పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Nauduri Murthy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nauduri Murthy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, సెప్టెంబర్ 2012, శనివారం

నౌడూరి మూర్తి|| ఆర్కిమిడీస్ సూత్రం!!


నిన్నటి వరకూ నాకు ఎప్పుడూ ఒక సందేహం వస్తుండేది
సంతోషాన్ని కొలవడం ఎలా?
దాని విలువకట్టడం ఎలా? అని.

ఎన్ని వేల సందర్భాలు తటస్థించేయి జీవితంలో
కానీ నిన్నటిదాకా ఆ ‘యురేకా’ క్షణం రాలేదు

నిన్న మా మనవరాలిని ఎత్తుకున్నప్పుడు
ఒక్కసారి ఆర్కిమిడీసు తట్టేడు
ఆనందంలో ములిగిపోయిన నేను కోల్పోయిన
సమాన ఘనపరిమాణముగల నా తనుభారమే
నా చేతిలో ఉన్న నా ఆనందపు మొలక అని అప్పుడు తెలిసింది.

1.9.2012

11, ఆగస్టు 2012, శనివారం

నవుడూరి మూర్తి // విశాఖ నగర ప్రబంధం //


ఛందో బధ్ధ కవిత్వంలా ఉన్నాయి– ఇళ్ళూ, వాకిళ్ళు,

దుష్ట సమాసాల్లా — అక్కడక్కడ భవంతుల ప్రక్కన పూరిళ్ళు

సుదీర్ఘ సమాసంలా ఉంది - రాచబాట (National Highway)

ద్విపదలా సాగుతోంది స్టేషన్ నుండి బీచి దాకా ఉన్న రోడ్డు

ఛేకానుప్రాసల్లా ఒకటి విడిచి ఒకటి వెలుగుతున్నాయి సోడియం దీపాలు

రోడ్డుకి రెండు వైపులా- మార్జిను గీసినంత అందంగా కాలిబాటలు

దానిమీద రాసుకున్న ‘నోట్సు ‘లా చెట్లూ, చిల్లర దుకాణాలూ,

ఆశ్వాస విభజన చేసుకుంది- ఆశీలుమెట్ట జంక్షన్

శబ్దాలంకారాలులా మ్రోగుతున్నాయి 'ట్రాఫిక్ జాం'లో వాహనాలు

ఆధునిక కవిత్వానికి ఆవగింజంతైనా విలువివ్వని

పూర్వసువాసిని కవిలా బోడిగా కంచరపాలెం కొండ

తలపులు బోడులు కావని సూచిస్తూ

అక్కడక్కడ విచ్చుకున్న పచ్చని పొదలు

ద్వంద్వ సమాసాల్లా సినిమాహాళ్ళు,

'విగ్రహవాక్యం' లా కనకమహలక్ష్మి అమ్మవారి గుడి,

మారుతీ కారులో దూసుకుపోతున్నదొక బహువ్రీః

కొండమీది పార్కు వసంత ఋతు వర్ణన చేస్తుంటే,

విరహోత్కంఠితయై తిరుగుతోంది 'లైటు హౌసు'

ఉత్ప్రేక్షలా చంద్రుడికేసి ఉరుకుతోంది సముద్రం.

ఆర్ద్రతలోపించిన కావ్యంలా ఉక్కతో అసహనంగా ఉన్న నగరానికి

ఆతిధ్యమిచ్చే అన్నపూర్ణలా వచ్చిందో మేఘ మల్హార్

శ్రోతదొరికిన కవిలా, వస్తూనే కావ్యనివేదన ప్రారంభించింది…

మధ్య మధ్యలో గొంతు సవరించుకుంటూ, ధారా శుధ్ధి ప్రకటిస్తూ,

కవిత్వంలో మెరుపులు ఎత్తిచూపిస్తూ మరీ.

రసలుబ్దుడైన కవికంటే, సామాన్యుడే మెరుగన్నట్లు,

అంతో ఇంతో ఆస్వాదించిన చెట్లు ఓహో అని తలలూపుతుంటే,

ఉండీ ఉడిగీ కిటికీలు చప్పట్లు కొడుతున్నాయి.

