పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sreekanth Aluru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sreekanth Aluru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఏప్రిల్ 2014, శనివారం

Sreekanth Aluru కవిత

శ్రీ II అదృశ్య సంకెళ్లు II భావ దారిద్ర్యపు బందీఖానాలో పరాదీనతకి గులాం చేస్తూ పరాన్నబుక్కత్వాన్ని నర నరాన ఎక్కించుకున్న ఆలోచనకి వెన్నెముక నివ్వలేని నిస్సహాయ వ్యవస్థ స్వార్థం పరమార్థమై సమూహ భావన మరచి సమిష్ఠి చింతన విడిచి అర్థం కోసం మానవ సంబంధాల అర్దం మార్చి క్విడ్ ప్రో కో సంస్కృతిలో ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ రాత్రికి రాత్రే ఆంటిలాల్లాంటి అందలాలెక్కెయ్యాలని కలలుగనే మద్య తరగతి మేదావి వర్గం నిజం చూడలేక కాదు మూలాల ఎరుక లేక కాదు మట్టి వాసనలోని క(అ)మ్మతనం తెలియక కాదు... కానీ గ్లోబలైజేషన్ తెచ్చిన కాస్మోపాలిటన్ వెలుగుల్లో తనని తాను కోల్పోయి కార్పోరేట్ల అదృశ్య సంకెళ్లని అభివృద్ది కిరీటాలుగా భ్రమిస్తూ అంతఃచేతనని త్యజించి భావ దాస్యంలో వినియోగ వ్యసనంలో ఆధునిక వెట్టిలో ఊగుతూ..., జోగుతూ..., విలువలని తాకట్టు పెట్టిన ఏకోన్ముఖ సమాజం నుంచి ఇంత కన్నా ఏం ఆశించగలం --శ్రీ

by Sreekanth Aluru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hItoQo

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Sreekanth Aluru కవిత

శ్రీ IIనన్ను వదిలెయ్యండిII ఎందుకో ఇప్పుడంతా కొత్తగా అనిపిస్తుంది లోకమంతా కొత్తగా పరిచయమవుతున్నట్టు ఇన్నాళ్లూ నేనెరిగిన మనుషులేగా పరిచయాలు పాతవె గాని పలకరింపుల్లోనే ఏదో తేడా వుంది మాటల తూకంలో నన్ను తూస్తున్న అనుభూతి దూరం మనుషుల మద్య దూరాన్ని పెంచుతుందన్నది అబద్దం దూరం మనసుల మద్య బంధానికి స్ట్రెస్ టెస్ట్ ఇప్పుడెందుకో ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు అర్రే వీడు ఎదురుపడ్డాడు పలకరిచాలేమో అని సందేహించకండి మీ పలకరింపు నాకవసరం లేదు ప్లాస్టిక్ నవ్వుల కంపు భరించలెకున్నా మీరు పలకరించి నా నోటికి ప్లాస్టిక్ అద్దకండి ప్లీజ్ ఇప్పుడు నాకే తెలియకుండా కొత్త విద్యేదో అబ్బినట్టుంది సైనస్ తో ముక్కు వాసనలు పసిగట్టలేకున్నా మనుషుల అంతరంగాల్లోని మకిలి వాసనలు మాత్రం బాగా తెలుస్తున్నాయి నా మానాన నన్ను వదిలెయ్యండి నా గురించి మీరు ఎదో అనుకుంటారేమో అన్న స్థితిని నేనెప్పుడో దాటేసాను మీకు తోచినట్టు అనుకోవచ్చని కూడా ప్రకటిస్తున్నా ఇక మీ నటనలు చాలించి మీకు మీరుగా రండి ముసుగులు తొలగించి --శ్రీ

by Sreekanth Aluru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlJXEF

Posted by Katta

24, సెప్టెంబర్ 2012, సోమవారం

శ్రీ || పిచ్చి కుక్క

అవును అతను కుక్కే...
తన దేశ సంపద పై తోడేళ్ళు కన్నేస్తే
దశాబ్దాల పాటు కాపు గాసిన కుక్కే
అవును అతను ఖచ్చితం గా పిచ్చి కుక్కే
అగ్ర రాజ్యపు అడుగులకి మడుగులొత్తకుండా
అమెరికా అధికారాన్నే ప్రశ్నిస్తే
పిచ్చి కుక్క కాక మరేమవుతాడు.

