పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, జులై 2012, మంగళవారం

వంశీధర్ రెడ్డి || * నా అక్షరాలు *.||

నా అక్షరాలు.
అగ్నిని భస్మించే అవిశ్రాంత హవిస్సులు,
ఆత్మని రక్షించే అవిరళ తపస్సులు.
అంతరంగావిష్కరణలో అస్పష్ఠ ఆర్తనాదాలు,
అసహజ సహజాతాల సహజ సంవాదాలు

నా అక్షరాలు.
వెన్నెల్లో ఆడుకునే నీ రూపాలు,
నీ కన్నుల్లో నాకోసమెగసే సంద్రాలు.
నేను లేకున్నా నీతో అనగలిగే మాటలు,
నువ్వున్నపుడు చెప్పలేకపోయిన భావాల నీడలు,
నీ వల్ల కలిగిన అనుభూతుల సాక్ష్యాలు,
మనసు మోయలేక బైటికి దూకే సంతోషపు కెరటాలు,
అనుక్షణం నడిపించే నీ పిలుపులు,

నా అక్షరాలు.
ఇన్నాళ్ళూ కనపడని,
ఇక చేరలేనేమో అనుకున్న గెలుపుల ఆహ్వానాలు,
నీ మీద చూపించికోగలిగే చిట్టి కోపాలు,
నన్ను నేను పొగుడుకునే,
నిన్ను నాలో పొదుముకునే,
నాకు నేనే పంపించుకునే,
నీకు నేనందివ్వగలిగే,
ఆశల అనుబందాలు.....

(మూర్తి గారి, "అ క్ష రే లు" చదివాక, అప్పుడెప్పుడో తిలక్ని కాపీ కొట్టిన కవిత గుర్తొచ్చి.... )
*17-07-2012

శ్రీనివాస్ వాసుదేవ్ || ఈ పొగమంటకి సమాధికడ్దాం......!||

1.
చీకటిభాష--తప్పటడుగు పదాల్లో
వయసుతోపాటు నరాల్లోకెక్కిన మత్తు....
2.
సాయంత్రపు కౌగిలినుంచి
బయటపడ్డ విశృంఖల చీకటి
గొట్టాల్లో గరళం
ఔన్సుల్లో విషం
రంగురంగుల రుచులన్నీ కలబోసి
పెదాల్నీ ముద్దాడి, గుండెనీ తడిమీ
వెళ్ళినదారినే వెనక్కొచ్చే ధూమం
నంగనాచిలా ముఖంలేని మొహంతో......
డామ్నేషన్!
శరీరానికో, దేహానికో పేర్చుకున్నరంగుల చితిమంటలు....
3.
నాగుండెకీ, నాకూ అడ్డి పెట్టే పేచీపొగ
వయసు భీభత్స సంగీతానికి కరాళనృత్యమం
మనసు మంటా, పొగాకు వేడీ
మధ్యలో నలిగిపోతున్న దేహం!
గుండెని తాకట్టుపెట్టాననే కోపంతో
నా ఊపిరి నాదికాకుండా పోయింది!
4.
మంటనంతటినీ ఉండచుట్టి గొంతులో పూడ్చిపెట్టి
కర్మకాండకు సిధ్ధమయ్యే స్థితినే నమ్ముకున్నా
వేనోళ్ళ సంకీర్తనతో....వయసంతా
5.
ఈ చీకటిగదుల్లో రోజూ బోనాలు
కాలాతీతమనుకునే తీర్ధప్రసాదాలు......
రంగమెక్కే రంగవల్లులూ.......
పైట దాచలేని పరువాలు
పరికిణీ కింద అందాలు
నగ్నత్వాన్నినిర్వచించే తాపత్రయంలో....
రేపటిగురించేం చెప్పలేక సతమతమవుతూ
పొగతో పోటీపడి శూన్యంలోకి జారిపోతూ
బట్టల్లేని శూన్యంలోకి....

6.
ఆనందపు అంచులు కొలిచే కొలవెర్రి
చివరికొచ్చేసింది.....
ఇక నేనో నువ్వో ఒకరే మిగలాలి!
ఓ లివర్ సిరోసిస్, ఓ లంగ్ క్యాన్సర్
ఈ పోరాటంలో ఇక మిగిలిందొకటే
సుమోటో!
నీజీవితాన్ని నువ్వే గెల్చుకో
’నీ తరఫున వాదించే ఊపిరితిత్తులు మిగిలాయి’
వర్తమానాన్ని గుండెల్నిండా నింపుకున్నా
భవిష్యత్తు అగమ్యగోచరం
ఓ పొగలా......ఓ హుక్కా పొగలా!
(’క్షమించాలి, జీవితాన్ని అరువివ్వలేను’)


