పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Ram Kishan Raki Dharmapuri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ram Kishan Raki Dharmapuri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, సెప్టెంబర్ 2012, సోమవారం

రాఖీ ||”ఒ’క’’వి’జ్ఞాన” సర్వస్వం


1.
కవిత్వం ఒక భావోద్వేగం..
కవిత్వం ఒక రాగ ప్రవాహం ..
కవిత్వం..ఒక అనుభవం..
కవిత్వం అనుభూతుల సమాహారం..
2.
ఒక భౌతిక సంయోగానికి...
ఒక రసాయనిక..చర్య జరిగి...
తగిన గణాంకాలన్నీ కుదిరి..

ఎలా ఒక జీవం రూపు దిద్దుకొంటుందో..
ఎలా ఒక కణం ప్రాణం పోసుకుంటుందో..

ఏ పరిధి వరకు..
ఏ అవధి వరకు..
ఏ సరిహద్దుకు...

అచరం..చరమౌతుందో..
మూలకం..స్వయం చలితమౌతుందో..
జడపదార్ధం ...చైతన్యవంత మౌతుందో...

ఎవరు చెప్పగలరు..?
ఎవరు సృష్టి గుట్టు విప్పగలరు..??
3.
దేహ మిథున మథనం లో ..జీవం ఆవిర్భవించినట్టు..
హృదయ మేధో మథనం లో ...కవనం ఆవిష్కృత మౌతుంది..

కన్ను తెరచిన నాటి నుండే...
తనను తాను నిర్మించుకొంటూ...
పాఠాలు..గుణపాఠాలు..నేర్చుకొంటూ..

ధర్మాన్ని ..అనుసరిస్తూ...
కర్తవ్యాన్ని..నిర్వర్తిస్తూ...
ప్రతిఫలాపేక్ష ఉపేక్షిస్తూ..
మానవుడు..మహనీయుడు..
4.
ప్రకృతి చక్కని గురువు..
పరిశీలిస్తే చెప్పలేనంత..చదువు..
పరిశోధిస్తే..అగాధ విజ్ఞాన సింధువు..
5.
ప్రతిఫలమేమి కోరుతుంది.. పూచిన గులాబి
బహుమతులేవి అడుగుతుంది ..పరిమళించిన సిరిమల్లి..
కానుకలేవి ఆశిస్తుంది...వెన్నెల విరజిమ్మే..జాబిల్లి..

నెమలి నాట్యం లో...ఎనలేని పరవశముంది
కోయిల గానంలో...కొలవలేని తన్మయముంది..

దూకే జలపాతంలో..తోక ముడవని తత్వముంది..
సాగే కొండవాగులో...వెనుదిరగని..ధైర్యముంది..
దాహం తీర్చే నదిలో..తొణకని..నిండు దనముంది..

విరిసిన ఇంద్ర ధనువులో...రంగులు చిమ్మిన ఆనందముంది..
పలు వర్ణాల సీతాకోక చిలుకలో..అందం చిందించే నైజముంది..
నీడ నిచ్చే చెట్టులో..ప్రాణ వాయువు అంది౦చే .దాతృత్వము౦ది..
పంట చేలలో..తమ ఉనికి కోల్పోయీ.. ఆకలి తీర్చే త్యాగ నిరతి ఉంది..

6.
ప్రకృతికి ఇవ్వడమే తప్ప..ధర కట్టడం తెలీదు..
మనిషి మినహా జీవులు-
అనుభూతి చెందడమే తప్ప ..అడగడం ఎరుగవు..
ప్రశంసలకు..పొంగవు...విమర్శలకు కృంగవు
సత్కారాలు ..సన్మానాలు..ఆశి౦చవు
బిరుదులూ...పతకాలు ..అర్థించవు
7.
గొర్లుకాసే పిల్లవాడి పిల్లనగ్రోవి పాటకు..కొట్టేదెవరు చప్పట్లు
దుక్కిదున్నేరైతు ఆశుకవితకు..కప్పేదెవరు దుప్పట్లు..
8.
ఒకటికి రెండింతలు..
గోరంతకు..కొండంతలు ..
ఆశిస్తూ అపేక్షిస్తూ..
వక్రమార్గాలన్వేషిస్తూ...
అక్రమ విజయాల..సాధిస్తూ..ఆస్వాదిస్తూ..
వందిమాగదులతో జేజే ధ్వానాలు....
భజంత్రీలతో...భుజం చరుపులూ...
9.
మది పెల్లుబిన భావాన్ని ..అక్షరీకరించడం..
పదాల నాదాన్ని పదుగురి ఎదుట నినదించడం..

