పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, ఆగస్టు 2012, గురువారం

సాత్స్ || సూరీడు ||

తెల్లారింది.....
ఎరుపెక్కిన కన్నులతో
నైట్ డ్యూటీ చేసిన వాచ్మెన్ లా సూరీడు......

తన రధం మీద బయలుదేరాడు,
జగత్తుని మేలు కొలిపెటందుకు.,

ఆయన చేస్తున్న దైవకార్యం
గురించి దేవర్షులకి తెలుసేమో కాని
జులాయి సినిమా కోసం ఆగస్ట్ దాక
ఎదురుచూసే సామాన్యునికేం తెలుసు.

ఎవరేమనుకున్నా తనకేమి.,
ఎవరికీ అవసరం లేకున్నా తన
అవసరం తెలుసుకుని మనని
కాపాడుతున్న భాస్కరునికి...., నమస్సుమాంజలి...

చివరగా ఒక్క మాట., తెలిసిన మాటే...,
దినకరుని కరుణ లేనిదే దినం లేదు,

*09-08-2012

వంశీ // ది క్రానికల్స్ ఆఫ్ లవ్ //

"వెన్నీ వేర్ ఆర్ యూ,
వెన్నీ, ప్లీజ్ కం బాక్"


అప్పటి నా అరుపుల్నాకింకా విన్పిస్తూ,
ఇప్పటి నేనెప్పటికీ నిన్ను క్షమించలేనేమో అన్పిస్తూ,

లవ్
ఈజ్ ఎ కాలిక్యులేటెడ్ సెల్ఫిష్ బాస్టర్డ్

నా ఇష్టాల్నీకు నచ్చలేదనో,
నీ కారణాలు నాకు చెప్పాల్సొస్తుందనో,
నేన్నిన్ను మరవడానికి నువ్ సృష్టించిన
నీ "మరణమనే" అబద్దంలో సహగమించి

ఆర్నెల్లు
నా ఆత్మ కడుపు మాడ్పించి,
నీ ఙ్నాపకాల ముసుక్కప్పిన నా గదిగోడలకు
ఆలోచన్లు పోగేస్కున్న తల బాదుకుంటూ, బదులడుగుతూ,
వొంటరిగా ఫోమ్ బెడ్ మీద, నీ నగ్నత్వం
వొదిలెళ్ళిన నాటి మరకల కమురువాసన్లు పీలుస్తూ,
నీ నవ్వుల్నిండిన నా కలల్నిబహిష్కరిస్తూ
నిద్రని మింగి,
మన ఫోటోలు కాల్చిన మసి వొంటికిపూసి
నిన్నావహించిన క్షణాన
సమయమాగేట్టు గడియారం బద్దల్చేసి...

"యూ ఫూల్,
డోంట్ బి మాసోకిస్టిక్, జస్ట్ కిల్ హర్,
ఎవడి పక్కలోనో, వాడి ఊహలకు ప్రాణం పోస్తూ,
షిట్, కిల్ దట్ బిచ్
కత్తదుగో, లూసర్, హ హ హ"

లేదు, లేదు,
వినొద్దు వినొద్దు, మెదడ్లో మరోమనిషిని,

కుడిచేతి మీద తన పేరును
కసిగా, ఆనందంగా, సంతృప్తిగా పొడుస్తూ
చెరిపిన బాధలో కనపడ్తూ నాటి
నా "వెన్నెల",
"ఐ హేట్ యూ" అంటూ,

నా దుఃఖం లోకానికి
తర్జుమా ఔతున్నట్టు వాన, బైట..
అట్టలు కట్టిన రక్తప్రవాహప్పొరల్లో
నన్ను నేను వెతుక్కుంటూ,
యుగాల్తర్వాత సుషుప్తినాహ్వానిస్తూ,

కల
మేఘాల్లో మూలుగుతున్న తన రొమ్ములకు
కాలపు దారాల్తో ఉరేస్కుంటూ,
కాస్మిక్ ఆర్గసమ్ అనుభవిస్తున్నట్టు ..

