్మన్నా

నీ హృదయంలో నేను లేనన్నా
గతించిన జ్ఞాపకానివి నువ్వన్నా

వస్తూనే ఉంటా నీ నీడనై
పోతూనే వుంటా నీ జ్ఞాపకాల్లో గూడునై ...
*22.7.2012

16, జులై 2012, సోమవారం

భమిడిపాటి ఫణి కుమార్ శర్మ కవిత

అడుగులు తడబడుతున్నాయి
గమ్యం లేని దారి
మసక బారిన కళ్ళకు
రెండుగా చీలి వెక్కిరిస్తూ

ఎండిన డొక్కకు
పట్టెడు మెతుకులు
అలసిన గుండెకు జాగా లేదంటూ
నీ వచ్చిన చోటికే పోమ్మంటూ.....

ఎచటికి పోతావ్ ఓ రైతన్న .............

పంచె కట్టిన చోట రాళ్ళెత్తలేవు.
ఎండిన భూమిని చూస్తూ బ్రతుకలేవ్
కుటుంబ భారాన్ని మోయలేవ్
నీ వాళ్ళను పస్తులున్చలేవ్....

నీ తల్లి భూమిలో నీరులేదు
సర్కారీ విత్తనాల్లో సత్తాలేదు
అప్పులోల్లు ఒంట్లో చుక్క రక్తం మిగల్చలేదు
ఓదార్పుల ప్రభుత్వంతో ఒరిగేదేమీలేదు.
*16-07-2012