ఇవ్వడం నీ సమస్య ..
గ్రహించడం ..ఆగ్రహించడం..సంగ్రహించడం...
అవతలి వారి సమస్య...

నిన్ను నువ్వు ..పరిష్కరించుకో...
నిన్ను నువ్వు సంస్కరించుకో..
నిన్ను నువ్వు సమర్పించుకో..

అంతా సవ్యమే
..అంతా..నవ్యమే
.అంతా..ఆమోద యోగ్యమే..

గిరి గీసుకొంటే..అది బంధనం..
కోర్కెతో రాస్తే..అది శృంఖలం..
మొక్కుబడిగా రాస్తే..అది వ్యాపారం..

స్వేచ్చా విహంగమే కవిత్వం...
స్వతంత్ర హృది జన్యమే...కవిత్వం ..
కవిత్వం చేత ,కవిత్వం కొరకు ,కవిత్వం..
కవి తత్వమే కవిత్వం..
కవిత్వం కావాలి కవిత్వం...!!!

23-09-2012

8, సెప్టెంబర్ 2012, శనివారం

రాఖీ || యదార్థ జీవిత వ్యదార్థ గాధ ||


అంతా సజావుగానే..సాగుతున్నట్టుంది..
అంతా సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..

కానీ ఏదో..తెయని శూన్యం-
కానీ అంతు దొరకని అగాధం-

ఉదయాలు..సుప్రభాతాలు..
కాలకృత్యాలు..అన్నపానీయాలు..
కార్యాలయాలు..కార్యక్రమాలు..

అంతా సజావుగానే..సాగుతున్నట్టుంది..
అంతా సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..

కానీ ఎక్కడో ఏదో..మెలిక..
కానీ ఏదో మ్రింగుడు పడని గుళిక..

స్నేహితాలు, బంధుత్వాలు
పండగలు పబ్బాలు
ఉత్సవాలు పర్వదినాలూ
వివాహాలూ ,వేడుకలూ..
విందులూ వినోదాలు...

అన్నీ సజావుగానే..సాగుతున్నట్టుంది..
అన్నీ సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..

పులుముకొన్న బాడీ స్ప్రేలు..
అతికిన్చుకొన్న నవ్వులు..
కరచాలనాలు,క్షేమ సమాచారాలు..
కడుపులో లేకున్నా కావలించుకోవడాలు..
లేని ప్రేమంతా ఒలకబొయ్యడాలు..

అంతా కృత్రిమత్వమే..
అంతా యాంత్రికత్వమే...

ఎక్కడలేని..సందడి..ఒకటే హడావుడి..
ఎవరో తరుముతున్నట్టు...
జాగిలాలు వెంటబడ్డట్టు...
బొక్కబోర్లా పడుతూ లేస్తూ..
పరుగెత్తి పాలు త్రాగడాలు..
మితిమీరిన ..ఆగడాలు..ప్రతిదానికీ..జగడాలు..

అంతా సజావుగానే..సాగుతున్నట్టుంది..
అంతా సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..

కానీ ఎవరూ పూడ్చలేని అగడ్త..
ఎవరూ తీర్చలేని..వ్యధ..

స్కానింగ్ లకు చిక్కని...స్కాం..
ఏమ్మరైలకు..దొరకని..క్యాన్సర్ కణం..
ఏదో మాయరోగం..
ఏదో వింత విక్షోభం..( విక్షోభం=యాతన=పెయిన్..)

మృగ్యమైన ఒక మానవీయ బంధం..
అంతరించి పోతున్న హృదయ గత బంధం..

నిన్ను నువ్వు అమ్ముకొన్నప్పుడు....
నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకొన్నప్పుడు...

సరిగ్గా అదే వెలితి..
నిజంగా.. అదే..దుస్థితి..
కక్కలేని మ్రింగలేని..పరిస్థితి..
ముందుకెళ్ళలేని..వెనక్కి మళ్ళలేని..దుర్గతి..
పశ్చాత్తాప పడినా..ప్రయోజన..రహిత స్థితి
ప్రాయశిత్తం..చేసుకొందామన్నా...కుదరని..స్థితి

అంతా సజావుగానే..సాగుతున్నట్టుంది..అలాగా !..
అంతా సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..ఔనా ..?!