(గత కొన్నిరోజులుగా ఓ టీవీ చానల్లో హుక్కా సెంటర్లపై వొస్తున్న ఓ కథనంపై స్పందనగా రాసుకున్నది ఈ రచన)
*17-07-2012

రామాచారి బంగారు కవిత

పదునెక్కిన సూదిమొనపై చిందులువేసే అహం
బంగారంలాంటి బుద్దిజీవుడిని పరిమార్చి
కనురెప్పపాటులోనే కీర్తిశిఖరం నుండి
పతనాల లోయల్లోకి పడదోస్తుంది.
*17-07-2012

ప్రవీణ కొల్లి || వలయం ||

ఏదో ద్రవంలో తేలియాడుతున్నాను
చేతి వేళ్ళు కదలాడుతున్నాయి
కాళ్ళ కదలికలు మొదలయ్యాయి
కనురెప్పలు విడిపడుతున్నాయి
కనులు మూసినా తెరిసినా, అదే చీకటి!

ఏదో ప్రవాహపు హోరు ఆలకిస్తూ
బొడ్డుతాడు చుట్టూ తిరిగేస్తూ
నాకు మాత్రమే సరిపోయే చోట
నేను మాత్రమే ఉన్నాను!

అమ్మ గర్భమంట
ఎంత భద్రంగా ఉందీ చోటు!
అమ్మ..అమ్మ...ఎలా ఉంటుందో?
గొంతు లీలగా వినిపిస్తోంది

అయ్యో... అయ్యో....
నన్నెవరో తోసేస్తున్నారు
ఈ పొర చిలిపోతోంది
ఈ ద్వారం ఇరుకుగా ఉంది
కండరాలు నొక్కేస్తున్నాయి
నలిగిపోతున్నాను
జారిపోతున్నాను
వేధన..వేధన....ప్రసవ వేధన
ఎవరివో చేతులు
నా తలను పదునుగా పట్టి
నా శరీరాన్ని బలంగా బయటకు లాగేసాయి

ఊపిరి..ఊపిరి...ఊపిరి కావాలి
కేర్ మనే ఏడుపుతో
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల లయ ఆరంబమయింది!
అబ్బా..ఈ వెలుగు బరించలేకపోతున్నా
కళ్ళు చిట్లించి చిట్లించి చూస్తున్నా
ఓ వెచ్చటి స్పర్శ ఆహ్వానించింది
తన చనుబాలు నాకు అందిస్తూ
అమ్మ..అమ్మ....అమ్మ
ఆకలి మొదలయింది!

నా లేత చెక్కిళ్ళు ముద్దాడుతూ అమ్మ
నన్ను మురిపెంగా చూస్తూ నాన్న
ఆకలేస్తే ఏడుపు
కాదంటే మారాం
అందమైన లోకం
అమాయకపు సర్వస్వం
నడకలు నేర్చాను
పలుకులు పలికాను

అంతలోనే
ఎవరో నన్ను గెంటేస్తున్నారు
పద పదమని తొందర చేస్తున్నారు
ఆగండి...ఆగండాగండి
ఈ స్వేఛ్చ నా హక్కు
ఈ స్వచ్ఛత నా స్వభావం
నా నుంచి నన్ను దూరం చెయ్యకండి, వేడుకుంటున్నా
"ఎలా బతుకుతావేమిటి?"
చురకత్తులు విసిరారు
ప్రయత్నంగానో అప్రయత్నంగానో
ఓ కత్తి చేజిక్కించుకున్నా
పరుగులు సమరాలయ్యాయి
యుద్ధం నిత్యకార్యమయింది....

నాటి కన్నుల్లో మెరుపు
నేడు లౌక్యాన్ని నేర్చింది
నాటి మోములోని అమాయకత్వం
నేడు గడుసుతనాన్ని ఆపాదించుకుంది
స్వయంరక్షనంటూ
కట్టి కూల్చేస్తున్నా
కూల్చేసి కట్టేస్తున్నా!
అడుగుల వేగం పెరిగి పెరిగి
సంధ్యవేళ నెమ్మదించింది...

పట్టుతప్పుతున్న దేహం
అదుపుతప్పుతున్న అలసట
ముడతలు పడిన మోము
బతుకు సమరం కొలిక్కి వచ్చిందో? నెమ్మదించిందో?

