పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Suresh Vanguri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Suresh Vanguri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జూన్ 2014, గురువారం

Suresh Vanguri కవిత

సురేష్ వంగూరి || బాల్యం || - - - - - - - - - - - - - జారిపోతున్న లాగూకి మొలతాడు అడ్డం వేసి ఒరలో చీపురు పుల్ల పెట్టి రాజసంగా నడవటం గుర్తుందా కర్రపుల్లను చర్నాకోలా చేసి సైకిల్ టైరును రథంగా తోలటం గుర్తేనా బంతిని బాణం చేసి ఏడు పెంకుల్ని ఏకాగ్రతగా పడగొట్టి శత్రువులకు చిక్కకుండా చాకచక్యంగా మళ్ళీ వాటిని నిలబెట్టిన సాహసం గుర్తుందా పగిలిపోయిన రబ్బరు బంతీ అందులోంచి రాలిపడిన బాల్యంలాంటి ఇసక మట్టీ గుర్తేనా 19-6-2014

by Suresh Vanguri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UeplHR

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Suresh Vanguri కవిత

సురేష్ వంగూరి ॥ ఎప్పటికప్పుడు ॥ ఎప్పటికప్పుడు కన్నీళ్ళతో నన్ను వెతుక్కోవటమే కదా నీకు తెలిసిన ప్రేమ ఎప్పటికప్పుడు ప్రేమకు కట్టుబడటం తప్ప నన్ను ప్రేమించి నీకేం ఒరిగిందని ఎప్పటికప్పుడు నిన్ను చూసే నేర్చుకుంటున్నా కొంచెం కొంచెంగా ప్రేమకు అలవాటుపడుతున్నా అప్పుడప్పుడు మట్టి కలంతో ఏవో రెండు పిచ్చి కవితలు నీ బంగారు పాదాల దగ్గర 15-06-2013

by Suresh Vanguri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TXXrzM

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

Suresh Vanguri కవిత

సురేష్ వంగూరి ॥ చెరువు ॥ 1 నిన్న సాయంత్రం చెరువు ముందు చేతులు కట్టుకుని నిలుచున్నాను నన్ను చూడగానే తనలో ఒక కదలిక నా కేరింతల బాల్యం తను కలిసి ఆడుకున్నాం కలిసి అల్లరి చేసాం తను నాకు ఈత నేర్పింది నేను తనకు నాట్యం నేర్పాను నేను ఈదినంతసేపూ తను నాట్యం చేస్తూనే ఉండేది కాంక్రీట్ సంద్రాలకు అలవాటుపడి ప్రవాహంలో కొట్టుకుపోవటమే జీవితం అనుకుంటూ నేనే ఈదటం మర్చిపోయాను తను మాత్రం మారలేదు 2 నిన్న సాయంత్రం చెరువు ముందు తలొంచుకుని దోషిగా నిలుచున్నాను ముఖం చెల్లక మౌనంగా నిలుచున్నాను 3 ఎంతైనా చిన్ననాటి ప్రేయసి కదా తనే చనువు తీసుకుంది దోసిళ్ళు దొసిళ్ళుగా జ్ఞాపకాల కిరణాల్ని ముఖమ్మీద చల్లింది చొరవగా నెట్టింది చిలిపిగా తోసింది నిలువెల్లా తడిపేసింది గతం గతః అంటూ కలువలతో తలంటి స్నానం చేయించింది 4 మళ్ళీ ఎప్పటికొస్తానో అని ఆప్యాయంగా నన్ను ముద్దాడింది చల్లటి తడి నవ్వులతో నన్ను సాగనంపుతుంటే ఒక్కసారిగా నా గుండె చెరువయ్యింది నా లోపల వలయాలు వలయాలుగా ఏదో బెంగ, ఏదో ఆనందం, ఏదో మార్పు 12-06-2014