అతను ఖచ్చితం గా పిచ్చికుక్కే
తన దేశపు చమురు నిల్వలు
తన ప్రజలకి మాత్రమే చెందాలనుకోవడం,
చుక్క నెత్తురు చిందకుండా
రాజరికాన్ని అంతం చేసినా,
అధికారం చెలాయించడానికి
అమెరికా ముందు తోక ఆడించాలి గానీ
జాడించకూడదని తెలియని పిచ్చి కుక్క.

అవును అతను నియంతే
మానవ హక్కులని హరించిన దుర్మార్గుడే
కానీ హక్కులని హరించాలంటే
ప్రజాస్వామ్యపు ముసుగు తొడుక్కోవాలని
తెలియని పిచ్చోడు...
ప్రజాస్వామిక హక్కులని భక్షించినా
దాన్లో నాటో తోడేళ్ళకి కూడా
భాగం పంచితే సరిపోతుందన్న
కనీస లోక ఙ్ఞానం లేని వాడు
అదే వుంటే...
గ్వాంటనమో బే లాంటి జైలు కట్టుకుని,
ఆమ్నెస్టీ ఇంటెర్నేషనల్ కి
విరివి గా విరాళమిచ్చి
చేతులు దులుపుకునేవాడు కాని
పిచ్చోడి లా మానవ హక్కుల కోర్టులో
దోషి గా ఎందుకు నిలబడతాడు

అతను ఖచ్చితం గా పిచ్చి కుక్కే
కాకపొతే..
అధికారం లొకి వచ్చిన
నాలుగు దశాబ్దాల్లోనే
అక్షరాస్యతని వంద శాతానికిపెంచి
నిరుద్యొగితని పూర్తిగా నిర్మూలిస్తాడా
పిచ్చికుక్కే కాకుంటే
వ్యభిచారాన్ని,మద్యపానాన్ని నిషేదిస్తాడా

ఒకనాడు రక్తం చింద కుండా
లిబియన్ రెవల్యూషన్ ని విజయవంతం చేసి
లిబియా ని ఆర్థికం గా పరిపుష్టం చేసి
ప్రజల చేత జేజేలు కొట్టించుకున్న గడాఫీ
పిచ్చోడు కాబట్టే అదే ప్రజల చేతిలో
హత్య కావించబడ్డాడు..చరిత్ర హీనుడయ్యాడు.

(అంత్యక్రియలు కుడా ముగియక ముందే చరిత్రకారుల చేతిలో
హీన చరిత్ర లిఖించుకున్న గడాఫీ కి అంతిమ నివాళి)
--శ్రీ 28.10.2011

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

శ్రీ|| స్పూర్తి కాగడా||


ఇంతకు ముందెన్ని
పిరికి ప్రాణాలు
ఉరితాడుకుయ్యాలలూగడం చూళ్ళేదు?
ఎన్ని
నిస్సహాయ బతుకులు,
నిర్వేదపు జీవితాలు,
మృత్యు కౌగిలిలో శాశ్వతంగా
ఒదిగిపోవడం చూళ్ళేదు?

అప్పుడెప్పుడూ ఇన్ని
ప్రశ్నార్దకాల కంచెలు లేవు
మనసులో ఇన్ని సందేహపు
వలయాలు లేవు.
సన్నని సూదులతో
గుండె అడుగున పొడుస్తున్న
బాదా లేదు

కానీ ఇప్పుడు
ఉవ్వెత్తున యెగసిన
ఒక ఉద్యమ కెరటం
ఉరేసుకుంది

నక్సల్బరి లో
అడవితల్లి కి పురుడు పోసి
ఉద్యమానికి ఊపిరులద్దిన
ఒక ప్రచండ ఝుంఝూ
చైతన్యమారుతం
ఉరేసుకుంది.

దారితప్పి చీకటిలో
అస్తవ్యస్తమైన ఉద్యమమానికి
అస్తమించే వయసులో
వెలుగునివ్వలేక
ఆ ఘడియ రాకమునుపే
కొత్త వెలుగుల
విప్లవోదయాల కోసం
కడలిలో దూకిన సూర్యుడల్లే
అగుపిస్తున్నవ్ 'కానూదా'

ఇన్నాళ్ళూ నువ్వు నడిపిన ఉద్యమం
ఇవ్వాళ నిన్ను నడపాల్సొచ్చిందని
బాదతోనేగా నీ మరణాన్ని కూడా
స్పూర్తి కాగడాగా వెలిగించి
నిష్క్రమించావ్!