తెలుస్తోందా...
విలువలు వలువలు కోల్పోయి
నగ్నంగా నర్తిస్తున్నాయి..
ఎరుకయ్యిందా..
అనుబంధాలు ధనార్జన కాళ్ళక్రింద నలిగి
మూగగా రోదిస్తున్నాయి..
గ్రహిస్తున్నవా...
వైఖరులు ఉన్నస్థితి..ఉన్నతిని..గుర్తించలేక..
విదేశీ వికృత సంస్కృతిని..ఒంట బట్టి౦చుకుంటున్నాయి..

ఒక సంతృప్తి వైపు సాగాలి కదా మన పయనం...!
ఒక ఆత్మానందం కావాలి సదా మన గమ్యం..!!

06-09-2012.

6, సెప్టెంబర్ 2012, గురువారం

రాఖీ||ప్రేమసమరంలో అవసరమా ఖడ్గమూ డాలు ||



తూర్పున నేను
పశ్చిమాన నీవు

భూగోళానికి ఇరువురం చెరోవైపు
అందుకే అందదు మనకు మనవీపు
అయినా తీపులకై చేతులు చాపు

ధృవాలు వేరు ఉత్తర దక్షిణాలు
అందుకేనేమో ఈ ఆకర్శణాలు

దృక్పథాలు వేరు ఎడ్డెమంటె తెడ్డెమనడాలు
ప్రేమసమరంలో అవసరమా ఖడ్గమూ డాలు
వాయింపుకు భిన్నంగా రెండురకాలుగా మ్రోగే డోలు

ఎప్పుడైనా పయనంలో మనచేతులు చెట్టపట్టాలు
కలిసిసాగుతున్నా కలుసుకోలేని రైలు పట్టాలు

భేషజాల భావజాలం –ఒకరులేక ఒకరం మనజాలం!
బ్రతుకే ఇంద్రజాలం-అంతర్జాలంలా మయాజాలం!!

04-09-2012

1, సెప్టెంబర్ 2012, శనివారం

రాఖీ||కవిని నేను! ||


చిగురాకు నేను
చిరుగాలికే మైమరచేను

ఏకాకి నేను
చిరు స్పర్శకే పులకరించేను

అనాధను నేను
చిరునవ్వుకే పరవశమౌతాను

బీడు భూమి నేను
చిట్టి చినుకుకే అనందం తట్టుకోలేను

ఎండిన మోడు నేను
ఆమని కై అర్రులు చాస్తాను

ఎడారి బాటసారి నేను
ఒయాసిసుకై పరితపించి పోతాను

పసి వాణ్ణి నేను
చేర దీస్తే ఆశగా చేతులు సాచేను

చకోరి నేను
జాబిలికై జాలిగ చూస్తాను

కవిని నేను
కాసింత ప్రశంస కే ఉత్తుంగ తరంగమై ఉప్పొంగుతాను

ఏమిచ్చుకోను అభిమానులందరికీ
శిరసు వంచి నేను సదా అభివాదమంటాను
30-08-2012

22, ఆగస్టు 2012, బుధవారం

రాఖీ|| బ్రతుకు భార(త)౦ ||


నా భారత దేశం కాదు దారిద్ర్య దేశం....
ఇది భావదారిద్ర్య దేశం..!

1

క్రమశిక్షణాయుత పాలనా రాహిత్య దేశం...
మౌలిక వసతుల పరికల్పనా రాహిత్య దేశం-
విద్యా ,వైద్యం – న్యాయం ,వ్యవసాయం
రవాణా,పారిశ్రామిక ,విద్యుత్ రంగం ....
ఏదైనా అంతే- మిగిలేది చింతే-

రక్షిత ఆరోగ్యం ఎచట వెదికినా మృగ్యం-
బస్సుల్లో...రైళ్ళలో...
రేట్లు పెట్టినా టిక్కట్లు దొరకని దౌర్భాగ్యం..
తిప్పలు బడితే...టిక్కెట్లు దొరికినా ..సీట్లు అలభ్యం..
ఎంత దూరాలైన..నిలబడి ..పయన౦..సంప్రపతే తుభ్యం
గుండె గుభిల్లనే..బిల్లు ..కట్టినా....దొరకదు...నిరాటంక కరెంటు సౌలభ్యం..
వేలు లక్షలు..పోసినా...ఎంట్రన్స్ ల హర్డిల్స్ దాటినా...
నాణ్యమైన విద్య గగన కుసుమం....
ఖరీదు చెల్లించినా దొరకని సౌకర్యం..
డబ్బులు వేదజల్లినా లబించని సౌఖ్యం-