ఎవరో ఎవరో..ఎక్కడ నుంచి వచ్చారో !
నన్ను బలంగా ఈడ్చుకుపోతున్నారు
"రాను రాను...నేను రాను..నన్ను వదిలేయ్", గింజుకుంటున్నా
"నీ సమయం ముగిసింది", వాణి వినిపించింది
"నన్ను నా సామ్రాజ్యం నుంచి విడదీయటానికి నువ్వెవరు?", నిలదిసా
"నేనేవరా?నన్ను గుర్తించలా?.........
నేను కాలాన్ని....."

చేతి వేళ్ళు అతుక్కుపోతున్నాయి
కాళ్ళ కదలికలు బిగుసుకుపోతున్నాయి
కనురెప్పలు మూతబడుతున్నాయి
చుట్టూ చీకటి
ఆయువు బొడ్డు తెగిపోయి
ప్రాణం అనంతంలో కలిసిపోయింది...
http://alochanalu.wordpress.com/2012/07/16/%E0%B0%B5%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82/ 
*16-07-2012

రఘు మందాటి కవిత

గమ్యం ఎరుగని తీరాల వెంట ఆలోచనల పరుగులు.

నిశిధం మాటున సేద తీరిన నిన్నటి జ్ఞాపకాలు.

క్షణ క్షణమొక యుగం మరుక్షణం ఒక యాగం.

నీ తలపుల మాటున మిగిలిపోయిన శ్వాసల ప్రకంపనలు.

నీ అధరాల కౌగిల్లో ఊపిరాడని నా నిశ్శబ్దం.

గరుకు గుండెలో మరుపురాని తీయ్యని గాయం చేసి

చెరిగిపోని గుర్తుని మిగిల్చి

మాయం కాని రాగాన్ని నింపి

మౌనాన్ని సైతం సతమతపెడుతూ

ఉక్కిరిబిక్కిరి చేస్తూ

కనులకు సైతం అందకుండా

ఊహకైనా చిక్కకుండా ఇంకా ఎంతకాలమి దోబూచులాట..

-నీ లాలనకై అలమటిస్తూ వేచి చూస్తూ పరితపిస్తూ..... నీ నేను.
*17-07-2012

కె క్యూబ్ వర్మ కవిత

ఎత్తుగా ఓ పర్వతపు సానువులా
నిలువెత్తుగా...

శిలల ఆకృతులలో తమ ముఖాలను
వెతుక్కుంటు...

ఎవరో ఓ పక్క గాలి కోతకు తెగిపడిన తలతో
ఆడుకుంటూ...

చేయేదో ఆలవోకగా ఇలా ఎత్తిపట్టినట్టు
తేలియాడుతూ...

ముఖంపై పడుతున్న ముడతల మధ్య
దాగిపోతూ...

ఏదో సజీవత్వం అలా ఆ రాతి కళ్ళలో
గోచరిస్తూ...

యుగాల మలుపులన్నీ ఆ కాలి వేళ్ళగుండా
మరలిపోతూ...

ఈ రాతి జ్ఞాపకాలన్నీ ఒక్కోటీ
దొర్లుకుంటూ....

ఒక్కసారిగా గుండెలపై కూలబడ్డ
బరువుతనంతో....
*17-07-2012

రియాజ్ || తెలియట్లేదు? ||

కొన్ని దృశ్యాలు
వేళ్ళలో బలంగా పాతుకున్నాయ్!
కలుపులా తీసివెయడం తెలియట్లేదు?

పీకిపారేయడమంటావా..బలవన్మరణమే?

కొన్ని జ్ఞాపకాలు
అంతరంగంలో నిరంతర ప్రవాహమై పారుతున్నయ్!
నిశ్చలితం చేయడమెలానో తెలియదు?

ఆ గాలి సోకకుంటే..శ్వాస ఆగినట్లే!!

కొన్ని కలలు
పదే పదే వస్తున్నాయ్!
అల్లుకున్న గుబులు గుహల చీకట్లో ఊగుతూ విఫలరెక్కల నడుమ
గాఢ పరిమళాల దోచుకుంటున్నట్లు
ఆపేయమంటావా?
మనో విద్వంసమే? కాంక్షా మరణమే?

కొన్ని పదాలు గుండెను దున్నుతున్నయ్!
అలా గాలికొదిలెయ్యడం తెలియట్లేదు?
వ్యక్తీకరించకంటావా అస్థిత్వ రాహిత్య సంఘర్షణమే?
*16-07-2012

వెంపల్లి గంగాధర్ కవిత

నీ దేశం తయారుచేసిన క్షిపణి ఒకటి
గగన తలం లోకి
నిప్పులు గ్రక్కుతూ ఎగురుతుంది ....
ఉదయాన్నే పత్రికలు పతాక
శీర్షికలతో పట్టం కడతాయి!
రేపటి కాలం లో అది ఎవరిని మ్రింగ నుందో
ఎవరు చెప్పరు కదా ....?