కానూదా
నీ త్యాగం వ్యర్దం కాదులే
నీ ఆదర్శాలనర్దం చేసుకోలేని
'వాళ్ళ' వంకెందుకు చూస్తావ్
వక్రమార్గం పట్టిన
ఉద్యమకారులను కూడా చూడకు
వాళ్ళూ వీళ్ళూ కాక లోకంలో
నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు లే
నీ ఆదర్శాల వెలుగుల్లో
ఉద్యమ పాఠాలు నేర్చుకుంటున్న వాళ్ళం
నువ్ వెలిగించిన కాగడా మోయాలనుకుంటున్న వాళ్ళం

--శ్రీ(కామ్రేడ్ 'కానూ సన్యాల్ ' కి విప్లవ జోహార్లు) 26.03.10

30, ఆగస్టు 2012, గురువారం

శ్రీ || సామాన్యులమంటే మనం ||

సామాన్యులమంటే మనం
ప్రజలే ప్రభువులన్న
ఒకే అబద్దాన్ని
పదే పదే నమ్మించే
అ/ప్రజాస్వామ్య రాజకీయ నాయకులు కాదు

సామాన్యులమంటే మనం
ఇంటి మీద హెలిపాడ్
పెళ్ళానికి చార్టర్డ్ ఫ్లైట్
ఒక్క మాట తో
స్టాక్ మార్కెట్ హాం ఫట్.
త్రీ పీస్ సూట్లేసుకుని
సంపద పై స్వారీ చేస్తూ
తమ ప్రగతే దేశ ప్రగతని
నమ్మబలికే వ్యాపారవేత్తలు కాదు

సామాన్యులమంటే మనం
ప్రభువుల పాపాల్ని తమ విఙానం తో
రాజ్యాంగ లొసుగుల్లో పాతిపెట్టి
అవినీతి మూటల మేడల్లో
హాయిగా వుండే బ్యూరొక్రాట్లు కాదు

సామాన్యులమంటే మనం
హీరొయిన్ల లిప్ స్టిక్ ధరల్ని
హీరోల చీకటి రహస్యాల్ని
ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల్తో
అబద్దపు వార్తల్ని అందం గా
అందించే వాళ్ళు కాదు

సామాన్యులమంటే మనం
30 సెకన్ల ప్రకటన తో
తమ విలువైన కాలాన్ని
సెకన్ల కి కోట్ల చొప్పున
అమ్ముకునే సెలబ్రిటిలు కాదు

సామాన్యులమంటే మనం
పడవల్లాంటి కార్లేసుకొచ్చి
సూపర్ మార్కెట్ తోపుడుబండి నిండా
సరదా కోసం షాపింగ్ చేసె వాళ్ళు కాదు

సామాన్యులమంటే మనం
ఒకటో తారీఖొస్తుందంటే ఒణికిపోయే వాళ్ళం
ఉల్లిపాయ,టమాటా, నిత్యావసరం ఏదైనా
రేటు పెరిగిందంటే
బడ్జెట్ సవరణల్తో కుస్తీ పట్టేవాళ్ళం.
కందిపప్పు పండక్కే వండుకునే వాళ్ళం
గుక్కెడు నీళ్ల కోసం
కుళాయి దగ్గర కుస్తీ పట్టే వాళ్ళం
రేషన్ షాప్ క్యూ లో సహనాన్ని పరీక్షించుకునే వాళ్ళం
వాన కోసం ఎదురుచూసేవాళ్ళం
మట్టి వాసన పీల్చే వాళ్ళం
అనుక్షణం పోరాడే వాళ్ళం..ఆశాజీవులం
--శ్రీ

(పొట్టకూటి కోసం కవిత్వాన్ని ఫుట్పాత్ మీద అమ్ముకునే ఒక ఐరిష్ కవి కవిత ని ఫ్రీ గా చదివి అనుసరిస్తూ..,అనుకరిస్తూ..
మన్నించాలి నాకు అతని కవితే కాదు కనీసం పేరు కుడా గుర్తు లేదు )