స్టిల్,
ఐ లవ్ యూ వెన్నీ..

*09-08-2012

కిరణ్ గాలి ||నీలి చిత్రం||

వాడు అద్బుతమైన నీలి చిత్రాలను
అత్యంత రసవత్తరంగ తీస్తాడు


వాటిని సరాసరి మీ నట్టింట్లొకి
కేబుల్ చేస్తాడు

మీరు మీ గది నాలుగు గోడల మధ్య
సకుటుంబ సపరివార సమెతంగా
వాటిని ఆస్వాదించే సౌలభ్యం కలిగిస్తాడు

..............

వాడు అసమాన ప్రతిభాశాలి

మానవత్వం గుడ్డలూడి
నగ్నంగ నడిచినప్పుడల్ల
వాడు దాన్ని అతి లాఘవంగ దృశ్యీకరిస్తాడు

ఆకలి అవసరంతొనో,
అవసరం అవకాశంతొనో
అవకాశం అధికారంతొనో,
అధికారం అధిష్టాన
శీష్నంతోనో,
రమించినప్పుడల్ల దాని ఆనవాలు పట్టెస్తాడు
దాని గుట్టూ మీముందు విప్పేస్తాడు

..............

వాడు అనితర సాధ్యుడు

దుఃఖాన్ని, భయాన్ని, బాధని,
చీకటిని, మ్రుత్యువుని
ప్రత్యక్ష ప్రసారం చేస్తాడు

దేశంలో ఆశనిరాశల సంభొగ శ్వాసను
అనునిత్యం మీకు వినిపిస్తాడు

అసహాయత అంగాంగాన్ని
ఆధిపత్యం చెరచడం
అతిదగ్గరగ చూపిస్తాడు

.............

వాడు ఆధునిక ధురంధురుడు

సూయిసైడుని లైవ్ చేసి
మరణాన్ని మీకు పరిచయిస్తాడు

Rape లపై రివ్యు అంటు
కారణాలు సమీకరిస్తాడు
తప్పొప్పులు సమిక్షిస్తాడు

మన సంస్క్రుతి మట్టి గడ్డ అంటు
మాబ్ ని ప్రొవొక్ చేస్తాడు
మొలెష్టేషన్ చిత్రిస్తాడు

.......

వాడొక అమొఘమైన దృష్టికోణం

స్వాపింగ్, ఫెటిష్, ఇన్సెస్ట్ లాంటి
కొరుకుడు పడని పదాలను మనకు విశిధికరిస్తాడు
ఇంక రాయలేని వాటినెన్నిటినో
విశ్లేషిస్తాడు

చీకటి అంచుల ఎరుపును
వెలుతురు పెదాలకు పూస్తాడు
వేశ్యను చేస్తాడు
వేడుక చూస్తాడు

మిమ్మల్ని ఊరిస్తాడు
ఊగిస్తాడు
శాసిస్తాడు

.............

అమ్ముడవుతుందంటె అమ్మనైన
అంగట్లొ పెట్టె
కాపిటలిష్టుల కొవర్టు వాడు

వాడి ఫొకస్ TRP
వాడి టార్గెట్ Rupee

టికెట్టు లేని బ్లూ ఫిల్మిది
ఆత్మలను తాకట్టు పెట్టకుండానె అందరం చూడొచ్చు

------------------------------------------------------------

Dear Viewer

శుభొదయంలో
మతాచారుల సూక్తిముక్తావలి పిదప
సన్ని లియొన్ ఫిట్నెస్ ష్కెడ్యుల్ని
బిపాష బసు బ్రేక్ఫాస్ట్ మెనుని
మరెన్నొ ఉదయపు ఉల్లాసలను
నమ్ముకున్న భక్తులకు
ఎటువంటి కమర్షియల్ ఆటంకాలు లేకుండా అందిస్తాము

అపరాహ్నం
"ఆమెకు ఆమె శతృవు"
రీటెలికాస్ట్ చేస్తున్నాము
తల్లి కుతురు మధ్య అందం ఎలా
అగాధమవుతుందొ
ఎవరి బాయ్ ఫ్రెండ్ని ఎలా కాపాడుకొవాలొ
జాగ్రత్తలు నేర్పుతాము
దయ చేసి ఇద్దరు కలిసి మాత్రం చూడకండని సూచన