2

అటెండర్ నుండి అధ్యక్షుడి వరకు ...
రాజ్యమేలేది ఇట..దోపిడే..
కంట్రాక్టర్ నుండి..మినిస్టర్ వరకు..అంతా మేసుడే ..
అడుగడుగునా కుంభకోణాలు వెలుగు చూసుడే...
అణువణువునా అవినీతి గాధల సందడే...
దోచుకున్న వాడికి దోచుకున్నంత రాజశేఖరా ..
దాచుకున్న వాడికి పట్టుకోలేనంత జనార్దనా..

3

మేస్త్రీల నుండి మేనేజర్ల వరకు ...ఫ్రాడ్
మెకానిక్ ల నుండి టెక్నీషియన్ల వరకు..డబ్బుల డిమాండ్..
చెప్పిందే వేదం...పలికిందే మంత్రం...పాడిందే గానం...
ట్రాన్సిస్టర్ నుండి ట్రాన్స్ఫార్మర్ వరకు...మొనోపలీ ..
గతిలేని గత్యంతరం లేని సామాన్యులు బలి-
ఈ నా దేశం ఎటు పోతోంది..
నా పవిత్ర భారత దేశం ఏమైపోతోంది...

4

సభ్యత ,సంస్కారం..
సంస్కృతీ, సాంప్రదాయం..
అనుబంధం, ఆత్మీయత...
స్నేహం, సౌజన్యం...
విలువలు ,వినయాలు ...
మానవత్వం ,జీవ కారుణ్యం..
అన్నీ మృగతృష్ణ లే..
అన్నీ గత చరిత్రలే...

వర్ధిల్లు నా దేశమా..ప్రపంచానికే ..సందేశమా..!
విలసిల్లు నా భరతదేశమా...విధి లేని జీవన విధానమా..!
*21.8.2012

19, ఆగస్టు 2012, ఆదివారం

రాఖీ || కవితలు మనవెంటే మన వెన్నంటే !!


ఆశలుంటే ఆశయాలుంటే
అవి సాధించే కృషి యే ఉంటే
కవితలు మనవెంటే మన వెన్నంటే!

వెతలుంటే వ్యధలుంటే
ఎదలోతుల గాధలుంటే
కవితలు మనవెంటే మన వెన్నంటే!

హితులుంటే స్నేహితులుంటే
మనల ప్రేరేపిస్తుంటే
కవితలు మనవెంటే మన వెన్నంటే!

మనసుంటే అది స్పందిస్తే
అనుభూతులు అందిస్తే
కవితలు మనవెంటే మన వెన్నంటే!!

*18-08-2012

రాఖీ ||అభిమానము అస్వాదనమే||


తాజ్ మహల్ రాసిస్తే
బ్రతుకంతా కాపురముంటామా

రాకెట్ మన పరంచేస్తే
హాయిగా ప్రేయసితో షికార్లు కొడతామా

అందాల ఐశ్వర్యని వండుకొని తింటామా
యేసుదాసు గాత్రాన్ని నంజుకొంటామా

అభిమానం ఆస్వాదనమే
ఆస్వాదన అనుభూతి మయమే

ఇలయరాజా సంగీత రీతులు అభిమానం
యండమూరి రాత రీతులు అభిమానం
సచిన్ క్రికెటాట తీరు అభిమానం
సానియా బంతుల షాట్ తీరు అభిమానం

సినిమాల్లో నటిస్తున్నప్పుడే కమల్ హసన్ గొప్పదనం
పొరుగింటివాడైపోతే ఏమున్నది వినూత్నం