26, ఆగస్టు 2012, ఆదివారం

శ్రీ || ఒక శూన్య సాయంత్రం ||


ఒకప్పుడు..అదే ఆనాడు
మనిద్దరం కలిసి ఆ దారెంట నడిచిన ఆరోజు
అక్కడే
తుంటరి గాలి నీ కురుల ఒంపుల్లో చిక్కుకుని
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయి
నీ ముంగురులతో ఉయ్యాలలూగి
ముని వేళ్లతో సయ్యాటలాడి
నీ చెక్కిళ్లపై నుండి తుళ్లి పడుతూ కేరింతలు కొడుతూ
నీ సౌకుమార్యాన్ని పూల రెమ్మలపై అద్దడానికన్నా ముందు
కుంచెగా మారి
నా మనసు కాన్వాసుపై
నీ రూపాన్ని చిత్రించింది చూడు ...అక్కడే
నేను మౌన ప్రవాహమై
మాటలకి గంతలు కట్టిన చోట
నీ కళ్ల వాకిళ్లలో నిలబడి లోనికి
తొంగి చూసే ప్రయత్నం చేసిన చోట
నా హృదయ భాషని వినమని చెప్పలేక
నువ్వెళ్లిపోయే క్షణం రాకుండా ఆపేందుకు
కాలానికి సంకెళ్లేయాలని నే విఫలయత్నం చేసిన చోట
గతించిన కాలపు ఆనవాళ్లేమైనా
దొరుకుతాయేమోనని వెతుకుతున్నా

లేవు ఏమీ లేవు ఇక్కడ

గాలి వీస్తోంది కానీ నీ పరిమళం లేదు
ఆ చల్లని తడి స్పర్శ లేదు...ఇప్పుడది
హృదయాలు దగ్దమవుతున్న కవురు కంపు కొడుతోంది.
ఉండుండి విసురుగా నా మొహంపై దాడి చేస్తోంది
నువ్వు లేని నన్నూ..
నా ఒంటరితనాన్నీ అసహ్యించుకొంటుంది
ఆ పూలు కూడా అలానే ఉన్నాయి
కాలాలని నిషేదించిన శిలలమల్లే

ఇప్పుడా దారెంట
జ్ఞాపకాల సమాధులు బద్దలవుతున్నాయ్.
సజీవంగా కప్పెట్టబడ్డ కాలం
నా పాదాల కింద నలుగుతూ
స్మశాన సంగీతాన్ని వినిపిస్తోంది.
జ్ఞాపకం మరోసారి సమాధవుతుంది.
కొత్త ఉదయాల కోసం
ఈ శూన్య సాయంత్రంలో
గతం కుబుసాన్ని విడుచుకొందమని వచ్చిన నేను
స్మృతుల చితి మంటల్లో చలికాగి
అదే గతాన్ని ఇస్త్రీ చేసి తొడుక్కుని
మరో సాయంత్రం కోసం వెనుదిరిగా

-- శ్రీ 25/08/2012

19, ఆగస్టు 2012, ఆదివారం

శ్రీకాంతో ఆలూరు ‎'' అమరత్వం పొందిన కాలం ''


మన సాంగత్యం వల్ల
నాలో అమరత్వం పొందిన
పిడికెడు కాలం
నా అంతరాంతరాలలో
ఇంకా కదలాడుతూనే ఉంది
నీ నిష్క్రమణం
చేసిన గాయాలు
బండ రాళ్ళ కొండంటి
నా మనుసులో
మోదుగ పూలల్లే
వికసిస్తూనే ఉన్నాయ్

ఇప్పుడు..
నాలో మిగిలిందేమీ లేదు
ఎప్పుడైనా
ఆ పార్క్ కి వెళ్తే
మనం చివరిసారి కలిసినప్పుడు కూర్చున్న
ఆ బెంచ్ ని ఒక సారి చూడు
ఉరేసుకున్న నా హ్రుదయం
వేలాడుతూ కనిపిస్తుంది.

ఇప్పుడు నేను నేను కాదు
కేవలం నా నిర్జివ అవశేషాన్ని
వర్తమానపు వర్ణాలేవీ
గతం గురుతులని చెరపలేకపోతున్నయ్
నాలో జీవం నింపలేక పోతున్నయ్
అనుభూతించిన క్షణాలు మాత్రం
నాలో నిత్యం రగులుతూనే ఉన్నయ్
వాటిని పూర్తిగా ఆర్పలేక
నివురు దుప్పట్లు కప్పి
నిద్ర పుచ్చుతున్నా.

*18-08-2012

శ్రీ || మనం జీవించే ఉంటాం.. ||


మనమెప్పుడూ సంఘర్షిస్తుంటాం...
కనపడని బానిస సంకెళ్లని
బద్దలు కొట్టడానికి,
తిరుగుబాటు కొలిమిలని రాజేసేందుకు
ఆలోచనలకి అగ్గి రాస్తుంటాం.

మనమెప్పుడూ నినదిస్తుంటాం.
మట్టి వాసన పీల్చే హక్కు కోసం.
శ్రమకి తగ్గ ఫలితం కోసం.
అసమానతలు లేని సమాజం కోసం.