మీ ఆయన, పిల్లలు
ఇంట్లొ లేని సమయంచూసి
Gigilo లపై
చిన్న స్నిప్పెట్ స్లిప్ చేసాము
సావకాశంగ చూసి
మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకొండి

సాయంత్రం "సౌందర్య లహరి" లో
అనుష్క నడుము మడతను
ప్రియమని పెదవి ముడతను
నమిత చాతి కొలతను
ఇంట్లోనె కూర్చొని ఎలా సంపాదించచచ్చొ
సవివరంగ విజ్యూల్స్ తొ సహ చూపిస్తాం
మీ ఆవిడ చానల్ మార్చమనదని
మాదీ గ్యారంటి

రాత్రి "పాశ్యత్త సంస్కృతి పెడ పొకడలు" అనే శిర్షికతొ
అర్ధనగ్న దేహాలను అరగంట పాటు చూపిస్తాము
అవసరం లేక పొయినా అప్పుడప్పుడు బ్లర్ చేస్తు
లేనిది వున్నట్టు కనికట్టు చేస్తాము...
మీలొ నిద్రానంగా వున్న దేన్నొ ఉద్రెక పరుస్తాము

ఇంకా
"గవర్నర్ గారి గరం గరం శృంగారం" స్టింగ్ ఆపరెషన్
Open Heart విత్ తారా చౌరి
వాన పాటలు
కత్తి పోటులు
వగైర
వగైర
వయాగరాలు

..............

24/7 , 365 days
సదా మీ సేవలో
మీలొ పలురకాల
పెర్వెర్షన్సుకి
ప్రాంట్ సొల్యుషన్ తొ
రోజంతా మల్టిపుల్ ఏజాకులషన్స్

...........

Breaking News మిస్ అయ్యావని
Speacial Episode స్లిప్ అయ్యిందని
Popular program పవెర్ కట్లొ పొయిందని
Retelecastకి రీచ్ కాలెకపొయావని
బాధ పడొద్దు

YouTube లో లింకుంది

*09-08-2012

కాశిరాజు || కలొచ్చింది ||

మా అమ్మనన్ను తెలుగులో కన్నట్టు
నాకు తెలుగుగ్గుపెట్టినట్టు
తెలుగుపాలు పట్టినట్టు
తెలుగుజోలపాడినట్టు

నేను తెలుగుతొడుక్కుంటున్నట్టు
తెలుగురాసుకుని
వొళ్ళంతాపూసుకు తిరుగుతున్నట్టు
తెలుగు సూసినట్టు
విన్నట్టూ
వాగినట్టు
తెలుగుతిన్నట్టు
తిడుతిన్నట్టూ
తెలుగును కట్టుకున్నట్టు
కాపురం చేస్తున్నట్టూ
నేను తెలుగులు కన్నట్టు
వాటికి తెలుగు నేర్పుతున్నట్టూ
నా తెలుగిలాగే తన సుట్టూ తాను తిరుగుతున్నట్టూ
నాదినం గడుస్తున్నట్టూ
.
.
.
నాకు కలొచ్చింది

*09-08-2012

వాడ్రేవు చిన వీరభద్రుడు || A poem for Sri Sadasiva ||


హేమంతానికి చెక్కుచెదరని గులాబితోట..
సాదీ షిరాజి (గులిస్తాన్)

ఆయన ఒక గులాబీలబుట్టతో మనమధ్య సంచరించాడు
ఎన్ని సంధ్యలు, ఎన్ని రాత్రులు, ఎన్ని తొలిమంచువేళలు
ఎక్కడెక్కడ ఏ మహామోహన సంగీతమయలోకాల్లో ఏ
పరిమళాలు చవిచూసాడో,ఆ పూలన్నీ ఏరుకొచ్చాడు

ఆ తోటలో ఎన్ని వసంతాలు గడిపాడోగాని, మనకు
తెలిసినప్పటినుంచీ ఒక దర్వేషులాగా ద్వారం దగ్గరే
నిలబడివున్నాడు, దారినపోతున్నవాళ్ళందరినీఎలుగెత్తి
పిలుస్తూనే వున్నాడు,కొమ్మల్లో బుల్బులిపిట్టకు తోడుగా.

