పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Jagathi Dhaathri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jagathi Dhaathri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, సెప్టెంబర్ 2012, శనివారం

జగద్ధాత్రి || అవసరమా?


దాపరికం అవసరమా నేస్తం?
అడిగాను సందేహంగా
అవసరమే ... ఖచ్చితమైన జవాబు
సూటిగా తాకింది చెవిని

కొన్ని మాటలు , కొన్నివిషయాలు
కొన్ని సంఘటనలు కొందరితో చెప్పకూడనివి
చెప్పకూడదు ...అందుకు అవసరమే దాపరికం
నిష్కర్ష స్వరం లో పలుకు సోకింది కర్ణ భేరిని

ఏమో మరి ...పెదవి విరిచాను
ఏది దాయాలో ఏది దాయ కూడదో
నిజంగా నాకు తెలీదు సుమా
అన్నా భుజాలెగరేసి

మనసు , మమత జంట కట్టిన
అనుభూతుల రసావిష్కరణ
మది లో చెలరేగే మధుర తుఫాను
అక్షరాలుగా ఒలికి పోతాను

హృదిని వేధించే బాధలను
మాటలలో పంచుకుంటాను
చుట్టూ ఉన్న సమస్యలకు
కవితావేదన గా ఎక్కడన్నా
పరిష్కారాలు దొరుకుతాయేమో నని
వెదుకులాడుకుంటాను

ఘనీభవించిన భావ ప్రకంపనలను
ఉద్విగ్నతతో ఉల్లేఖిస్తాను
అన్యాయపు వక్ర వర్గాలను
తూర్పార బట్టకుండా ఉండలేను

మనుషుల మది మేధలలో
అలుముకున్న విష మేఘాలను
అనురాగ వర్షమై అలికి వేస్తాను

అనుభవాల , అనుభూతుల సారాన్ని
మరు తరం వారికి పంచి
జీవితమేమిటని ఎరుక కల్గిస్తాను

అందుకే నాకు దాపరికాలు లేవు
తప్పులో ఒప్పులో మెప్పులో దేప్పులో అయినా
మనసు చెప్పిన మాట
మేధ గాంచిన బాట
పదిమందికీ పంచి పరవశిస్తాను
కొందరి హృదినైనా కవితా దివిటీనై
వెలుగుతూ, వెలిగిస్తూ సాగిపోతాను

ఇక ఇప్పుడు చెప్పు దాపరికం అవసరమా?
జీవితానుభవాల సారాన్ని
దాచుకోవడం అవసరమా నేస్తం ??
దాచకుండా చెప్పు !!!

22, సెప్టెంబర్ 2012, శనివారం

జగద్ధాత్రి ||విచిత్రం ||


నా తెల్లని హృదయ కాన్వాసు పై
నీ భావనల రంగులన్నీ ఒకేసారి చిమ్మావు
నీ కోప తాపాల, ఉద్వేగాల, ఉద్విగ్నతల
ఆశ నిరాశల, అస నిపాతల, అహంకారాల
నీ వేదనల, శోధనల , అంతర్యపు వర్ణాలెన్నో
అన్నిటినీ ఒకేసారి దోసిలి నిండా తీసుకుని
ఒక్కసారిగా విసిరేవు ...
అన్ని ఛాయలు కలగలిసిన నీ హృదయాన్ని
అదాటుగా ఆవిష్కరించేవు
నీలోని అన్ని రంగులను ఒకేసారి చూసిన నా మది
నిశ్చేష్ట అయి పోయింది

చిత్రమైన నీ భావాల వైచిత్రికి
నా హృది మూగబోయింది
సప్త వర్ణాలు కలగలిసిన విన్నూత్న వర్ణమేదో
గజిబిజి గా నన్ను కంగారు పెట్టింది

ధవళ వర్ణం తప్ప ఎరుగని నా ఎద
ఇన్ని రంగుల కల బోతకు బిత్తరపోయింది
నీవు విసిరిన పలు రంగులను కన్నీటితో కడిగి చూసుకున్నాను
నీ వలపు వర్ణం ఉందా లేదా అని

సప్త వర్ణాల కలబోత
నీ భావాల కుంచెలోంచి
స్పష్టా స్పష్ట కలనేత నీ చిత్రాల చిత్రం
నీ హృదిని ఆవిష్కరించింది

అన్ని వర్ణాలలోనూ
నా కనులకు , మనసుకు
స్పష్టంగా అగుపించింది
నీ అనురాగ రంజిత సువర్ణం
ఈ లోక పు కుడ్యం పై ఎప్పటికీ
వన్నె తరగని ప్రేమ తైల వర్ణ చిత్రం

ప్రియతమా! బహు చిత్రమైన చిత్రకారుడివి నీవు
అంతరంగాన్ని అన్ని రంగుల మిశ్రమం లోనూ
మమతల మధురిమను దర్శింప జేశావు
మాటల్లో చెప్పవు కానీ నీ చిత్రాలలో
పటం కట్టుకున్నది మాత్రం ప్రేమానురాగాలేనని
అవగతమైంది నాకు ....ఇప్పుడు నీ చిత్రాలు
చిత్రం కావు నాకు ... నవీన రీతులలో తీరిన
నీ ఊహల , ఆశల ,ఆంతర్య అద్వితీయ హర్మ్యాలు !!!

........................................................................ప్రేమతో జగతి 6.09am .18th Sept Tuesday 2012