అందుకే
మనం దోషులమవుతాం

దోపిడీని ప్రశ్నించినందుకూ..
ప్రజాస్వామ్యం ముసుగన్నందుకూ...
ప్రత్యామ్నాయం ఉందన్నందుకే,
మనం అంతర్గత భద్రతకి
పెనుముప్పుగా పరిణమించి
నిషేదానికి గురౌతుంటాం.
పదే పదే నేరగాళ్లమవుతుంటాం.
హత్యా నేరం మోపబడి
శిరస్సుపై రాజ్యం నజరానాలని మోసుకుంటూ,
నీడని కూడా నమ్మలేని నిస్సహాయతలోకి
మన ప్రమేయం లేకుండానే నెట్టివేయబడుతుంటాం.

కాబట్టే

మనం మరణిస్తుంటాం
స్వార్థం ఆకలితో సంభోగించి
నమ్మక ద్రోహాన్ని ప్రసవించినపుడూ,
ఆశ ఆశయాన్ని మానభంగం చేస్తే
కోవర్టులు పుట్టినపుడు
అబద్దపు ఎన్్కౌంటర్లలో మనం
అకస్మాత్తుగా నేల రాలుతుంటాం

కానీ అంతలోనే

మనం మళ్లీ పుట్టుకొస్తాం
నేల రాలిన విత్తనం
మొలకెత్తినంత స్వచ్చంగా
రాత్రిని హత్య చేసిన
అరుణమంత సహజంగా
మళ్లీ మళ్లీ పుట్టుకొస్తాం.
దేర్ ఫోర్
మనమెప్పుడూ జీవించే ఉంటాం
విప్లవం వర్దిల్లాలన్న నినాదంలో,
గోడపైనే కాదు.., గుండెల్లో సైతం
వెలుగుతున్న కాగడాలో,
మార్పుకై ఎదురు చూసే కళ్లల్లో
ఎగిరే ఎర్ర జెండాలమై
మనమెప్పుడూ బతికే ఉంటాం..

*18-08-2012

13, ఆగస్టు 2012, సోమవారం

శ్రీ ||''నిషేదిత చరిత్ర''||

విప్లవం ఇప్పుడొక
డస్సిపోయిన నినాదం
రివొల్యూషన్ ఇంకా
రొమాంటిక్ కలగానే ఉంది
అందుకే నిన్నిపుడు
నింగికెగసిన తారవనో
విప్లవాగ్ని ధారవనో
కీర్తించడం లేదు

ఏం సాధించావ్ కిషన్ జీ
ముప్పైదేళ్ళు అడవికే అంకితమయ్యి
కనీసం అమ్మని కూడా కలవకుండా
చెట్లమ్మటా పుట్టలమ్మటా తిరిగి
ఏం బావుకున్నావయ్యా
తెలంగాణాలో నువ్వు వెలిగించిన
చైతన్య దీప్తులు ఎక్కడా
కానరావడం లేదు లే
గ్లోబలైజేషన్ వెలుగుల ముందు
నీ కాగడా వెలవెలబోతుంది చూడు
విద్యార్థి ఉద్యమాల కాలం
నీ తరంతోనె అంతమైపోయింది

అసలు తిరుగుబాటు తత్వం
మాకెక్కడిది...
మెటీరియలిస్టిక్ బతుకు
బతుకుతున్న మాకు
గతితార్కిక భౌతిక వాదాలు
ప్రజాతంత్ర పోరాటాలు
సోషలిస్టు సిద్దాంతాలూ
అర్దం కావు ఎందుకంటే
మేము చదివిన
చరిత్ర పుస్తకాల్లో
సిక్కోలు పోరాటం,జగిత్యాల జైత్ర యాత్ర,
తెలంగాణా సాయుధ పోరాటల
ప్రస్తావనే లేదు
ఇకా మర్క్సిజం, మావోఇజం
మాకెక్కడ అర్దమవుతాయ్
అయినా ఇప్పుడున్నది ఒకే ఇజం
కెరీరిజం..