పూర్వకాలపు మొఘల్ చక్రవర్తుల ఎదట పారశీక
పూలకంబళి పైన కన్నులరమోడ్చిన రత్నపరీక్షకుడిలాగా
ఆయన మన మధ్యనే కూచుని తీరిగ్గా కొన్ని రదీఫులూ
కొన్ని ఖాఫియాలూ సరిచూస్తూ బతుకంతా గడిపేసాడు.

నిజమైన సాధువు, లోకప్రేమి, తనొక్కడే ఆస్వాదించ
లేదు,రుచిచూసిందెల్లా మనతో పంచుకున్నాడు
తుపానులకు చెదరని,హేమంతాలకు వాడనిఒక
గులాబితోట మనకు వీలునామా రాసివెళ్ళిపోయాడు.
*09-08-2012

వర్ణలేఖ || అబద్దపు గోడల్లో ||


నేనూ నీతో
ఉన్నాననుకుంటున్నావు

కాని నీవు నన్ను
నన్నులా చూడనప్పుడు
నేనీతోనే ఉన్నా
నా మనసు నను విడిచి
పరిగెడుతుంది

ఈ గల్లి ఆ గల్లి దాటి
ఊరిబయట
బస్సెక్కి, రైలెక్కి
మద్యలో దిగి

కొండల్లో సంచరిస్తూ
నెమళ్ళ నాట్యానికి
పరవశిస్తూ
కుందేలు పరుగులో
లేడిపిల్ల గెంతుల్లో
చురుకుదనం
అరువు తీస్కొని
కొండ బంతిపూల
వాసన చూస్తూ

పురాతన బావిలో
మునకలేసి ఇది
ఇంకా సజీవంగానే
ఉంది దాని సొంత
అస్థిత్వం వల్లనా
అని ఆశ్చర్యపోతూ

మళ్ళీ అడవిబాటపట్టి
చెంచుల చుంచు బట్టలు
చూసి నేను
బాగానే ఉన్నాననుకుని
చెట్టెక్కి వడ్రంగి
పిట్టతో ముచ్చటెట్టి
అడవిపూల పరిమళానికి

ఆకలి దంచేస్తే
దుంపలతో పొట్టనింపుకుని
చింత చెట్టుకింద
చిరు కునుకుదీసాక
ఎత్తైన శికరమెక్కి
ఆవలివైపు దిగి
అచ్చెరువొందించే
జలపాతంలో
జలకాలాడి
చేపపిల్లలా ఈది

సముద్రంలోపడి
ఆల్చిప్పల్లో
ముత్యాలేరుకున్నా
కాని ఇవి నాకెందుకని
సాగరానికే వదిలి
ఆవలి తీరం చేరా

గడ్డకట్టుకుపోతున్న
నీటి అంచుల్లో
మంచుతో నిండిన
కొండచరియల్లో
మనుషులెవరూ లేరని
నిర్దారించుకుని
వెక్కి వెక్కి ఏడ్చి

ఒకే ఉదుటున మళ్ళీ
నీ కళ్ళముందుకొచ్చి పడ్డా
కన్నీటి జాడను వెతికా
అది అక్కడే
గడ్డకట్టుకుపోయిందని
చాలా సంతోషించా

నీతో మామూలుగా
మసులుతూనే
నా మనో విహారపు
తీపి జ్ఞాపకాలను
నెమరెసుకుంటూ
అస్థిత్వం లేకున్నా
ఆనందాన్ని
నిర్మించుకుంటున్నా
అబద్దపు గోడల్లో

* 8Aug12

రవి వీరెల్లి || రాత్రికి లోకువై... ||

కలిసినట్టే కలిసి విడిపోయే
రాత్రీపగళ్ళ పగుల్లనుంచి

ఒంటరి రోజులన్నీ
ఒక్కొక్కటే
విడివిడిగా దొర్లిపోతుంటే
కలిసి పంచుకున్న
ఆ కొన్ని క్షణాలు కూడా
కన్రెప్పల సందుల్లోంచి
ఎప్పుడో ద్రవించి పోయాయిలే.