by Suresh Vanguri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kpUjCh

Posted by Katta

22, ఫిబ్రవరి 2014, శనివారం

Suresh Vanguri కవిత

సురేష్ వంగూరి ॥ గజల్ ॥ చల్లని కాంతుల వానకి తడవాలని సరదా చిక్కని చీకటి గోడను పొడవాలని సరదా లేదనుకోవటమే ప్రాప్తి కాదనుకోవటమే తృప్తి దుఃఖపు దుప్పటి దులిపి మడవాలని సరదా ఎంతకాలమిలా ఉగ్గబట్టుకుని ఊపిరాపుకుని ఒంటరి గదిలో ధైర్యంగా ఏడవాలని సరదా అడ్డంగా తలలూపే అనుభవాల నోర్మూసేయ్ వాస్తవాల వీధుల్లో భయంగా నడవాలని సరదా కుదిరినట్టుగా బతికేస్తే కుదరదులే వంగూరీ మరణం కుళ్లుకునేలా ప్రాణం విడవాలని సరదా 22-02-2014

by Suresh Vanguri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jn4Jor

Posted by Katta

29, సెప్టెంబర్ 2012, శనివారం

సురేష్ వంగూరీ || ఏకాంతం


నాకెవరూ లేరనుకోకండి
నాతో నేను స్నేహించడానికే ఈ ఏకాంతం

ఏకాంతంలో
కొన్ని జ్ఞాపకాల పలకలూ, బలపాలూ
నన్ను నేను దిద్దుకుంటూ, చెరుపుకుంటూ

ఏకాంతంలో
కొన్ని అనుభవాల అద్దాలూ, అర్ధాలూ
నన్ను నేను చూసుకుంటూ, తెలుసుకుంటూ

ఏకాంతంలో
కొన్ని అవకాశాల తలుపులూ కిటికీలూ
నన్ను నేను తెరుచుకుంటూ, తొంగిచూస్తూ

ఏకాంతంలో
నన్ను ఉతుక్కుని ఆరబెట్టుకుంటాను
నన్ను వెతుక్కుని కూడగట్టుకుంటాను
నాకు నేనే భుజం తట్టుకుంటాను

నాకెవరూ లేరనుకోకండి...
హృదయాన్ని పైకి లాగి బిగించి కట్టుకుని
మళ్లీ మనుషుల్లో కలవడానికే ఈ ఏకాంతం

27. 9. 2012

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

సురేష్ వంగూరీ || కులం ||


1
కులం
వాడి నోట్ పుస్తకాలపై
ఇంతింత అక్షరాలతో
ఇంటిపేరుగా ఇకిలిస్తోంది

2
కులం
వాడి బైక్ వెనక
స్టిక్కరై మెరుస్తోంది

3
కాలేజ్ టాయ్లెట్ గోడల మీద
తరగతి గదుల్లో బెంచీల మీద
వాడు కులాన్నే కెలుకుతున్నాడు

4
వాడు తన ఫోన్ బుక్ నిండా
కులాన్నే పలురకాల పేర్లతో
సేవ్ చేసుకున్నాడు

5
ఎవరిని స్నేహించాలో
ఏ లెక్చరర్ పాఠం వినాలో
ఏ హీరోని అభిమానించాలో
ఎవరికి వోటెయ్యాలో
అన్నీ కులాన్ని సంప్రదించే
నిర్ణయాలు తీసుకుంటాడు

6
వాడు
కులానికే తాళి కడతాడు
కులాన్నే కంటాడు
మళ్లీ కులాన్నే నామకరణం చేస్తాడు

7
కులాన్ని శ్వాసించటం అలవాటయ్యాక
కులం వాడి అస్తిత్వమయ్యాక
ఇప్పుడు
వాడికి తెలియకుండానే వాడు
చూపుల్లో పుసులు కడుతూ
మాటల్లో చొంగ పడుతూ
మనసంతా కుళ్ళిపొయి దుర్గంధిస్తూ
మనిషితనమంతా పుళ్ళుపడి రసులు కారుతూ
జీవితపు రోడ్లెంట
స్కిజొఫ్రినియా వచ్చిన గజ్జి కుక్కలా బతికేస్తూ
తన వాంతిని తనే గతికేస్తూ...

