ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడైన గొప్ప దేవా
నీ నామమును భయ భక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుడైన నా మొరను
చెవి యొగ్గి వినుము ఖిన్నుడనై వున్న నా యీ ప్రార్ధన నాలకింపుము
నేల మాళిగ వంటి వొక చెరసాలలో నా ప్రాణము బొందిలో నిమ్మళము లేక యున్న సంగతి నీకు నివేదింతును
మందలో కలవలేని అశక్త గొర్రెను. యెప్పుడూ నా నుంచి నేను తప్పిపోతాను. జీవితాన్ని జైలును చేసిన యెహోవా, జానెడు నేల కోసం, దోసెడు నీటి కోసం బంధింప పడ్డాను. నిన్ను శిలువ వేసిన వారి వారసులతో దేవా నేను మోదుకొంటినని నాకేమెరుక. మట్టికీ బతుకుకూ పేగు సంబంధాన్ని ముడిపెట్టితిననుకుంటిని. కానీ బంధనము బహుమానమగునని తలంచలేదు. నీ వాక్కుననుసరించి నా పొరుగు వారిని ధృడముగ ప్రేమించుటయే నేను చేసిన నేరము. యెహోవా, అబద్ధాములాడు కాలము నుండి, మోసకరమైన ప్రతి కొత్త వుదయము నుండి నన్ను విడిపింపుము. నీవు నీ జ్ఞానము చేత సృజియించిన భూమ్యాకాశములు నీవు సృజియించిన పాపులమైన మాకు చెందునట్లు చేయుము. పగలు యెండ దెబ్బ నుంచి, రాత్రి వెన్నెల దెబ్బ నుంచి కాపాడుతున్న దేవా, నా రాకపోకలందు వూపిరులొదులుతున్న వొక మహా యుద్దము నుండి నన్ను కాపాడుము. నిర్నిమిత్తముగ నన్ను ద్వేషించుచున్న యేలినవారిని కన్ను గీటనియ్యకుము.
అహంకారులైన దొరలు మా మీదికి లేచినపుడు మా చేతికొక ఆయుధమైనా నొసంగని వో దేవా నీ తల్లి వంటి నా తల్లి కన్యకయని అవహేళననొంది ఆత్మహత్యింపబడినది. ఆమె స్మృతులొరసుకొని నేనిక్కడ నది వొడ్డువలె కరగిపోవుచుంటిని. నా చీకటి ముఖమును కప్పుకొనుటకిక్కడ వొక నక్షత్రముయునూ లేదు. మంద నుండి నన్ను రక్షించుటకై యేకాంతమనెడి చల్లటి హస్తమును నా తలమీదుంచుము. వెంటాడుతున్న అపరిచిత ముఖము వంటి దుఃఖము నుండి నన్ను వుపశమింపచేయుము. నల్లని ద్రాక్ష గుత్తుల వంటి నా ప్రియురాలి రొమ్ముల రుచుల వంటి జ్ఞాపకములు నన్నిక్కడ వెంటబడి తరుముచున్నవి. నువ్వు పాయలుగా చీల్చిన యెర్ర సముద్రము అలలెత్తి నాలో ఘోషించుచున్నది. రాత్రి కురియు మంచుకు తడిచిన నా ప్రియురాలి నగ్న శరీర సౌందర్యము వంటి రహస్యమేదో నా చెవిలో హోరెత్తుతున్నది. ఆకాశమందు ఆసీనుడైన వాడా యెహోవా నీవు నీ గుప్పిలిని విప్పి పిడికెడు నక్షత్రములు నా నెత్తిమీదికి రాల్చి నన్ను ధన్యతనొందింపుము. నాకు నా ప్రియురాలి బలసూచకమైన మందహాసము నిమ్ము. ఆమె ప్రేమాతిశయ స్వరమును వినిపింపనిమ్ము.
గ్రీష్మము దాటిపోయెను. వర్షాకాలముయునూ గతించుచున్నది. దేశమంతా పువ్వులు పూసియున్నవట. సౌందర్యము విచ్చుకొనుచున్నదట. దర్శన భాగ్యము లేదు. భూదిగంతములనుండి ఆవిరిలేవజేయు వాడా, వాన కురియునట్లు మెరుపు పుట్టించు వాడా, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. కావలి వారు వుదయము కొరకు కనిపెట్టుకొనుటకంటే యెక్కువగా స్వేఛ్చ కొరకు నా ప్రాణము కనిపెట్టుచున్నది. నాకొక వేకువను ప్రసాదింపుము. ఆరు బయటి సముద్రము రెక్కలు కట్టుకొని నా చెంత వాలునట్లు చేయుము. తల్లివలె వేచి యున్న నా ప్రియురాలి వోర్మిని యింకనూ పరీక్షింపకుము. నా చేతులకున్న సంకెళ్లను త్రెంచివేయుటకై నేను నిన్ను పది తంత్రుల సితారతో కీర్తించెదను. నీ నామమును ఘనపరిచెదను.
అయ్యా! నా ప్రార్థననాలకించినందులకు నీకు స్తోత్రములు.....స్తోత్రములు.
వొకానొక సంవత్సరం
చిత్తూరు జైలు.

*12-07-2012