ప్రశ్నించడం గురించీ
ప్రత్యామ్నాయాల గురించి
ఆలోచించనే రాదు మాకు
నువ్వెంత చెప్పినా
శాంతిబద్రతల కోణం నుంచి తప్ప
నిన్ను వేరె విధం గా చూడలేము
ఎందుకంటే ఇప్పుడు మేము
సామ్రాజ్య వాద భావ దాస్యం లో
హాయిగానె బతుకుతున్నాం
బహుళ జాతి కంపెనీలకి
బానిసలమైనా మేము
సుఖం గానె ఉన్నాం
మా జీతం మాకొస్తుంది
మా ఇల్లు మేము కట్టుకున్నాం
రేట్లు ఎంత పెరిగినా
కొనగలిగే శక్తి ఉంది
ఇక ఎవరు ఏమైతే మాకెందుకు

నీ మరణం కించిత్ బాదని
కూడా కలిగించడం లేదు
అయినా ఎవరికోసం చచ్చిపోయావ్
ఈ భూమి మీద ఇంకా
ఆకలికి ఏడ్చేఅ వాళ్ళున్నారా?
హౌ ఫన్నీ
మన జీడీపీ చూడు
ఎట్లా పరుగులుపెడుతుందో
అడవిలో ఏముంది
రాళ్ళూ, నాగరికత తెలియని
మనుషులు తప్ప
ఒక్కసారి హైదరాబద్ వంక చూడు
ఎటు చూసినా అంతా అభివ్రుద్దే కనిపిస్తుంది

అయినా మీ మార్క్సే చెప్పడట కదా
మానవ సంబందాలన్నీ
ఆర్థిక సంబందాలేనని
ఇప్పుడు మేము కూడా
దానినే ఫాలో అవుతున్నాం
మాకు నష్టం లేనంత వరకు
ఎవడు ఏమైపోతే మాకేంటి
మా లాభం కోసం
పక్క వాడు చస్తున్న పట్టించుకోం
ఇప్పుడు ఇదే
ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్

సమాజం సున్నితత్వాన్ని
కోల్పోయింది కామ్రేడ్
క్రైం న్యూస్ ని కూడా వినోదం గా
మార్చిన మా టీవీ చానళ్ళకి
నీ చావు వార్త
ఒక రోజు బ్రేకింగ్ న్యూస్
ఎవడికి వాడు
ఆ ఉత్సుకతా, ఉత్కంఠని
ఎంజాయ్ చేసి ఎప్పటిలానె
ఎవడి పనుల్లోకి వాడు హాజరు.
ఎవడికి పట్టింది నీ చావు
అందరికీ తెలుసు
నిన్ను అన్యాయం గా మట్టుబెట్టారని
అయినా ఎవరం నోరెత్తం

కాబట్టి కామ్రేడ్
ఇప్పుడు నీ చావుని
గ్లోరిఫై చెయ్యదల్చుకోలేదు
బలవంతుడిదే రాజ్యమన్న
ఆటవిక నీతి
కొనసాగినంత కాలం
నువ్వెలాగూ చరిత్ర పుస్తకం లో
నిషేదించబడ్డ పేజీవే
నిజం గా నువ్వు కలగన్న
ఆ విప్లవం ఉదయించిననాడు
ఆ నిషేదిత పుటల్లోని
అమరుల చరిత్ర పైనే
మరో ప్రపంచపు పునాదులు
మహోద్రుతం గా పైకి లేస్తాయి
అంతవరకు లాల్ సలాం
--శ్రీ
*12-08-2012

11, ఆగస్టు 2012, శనివారం

శ్రీ || గీతలు ||


నాజీవితంల
నాకు ఎరుకైనవి రెండే గీతలు.
పనిముట్టు చేసిన రాపిడికి
అరిగిపోయిన నా చేతి గీతలు,
చేతిల అరిగి పోయిన గీతల్ని
చెమటతో నా నుదుటిపై
గీసుకున్న శ్రమ గీతలు

గిప్పుడు గీడెవడో
మాంటెక్ సింగో.. మాయల ఫకీరో
ఎవడైతేనేం లే
ఇద్దరూ చేసేది కనికట్టేగా.
వీడు మాయాజాలంలో
బ్రహ్మ దేవుణ్ణే మించినోడు
నా నుదుటి మీద
బ్రహ్మ గీసిన దరిద్రపు
గీతల్ని చెరపనీకొచ్చిండట.

ిఅంటే ఇప్పుడు రోజూ రాత్రి
మా పొయ్యిల పిల్లి పండుకోదా?
మా పోరలు కూడా
బడికి పోతరా?
మా ఇంట్ల ఇగ నుంచి
వాన నీళ్లు గుంతల్జెయ్యవా?
రోగమొస్తె మాగ్గూడ
సూది మందులిత్తరా?
గీ మాత్రం గాకుండ
మా దరిద్రమెట్ల పోతది?