12.9.2012

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

సురేష్ వంగూరీ || మరో ముల్లు ||


ముల్లును ముల్లుతోనే తీయాలి
తీసే విధానం సరిగా తెలియాలి

ఒక ముల్లు కసుక్కున దిగబడింది దోపిడీదారుడిలా
మరో ముల్లు జాగ్రత్తగా దానిని తొలగించాలి ఉద్యమకారుడిలా

వాదాలూ, విశ్లేషణలూ తర్వాత
ముందు ముల్లెలా తీయాలో తెలుసుకో
ఎగబడి ఆగ్రహించటం ఉద్యమమైతే కాదు

ముల్లును మెత్తగా గీరటం తెలుసా
లేతగా స్పృశించటం తెలుసా
కొంచెం కొంచెంగా చర్మాన్ని చల్లగా చీలుస్తూ
లోపలికి పోవటం తెలుసా
ఒక్కొక్క పొరనే ఓర్పుగా కదుపుకుంటూ
మృదువుగా ముల్లును బైటకి నెట్టడం తెలుసా

ఈ ప్రయత్నంలో
నొప్పి అనివార్యమే కానీ
అధికారికం కాదు సుమా

ఆగ్రహ ప్రకటన అంటావ్
ఎవరి మీద?
ముల్లు మీదా? దేహం మీదా?
కలుపు మొక్క మొలిచిందని పొలం తగలబెడతావా?
ముల్లు బాధ పెడుతోందని కాలు నరుక్కుంటావా?

మానవీయ విలువల్ని తుంగలో తొక్కి
ఉద్యమించటం అంటే మరో ముల్లుగా దిగబడటమే

అన్నా...
ఇప్పుడు చెబుతున్నా
ఇదే ఉద్యమమంటూ
ఇష్టమొచ్చినట్టు నువ్వు గుచ్చుకుపోతుంటే,
సమాజం కదా, నా దేహం కదా
చూస్తూ వూరుకోలేను
కష్టంలో కష్టం
నొప్పిలో నొప్పి
రెండు ముళ్ళు దిగాయంటూ
నిన్ను కూడా వదిలించుకుంటా

9.3.2012

28, ఆగస్టు 2012, మంగళవారం

సురేష్ వంగూరీ || మీడియాజాలం ||

మనసుని శాటిలైట్ ఛానళ్లుగా విడగొట్టి
కుహనా విలువల రిమోట్ కంట్రోల్తో
మనల్ని మనమే మార్చి మార్చి
మోసం చేసుకుంటూ ఉంటాం

జీవితం డైలీ సీరియల్‌లా
అరాచకంగా సాగుతుంటే
అర్ధాంతరంగా ఒక కమర్షియల్ బ్రేక్...
అనుకోకుండా అందులో మనమే ఉంటాం

మనం పంటి నొప్పితో బాధపడుతూ
డెంటిస్ట్‌ను సంప్రదించకుండా
చిత్రంగా సినిమా కెళతాం
సినిమాలో కొందరు రౌడీలు
హీరోయిన్ని బలవంతం చేస్తుంటారు
ఉన్నట్టుండి పంటి నొప్పి తాళ లేక
ఆ... అని అరుస్తాం
మన మీద జాలి పడిన హీరోయిన్
అత్యాచారాన్ని వాయిదా వేసుకుని
తెర చీల్చుకుని మన ముందుకొస్తుంది
ఉచితంగా ఒక ఉప్పు సలహా ఇస్తుంది

ఏమీ జరుగుతుందో మనకర్ధమయ్యే లోపే
ఆమె తిరిగి తెర మీద కనిపిస్తుంది
రౌడీలకు స్వచ్చందంగా సహకరిస్తూ
తన అత్యాచారం సీను కంటిన్యూ చేసుకుంటూ
అచ్చం మన సంకీర్ణ ప్రభుత్వంలా

ఇప్పుడు
శీలం కాపాడుకోవటం కన్నా
పంటి నొప్పికి కారణాలూ పరిష్కారాలూ
తెలియచెప్పటం అత్యంత అవసరం

ఇక్కడ
అమ్మకమే జీవితం
ప్రభుత్వాలు వాణిజ్యం చేస్తున్నాయో
వాణిజ్యాలు ప్రభుత్వం చేస్తున్నాయో మనకు పట్టదు
ఇంకా ప్రాధమిక హక్కులే అనుభవానికి రాని మనం
బంగారపు హక్కుల గురించి పోరాడుతుంటాం

చూడటానికీ మోసపోవటానికీ
అలవాటైన జీవితంలో
కరెంటుపోయిన ఒక రోజు
ఏదోటి చూడకుండా ఉండలేని మనం
విధిలేక మనసుల్లోకి చూసుకుంటాం
మెల్లగా మల్టీ మోసాల మీడియాజాలం అర్ధమవుతూంటే
ఏడ్వడానికి కూడా సిగ్గేస్తుంది