అభిమానం అంటే అంతే
మర్మమైన ప్రతిదీ వింతే

కలవనంత వరకు కలవరింతే
కలిసినంతనె చెప్పలేని గుబులంతే-చింతే

ఆకసాన ఉంటేనే చందమామ సొగసుదనం
అల్లంతలొ ఉన్నపుడే కొండలకా నునుపుదనం

పొరలు కప్పి ఉన్నప్పుడె ఉల్లి
విప్పుకొంటుపోతే అంతా ఖాళీ

కొన్ని అందకుంటేనే హాయి
కొన్ని దాచుకుంటేనే పదిలమోయి

*18-08-2012

11, ఆగస్టు 2012, శనివారం

రాఖీ || తెర పడని నాటకం ||


నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు

అసలే నాది అంధుని పాత్ర
అందులోను అమావాస్య రేయిలో
లైటారిపోయినప్పటి సీను

నిజంగానే తడుము కోవాల్సిన పరిస్థితిలో
అప్పుడు నేను జీవిస్తున్నానని ఎరుగని ఆడియన్స్
నా నటన చూసి ఎన్నెన్ని కామెంట్స్

వాళ్ళకెలా చెప్పాలి అది నాటకమని
నా పాత్రే ఒక బూటకమని
నా నాటకానికి తెర తీసారే గాని
వేయడం మానేసారు
ఇదేం రక్తి కడుతుందని ఇంకా
ఇలాగే చూస్తున్నారు

నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు

తెరవెనక్కి పారిపోతే పిరికి వాడని అంటారు
రంగాన్నంతాపీకి పోతే పిచ్చివాడని అంటారు
ఇంకా అలాగే నిలబడితే చచ్చిపోడేమని అంటారు

రావడమైతే రంగం మీదికొచ్చాను గాని
మధ్యలో డైలాగ్స్ అన్నీ మరచిపోయాను
నోటికొచ్చింది పేలుతున్నానే గాని
’అసలు యాక్షన్’ చేయడం మానేసాను

కప్పగంతులు వేస్తున్నాను
కుప్పిగెంతులు వేస్తున్నాను
నవ్వుతున్నారు లెమ్మని
ఇంకా నవ్వుకొమ్మని
నీతులు మాట్లాడ్డం మానేసి బూతులనే మాట్లాడుతున్నాను
కాళ్ళతో నడవడం వదిలేసి చేతులతో నడుస్తున్నాను

నువ్ బఫూన్ వి కావని డైరక్టర్ చెప్పడు
నువ్వే హీరోవని ప్రామ్టరూ చెప్పడు
వాళ్ళకు మాట పడిపోయింది కామోసు
మరి నాకే చెవుడొచ్చింది కావచ్చు

ప్చ్! నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
హుమ్!!ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు

నాలోని మరోమనిషికి ఇవ్వేం పట్టవ్
ఆ’మరమనిషికి’ నావేం గిట్టవ్
“ ఒరే నువ్వున్నది అథః పాతాళం
చేరాలనుకునేది గగనాంతరాళం

ఎందుకురా ఎప్పుడూ అదే ధ్యాస
ఎందుకురా ఈ వృధా ప్రయాస

తెల్ల కాగితాన్ని పిచ్చిగీతలతో ఎందుకురా పాడుచేస్తావ్
ఎవరూ అర్థం చేసుకోని భాషలో ఎందుకురా నీ గోడు రాస్తావ్
నువ్వనుకుంటున్నావ్ అది కళాఖండమని
నువ్వనుకుంటున్నావ్ అది ఘనకార్యమని

అసలూ ఎందుకు నటిస్తావ్ “ అని నేనంటే
“అయినా ఏం సాధిస్తావ్ “అని నే అన్నది వింటే

నాలోని మరో వాడు పరమ కౄరుడు-
“నటించడం నా జన్మ హక్కు” అంటాడు
“అయినా నటిస్తే ఏం తప్పు” అంటాడు
“ నీతిగా బ్రతికితే గోతిలోకి తోస్తారా”
చిరు నవ్వు నవ్వితే ఉరిశిక్ష వేస్తారా “
అనేదే వాడి వాదన-ఆవేదన

“ నటించు కాకపోతే నగ్నంగా నర్తించు
ఇదే పాత్రలో ఇదే స్టేజీపై ఈ ప్రేక్షకులముందే ఎందుకు నటిస్తావ్
నీ నటనకి ఆస్కార్ అవార్డ్ రావాలని వెర్రిగా ఎందుకు ఆశిస్తావ్-“

నేనంటే పడని అసమర్థుడు నా మాటే వినని దరిద్రుడు అన్నాడూ-
“ ఏంచేస్తాం నా ఖర్మ ఇలాగే కాలిపోయింది
దొరక్కదొరక్క నాకిదే దాపురించింది
ఏది ఏమన్నా నా నటన దీనికే అంకితమైంది

