సాహిత్య చరిత్ర నిర్మాణంపై చూపు సారిస్తారా? Posted on: Sun 08 Jun 05:36:20.878858 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యాసంస్థల్లో సిలబస్ పూర్తిగా మారాల్సిన పరిస్థితే ఉంది. ఆ విషయాన్ని ముందుచూపుతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను మనం తక్షణమే పరిష్కరించుకోగలమా అనేది ప్రశ్న. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పాఠ్యపుస్తకాలు మారాల్సి ఉంది. ముఖ్యంగా, తెలుగు పాఠ్యాంశాలు, చరిత్ర మారాల్సి ఉంటుంది. ఇతర విద్యాసంస్థల విషయాన్ని పక్కన పెడితే విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా తెలుగు శాఖలకు తెలుగు సాహిత్య చరిత్ర తక్షణమే మారాల్సిన అవసరం ఉంది. ఈ విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ తెలుగు సాహిత్యాన్ని ప్రతిబింబించే పాఠ్యభాగాలు రావాలి. ఆ విషయాలను పక్కన పెడితే, ఇప్పటి వరకు తెలంగాణలోని తెలుగుశాఖల్లో బోధిస్తున్న సాహిత్య చరిత్రనే ఇక ముందు కూడా బోధించడానికి వీలు లేదు. అలా బోధిస్తున్నామంటే, తెలంగాణ ఉద్యమంలోని సారాన్ని గ్రహించలేదని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి చోదక శక్తులుగా పనిచేసినవాటిలో నీళ్లు, నియామాకాలు, నిధుల వంటి భౌతిక విషయాలు మాత్రమే కాకుండా భావజాలానికి సంబంధించిన సాంస్కృతిక, సాహిత్య విషయాలు కూడా ఉన్నాయి. తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం అన్నారు గానీ అసలే నిర్మాణమే లేనప్పుడు పునర్నిర్మాణం అనేది ఎలా ముందుకు వస్తుందనేది ప్రశ్న. మొత్తంగా తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమే జరగాల్సి ఉంది. ఆ అవసరం ఎందుకు వచ్చిందనేది ప్రశ్న. ఉమ్మడి తెలుగు సాహిత్యంలో తెలంగాణ సాహిత్యానికి స్థానం లేకపోవడం ప్రధాన కారణం. తెలంగాణ సాహితీవేత్తలు, విమర్శకులు, పరిశోధకులు, పరిశీలకులు కూడా గుర్తు పట్టలేనంతగా తెలంగాణ సాహిత్యం మరుగున పడిపోయింది. తెలంగాణ సాహిత్యం తనను తాను మరుపునకు లోను చేసుకుంది. ఈ స్థితిలో కరిక్యులం మార్చాల్సి వచ్చేసరికి తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ఆచార్యులు ఆందోళనకు గురయ్యే పరిస్థితే ఉంది. విశ్వవిద్యాలయం తెలుగుశాఖల్లో విద్యార్థులు చదువుతున్నదంతా ఇప్పటి వరకు కోస్తాంధ్ర సాహిత్య చరిత్రనే. తెలుగు సాహిత్య చరిత్ర తెలంగాణ సాహిత్యాన్ని తనలో ఇముడ్చుకోలేకపోయింది. ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి సాహిత్యం ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రూపుదిద్దుకోలేదు. ఉమ్మడి సాహిత్యం రూపుదిద్దుకుని ఉంటే సాహిత్య చరిత్రలో కోస్తాంధ్ర సాహిత్యంతో పాటు తెలంగాణ సాహిత్యం సమానమైన హోదాను, గౌరవాన్ని పొంది ఉండేది. తెలంగాణలోని సృజనాత్మక సాహిత్యం సాహిత్యమే కాదన్నంతగా సాహిత్య చరిత్రల నిర్మాణం జరిగింది. ఖండవల్లి లక్ష్మిరంజనం, పింగళి లక్ష్మికాంతం, కెవి నారాయణ రావు వంటివారు రాసిన సాహిత్య చరిత్రలను విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులూ ఆచార్యులూ బోధిస్తున్నారు, విద్యార్థులు చదువుకుంటున్నారు. ఖండవల్లి లకీëరంజనం రాసిన సాహిత్య చరిత్రలో తెలంగాణ కవులకు సంబంధించిన ఓ అధ్యాయం వుంది. దాన్ని విస్తరించి ఆంధ్ర సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్య చరిత్రను చేర్చి, ఉమ్మడి సాహిత్య చరిత్ర నిర్మాణం జరగలేదు. కసరత్తు అవసరమైనప్పటికీ కాస్తా శ్రద్ధ పెడితే వాచకాలను మారిన భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోగలం. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఏ సాహిత్య చరిత్రను బోధించాలనేది అధ్యాపకులకు, ఏది చదువుకోవాలనేది విద్యార్థులకు సమస్యగా మారుతుంది. ఇంతకాలం సాహిత్యవేత్తలు, పండితులు, పరిశోధకులు ఎక్కువగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, అంటే భౌగోళిక పరిస్థితుల మార్పు కోసం జరిగిన ఉద్యమంపైనే దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర సాహిత్యాన్ని మాత్రమే గుర్తించిన సాహిత్య చరిత్రను చదువుకోవడంలో అర్థం లేదు. అది కూడా ఒక భాగంగా ఉండాలి గానీ అదే ప్రధానమైన పాయగా ఉండకూడదు. ప్రధానమైన విషయం తెలంగాణ సాహిత్య చరిత్ర కావాలి. తెలుగు సాహిత్య పరిణామక్రమం వివిధ కాలాల్లో నిజామాంధ్రలో ఒక విధంగా, బ్రిటిషాంధ్రలో మరో విధంగా ఉంది. ప్రభావాలు, సామాజిక పరిణామాలు, రాజకీయ పరిణామాలు, సాంస్కృతిక వికాసం భిన్నంగా ఉన్నాయి. సాహిత్య చరిత్రలో జరిగిన యుగ విభజన తెలంగాణ సాహిత్యానికి చోటు కల్పించేది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ యుగ విభజనను మార్చాల్సిన అవసరాన్ని కూడా గుర్తించలేదు. రెండు సందర్భాల్లో మాత్రమే తెలుగు సాహిత్యం తెలంగాణ సాహిత్యాన్ని స్వీకరించింది. ఒకటి - తెలంగాణ సాయుధ పోరాటం, రెండోది - నక్సలైట్ ఉద్యమం. ఈ రెండు సందర్భాల్లో కూడా తెలంగాణ క్రియాశీలకంగా ఉండడం, అందుకు అనుగణమైన సాహిత్యం వెలువడడం కారణం కావచ్చు. మిగతా కాలాలకు వస్తే తెలంగాణ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యం స్వీకరించిన సందర్భాలు చాలా తక్కువేనని చెప్పవచ్చు. ప్రాచీన సాహిత్యంలో తెలంగాణ సాహిత్యానికి చోటు దక్కిన సందర్భం ఉంది. పాల్కురి సోమన వంటి శైవకువులను సాహిత్య చరిత్ర విస్మరించలేదు. కానీ, దానికి దేశీ కవిత్వం కింద చోటు కల్పించి, న్యూనతకు గురి చేశారు. సాహిత్యంలో మార్గదేశీ మార్గాలను విడదీసి, మార్గ కింద ఇతర కవులను చేరిస్తే, దేశీ కింద తెలంగాణ ప్రాచీన కవులను చేర్చారు. అంటే, పోతనను మినహాయిస్తే, ఇతర తెలంగాణ కపులను దేశీ కింద చేర్చి ద్వితీయ శ్రేణి కవులుగానే చూశారు. తెలంగాణకు చెందిన పరిశోధకులు కూడా సాహిత్య విశ్లేషణ, సాహిత్య వింగడింపుల్లో కోస్తాంధ్ర సంప్రదాయాలను, పద్ధతులను, ప్రమాణాలనే స్వీకరించారు. ఇందుకు మంచి ఉదాహరణ - ఆధునిక తెలుగు సాహిత్యం -సంప్రదాయములు, ప్రయోగములు అనే సి. నారాయణ రెడ్డి పరిశోధక గ్రంథం. ముదిగంటి సుజాతారెడ్డి తన సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్యానికి