11, జులై 2012, బుధవారం
రామ్మోహన్ డింగరి॥ఈ సాయంత్రాలు॥
ఈ సాయంత్రాలు
చీకటి దుప్పటి కప్పుకొనే..
సాయంత్రాలు..
నన్ను నే అన్వేషించుకొనే, నన్ను నే ఆవిష్కరించుకొనే సాయంత్రాలు..
స్పటిక చషకాల్లో పొంగే
బంగారు రంగు ద్రావకం
నాలోకి ...లోలోకి ప్రవహించి
పొద్దుంనించి నే వేసుకున్న ముసుగులన్నీ తీసేసి ..
నాకు నేనై
ఇక
ముఖేశ్ ,తలత్ ,గులామలీ ..
ద్వారమ్,మాన్డలీన్ మధ్య బీతొవెన్ తో కొట్టుక పోతా...!
*11.7.2012
సత్యశ్రీనివాస్॥మరణాంతర కవిత॥
చెట్టు
మొదళ్ళలో
నిక్షిప్త
బొగ్గు
రాసులు
నా చరమ
గీతాన్ని
వెలికితీస్తాయి
*11.7.2012
రియాజ్॥నవ్వు వెనుక..॥
అందరూ గమనిస్తున్నారు
కొందరు అడుగుతున్నారు
నువ్వు నువ్వులా లేవే??
ఆ నవ్వు కొత్తగా ఉందే???
అవును..
ఈ నవ్వు వెనుక
సుధీర్ఘ మౌనం వెనుక రహస్యమేమిటో
వారికేం ఎరుక!!
ఒకప్పుడు
ఓటమి అంచుల్లో మా అమ్మ గుర్తుకొచ్చేది
ఆమె నవ్వు గుర్తుకొచ్చేది
కానీ..ఇప్పుడు మాత్రం
అదనంగా నీ నవ్వు గుర్తుకొస్తుంది!!
ఇంత అందంగా నవ్వడం ఎవరు నేర్పారో కానీ!!
నా నవ్వు వెనుక మౌనంగా దాగిఉంటావ్!!!
కోపంలో నువ్వు పెట్టే ముచ్చంగిముఖం ఇంకా గుర్తే!
నాలో విస్మయం సృష్టించే!
నీ నవ్వు తాలూకు జ్ఞాపకం
ఇప్పటికీ నా మోముపై ప్రదర్శితమవుతూనే ఉంటుంది!!
అచ్చు నాలా నేను నవ్వడం బహు అరుదు !!
నువ్వెక్కడికీ వెళ్ళలేదు !
విషాదంలోనూ..మౌనంలోనూ..గెలుపులో నూ..ఆనందంలోనూ
నా వెనుకే దాగివుంటావ్!!
నా మోముపై ప్రత్యక్షమవుతుంటావ్
*11.7.2012
స్వాతి శ్రీపాద॥రోజూ॥
తెల్లారేసరికి
చుట్టూ గిరిగీసినట్టు పరచుకున్న పారిజాతాల
మధ్య బోసి పోయిన వదనంతో ఏకాంతాన్ని పాడుతున్న నిశ్శబ్దపు చెట్టునై
వడలి వాడి సోలిన క్షణాలు విత్తనాలుగా
ఇంకా పదునుకు రాని సమయానికై
అసందిగ్ధ స్వప్నావస్థలో ...
ఒక వాస్తవం
నిన్నటి కలలకూ రేపటి భ్రమలకూ మధ్య
కుంగి కృశించిపోతూ మొగ్గ గానే రాలిపోతూ ...