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ
ఓటుకు నోటు సిద్ధాంతం
ఆర్థిక శాస్త్రం లో కొత్త పాఠం రాస్తుంది !
ప్రజల తల ఫై ముళ్ళ కిరీటం
వంశ పారం పర్యం గా వస్తోంది .
నీ శవ దహనానికి కూడా
నువ్వు ముందే పన్ను కట్టాలి ..!
నదీ పరివాహక ప్రాంతాలు
నాగరికతను నేర్పిన వైనం
పుస్తకాల్లోని పాత చరిత్ర .
ఇసుక లోంచి కోట్లు
పిండుకోవడం నువ్వు నేర్చుకున్న అధ్యాయం .

కూడు..గూడు.. గుడ్డ ...
ఒక పురాతన మనిషి కల .

సన్నని కాళ్ళు గల గొర్రెలు
పచ్చిక కోసం కరువు నేల మీద
లోతయిన కళ్ళ లో ఆకలి నింపుకొని
ఎదురుచూపులతో సంచరిస్తూనే ఉంటాయి .
బెదిరి చెదిరి బిత్తరి చూపులతో
జీవిత కాలం నెట్టు కోస్తుంటాయి ...

నువ్వు పుట్టుక తో నే
రాజ్యం లో సభ్యుడివి ...
ఇక...నవ్వుకొని నవ్వుకొని ఏడ్చు !

www.vempalligangadhar.com
*17-07-2012

జగతి జగద్దాత్రి || భావ ప్రాప్తి ||

ఎప్పుడు ఏ క్షణాన కలుగుతుందో
తెలియదు .....
ఆ దివ్య క్షణం కోసం
ఎంతని నిరీక్షించాలో
ఒకోసారి జీవితం చాలదేమో
అందుకే మరో జన్మ
ఎత్తాలేమో...మళ్ళీ
పుట్టి పెరిగి పెద్దై...
ప్రేమకు చెరిగిన హద్దయి
ఆ జన్మాంతపు
ప్రేమ వ్రతం చేసి ...
మరల మరల
వ్రత సాఫల్యం కోసం
కళ్ళు విప్పార్చుకుని
హృదయాన్ని చకోరాన్ని చేసి
మనో దేహాలను
సమర్పించుకుని
ఎదురు చుస్తే...
ఎప్పుడో ఏ దైవిక మైన లిప్తలోనో
కలిగే ఆ భావన
అదే మోక్షం
అదే ముక్తి
అదే ఆత్మకు విముక్తి
నిస్త్రాణమై త్రుటిలో
కాలం స్తంభించిన
ఆ అపురూప క్షణం
కలిగేదే ..... చిరంతనంగా
సకల మునులూ, జనులూ
తపించేది ....తపస్సించేది.
*17-07-2012

ఆరార్కే మూర్తి || జ్ఞాపకాల వర్షం ||

చినుకులు
ఒకదానివెంట ఒకటి బియ్యపు గింజల్లా
పెళ్ళినాడు తలపై నుంచి రాలుతున్న తలంబ్రాలలా
అప్పుడప్పుడూ మొఖానికి గుచ్చుకుంటో
అచ్చం నీ జ్ఞాపకాలలా

ఉండుండీ గుండెను తాకుతున్న
ఉరుముల చప్పుడు
పదిమందిలో కూర్చున్నపుడు
దూరంగా వినవస్తున్న నీ నవ్వులా

ఈ వర్షంలా నువ్వూ
శాశ్వతం కాదని ఆనాడే తెలిస్తే
ఏదో ఓ గొడుగు వేసుకు
నీనుంచి తప్పించుకునే వాణ్ణేమో

లోకులు కాకుల్లా పొడుస్తున్నా
నే నీలో తడిశాను చూడు
ఈ తడి ఎన్ని జన్మలకి ఆరేనో గదా
నే మండినా బాగుణ్ణు ఆరేందు కొరకు

ఈ వాన రాత్రి మెరుపులా
నీ ముఖం వెలుగు పడ్డాకే
నేనీ లొకానికి కనిపించానేమో
ఇహ ఈ ఆలోచనయితే
నన్నెప్పటికైనా ఆరనిచ్చేనా?