చెవిటివాడిముందు శంఖారావంలా,

ఇంతటి రసావిష్కరణా సముద్రంపాలవడంచూసి

అలిగి వెళ్ళిపోయింది అన్నపూర్ణ.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలా

దివ్వు దివ్వు మంటూ మిగిలిపోయింది

పాపం! నా నగరం.



*10-08-2012

18, జులై 2012, బుధవారం

నవుడూరి మూర్తి కవిత

వయసు కండె విచ్చుకుని బాల్యపు గాలిపటం
నీలాంబరిని నర్తిస్తుంటే,
కాలం తకిలీ వడికిన వర్షధారలకు
తుఫానుగా పరిణమించిన వార్థక్యం
అలలతలమీంచి ఆకసానికెగసిన
"అల"నాటి అనుభూతికై ప్రాకులాడుతోంది..

ఏడుపెంకులాట బ్రతుకులో
మధురస్మృతులు ఒకదానిపై ఒకటి పేర్చేలోగా
"చేదు అనుభవపు" బంతి
వీపుమీద ఒకటి చరుస్తుంది.

ఇసుకతిన్నెలు చూసినప్పుడల్లా
గూడుకట్టుకోవాలని పడిన ఆరాటంలా,
చుట్టుపక్కల లేస్తున్న ఇళ్ళను చూసి
"నేనూ ఇల్లుకట్టుకోవా"లనిపించినా,

బ్రతుకు పుస్తకంలో భద్రంగా దాచుకున్న
నెమలి ఈకలూ - కాకిముచ్చిల్లా
"మచ్చకొండ"ను చూసినప్పుడల్లా
రఘూ, రత్నం, రథయాత్రలూ గుర్తొచ్చినా

సినిమాహాలు దగ్గర లాగు ఎగలాగుకుంటూ
టిక్కెట్టుకి చాలని పావలాకోసం
"తాడాట"లో తిన్న "చెంకీ"కి పొడిగింపులా
బొంబాయిలో పెన్నులమ్మేవాడిచేతిలో మస్కాతిన్నా,

ఎంత జాగ్రత్తగా ఆడినా "దొంగ" కాకుండా
తప్పించుకోలేని చాతకానితనంలా
ఎన్ని పరీక్షలు రాసినా, పరంపరగా వచ్చే
"Regret Letters" ఆపలేకపోయినా,

ఏడో ఎక్కం ఎప్పుడూ తప్పే చెప్పినందుకు
SS మేష్టారు తలపై బెత్తంతో చేసిన బొడిపిల్లా
చేసిన తప్పే చేస్తున్నానని
బాసు మెమోల మొట్టికాయలు వేసినా,

ఉదయాస్తమయాలమధ్య
జీవనపర్యంతం పరుగెత్తే సూరీడులా
ఏ ఊరికీ వెళ్ళకుండా ఊళ్ళోనే ఉండిపోయిన
వేసవి శలవుల్లా జీవితం గడిచినా,

బోర్లా పడిన ప్రతిసారీ ఏడుపులంకించుకున్నప్పటికీ
మళ్ళీలేచి అందుకోవాలని పడిన చిన్నప్పటి తపనే
అరిగిపోయిన మనకాళ్లకి విసుగెత్తిన ప్రతిసారీ
కొత్త ఆశల "Re-soling" చేస్తుంది.

నాన్నజేబులోంచి దొంగతనంగా తీసిన సిగరెట్టుతో
పెరట్లో జామచెట్టు గుబుర్లో సృష్టించిన మేఘాలూ,
అల్లావుద్దీన్ కథ చదివి
ప్రతి పాత లాంతర్నీ గోకిన తెలివితక్కువదనమూ,
తాతగారి ఊర్లో చలిరాత్రులపుడు
వేరుశనగకుప్ప మంటవేసుకుంటూ
సీనుగాడితో పంతాలేసుకుని
శనక్కాయలు ఫలహారం చేసిన తర్వాత
బెల్లంకోసం కుండలో చెయ్యిపెట్టినపుడు
తేలుకుడితే వేసిన కుప్పిగంతులూ,

ఎండాకాలం వర్షంలో తడుస్తూ వదుల్తున్న కాగితం పడవల్లా
గ్రీన్ కార్డ్ సీతారామయ్యతో రెండుమూడేళ్ళకొకసారి
గడిపే మధుర క్షణాలూ
కాలం ఊదుతున్న ఈ బెలూన్ లో
ఆడుగడునా దర్శనం ఇస్తుంటాయి.