చీకటి కేం
అంచులను చురకత్తుల్లా చేసి
రంపపుకోత కొస్తుంది
ఎంతైనా
ఒంటరితనాన్ని మోస్తున్నవాళ్ళంటే
రాత్రికి తెగ లోకువ.

ఇదిగో
చీకటి గోడలకు చూపులనతికించి
నడిరాత్రి నడుంమీద
సమయాన్ని చేదిపోస్తూ
ఒక్కొక్క జ్ఞాపకం పూసని
మునివేళ్ళతో మీటుతూ
అరతెరిచిన కళ్ళతో
తపస్సు చేస్తూ…

పొగమంచును మోస్తూ
పొడిచే పొద్దు కోసం
ఎదురుచూసే వెదురు పొదలా
ఇలా…

నా రాత్రులు నావి.

నీ పగళ్ళు నీవి.

రెండు ముక్కలైన
రోజును
అతికిస్తే బావుణ్ణు!
*09-08-2012

జుగాష్ విలి || పాతబడని కధ ||

ఆకాశం మట్టి నుంచి
తొలి కిరణం మొలకెత్తింది
కుట్ర మొదలైందన్నాడు

మిట్ట మధ్యాహ్నమైంది
నిప్పుల వర్షం కురుస్తోంది
ఆకాశం సాయుధమైందన్నాడు

సూర్యుని మీద ఉమ్మేసాడు
ముఖాన పిడుగై కురిసింది
శాంతి భద్రతల సమస్యన్నాడు

చిగురు టాకుల నెలవంక
గాయమై నేలకూలింది
ఆత్మరక్షణ ప్రయత్నమన్నాడు

"విన్నావా! బిడ్డా!
నలభై ఏళ్ళుగా యిదే కధ
జనం విసుగులేకుండా 'ఊ' కొడుతున్నారు
వేలెడంత లేవు నువ్వు
నీకేమో రోజుకో కొత్త కధకావాలి" అన్నది
తల్లిపిట్ట పిల్ల పిట్టతో
నల్లమల అడవిలో
నల్లమద్ది చెట్టుమీద.
-
-*07-08-2012

స్వాతీ శ్రీపాద||కలల సాగు ||

మొహం మీద రాసుకున్న పల్చని పసుపు తెరలా
నువ్వో కాంతి వలయం వలలా
మాటల సూదంటు రాళ్ళు నా ఉక్కు మనసు పైకి విసిరి విసిరి

ఓ చిన్న బిందువులా నాలోలోని నాలోకి తొంగి చూసి
చూస్తూ చూస్తూండగానే పెరిగి పెరిగి నీలి అనంతాకాశంలా మారి
హద్దులు చెరిపేసుకు వెయ్యి చేతుల సింధువులా
చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే
మాటలు మర్చిపోయిన పెంపుడు చిలకనై
నీ జీవితం నెలవంకపై వాలి
నీ రాగాలాపనల సమ్మోహనంలో
నా ఉనికిని చెరిపేసుకు నీ చూపుల ప్రవాహంలో నేనూ ఓ వెలుగు వీచికనై
ఎన్ని జన్మల తాదాత్మ్యం ?
వేళ్ళ సందుల్లోంచి జారిపోయే చూపుల జలపాతాల మధ్య
ఎప్పుడు జారిపోయావు నా కళ్ళు గప్పి?
ఈ చీకటి విస్పోటించిన ప్రేతాల మధ్య
తలపోతల వెలుగు పూల భ్రమల్లో తచ్చాడుతూ
దాపుడు చీర దాగుడు మూతల్లో తొంగి చూసే
కలలను
ఇక్కడ నాటుతున్నాను
రేపటికి ఏ పంట పండిస్తాయో మరి