ఈ బ్రతుకిక తడిగా
చిత్తడిగా ఇలా ఈడ్చేయవల్సిందే
జీవమూ లేక శవమూ కాక
ముసురులా మూసుకుపోవలిసిందే
మరుజన్మలో నీ జ్ఞాపకాలుండపోతే
అది ఈ క్షణమే ఎందుకు రాదో !
*17-07-2012

వంశీధర్ రెడ్డి || ‎* నెమలీక * ||

కొన్నెవరితోనూ చెప్పాలన్పించదు,
కొన్నెవరికీ అర్ధమవవెంత చెప్పినా,
కొన్ని రోజూ తలవందే నిద్దర్రాదు,
నీ నెమలీకలా,

గుర్తుందా,
ముప్పయ్యేళ్ళ క్రితం,
గవర్నమెంట్ స్కూల్లో పంద్రాగస్టుకు,
నా గుండెకి గుండుసూత్తో జెండా గుచ్చుతూ,
నొప్పితెలీకుండా
నువ్విచ్చిన నెమలీక,
స్వాతంత్ర్యమంటే తెలిపి,
భుజాలకు రెక్కలు మొలిచి,
చూపుకు వెలుగులు మిగిలి,

నెమలీకలో నీ కళ్ళే ఉన్నట్టు,
అది చెంపకాన్చితే, నువ్వే తాకినట్టు,
ప్రేమంటే ఇదీ అని తెలీనపుడే
ప్రేమ నేస్తమై,

ఏడాదికో డైరీ నిన్ను దాచుకుంటూ,
పాతికయ్యాయ్,
ఇప్పటికీ,
నువ్ నాకో తాజా శ్వాసవే,
తరిమే ఊహవే,

మొన్నే తెలిసింది,
అల్జీమర్స్,
నా ఙ్నాపకాలొక్కొక్కటే మాయం చేస్తూ,
నిన్నూ, మన ప్రేమనీ తుడిచేస్తూ,
అద్దంలో నన్ను నాకు రోజూ పరిచయిస్తూ,

నువ్విది చదివేనాటికి, నేనంతా మరవొచ్చు,
కానీ, ఎప్పటికీ గుర్తుండేదొక్కటే,
నీ నెమలీక,
ఎందుకంటే,
అది నా జ్నాపకం కాదు,
జీవితం మరి..
*17-07-2012

మెర్సీ మార్గరెట్ || కాఫీ కప్పుకేం తెలుసు మౌనం మాటున జరుగుతున్న సంభాషణ ||

కాఫీ కప్పుకేం తెలుసు
మౌనం మాటున జరుగుతున్న సంభాషణ

********
చూపులతో చూపులకు
మాటలతో మాటలకు
శ్వాసతో శ్వాసకు
ఇవ్వాలే జరిగిన పరిచయం

అటు తను
వర్షించక ముందు మేఘం లా
ఇటుగా నేను
స్వాతి చినుకుకై చూస్తున్న ముత్యపుచిప్పలా

తెలియని సంబంధాన్నీ
భగీరద ప్రయత్నంలా
చేయి గీతల్లోనో ..నుదుటి రాతల్లోనో
దాక్కున్న మనసుల్ని
విధి తపస్సుచేసి కలిపినట్టు

ఆ చూపుల్లో చల్లదనం
తన కళ్ళలో ఒదిగి పోయి
అక్కడే ఉండమంటూ ..
ఆ నవ్వులో నిష్కల్మషం
పెదాలతో ఒప్పందం చేసుకొని
తన గుండెపై తొలకరి చినుకులై
వర్షించి చల్లబడమంటూ.

వేడి నిట్టూర్పులు తనువును
తాకుతూ
భావాలతో భావాల పరిచయం చేస్తుంటే
తగిలి తగలని
అంటి అంటకుండా ఇచ్చిన కర చాలనం
హృదయ చాలనమే జరిపేసినట్టు
తెలియని సరికొత్త పరిమళాన్ని
మనసు మస్తిష్కానికి చేరవేస్తుంటే

వేల క్షణాలే అవసరం లేదంటూ
యుగ యుగాల నిరీక్షణ వృధా అనిపిస్తూ
ఆ కొన్ని క్షణాల కలయిక
గుండె నిండా నింపుకుని
ఒక జీవిత కాల జ్ఞాపకంగా
మిగిలిపోయే ఊపిరై పోవాలనిపించింది
అర్ధం కాక చూస్తున్న కాఫీ కప్పు సాక్షిగా ...
*16-07-2012

Jayashree Naidu || కల*కలం* ||

కలల కలం
నిదుర అరువు కాలంలో..
సిరా లేని పాళీతో..
ఆశల కాగితమ్మీద
నువ్వు నిండిన
నవ్వు రేణువుల్ని
విరజిమ్ముతూనే వుంది.
*17-07-2012

రేణుక అయోల || మాంత్రికుడు ||

ఏది జ్ఞాపకం రాని తాంత్రిక విద్య వస్తే
అంటుకున్న రంగులని అద్దకాల్ని దాచేసి
మాంత్రికుడి పెట్టెలోంచి ఎగిరే పావురం వెతికే ఆకాశం కోసం అన్వేషణ.