దరిద్రమంత బోగొడతనంటే
అబ్బో మా దొడ్డ మనిషినుకున్న.
వీనింట్ల పీనుగెల్ల
పెతోనికి పేదోడంటే
అలుసైపోయింది.
పేదోడి ఆశతోని, ఆకలితోని
ఆడుకునుడు అలవాటైపోతంది.
ఇంతకి వీని ఘనకార్యం జెప్పలే కదా
ఆడికే వత్తన్న...

నాగ్గూడ దెల్వదు గానీ
ఇన్నాళ్లూ గా దరిద్ర గీత
నా నెత్తి మీదుండెనట.
అది మీదున్నదో, నేను కిందున్ననో
నాకైతే దెల్వదు.
గిప్పుడా గీతని
గీ మొగోడొచ్చి నా కాళ్ల కింద గీసిండట.
గీత కిందికొస్తే దరిద్రమెట్ల బోతదో
నాకైతే సమజైత లేదు.
నా కాళ్లకి సెప్పులైన లేకపాయె..
కొడుకు దవడ పగలగొడుదును.

వీని కథలు ఇంకా ఐపోలే
అంబానీ గాని ఆస్తుల్ని
అందర్తోని భాగించి అభివృద్దంటండు.
ఉచ్చ తొట్లకి ముప్పై లక్షలు బెట్టినోడే,
రోజుకి 26 రూపాయలు
సంపాయిస్తే పేదోడు గాదంటండు.
వీడు గీసిన గీత
దరిద్రం పోగొట్టేది కాదు
దరిద్రులని మట్టుబెట్టేది.
వాని గీతలు
చుక్క నెత్తురు కారకుండా
పేదోళ్ల కుత్తుకలు కోసే కత్తులు.

గిదంత ఎందుగ్గానీ..,
ఒక్కటైతే జరూరుగ ఖరారైంది.
పేదోనికి ఆశపడే అర్హత లేదని.
అరిగిపోయిన అరచేతులతో
నుదుటి మీది ముడతల్ని
తడుముకుని మురుసుకునుడు తప్ప
పేదోనికి మిగిలేదేముండదని


*11-08-2012

10, ఆగస్టు 2012, శుక్రవారం

శ్రీకాంత్ ఆలూరు||''నేను నకిలీనెట్లైత''||

నేనెట్ల నకిలీనైత
నా అణువణువు లో
ప్రాణాన్ని ప్రవహింపజేసి

నా హృదయానికి తొలిసారిగా
స్పందనలు కలుగజేసి నాలో
జీవాన్ని జనింప జేసింది
ఇక్కడి గాలే ఐనప్పుడు,
నా మెదడు లో మెమొరీ గదులు
వృద్ది చెందక ముందు నుండీ
ఈ మట్టినే తిని పెరిగినప్పుడు,
పాఠ్య పుస్తకాల్లో వక్రీకరించబడ్డ
చరిత్రనే కాదు
మా ఇంటి గోడపై రాసున్న
విప్లవం వర్దిల్లాలన్న నినాదాన్నీ
నేర్పింది ఈ గడ్డే ఐనప్పుడు,
నేను నకిలీనెట్లైత..

జారిపోతున్న లాగుని పైకి లాక్కుంటూ
ఉరుకెత్తుతున్న కాలువలో వదిలిన
బతుకమ్మ వెంబడి
పూలన్నీ వేటికవే పూర్తిగా
విడిపోయి ప్రవాహం లో కలిసిపోయేదాకా
పరుగెత్తి ఆయాసం తో నిట్టూర్చినపుడు,
హోళీ కి మూడు రోజుల ముందునుంచి
మోదుగ పూల రసంతో
రంగులు తయారు చేసినపుడు
సవాసగాళ్ళంతా జాజిరి కర్రల
కోలాటమాడుతూ ఊరంతా తిరుగుతుంటే
వాళ్ళతో పాటు పాటలు పాడుకుంటూ
వెళ్ళినపుడెపుడూ నన్ను నకిలీ అన్లేదు
మరి ఇప్పుడు ఎట్ల నకిలీనైన??

ఊహ తెలిసిన నాటి నుంచి
గర్వం గా తలెత్తుకుని
మాది వరంగల్ అని
చెప్పుకోవడమే నాకు తెలుసు
అప్పుడెప్పుడూ నా గొంతులోని
శబ్దాల ఎత్తుపల్లాలని
ఎవరూ తరచి చూడలేదు
ఇప్పుడు అదే మాట చెప్పడానికి
మాటని మాడ్యులేట్ చెయ్యాల్సి వస్తోంది
గొంతులో ఏ మాటనైనా
ఈ ప్రాంత యాసలో పలికే
వాయిస్ ఫిల్టర్లు పెట్టుకోవాల్సి వస్తోంది
రెండు భాషలు మాట్లాడటం
అదనపు అర్హతయితే
రెండు యాసలు మాట్లాడితే మాత్రం
మనిషి నకిలీ ఐతండు..