సరిగ్గా అప్పుడే
నీ మీద నుంచి అడ్డంగా ఒక మెరుపు వెళుతుంది
సత్యం సాక్షాత్కరిస్తుంది
అవాక్కయ్యారా అని ప్రశ్నిస్తుంది

28. 8. 2012

27, ఆగస్టు 2012, సోమవారం

సురేష్ వంగూరీ || అలక

1
ప్రశ్నలు నూరుతూ నువ్వు
సంజాయిషీ ముఖంతో నేను

2
అలగాలని అలుగుతావో
సరదాకని అలుగుతావో
బుజ్జగింపు నెపంతో
నేను చనువుగా మెలగాలని అలుగుతావో
ఎప్పటికీ అర్ధం కాదు

3
అలగటంలో ఏముందో తెలీదు కానీ
అనునయించడంలో అదో ఆనందముంది
బతిమిలాడటంలోనే మన బంధం బలోపేతమవుతున్నది

4
నీ అలక
నాపైన నీకున్న అధికారానికి ప్రతీక

5
కలిసిన ప్రతి సారీ
ఏదో విధంగా అలుగుతూ నీవు
అదే ఛాన్సుగా ప్రేమిస్తూ నేను

*24-8-2012

4, ఆగస్టు 2012, శనివారం

సురేష్ వంగూరి॥గజల్॥

చిరునవ్వై నడుస్తుంటే చుట్టుమూగి చూడాలి
పాటై రవళిస్తుంటే చేతలుడిగి చూడాలి

అలల తలలు అణచుకుంటూ ఈదడానికేముంది
తీరమెంట నడుస్తుంటే సంద్రమాగి చూడాలి

ఉన్నతాలు ఎగబ్రాకే గెలుపులోన ఏముంది
నేలపైన మెరుస్తుంటే శిఖరమొంగి చూడాలి

సంతృప్తే మకుటంరా స్నేహితులే స్వాస్థ్యమ్ రా
సిరులు కోరి వస్తుంటే దూరమరిగి చూడాలి

బితుకు బితుకుమంటూనే బతకాలా వంగూరీ
మరణం దరికొస్తుంటే ఎదురుకేగి చూడాలి
 
*3.8.2012

3, ఆగస్టు 2012, శుక్రవారం

సురేష్ వంగూరి॥మౌనం॥

ఒక్కోసారి మౌనం
అర్ధాంగీకారం కాదు
అనంగీకారం కూడా!

మౌనం
ఒక నిరసన
పైకి వినపడని ఆగ్రహం
లోలోపలే రాపిడవుతున్న అభిమానం

మౌనం
ఒక అసంతృప్తి జ్వాల
పెదాల కరకట్ట కవతల
పోటెత్తుతున్న అభివ్యక్తి ప్రవాహం

ఏదో ఒక రోజు
మౌనం మళ్లీ మాటగా మారుతుంది
అయితే ఆది ఖచ్చితంగా ప్రశ్నించటమే అవుతుంది!
ఉవ్వెత్తున ఉద్యమించటమే అవుతుంది!

అందాకా,
మౌనమే సామాన్యుడి నోరు!
సహనం చేసే ఒంటరి పోరు!!
 
*2.8.2012

30, జులై 2012, సోమవారం

సురేష్ వంగురి కవిత

ఒక్కసారిగా గతం బతికినట్టుగా ఉంది
జ్ఞాపకాల శకలాలను అతికినట్టుగా ఉంది

ఆమె ఎదుట పడగానే ఎందుకింత అదురు నాలో
మానుతున్న గాయాన్ని రేపినట్టుగా ఉంది

ఇన్నాళ్లకు ఎదురైనా పలకరించదేమిటో
గొంతులోన శోకమొకటి కురిసినట్టుగా ఉంది

చూసి కూడా చూడనట్టు ఆమె దాటిపోతుంటే
కళ్ళలోన సంద్రమొకటి కదిలినట్టుగా ఉంది

ఈ అవస్థను ఏమనాలో చెబుతావా వంగూరీ
సరదాగా బ్రతికించి ఛంపినట్టుగా ఉంది.
*29-07-2012