పగలు రాత్రి ఏనీడ పడకుండా రూపాని మార్పులు చేసుకునే
ప్ర యత్నాలు ముమ్మరంగా ,జ్ఞాపకం గాలి కిటికీ రెక్కను తోసి
వాన తుం పర్లను జల్లింది.
తారు అవుతున్న రూపంలో నీలిరంగు వేగంగా కలిసిపోతూ
ఆ ముఖం కుడా కరిగిపోతూ వేడి నెత్తు రు చిమ్మి నరాలు చిట్లగానే
ఏ బట్ట లేదు తుడవడానికి .

ఆ ముఖం లో ఎన్ని ప్రశ్నలు జవాబుకోసం !
లాంతరు నీడలో గోడల మీద జరుగుతున్న వెలుతురు చారికలు వెలుగుతూ
ఊపిరి వేడి మెడ వంపులో కొత్త రూపానికి మచ్చలా.

కాలాన్ని తోసేసి పరుగుతిస్తే ఊలు బంతి కాళ్ళకి అడ్డం పడి చుట్టుకుంది
కొసని వేలుకి చుట్టి విప్పుతూ చుడుతూనే ఉన్నాను
ఇద్దరం పాడుకున్న పాట చెవిలో వద్దను కున్నా వినిపిస్తూనే ఉంది
ఎన్ని సార్లు అల్విదా చెప్పను బట్టి పట్టిన ఎక్కంలా . కొత్త రూపం దారికోసం

అతను మాంత్రికుడిలా పావురాని ఎగుర వేసాడు
ఆ రూపం నాదే ఊపిరి వేడిలో కరిగిపోతూ ..
*17-07-2012

విజయ కుమార్ కోడూరి || ఏం చేస్తావు నువ్వు? ||





యంత్ర జీవితం వొక ఎడతెగని ఎండా కాలంలా
దేహాత్మలను దహించి వేసే దప్పిక దినాలలో.....


ఒక ఉదయం కిటికీ పక్కన చెట్ల ఆకుల మీద
సందడిగా జారి, ఆటలాడే వర్షపు చినుకులు
నీ కనుల మీది నిదురతెర తొలగించి
గది లోపల బందీగా పడి వున్న నిన్ను
ప్రేమతో ఆట లోకి ఆహ్వానిస్తాయి .....



కాలం నది మీద కొట్టుకుపోయిన కాగితం పడవ ఏదో
వొక కలలా నిన్ను పలకరిస్తుంది …..వొక లిప్త పాటు


చినుకుల్ని చుంబించిన మట్టి సౌరభమేదో
నిన్ను మంత్రించి, బంధ విముక్తుడిని చేసి
అలా బయటకు నడిపిస్తుంది….
నడక మెలకువలోనా? లేక నిదురలోనా?



అనంతాకాశం నుండి భూమిపై (లేక, నీపై)
దయగా కురిసే గొప్ప వాత్సల్యం.....
తడిసిన అందాలతో పచ్చగా నవ్వే చెట్లు...
కాసేపలా నీ రెండు అరచేతులతో చినుకుల్ని పైకి ఎగరేస్తూ…..
మరి కాసేపు నీ మొహాన్ని చినుకులకు అప్పగించి
'వొక నాలుగు ముద్దులు పెట్టండే' అని ప్రాధేయపడుతూ…..


జీవితం ఇక్కడ ఆగిపోతే బాగుండుననుకుంటావు కదా…..
నిన్ను మళ్ళీ నీ పాత గోతాములో కట్టి
ఇంటి లోనికి విసిరేసి….
కాగితం పడవ నవ్వుకుంటూ మాయమైపోతుంది….
* * * *
ఏం చేస్తావు నువ్వు?....
గోతాములో ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరౌతూ ...
వర్షపు చినుకుల్ని ఉదయాన్నే పలకరించిన దరిద్రమని తిట్టుకుంటూ ...
నీ యంత్ర జీవితంలోకి నిష్క్రమిస్తావు ...