చోటు కల్పించారు. కానీ కల్పించాల్సిన స్థానం కల్పించలేదు. దీనికి ప్రధానమైన కారణం - ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభమైన దాడి తెలంగాణవాళ్లను న్యూనతా భావనకు గురి చేసింది. భాషా సాహిత్యాల్లో తనను చూసి తాను సిగ్గుపడే విధంగా పెద్ద యెత్తున సాంస్కృతిక దాడి జరిగింది. కోస్తాంధ్ర సాహిత్యానికి ఆధిక్యత చేకూర్చి పెట్టి, తెలంగాణ సాహిత్యవేత్తలు తమను తాము చూసుకుని న్యూనతకు గురయ్యే పరిస్థితి కల్పించిన తర్వాత తనను తానే మరిచిపోయే పరిస్థితిని కల్పించారు. దాదాపుగా తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య అస్తిత్వం కోల్పోయే పరిస్థితి వచ్చింది. దాంతో ఆధునిక సాహిత్యం విషయానికి వస్తే, తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యానికి, నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన సాహిత్యాన్ని తప్పిస్తే మిగతా సాహిత్యం విషయానికి వస్తే జరిగిందంతా విస్మరణే. ఈ విస్మరణ రెండు రకాలుగా జరిగింది. ఒకటి - విస్మరణ. అది కావాలని చేసింది. అది వివక్షకు సంబంధించింది. దీనికి ప్రధాన కారణం - తెలంగాణ సాహిత్యాన్ని ఆంధ్ర సాహిత్య కొలమానాలతో బేరీజు వేయడానికి ప్రయత్నించడం. చినవీరభద్రుడు సంకలనం చేసిన వందేళ్ల తెలుగు కథ ఇందుకు నిదర్శనం. 1970ల నుంచి మాత్రమే తెలంగాణలో కథ ఉందనే విషయాన్ని చినవీరభద్రుడిలాంటి వాళ్లు చెబుతూ వస్తున్నారు. రెండోది - అంతర్నిహితమైన వివక్ష. అంటే, చైతన్యంలోనే వివక్ష గుర్తు పట్టరానంతగా అంతర్నిహితమై ఉండడం. అంటే, వివక్ష ఏమిటో కూడా తెలియకపోవడం. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి నవలను విశాలాంధ్రవాళ్లు అచ్చేశారు. దాని అట్ట మీద తెలంగాణ తొలి నవల అంటూ ఓ ముద్ర వేశారు. దానివల్ల అంతకు ముందు తెలంగాణలో నవలలే లేవనే విషయాన్ని చెప్పకనే అది చెబుతుంది. ఈ వివక్షపై తెలంగాణ రచయితలు ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రశ్నలు వేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ యేటా తెస్తున్న వార్షిక కథా సంకలనాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ అసంతృప్తికి, ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడానికి కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాలు ప్రయత్నించలేదు. తెలంగాణ రచయితల వాదనలోని హేతుబద్దతను గుర్తించడానికి నిరాకరించాయి. తెలంగాణ మలి దశ ఉద్యమంలో సాంస్కృతిక, చారిత్రక కోణం కూడా ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. సంస్కృతిని, చరిత్రను వక్రీకరించిన తీరును, విస్మరించిన తీరును, తెలంగాణ పట్ల ఈ విషయాల్లో చూపిన వివక్షను ప్రశ్నిస్తూ వచ్చింది. అలా ప్రశ్నిస్తూ తెలంగాణ సాహిత్యరంగంలో తనను తాను వెతుక్కునే ప్రయత్నం చేసింది. అంటే, యాభై ఏళ్ల కాలంలో తలకిందులై, స్థిరీకరింపబడిన అంశాలను నిటారుగా నిలబెట్టాల్సిన అవసరాన్ని గుర్తించడమే కాదు, అందుకు అవసరమైన కృషి కూడా ఈ ఉద్యమంలో జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాల్సిన అవసరం ప్రధానమైన అంశంగా ముందుకు వచ్చింది. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక చరిత్రను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని తెలంగాణ సాంస్కృతిక వేదిక 2000ల్లోనే గుర్తించింది. తెలంగాణ, సాంస్కృతిక ఉద్యమం ఆ దిశగా సాగాలని నిర్దేశించింది. అందులో భాగంగానే తెలంగాణ తోవలు, భౌగోళిక సందర్భం అనే రెండు పుస్తకాలు వచ్చాయి. ఈ రెండింటిలో తెలంగాణ తోవలు అత్యంత కీలకమైన, ప్రధానమైన గ్రంథం. ఈ పుస్తకంలో తెలంగాణ సాహిత్య విమర్శకు కొలమానాలు మారాలని, ఆ కొలమానాలు ఎలా ఉండాలో చెప్పడానికి కాసుల ప్రతాపరెడ్డి ఆధునిక తెలుగు సాహిత్యానికి అన్వయిస్తూ వాళ్లూ - మనమూ అనే వ్యాసం రాశారు. తెలంగాణ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను కొత్త కొలమానాలతో, కొత్త దృష్టికోణంతో, స్థిరీకృత పద్ధతులను తృణీకరించిన రాసిన వ్యాసాలున్నాయి. ఇందులో భాగంగానే పాల్కురికి సోమనాథుడిని తొలి తెలుగు కవిగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల లింగారెడ్డి సూత్రీకరించారు. నన్నయను ఆదికవి తెలంగాణ సాహిత్య చరిత్ర స్థిరీకరించి పెట్టింది. ఈ స్థితిలో అనువాదం మాత్రమే చేసిన నన్నయ ఆది కవి కాలేడని, సొంత వస్తువు తీసుకుని రాసిన పాల్కురి సోమనాథుడు ఆదికవి అవుతాడని వారు వాదించారు. వాటితో పాటు భాషపై నందిని సిధారెడ్డి, చారిత్రక పరిశోధనకు మనకున్న వనరుల గురించి కె. శ్రీనివాస్ వ్యాసాలు రాశారు. ఈ పుస్తకంలో అచ్చయిన వ్యాసాల్లోని సూత్రీకరణలను ఆధారం చేసుకుని సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చరిత్రలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉండింది. అయితే, ఆ దిశగా కృషి కాస్తానే జరిగింది. ఈ విషయంలో సంస్థలు, విశ్వవిద్యాలయాలు చేసిన కృషి కన్నా వ్యక్తులు చేసిన కృషి ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన కృషి తెలంగాణ సాహిత్య నిర్మాణానికి పనికి వస్తాయి. అంటే ఆధార గ్రంథాలుగా పనికి వస్తాయి. ప్రాచీన తెలంగాణ సాహిత్య నిర్మాణానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ముంగిలి మంచి ఆధార గ్రంథం. ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన చరిత్రను మరింత విస్తృతంగా నిర్మించుకునే వరకు దాన్ని బోధించడానికి వీలవుతుంది. దాన్ని బోధించే క్రమంలోనే విస్తరించుకోవచ్చు, మార్చులు చేసుకోవచ్చు. సాహిత్య చరిత్రలో తొలి తరం తెలంగాణ కథల వివరాలను సంగిశెట్టి శ్రీనివాస్ తెచ్చిన దస్త్రమ్ అందిస్తుంది. అలాగే, ముదిగంటి సుజాతారెడ్డి సొంతంగా ఒకటి, సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి మరోటి తొలి తెలంగాణ తొలితరం కథల సంకలనాలను అందించారు. విశాలాంధ్ర తెలంగాణ కథల సంకలనం తెచ్చింది. కర్ర ఎల్లారెడ్డి తెచ్చిన తెలంగాణ వార్షిక కథా సంకలనాలు ఉన్నాయి. స్కైబాబ తెచ్చిన ముస్లిం కథా సంకలనాలు, వివిధ సంపాదకులు తెచ్చిన దళిత కథల