Yasaswi Satish లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Yasaswi Satish లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
31, అక్టోబర్ 2012, బుధవారం
Yasaswi's || మనసుకి "key" whole||
చూస్తాం.. లోకం.. ఆ క్షణమంతా మనదే..
లోకమా! క్షణమా!! ఏమో.
నచ్చిన రంగులుంటాయ్.. మనల్ని కావాలంటాయ్
రంగవ్వాలా! నచ్చాలా!! ఏమో.
వెచ్చని ఆలోచనలుంటాయ్ లోనికి రమ్మంటాయ్
ఆలోచనలనా! వెచ్చదనాన్నా! ఏమో.
చిక్కని జవాబులుంటాయ్ కనుక్కోమంటాయ్
కనుక్కోవాలా! అడగాలా! ఏమో.
విప్పని ముడులుంటాయ్ చేయి చేసుకోమంటాయ్
ముడులనా .. వాటి జడలనా ఏమో.
కొన్ని కోరికలుంటాయ్
చూడాలని.. వినాలని .. ఆఘ్రాణించాలని.. స్పృశించాలని
రుచిచూడాలని.. ప్రేమించాలని ..
కోరాలా!! కోరపీకాలా ! ఏమో.
పుట్టినప్పుడు ప్రతీదీ అందంగానే ఉంటుంది.. పసిపాపలా.
ఆ క్షణం లో అదే లోకం..
లోకం లోకి అందమైన దాన్ని వదిలేయ్..
ఇంకేంకావాలి!
నీకు నచ్చినట్టు రంగరించు..
ఇచ్చేయ్..
నీ రంగులతో లోకం నింపు
ఇంకేంకావాలి!
లోనికి వచ్చిన ఆలోచనల వెచ్చదనాన్ని పంచు
జవాబు అడుగు..
దానికదే కనుక్కుంటుంది ప్రశ్నని
జడపట్టుకో
ముడి పట్టుబడిపోతుంది
తాడో-పేడో తేలిపోతుంది
కోరికలూ.. మీ మూలాలు వేరు
లోనికి చూస్తావా.. బయటదారులు కనిపిస్తాయి.
మనసుకి మార్గాలుంటాయి.. గొళ్ళాలుంటాయ్
తెరిస్తే బయటవాటిని లోపలే చూపిస్తాయి
బయటవెతికావో నిను లోపలపెట్టి చీకటి పాల్చేస్తాయి.
చీకటిని నీ వివేకంతో కాల్చేయ్..
మనసంతా నీ ప్రపంచమౌతుంది..
ఈ ప్రపంచానికే నీమీద మనసౌతుంది.
ఇంకేంకావాలి!!!!!!!!
==30.10.2012==
25, అక్టోబర్ 2012, గురువారం
Yasaswi's ||చతుర్ధ చంద్రోదయం||
=1=
చిన్ననాడెప్పుడో చంద్రుడ్ని చేరువుగా చూసిన జ్ఞాపకం…
బహుశా అమ్మ చూపుడి వేలి చివర వేలాడుతూ అనుకుంటా.
అప్పట్లో ఎంత అందంగా ఉండేవాడు !
పంచదార కలిపిన పెరుగన్నం ముద్దలా.
అదేంటో నే ఏడుపు ఆపేలోపు అమ్మ గోటిపై చేరేవాడు…
చల్లగ నా కడుపులోకి జారేవాడు..
నే నిద్దరోయాక నాన్న వచ్చేవాడు..
నింగికి.. నేలకు నడి మబ్బులా ..
ఎక్కువగా గర్జించేవాడు .. అప్పుడప్పుడూ వర్షించే వాడు ..
అమ్మ వెన్నెలంతా నాన్నకే సొంతం.
ఏ అమృత సాగర మధన ఫలితమో..
మా ఇంట శశి వదన ఉదయం ..
=2=
చిన్నప్పుడేప్పుడొ చంద్రుణ్ణి ఏడుస్తూ చూసిన జ్ఞాపకం
బహుశా అమ్మ అడ్దాల నడుమ ననుకుంటా..
అచ్చంనాలానే ఉండేవాడు ..
నోట్లో పాలపీకతో నా చిన్ననాటి ఫోటోలో లా …
అల్లరి నాలానే చేసేవాడు ..
పెద్దయ్యాక నాకు తొడొచ్చేవాడు.. నాన్న చేతికి అందొచ్చేవాడు
జ్ఞాపకాల దొంతరలో నలగని నిజం,
తమ్ముడైనా అన్న లాంటి వాడి నైజం .
=3=
మునుపెన్నడో చంద్రుడు నను చూసి నవ్విన జ్ఞాపకం ..
నను ముస్తాబించి కూర్చోపెట్టాక ..
అదేంటో నే తలెత్తి చూసేలోగా తెరమరుగయ్యాడు..
తెలిమంచు కరిగేలోగా తలపు లెన్నో రేపాడు..
అప్పటి వరకు తెలియలేదు ..
ఉదయ చంద్రిక కూడా ఉంటుందని నులివెచ్చగా
ఎన్ని జన్మలు బంధమో .. ఆ సప్తపద బంధం ..
ఆ చలువ రాయిపై అరిగే చందం .. నా జీవన గంధం .
ఇది కృష్ణ పక్షపు అష్టమి లోపు మరో చంద్రునితో నా అనుబంధం .
అష్టమి అమావాస్య తెలియకుండా రసరాజ్య యుద్ధం ..
ఫలితంగా పాడ్యమి పాపడు సిద్ధం .
ఇదీ ప్రతీ స్త్రీ కోరుకునే.. చతుర్ధ చంద్రోదయం …….
=4=
అమ్మలందరికీ.. ప్రేమతో..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)