ఎడతెగని ఎండాకాలాలు పూర్తిగా
దహించి వేసిన దేహాత్మలు నీవి...
ఏ వాత్సల్య వర్షాలూ వాటికి పునర్జన్మను ప్రసాదించలేవు
http://bangaaruchepa.blogspot.in/2011/07/blog-post.html?spref=fb

*16-07-2012

శ్రీ వెంకటేశ్ కవిత

నా శైలి ఒకటే నీకు నచ్చిన నచ్చకపోయినా
నా దారి ఒకటే అది వెలుగైన అందకారమైనా
నా గెలుపు ఒకటే అది ముల్లైనా మల్లైనా
నా ఓటమి ఒకటే పారిపోయినా లొంగిపోయినా
నా మాట ఒకటే విచ్చుకున్నా గుచ్చుకున్నా
నా ప్రేమ ఒకటే శత్రువైన మిత్రుడైనా
నా గౌరవం ఒకటే పేదోడికైనా ఉన్నోడికైనా
నా ఆకలి ఒకటే పంచభక్ష పరమాన్నాలైనా ఉప్పు లేని పప్పైనా
నా నిద్ర ఒకటే దూది పరుపుమీదైన కటిక నేల మీదైనా
నా సంతోషం ఒకటే అదౄష్టమైన దురదౄష్టమైనా
నా దుఖ్ఖం ఒకటే తెలిసినోడు పోయినా తెలియనోడు పోయినా
నా బ్రతుకు ఒకటే ఫ్లాట్లోనైనా ఫ్లాట్ఫార్మ్ మీదైనా
నా చావు ఒకటే ఆరడుగుల నేలమీదైనా ఆరొందలెకరాల భూమిలోనైనా
చివరిగా నేను నేనే అది సామాన్యుడికైనా అసామాన్యుడికైనా......
*17-07-2012

రామాచారి బంగారు || వానకాలం-వనవాసం-వానవాసం ||

వానదేవుడు కరుణించి కార్తెల
కాలంలోనే వర్షాలు కురిపిస్తాడూ
సమ్రుద్ధిగా పంటలు పండుతాయాన్న
కోటి ఆశలతో ఉన్నవన్నితెగనమ్మి
విత్తనాలు చల్లిందీ కర్షకలోకం
చుక్కరాలక దిక్కుతోచక వానచుక్కకోసం
ఆకాశంకేసి ఎదురుచూపులతో
ఏడిచ్చిమొత్తుకున్నా కనుచూపు మేరలో
మేఘం జాడ కనపడదాయి
పాడియావు వంటి వ్యవసాయం పడావుపడి
వున్నవూరుకన్న దున్నిన నేలకన్న
పెంచిన అమ్మ కన్న ఆ కాడు(అడవి)
మిన్న అని వెతలగోసలతో తలపోసి
వలసగా వనవాసమేగపోదామని
చాటింపు చేసి సాగే తరుణంలో
అదేమిచిత్రమో ఈతరుణం దప్పిందా
తనను ఈజనం నన్ను ఆగమాగంగా
తిట్టి సాపించి సానిపిజల్లుతారన్న
అదురుతో గాలిదేవుడికి మొక్కి
అయ్యా నువ్వు కాస్తా ఆగవయ్య
తండ్రి అనిబతిమాలి వరుణుడు
ఆగమేఘాలతో అచ్చి కురవంగా
కుంటలు, చెరువులు నిండంగా
అలుగులు పోయంగా. అలిగిన
మడుసులంతా కురిసిన జల్లులతో
మురిసిన మడులతో వనవాసం కాస్తా
వాన(దరహస) వాసంగా మారింది.
* 15.07.2012

స్వాతి శ్రీపాద || కుదిరేదెలాగ ? ||

నిశ్శబ్దం అంచులమీద ఆచితూచి ఆకాశానికి చేతులు చాస్తూ
నర్తించే నీటి బుడగల నురగలపై
కాస్సేపలా ఆగి
రేపటి ఉషోదయాల గురించీ
ఊహకందని జీవితానికావలి వైపు గురించీ
నీ నును వెచ్చని వేలి కొసల్లో
అణగారి పోయిన
పచ్చిక బీళ్ళగురించీ
నీతో సుదీర్ఘ సంభాషణలు సాగించాలన్న
స్వప్న సీమల్లోని తహతహ
కానీ,
నీకూ నాకూ కుదిరితేగా..
ఏ అర్ధరాత్రో గుండెతట్టి వెళ్ళిపోయే
పరిమళపు వెన్నెల కర్పూరం నువ్వు
ఉదయపుటంబరంపై కళ్ళు తెరిచే ఉదయ తారను నేను
నడి వేసవి తాపంలో దారిలోనే ఆవిరయే
తొలకరి చినుకువు నువ్వు
ఆకలి తీరక పగుళ్ళు వారిన పృధ్విని నేను
క్షణంలో రంగులు విసిరి పరవశం నుండి
తేరుకునే లోగానే
అదృశ్యమయే రంగుల హరివిల్లు నువ్వు
నింగీ నేలను కొలిచే వర్షఋతువును నేను మరి నీకూ నాకూ కుదిరేదెలాగ?