సంకలనాలు ఉన్నాయి. కాలువ మల్లయ్య తెలంగాణ కథ మీద రాసిన ఓ గ్రంథం ఉంది. తెలంగాణ విమర్శకులు వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాలున్నాయి. ఆ విమర్శకుల సాహిత్య విమర్శనా గ్రంథాల నుంచి వాటిని స్వీకరించవచ్చు. వివిధ సందర్భాల్లో తెలంగాణ నుంచి వచ్చిన కథా సంకలనాలున్నాయి. ఇక, ఆధునిక తెలంగాణ సాహిత్యానికి వస్తే ముందే చెప్పినట్లు సి. నారాయణ రెడ్డి ఆధునిక కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు తెలంగాణకు ప్రాతినిధ్యం వహించదు. తెలంగాణ పరిశోధకుడిగా రాసిన పరిశోధక గ్రంథంగా మాత్రమే దానికి గుర్తింపు ఉంటుంది. తెలంగాణ నవలకు సంబంధించి, తూర్పు మల్లారెడ్డి నల్లగొండ జిల్లా భువనగిరి లకీëనర్సింహస్వామి కళాశాలలో 2007లో నిర్వహించిన సదస్సులో సమర్పించిన పత్రాలతో తెలంగాణ సాహిత్యం - జీవన చిత్రణం అనే పేరుతో ఓ గ్రంథం వచ్చింది. అందులో తెలంగాణ నవలకు సంబందించిన కాలక్రమాన్ని, వస్తు పరిణామక్రమాన్ని విశ్లేషించిన వ్యాసం ఉంది. దాన్ని ముందు పెట్టుకుని నవలకు సంబంధించిన అధ్యయాన్ని విస్తరించవచ్చు. వరవరరావు వెలువరించిన తెలంగాణ విమోచనోద్యమ నవల గ్రంథం ఒక కాలానికి సంబంధించిన నవలను విశ్లేషించడానికి పనికి వస్తుంది. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు సంబంధించిన వర్గీకరణకు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన తెలంగాణ ప్రాంతీయ సాహిత్యం ఓ నమూనాగా పనికి వస్తుంది. సాహిత్య చరిత్రలో ఆధునిక కవిత్వ విభాగాన్ని నిర్మించడానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి ఇరుసు, కొలుపు, గుడిపాటి ఫాయిదా, సుజాతారెడ్డి సంపాదకత్వంలో తెచ్చిన ముద్దెర, నందిని సిధారెడ్డి ఇగురు వంటి సాహిత్య విమర్శనా గ్రంథాలున్నాయి. మరిన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు కూడా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ సాహిత్యంపై జరిగిన పరిశోధనలున్నాయి. ఆధునిక తెలంగాణ కవిత్వ నిర్మాణానికి ప్రాతిపదకను ఏర్పాటు చేసుకోవడానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, అంబటి సురేంద్ర రాజు సంపాదకత్వంలో వెలువడిన మత్తడి పనికి వస్తుంది. పొక్కిలి, మునుం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సందర్భంగా వచ్చిన కవిత్వాన్ని విశ్లేషించడానికి పనికి వస్తాయి. ప్రాచీన సాహిత్య చరిత్రను నిర్మించే క్రమంలో గోల్కొండ, శోభ, నీలగిరి వంటి పలు పత్రికలు ఆధారాలుగా పనికి వస్తాయి. తెలంగాణ సాహిత్య నిర్మాణానికి కావాల్సిన వనరులు ఉన్నాయి. ఆ వనరులను ఆధారం చేసుకుని తెలంగాణ సాహిత్య చరిత్రను నిర్మించడం అనేది పెద్ద ప్రాజెక్టు. ఆ సాహిత్య చరిత్ర నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. దానికి పరిశోధకులు, విమర్శకులు, విశ్లేషకులు కావాలి. వారిని గుర్తించి, కమిటీలు వేసి నిష్ణాతులతో ఆయా విభాగాలు రాయిస్తే అది సాధ్యం కావచ్చు. అయితే, అందుకు పూనుకునే వ్యవస్థ ఒక్కటి కావాలి. ఇప్పటి వరకు ఈ విషయంపై