ఐనా
“తప్పుని తప్పు “ అన్నవాడిని తప్పుగా అనడమేగాని”
’ఒప్పుని ఒప్పు’అని ఒప్పుకున్న వాడేడిరా “అని

వాడి మాటలూ కొంత సబబు అనిపించాయి
వాడి బాధలో కొత్త సత్యాలు తోచాయి

“ ఎవరి కోసం నటిస్తున్నావో గాని
చూడాల్సిన వాళ్ళు చూసి హర్షిస్తున్నారో లేదో గాని
గోటితో పోయేదానికి గొడ్దలి ఉపయోగించడం తో
మాటతో పోయేదానికి మనిషిని బలిచేయడం తో
నడమంత్రపువాళ్ళవల్ల నగుబాటు కావాల్సి వచ్చింది
చేయని నేరానికి శిక్షపొందల్సి వచ్చింది

అయినా ఎందుకురా అందని దానికోసం అర్రులు చాస్తావ్
ఎందుకురా ఆకాశానికి నిచ్చెన వేస్తావ్
ఇవతలి వాళ్ల ప్రణాలు అనవసరంగా ఎందుకు తీస్తావ్
అనుక్షణం అవమానంతో కుమిలి కుమిలి ఎందుకు ఛస్తావ్

అసలు ఎందుకీ అనర్థపు తపన
అవును ఎందుకీ అనవసరపు మదన
ఒరే ఎందుకీ అంతర్గత రోదన
ఇంకా ఎందుకీ అనంత కాల వేదన “”

అప్పుడన్నాడు ఏమి తెయని మా మూఢుడు
ఒప్పుకున్నాడు అన్ని తెలిసిన ఈ మూర్ఖుడు
“ ఎలా బయట పడాలిరా ఎరక్క వచ్చి ఇరుక్కున్నాను
ఏలా ఏడవాలిరా నే ఎక్కిన కొమ్మనే నరుక్కున్నాను
ఇప్పుడేంచేయాలిరా నా నాలుక నేనే కొరుక్కున్నాను

ఆడే వాణ్ణి ఓడి పోయాను
ఆడించేవాడూ వీడి పోయాడు
అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకోలేం
అవును పునాది కూలాక మేడలు కట్టుకోలేం

కాని ఈ ప్రేక్షకులకు
చక్షువు నోరుతో వీక్షణ కోరతో
దృశ్యాన్ని తాగుతూ పైశాచికానందం పొందే భక్షకులకు
ఇదంతా చూసి విసుగు రావడం లేదూ
ఇందులో ఏదో గందరగోళం జరిగిందని తోచడం లేదూ...

అందుకా మాటల రాళ్ళు రువ్వుతున్నారు
అందుకే చూపుల బాకులు దువ్వుతున్నారు

నా నటన చూసి హా హా కారాలు
నన్ను చూసి హుంకారాలు ఛీత్కారాలు

నా నాటకం పేరే “ ఓటమి “ కదూ
దాని రచయిత మాత్రం రాముడో కృష్ణుడో కాదు
వాడు అసలైన అసమర్థుడు వ్యర్థుడు

ప్రియమైన ప్రేక్షకులారా ఇంత తెలిసాక
ఎందుకు మీరు వెళ్ళడం లేదు
నరమాంస భక్షకులారా వాన కురిసాక
ఎందుకు తెర వెయ్యడం లేదు

ఓ సూత్రధారీ ! నువ్వైనా చెప్పేడు
ఈ రంగానికి మలుపు ఎప్పుడు?
నా నాటకానికి ముగింపు ఎన్నడు???

*11-08-2012

8, ఆగస్టు 2012, బుధవారం

రాఖీ,,,|| నీకే ఈ నా సమస్తం !! ||

ఆనంతాల అంతుల నుండి
దిగంతాల అంచుల దాటి
పాలపుంతలేన్నో మీటి

చుక్కలు చిక్కులు తెగ త్రెంచుకొని
ఖగోళాలు కృష్ణబిలాలు తప్పించుకొని
నవగ్రహాల ఉపగ్రహాల పీడ వదిలించుకొని

సప్త సముద్రాలను ఈదీ
మేరు పర్వతాల నధిరోహించి
అరణ్యాలు ఎడారులన్నీ ఏదీ వదలక
కౄర మృగాలు విష సర్పాలు ఎదునారైనా నే బెదరక