*08-08-2012

జిలుకర శ్రీనివాస్||కవిత||


చేపకి ఈదొద్దని నెమలికి ఆడొద్దని కోకిలకి పాడొద్దని పిట్టకి ఎగరొద్దని పిల్లాడికి ఏడ్వొద్దని నాకు నీతో మాట్లాడొద్దని షరతులు పెడితే అది ప్రక్రుతి విరుద్ధమని తెలుసు కదా!
ఎంత ఉగ్గపట్టుకున్నా గుండె సొద ఆగదు నిన్ను తలుచుకోగానే రెండు నల్లని రాత్రులు ఒక్కసారిగా వెలుగుతో మెరిసిపోతుంటాయి చాల్లే! నీ మాటలు నాకేమీ అర్థం కాటం లేదని కదా! నువ్వు నా మాటల్ని తుడిచేస్తుంటావు.

నిన్న రాత్రంతా ఒకటే నెత్తురు కన్నుల్లో! అస్సాం నిండా తెగిపడిన నా తలలే రూమీ టోపీలన్నీ కాలిపోతున్నాయి నీ ఒంటిని కప్పుకున్న బుర్ఖా చించి నీ మొహం మీద పదునైన కత్తులతో తవ్వుతున్న చప్పుడు చెవుల నిండా! తెగిపడిన నా చేతులు నీ ప్రాణాన్ని కాపాడాలని పెనుగులాడుతున్నాయి ఎక్కడి నుండి వచ్చిందో అంత తెగింపూ బలమూ నెత్తురోడుతున్న నీ దేహాన్ని ఆయుధంగా మలిచి ఒరిగిపోతున్న నన్ను కాపాడుతున్నావు! ఎంత దయగలదానివి ఎంత ప్రేమగలదానివి నిన్నెలా చంపాలనుకున్నారు? కలలింత రక్తం ఒలికితే నిద్రెట్లా పోయేది?


ఎన్ని అక్షరాలు నీ ముందు గుమ్మరించినా ఒక్కటీ అర్థవంతమైన సొగసివ్వటం లేదు
వాక్యాన్ని ఎన్ని ముక్కలు చేసినా నిన్ను చేరగల మెరుపును పుట్టించ లేకపోతున్నా
కవిత్వాన్నీ నిన్ను మెప్పించటం నా తరం అయిత లేదు సరె పో! నేను అంత వీజీగా ఓడిపోతానా మిమ్ముల వొదులుతానా!

*08-08-2012

ఆర్.దమయంతి. || అతడొక గాయం ||

నీమీద రమ్మంటే వచ్చిందనా, వలపు
పొమ్మంటే తప్పుకు పోయేందుకు!


నీ సొగసొక సూదంటు రాయి
నా గుండెను గుట్టుగా చుట్టుకెళ్ళిపోయింది.

నువ్వెళ్ళిన వైపే నా చూపు పరుగందుకుంది
నిలవని దేహమూ ఆ వెనకే అడుగేయమంది.

నువ్ దూరమైన కొలదీ వేగమైన నడకలతో
దరి చేరాను సుమా, నీ వూరు!
గాలి అలల వీచు మేని పరిమళాలు
నీ పేరుని దాచాయి.
ఇక చాలు. వెనుదిరిగి - పొమ్మన్నాయి.

అయినా, చెలీ! ఆశ!
నిజం చెప్పు!
ఏ చీకటి రాత్రో ..
ఓ వెన్నెల వోలే
నా విషాద వీధిలోకి నాకై నడిచొస్తావ్. కదూ?!
గాయమైన గజలై, గుండె నిండుతావ్ కాదూ?

సఖీ!
నన్నా - నిమిషం కోసం ఆశ పడనీ..

యేరు వంపు తిరిగిన ఆ వంక
వసి పోని వెలుగు పూలు పెట్టుకుని
రాకుండునా నా నెలవంక?!

ఇచటనే..నన్నెదురుచూడనీ
నువ్వొస్తే అలనై
రాకుంటే శిలనై!

*08-08-2012