*16-07-2012

మెర్సీ మార్గరెట్ కవిత

బ్రతికే ఉన్నా
నీ చివరి శ్వాస ఊపిరిగా
మిగిలే ఉన్నా
నీ ఆకరి కల ఆయువుగా

రాలిన కన్నీటి వెల
నీ నవ్వు కొని తెచ్చేటంతా
మూగబోయిన గుండె
నీ రాక చూసి మేల్కొనే గంట

పిలుపుకే ఆయాసం అంతా
గొంతు మూగ బోయినా
చూపుకే అలసటంతా
ఎదురు చూసే కన్ను వాలినా

వెళ్తున్నాఅదే దారుల్లో
పోగొట్టుకున్న ప్రేమను వెతుక్కుంటూ
పారేసుకున్న సంతోషాన్ని
అన్వేషిస్తూ
చితిలో కుడా జతగా మిగిలే వరకు
వదలనని నీకై
చివరి పరుగులు తీస్తూ
*15-07-2012

పి.రామకృష్ణ || కొత్తా దేవుడండీ.. ||

1.

2012 జూలై మూడు

చలికాలపు సాయంత్రం
షాంపైన్ నింపిన గాజు గ్లాసును
గాల్లోకి లేపాడు పీటర్ హిగ్స్.,
చీర్స్ చెప్పడానికి, ఎదురుగా-
సత్యేంధ్రనాధ్ బోస్ లేడు.!

2.

ముప్పైయేళ్ళ
పుడమి పురిటి నొప్పులకు
పుట్టిన
ప్రోటాన్ పసికందువు కదా..??

ఇంతకూ నువ్వు
ఆడా? మగా..?

3.

అమ్మా నాన్నా అవసరం లేకుండా
అవధరించావు కదా..?
దైవకణమని పేరెట్టుకున్నారు
మురిపెంగా.

సువార్తలేవైనా
మోసుకొచ్చావా మిత్రమా?
నిన్ను కూడా శిలువెక్కించేస్తారు
జాగ్రత్త సుమా. !

4.

2012 జూలై మూడు

చలికాలపు సాయంత్రం.
కన్నీరెండిన గాజు కళ్ళకి
మెరుస్తూ ఆదిమూలమేదో
అందినట్లైంది.
సాక్ష్యం చెప్పడానికి
సత్యేంద్రనాధ్ బొస్ లేడు.
*16-07-2012
( 'కొత్తా దేవుడండీ' కవితకు సుజాతగోపాల్ గారి అనువాదం. ) 


  Sujatha Gopal  || New God ||


On a wintry evening,
A champagne filled glass lifted high in the air,
For a toast by Peter Higgs,
To click the glass and say cheers,
There is no Satyendranath Bose …

For thirty long years,
To the mother earth in labour,
A proton child is delivered,
Are you a male or a female?

Without a mother or a father…
You are conceived,
Christened God Particle with pride…
Have you come with a gospel message, my friend?
Beware….
They may crucify you too!

2012 July 3rd
On a wintry evening,
In the tear dried glass eyes,
Shines the truth of origin perhaps,
To stand witness,
Satyendranath Bose is not alive…

__Sujatha Gopal


Jayashree Naidu || Momentous Silence ||

‎silence is the coolest..
silence is the warmest..

silence is a forest
silence is the everest

silence is a hurricane
silence is a travelling lane..

silence is a falling leaf...
silence is what the moment is made of!!


*16-07-2012

వర్ణలేఖ కవిత

షావుకారు కాడ
అప్పుదీర్సనీకె
కూలికివెడ్తే కొడుకుని
వడ్డికే సాలలే
వచ్చిన పైసలు

ఒల్సవోయిన కొడుకు
వచ్చిజూస్తడని
ఒత్తులేసుకున్న
కండ్లల్ల

పానంబోవట్టెగాని
పోరడు రాడు
ఊల్లనే వుంటె
కలో గంజో
కల్షేదాగుతుండె

దస్రకి దండంబెట్టనీకె
ఒస్తనన్నోడు
దీపాలెల్లినా
దిక్కులేడు

నా కట్టెగాలేనాటికన్నా
ఆని ఆప్పుదీర్తె
బాగుండు, నా కొడుకు
ముందల నడుస్తడని
నిమ్మలంగ
కళ్ళుమూయనీకె

వర్ణలేఖ
*16-07-2012