మైదానాలు నదీ నదాలు
కొండలు కోనలు వాగులు వంకలు ఏవీ విడవక
ఎండమావులు ఇంద్ర ధనువులూ వేటి మాయలో అసలే చిక్కక

లోయలు గుహలూ మిద్దెలు మేడలు
రెక్కల శ్వేత తురంగంపై అంతటా సంచరించి

విశ్వమంతటా అన్వేషించీ
అణువణువున నిను శోధించీ
ఆఖరికి నాలోనే నీవైన నన్ను గ్రహించి సంగ్రహించీ

తరించి అవతరించానిట నేస్తం!
నీకే ఈ నా సమస్తం!!
కుశలమే నా ప్రస్తుతం ?!
*07-08-2012

3, ఆగస్టు 2012, శుక్రవారం

రామ క్రుష్ణ రాఖి ధర్మపురి || ప్రేమించు ||


నీకు తెలుసా వాలిపోతున్న కనురెప్పల బరువెంతో
నీకు తెలుసా రాలి పడుతున్న అశ్రువుల విలువెంతో
నీకు తెలుసా నిద్రలేమితో మండే కళ్ల మంటెంతో


గమనించావా!
తదేకంగా తెఱపై చూస్తుంటే కనుకొలను
కోల్పోయిన ఆర్ద్రత అనుభవాలను
నీకు తెలుసా భావ గంగా ప్రవాహాన్ని నీకందించడానికి
వేళ్ళునొక్కేకీల హేల గోల
నీకు తెలుసా ముంచుకొచ్చే మత్తు గమ్మత్తు మహత్తులు

నీకు తెలుసా అనుక్షణం నీ ఆలోచనల కుమ్మరిపురుగు మెదడునెలా తొలుస్తుందో
నీకుతెలుసా! పుడమి కడుపు చీల్చుకొంటూ వెలికి వచ్చే గడ్డి పఱక ప్రయాస
నీకు తెలుసా!గొంగళి పురుగు రంగుల సీతాకోక చిలుక లా మారడానికి పడే ప్రస్థాన యాతన
నీకు తెలుసా! ఒక్కో పుల్లను,ఎండు గడ్డి రెల్లునూ కూడగట్టుకొని
పిచ్చుక గూడు కట్టుకోడానికి పడే తపన

ఎందుకు నేస్తం ! తీసిపారేస్తావ్ !! నన్నూ నా ప్రేమను
ఎందుకు మిత్రమా!! అపనమ్మకంతో చూస్తావ్ నన్నూ నా అనురాగాన్నీ

నీకు చేదు అనుభవాలు ఉండొచ్చుగాక !
నీవు విషమ పరిస్థులనెదుర్కొనవచ్చుగాక!!

అందరినీ ఒకే గాటుకు కట్టేయడం ఎంతవరకు సమంజసం?
అందరినీ అదే చోటుకి నెట్టేయడం ఎంతవరకు సబబు?
ఎప్పుడూ మోసపోతామని భయపడడం ఎంత వరకు న్యాయం?

నమ్మకం ఎప్పుడూ నమ్మదగ్గదే!
విశ్వసనీయత ఎల్లప్పుడు విశ్వసించ దగ్గదే!!
నమ్మంది నిమిషమైనా మనలేమే!
నమ్మంది క్షణమైనా శ్వాసించలేమే!!

పుట్టుక ఒక విశ్వాసం ?!
మరణం జీర్ణించుకోలేని నిజం
ప్రేమ అవసరమైన నమ్మకం
స్నేహం శాశ్వతమైన ఆనందం!!

గ్రహించు
సంగ్రహించు
విశ్వసించు
ప్రేమించు
సదానందంగా
సచ్చిదానందంగా
జీవించు
అనుభవించు అనుభూతులు పంచు!
*03-08-2012

30, జులై 2012, సోమవారం

రామ క్రుష్ణ రాఖి ధర్మపురి కవిత

“ఎక్స్ ప్లాయ్ టేషన్”
“ఎక్స్ ప్లాయ్ టేషన్”
సాకు- బాకు అవుతుంది నా దేశంలో...
బహీనత- వజ్రాయుధమవుతుంది నా దేశంలో-

మరణాలేవైనా మార్గం సులభతరం చేస్తాయి –మాకు ఉపకరణాలై...
ఆత్మహత్యలేవైనా మారిపోతాయి- మాకు తిరుగు లేని అస్త్రాలై...