తెలంగాణలోని ప్రధానమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం దృష్టి పెట్టకపోవడం విచారకరమే. తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణేతర తెలుగు సాహిత్యంతో తులనాత్మక అధ్యయనం కూడా చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సాహిత్య చరిత్రను ప్రధానంగా బోధించి, ఆ సాహిత్యాన్ని విడిగా బోధించడానికి అది పనికి వస్తుంది. తెలంగాణలోని ఆదివాసీలు జరుపుకునే జాతరల్లో ప్రముఖమైంది నాగోబా జాతర. దీని చరిత్ర, జాతర నిర్వహణ ఆసక్తికరమైంది. కొండకోనల్లో నివసించే గిరిజనులు తమ జాతి దైవంగా నాగోబాను కొలుస్తారు. దక్కన్ పీఠభూమి గిరిపుత్రులందరికీ నాగోబాయే ఆరాధ్యదైవం. ప్రతి సంవత్సరం పుష్యమాసం (జనవరి, ఫిబ్రవరి) అమావాస్య రోజున అత్యంత వైభవంగా నాగోబా జాతర జరుగుతుంది. ఈ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ఉంది. జాతర కోసం జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. జాతరకు వచ్చే పొరుగు రాష్ట్రాల గిరిజనులకు సౌకర్యాలు కల్పిస్తారు. అయితే జాతర చివరి రోజున 'ప్రజాదర్బార్' నిర్వహించడం ఆనవాయితీ. దీన్ని 1946 సంవత్సరంలో ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త హెమన్‌డార్ఫ్ ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్నుంచి అధికార దర్బార్ నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఆ రోజు జిల్లా కలెక్టర్ సహా ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కెస్లాపూర్‌లో కొలువు దీరుతారు. వివిధ తెగలకు చెందిన గిరిజనులు సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేస్తారు. వాటిని అక్కడికక్కడే పరిష్కారమయ్యే ఈ వేదిక ఏర్పాటు చేశారు. కాని ఏటా సమస్యలపై విన్నవించినా పరిష్కారమార్గం దొరకకపోవడంతో 'ప్రజాదర్బార్' ప్రాధాన్యత కోల్పోతోంది. జాతర సందర్భంగా పుష్యమాసం అమావాస్య రోజున మెస్రం తెగ గిరిజనులు గోదావరి నదీ జలాలతో నాగోబాకు అభిషేకం చేసి పూజలు చేస్తారు. స్థలపురాణం ఈ జాతరకు సంబంధించి ప్రచారంలో వున్న కథ ఒకటి ఈవిధంగా వుంది. కొన్ని సంవత్సరాల క్రితం నాగేంద్రుడు మెస్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి, రాణి దంపతులకు కలలో కనిపించి సర్పం రూపంలో జన్మిస్తానని చెప్పాడట. ఆ తర్వాత కల నిజమైందని గిరిపుత్రులు విశ్వసిస్తారు. కొంత కాలానికి నాగేంద్రుడి తల్లి తన తమ్ముని కూతురు గౌరితో సర్ప రూపంలో గల నాగేంద్రుని వివాహం జరిపిందట. అత్త ఆజ్ఞ మేరకు గౌరి భర్త అయిన నాగేంద్రున్ని బుట్టలో పెట్టుకొని గోదావరికి పయనమైనట్లు గిరిజనులు చెబుతుంటారు. ప్రయాణం మధ్యలో పాము ఒక చోట ఉడుము రూపంలో కన్పించగా ఆ ప్రాంతం ఉడుంపూర్‌గా మారింది. అనంతరం ధర్మపురి నదిలో గౌరి స్నానం చేస్తుండగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషిగా మారాడట. కాగా నాగేంద్రుడు పేరు ప్రతిష్టలు కావాలో, సాంప్రదాయం కావాలో తేల్చుకోమని అనగా, గౌరి సాంప్రదాయాలను కాదని పేరు ప్రతిష్టలు