అనివార్యం గా సంక్రమించిన
అనువంశిక చుట్టరికాలు తప్ప
ఆ ప్రాంతం తో
ఎటువంటి మానసికానుబంధం లేనందుకు
అక్కడి వాళ్ళకి నేను
''నైజామోణ్ణీ'
నా భాషలోనో, నా యాసలోనో
ఎక్కడో ఓ మూల
ఆ ప్రాంత అవశేషాలు
నాలో ఇంకా మిగిలి ఉన్నందుకు
ఇక్కడి వాళ్ళకేమో
''సెటిలర్నీ'
ఇప్పుడు నేను
ఇద్దరికీ నకిలీనే

ఇవన్నీ పక్కన పెడితే
నా కులం నన్ను నకిలీని చేసిందట
ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి,
ఇక్కడే చదువుకుని, ఇక్కడివాడిగానే
బతుకుతున్నా
నా ప్రమేయం లేకుండానే
ఆ కులం లో పుట్టినందుకు నేను నకిలీనైన

ఇంకా నేనెందుకు నకిలీనైన్నంటే
ఉద్యమాన్ని భుజానేసుకోక పోగా
కనీసం ఆ ముసుగైన తొడుక్కొని
మాటకి ముందొకసారి, వెనకొకసారి
నినాదాలు పలకనందుకు
రాజ్యాధికారం కోసం పోరాడాల్సింది
పెట్టుబడిదారీ వ్యవస్థ పైనా?
రాజకీయ వ్యవస్థ పైనా?
అని ప్రశ్నించినందుకు
ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాల్నో
నాదైన అభిప్రయాన్ని చెప్పినందుకే
బహుషా నేను నకిలీనైంది

*10-08-2012

7, జులై 2012, శనివారం

శ్రీకాంత్ ఆలూరు॥మౌనం॥


ఒక ఆలోచన నాలో
మౌన సాగరాన్ని
నిత్యం మథిస్తుంటుంది
ఒక మాట నాలో
పదే పదే అణుబాంబై
పేలుతుంటుంది.
ఆలోచనల కణ విచ్చిత్తి
నిరంతరం కొనసాగుతుంటుంది.
కానీ
గొంతులో పేరుకున్న
మౌనపు పూడిక దాటి
బయట పడలేక మాట
పురిట్లోనే ప్రాణం విడుస్తుంది.

అప్పుడప్పుడూ ఒక మాట
అంతరాంతరాలలో అగ్గి రాజేసి
అమాంతం పైకి రావాలని
అదే పనిగా
ఆరాట పడుతుంటుంది.
అదృష్టవశాత్తు ఆ మాట
మౌనపు అగాథాలని
చేదించుకుని బయటపడ్డా
అప్పటికే అది
నిస్సారమై, నిర్జీవమై
శవం పలుకులని
తలపిస్తోంది.

అణువణువునా మౌనం
ఆవహించిన నేను
ఎన్నటికీ బద్దలవ్వని
అగ్నిపర్వతాన్ని..
సహజ గుణాన్ని కోల్పోయిన
లావాని...
మౌనమెంత దుర్మార్గమైనదంటే
మండుతున్న లావాని సైతం
ఉండ చుట్టి తనలో దాచేసుకోగలదు.

నువ్ దూరమయ్యాక
నాలో స్పందనలున్న
ప్రతీ నాడీకణంలోనూ
మౌనం దిగ్గొట్టబడింది.
నా రక్త నాళాల నిండా
చల్లని మౌనం ప్రవహిస్తోంది
గుండె కవాటాలు సైతం
మౌనాన్ని ఆవాహన
చేసుకున్నాయి.

ఇప్పుడు నేను
మూర్తీభవించిన మౌనం
ప్రతిరూపాన్ని...
మౌనమెలా ఉంటుందంటే
నువ్వెళ్ళిపోయాక నాలా...

మౌనం ఒక
తరగని జ్ఞాపకాల
ఊటబావి

మౌనమంటే నిశ్శబ్దమా..
కాదు... కాదు
మౌనం
భయంకర విస్పోటనం.!
*7.7.2012