పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Jyothi Valaboju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Jyothi Valaboju లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జులై 2012, శనివారం

జ్యోతి వల్లబోజు కవిత

సంతోషంగా ఉన్నవేళ
నన్ను స్పృశించ సాహసించవు
సమూహంలో ఉండగా
నన్ను పలకరించ భయపడేవు.....

కాస్త దిగులుగా ఉన్నంతనే
నేనున్నానంటూ తడిమేస్తావు
ఒంటరిగా బెదిరి ఉన్న సమయాన
జడివానలా, జలపాతంలా కమ్మివేస్తావు....

నా మనసులో , భావనలలో
అలుముకుని, అల్లుకుపోయిన దుఃఖమా!
ఆనందంలో పలకరించేవు, ఆవేదనలో తోడుండేవు
ఎంత అణచిపెట్టినా, అడ్డు చెప్పినా కంటి కొనలో నిలిచేవు...

ఉప్పెనలా నన్ను చుట్టేసి
భావోద్వేగపు వెల్లువను శాంతపరిచేవు
తుఫానులో చిగురుటాకులా నన్ను వణికించే
దుఃఖమా? నాపై ఇంత ప్రేమ ఎందుకమ్మా???
*28-07-2012

18, జులై 2012, బుధవారం

జ్యోతి వల్లబోజు కవిత


( తొలకరి వానలో చిందులేస్తున్న ఒక చిన్నారి ఫోటో చూడగానే నాలో కలిగిన భావాలు.. )

మృగశిర దాటగానే తలుపు తట్టే వాన
ఎందుకోమరి అలిగి ,రానని మారాం చేస్తోంది..
ఐనా మనసుండబట్టలేక
అప్పడప్పుడు కళ్లాపి జల్లిపోతోంది..

సూరయ్య ఆగ్రహానికి వేడెక్కిన నేలతల్లిపై
జాగ్రత్తగా తప్పటడుగులు వేస్తోంది
మట్టిజాడ కానరాక సిమెంట్ రోడ్లు, డాబాలపై
తధిగినతోం అంటూ తబలావాయిస్తోంది.

అమ్మ వద్దంటున్నా, నాన్న వారిస్తున్నా
చిన్నది మాత్రం ఆ జల్లులోకి ఉరికింది
ఆ చిన్నదాన్ని చూసిన వాన కూడా
నేనేం తక్కువా అంటూ అల్లరి చేసింది...

ఒక చినుకు తలపై పూలజడ కాగా
ఒక చినుకు పాపిటబిళ్లగా అమరింది
ఒక చినుకు ముక్కెరై మెరుపులీనగా
ఒక చినుకు కంటి కాటుకై కూర్చుంది..
ఒక చినుకు చెవులకు లోలాకుగా వ్రేలాడగా
ఒక చినుకు పెదవిని ముద్దాడింది
ఒక చినుకు మెడలో కాసులపేరు కాగా
ఒక చినుకు నడుముకు వడ్డాణమై కూర్చుంది
ఒక చినుకు చేతులకు కంకణమైపోగా
ఒక చినుకు కాలికి పట్టీలా జారిపోయింది..

ఎంత అల్లరిదమ్మ ఈ వాన?
చేయి చేయి కలిపి ఆటలాడింది
మాటలాడనీక ఒళ్లంతా తడిపేసింది..
చిన్నదాన్ని చూడగానే ప్రేమగా కావలించుకుంది.
*18-07-2012