కేజ్ లు..లింకేజ్ లు..పై పై మసాజ్ లు
మాఫీలు.. మద్దతులు..మడతపేచీలు కుచ్చు టోపీలు
కంటి తుడుపులన్నీ..కపట నీతులు..కుటిల గోతులు
మేమేం తక్కువ తిన్నమా.. మేం మాత్రం వెధవాయిలం అనుకొన్నావా
ఊరడింపుచర్యలు బ్లాక్ మెయిలింగ్ల్ లై రొమ్మువిరుచుకొంటాయి....
రాయితీలు తేఱగా దొరికే తాయిలాలుగా రూపు మార్చుకొంటాయి..
రిజర్వేషన్లు జన్మహక్కై రాజ్యమేలుతుంటాయి-
సబ్సిడీలు తాత సొమ్మై సోమరితనం పెంచుతుంటాయి..
ఓట్లు వక్రమార్గాల అక్రమాలు నేర్పుతుంటాయి
హక్కులు రెక్కలువిప్పుకొని విశృంఖలంగా సొమ్ముచేసుకొంటాయి

పురుషాధిక్యం
పేదరికం
నిరక్ష్యరాస్యత
వెనకబాటుతనం
కులాలు
మతాలు
అవకరాలు
అవలక్షణాలు
అజ్ఞానం
ఏదైనా కావచ్చు ప్రతిదీ ఓ చిచ్చు!!
అన్నీ అర్హతలే నాదేశంలో-“ఈజీ మనీ” కి
అన్నీ అవకాశాలే నాదేశంలో-“లేజీ మాన్ ”కి

ఇది విషవలయం-ఎవరిని ఎప్పుడు ముంచేస్తుందో
ఇది తేన తుట్టే-కదిపితే ఎవరిని కబళిస్తుందో
ఇది పులిపై స్వారీ- దిగితే ఎవరిని మ్రింగేస్తుందో
అందుకే వీటిని ఇలాగే ఉండనిస్తారు...
వీటిని ఇంకా ఇంకా పెంచి పోషిస్తారు..
రోగికోరేదీ కమ్మని తీయని మందే..! వైద్యుడు ఇచ్చేదీ జబ్బు మానని మందే..!!
ఉన్నతమైన స్వావలంబనకు ఎన్నడూ ఊతమీయరు..
ఉదాత్తమైన సాధికారతకు ఎప్పుడూ పట్టం కట్టరు...
వీటిని పెంచి పోషిస్తేనే- రాజకీయ మనుగడ !
కాదుపొమ్మంటే అమ్మో-నిత్యం రగడ !!
ఎవరిస్థాయిలో వాళ్ళు...
ఎవరికందినంత వాళ్ళు...
దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవా
గుంజుకున్న వాడికి నంజుకుంన్నంత నారాయణా
నిస్సహాయంగా,అశక్తతతో,దీనంగా,బ్రతుకు దుర్భరమై
ప్రకృతి వైపరిత్యనికో విధి విలాసానికో ఎదురీదలేక
కొట్టుమిట్టాడే జీవికి తిరిగి నిలద్రొక్కు కోడానికి
అందించే చిరుసాయం-!
అదే అదనుగా,అదే ఆసరగా, అదే అవకాశంగా ఎగబడే
బాగా బలిసిన డేగలు,కందిరీగలు
రాబందులు,పందులు,
నక్కలు, పంది కొక్కులు,
గబ్బిలాలు ,గుడ్లగూబలు
నోటికాడి కూడు తన్నుకపోయే మాయోపాయం-!!
పథకాలకు తిలోదకాలు..
సిద్ధాంతాలకు పిండ ప్రదానాలు...
ప్రగతికి తగ్గని విరోచనాలు..!!!

29-07-2012

రామ క్రుష్ణ రాఖి ధర్మపురి || జీవిత పరమార్థం ||


నేనే
అన్నిటికీ కారణం అనుకుంటే

ఈ క్షణం
నే అనుభవిస్తే

ఏదీ ఆశించకుంటే

ప్రతిదీ స్వీకరిస్తే

అంతా మంచికేనని భావిస్తే

జీవితంలో ఏదైనా భాగమే నని
ఇది ఇంతేనని, సహజమేనని తలపోస్తే

బ్రతికినంతకాలం అందరితో కలిసి మెలిసి
హాయిగా జీవిస్తే

ఆనందం!
బ్రహ్మానందం!!
పరమానందం!!!
29-07-2012