కోరుకోగా మనిషి తిరిగి పాముగా మారినట్లు కథనం. తదనంతరం ఉడుంపూర్ నుండి గరిమెల వరకు వెతికిన గౌరి గోదారి నదిలో సత్యవతి గుండంలో కలిసి పోయిందని ప్రచారంలో ఉంది. గౌరి వెంట నాగేంద్రుడు ఉంచిన ఎద్దు బండగా మారింది. తర్వాత ప్రతి జంటకు బెటికొరియాడ్(నాగోబా సమక్షంలో కొత్త జంటలను కలపడం) తన సన్నిధిలోనే జరగాలని చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెబుతుంటారు. కాలక్రమేణా అదే కెస్లాపూర్ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్లిన పుట్ట వద్ద నాగోబా దేవాలయం వెలిసింది. ప్రతి ఏటా పుష్య అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గోండుల ప్రగాఢ విశ్వాసం. 'ప్రజాదర్బార్' నాగోబా జాతర సందర్భంగా జిల్లా యంత్రాంగం కెస్లాపూర్ తరలచ్చి గిరిజనం సమస్యల పరిష్కారానికి దర్బార్ నిర్వహిస్తున్నా వారికి ఏమాత్రమూ ఉపయోగపడడం లేదు. గిరిజన జీవితాలను అధ్యయనం చేసి వీరి కోసం ఒక వేదికను ఏర్పాటు చేశారు హెమన్‌డార్ఫ్. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా దర్బార్‌లు జరుగుతూనే ఉన్నాయి. గిరిజన తండాల్లో సమస్యలు సమస్యలుగానే దర్శనమిస్తున్నాయి. ప్రజాదర్బార్‌లో సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయని కేవలం ప్రచారానికే పరిమితమైంది. నేటి కంప్యూటర్ యుగంలో కూడా తండాల్లో గిరిజనులకు పూరి గుడిసె అద్దాల బంగ్లా. చెలిమె నీరే ఫిల్టర్ వాటర్. రోడ్డును ఆనుకొని ఉన్న గ్రామాలను మొదలుకొని అడవుల్లో వరకు గల గ్రామాలకు ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులు(కరెంట్) ప్రసరించడం లేదంటే అతిశయోక్తి కాదు. 1999-2000 సంవత్సరంలో అతిసారతో రెండువేలకుపైగా గిరిజనులు మృతి చెందారు. ప్రతి ఏడాది మలేరియా, విషజ్వరాలు సోకి నేటికీ గిరిజనులు పిట్టల్లా రాలిపోతూనే ఉన్నారు. అక్కడక్కడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినా అవి అలంకారప్రాయంగానే దర్శనమిస్తున్నాయి. నేటికీ గిరిజనులకు రక్షిత మంచినీరు మాత్రం దరిచేరలేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం వచ్చిన తెలంగాణ ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారమవుతాయా అని ఆదిలాబాద్ గిరిజనులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రాచీన, ఆధునిక సాహిత్యాలను కొత్త కొలమానాలతో, కొత్త దృష్టికోణంతో, స్థిరీకృత పద్ధతులను తృణీకరించిన రాసిన వ్యాసాలున్నాయి. ఇందులో భాగంగానే పాల్కురికి సోమనాథుడిని తొలి తెలుగు కవిగా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల లింగారెడ్డి సూత్రీకరించారు. నన్నయను ఆదికవి తెలంగాణ సాహిత్య చరిత్ర స్థిరీకరించి పెట్టింది. ఈ స్థితిలో అనువాదం మాత్రమే చేసిన నన్నయ ఆది కవి కాలేడని, సొంత వస్తువు తీసుకుని రాసిన పాల్కురి సోమనాథుడు ఆదికవి అవుతాడని వారు వాదించారు. - కాసుల ప్రతాపరెడ్డి రచయిత సెల్ : 9848956375
by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uDD47X
Posted by
Katta