కానీ, బెలూనుకి సహజ సిధ్ధమైన
అమాయకత్వం, అసూయ ఉక్రోషం,
ఉడుకుమోత్తనం, అభిమానం, అపేక్షల
వస్తుతత్త్వం ఎన్నటికి మారేను?
*17-07-2012

12, జులై 2012, గురువారం

నౌడూరి మూర్తి॥అక్ష రే లు॥


గాయాలు లేకుండా అక్షరాల్ని స్రవించకు నేస్తం!
"సెప్టిక్" అవుతుంది.
అక్షరాల్ని మూట కట్టకు
పదబంధాల జీర్ణవస్త్రంలోంచి భావం కారిపోతుంది.
ఆలోచనల దారాలతో అల్లని మాటలు చెల్లాచెదరైపోతాయి.

"మనసిత్వం" పోసి వెలిగించని అక్షరాలు
ఉల్కల్లా అరక్షణం వెలిగి ఆరిపోతాయి.
వివర్ణహృదయంతో పదచిత్రాలు గీయలేవు, నేస్తం!

అనుభూతుల వర్ణపటం నుండి రంగులు ఎరువుతెచ్చుకోవలసిందే.
స్వయంచాలితాలైన అక్ష"రే"లకు
అలంకారాల, సమాసాల అల్లెతాడు అవుసరం లేదు.
అనాదినుండీ భావాలకెప్పుడూ సుఖప్రసవం జరుగలేదు. నిజం.
అక్షరాలా--- అక్షరాల సిజేరియన్ చేయవలసిందే!
కానీ, పెన్సిలు ముల్లు చెక్కినట్లు అక్షరాలను చెక్కనక్కరలేదు.
అవి వజ్రకాఠిన్యాలేకాదు--- సునిసితాలు కూడా.
పద్యాల ఊయలలో మనల్ని లాలించినవీ,
బంధ, చిత్ర కవితలతో హింసించినవీ,
భావ కవిత్వంతో వినువీధులలో త్రిప్పినవీ,
జగన్నాధ రథ చక్రాలై --- నేల మీద నడిపించినవీ
ఈ అక్షరాలే!

అక్షరాలు వెన్నెట్లో ఆడుకునే ఆడపిల్లలే కాదు,**
నిక్షిప్తం చేసుకున్న విశ్వ రహస్యాలను
విపులీకరించడానికి Armstrong పాఠకులకై
అహరహమూ ఎదురుచూసే చంద్ర శిలలు కూడా.
రోజుకొక్క సూర్యోదయాన్ని ఆవిష్కరించేదీ,
కోకిలలనీ, వనాలనీ కొత్త ప్రతీకలుచేసి,
వ్యావహారపుకొలిమిలో పుటం వేసిన పుత్తడిలా
వింత వన్నెలు సంతరించుకునేదీ--- ఈ అక్షరాలే.
ప్రకృతికి శాస్త్రాల భాష్యం చెబుతున్న మనిషికి శబ్దమై హసించినవీ,
పదంగా ధ్వనిం చినవీ --- ఈ అక్షరాలే

అక్షరాలు జీవన్మరణ సూచికలు
కొందరు అక్షరాల్ని ఆలింగనం చేసుకుని సహగమనం చేస్తారు -- హష్మీలా,
కొందరు అక్షరాలను అడ్డువేసుకుని  వీర విహారం చేస్తారు --- అర్జునుడిలా.
అక్షరాలు అనుభవాల్ని మేసిన "అణు " భవాలు.

విస్ఫోటన- సంయోజనాల అదుపు తెలుసుకోక ప్రయోగించావో ---
అవి సమాజాన్ని సర్వసేనా మూర్చ లోనైనా ముంచేస్తాయి
లేదా
దాని గురుత్వాకర్షణ శక్తి నైనా లేపేస్తాయి.

(**with apologies to Tilak)
*11.7.2012