ప్పుస్తకాల మధ్య దాచుకున్న సంపంగి పూరెక్కల పరిమళంలా
అప్పుడప్పుడు పెదవులకు అద్దుకున్న తీపి తేనెలో దొర్లిన అక్షరాలు
అచ్చర కన్నెల్లా లోకం కళ్ళకు రంగుటద్దాలు తగిలిస్తాయి
కళ్ళల్లో కలికం వేసుకున్న రాత్రి
అణువణువునా రగిలే జ్ఞాపకాల నెలవులకు
క్షణ క్షణం ఉలికిపడే కంటి రెప్పలను బలి ఇస్తూ
రక్త సిక్త వదనంతో ఉదయన్ని ఆవహిస్తుంది
నిద్ర లేమిలో కాగికాగి ఆవిరులు వెదజల్లే అసహనం
మళ్ళీ ఓ పురిటి కందులా కేర్ కేర్ మంటూ
సహకారనిరాకరణ ఘోషిస్తుంది
అయినా
బేతాళుడి శవంలా మళ్ళీ జీవితం చెట్టెక్కుతుంది
*10.7.2012
కవి యాకూబ్ ॥స్థలం : మెలొడీ॥
అన్ని క్షణాలు మెలొడీగా
ఒక హృదయంగా
రాలిన బూడిదలో, కాలిన పొగల్లో
ఒక స్నేహరాగ మెలోడీ
బతికిన క్షణాలు బతకడం నేర్పే సంగీతాలు
టేప్ స్వరపేటికలోంచి పొంగి ప్రవహించిన
జీవిత మాధుర్యం.
గడియారం ముందు మోకరిల్లిన నిముషాలు
బతకడాన్ని నిర్వచించిన సంగీతం
గాలి చల్లబడి జెండాలా ఎగరటం
మొదలుపెట్టింది
నాలోపల దాగిన సంగీతజ్ఞానమంతా
నా ఎదుట సాక్షాత్కరిస్తున్న సందర్భం
ఒక టీకప్పు, ఆపై మరో టీకప్పు
మరికొంత జీవితాన్ని ప్రసాదించి
వెనక్కి మళ్ళాయి.
మా చెవుల వెనుక
మెహదీ హసన్
గులాం అలీ
పంకజ్ ఉదాస్...
......................!!
*10.7.2012
కిరణ్ గాలి ॥ఖాళీ॥
ఈ మధ్య మనసంతా
ఖాళీ హోరు చేస్తుంది
మళ్ళి ఎలా చేరుకుందో పేరుకుందో
వెంటాడే పులినించి ప్రాణభయంతో పరిగెట్టె
జింకకు ఆంది అందని దమ్ములా
కుత్తుక తెగేలా బిగిసే
కంచె లేని కాన్సెన్ట్రేశన్ క్యాంప్లా
ఎంత గింజుకున్న గిర గిరా తిప్పుతు
తనలోపలికి గుంజె సుడిగుండంలా
తెగ బాధిస్తుంది వేధిస్తుంది
ఈ ఖాళీ
ప్రేమ విఫలమైతేనో
ఒంటరితనం వెంటాడితేనో
ఒటమి వెక్కిరిస్తేనో
సంపాదాన సరిపొలేదనో
వచ్చింది కాదు
....
ఉద్యమం కోసం ప్రాణాలొడ్డి
నెత్తుటి మడుగులొ నేలరాలిన విప్లవకారుడి
చేతిలో తుటాలైపొయిన తుపాకిలాంటిదీ ఖాళీ
ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన
వీర జవాన్ భార్య
బొట్టులేని నుదిటిలాంటిదీ ఖాళీ
బిడ్డల ఆకలి తీర్చలేని
పేదరికం ఎండిన రొమ్ముల్లాంటిదీ ఖాళీ
నిఖర్సైన నాయకుడినే కనలేని
నా దేశం దశబ్దాల గొడ్రాలి తనం లాంటిది ఖాళీ
న్యాయమే లేని విశలమైన కోర్టు
అవరణ లాంటిది ఖాళీ
నెర్రలు పడి పగిలిన రైతన్న
గుండెల మీద మొలవని శ్రమ విత్తనంలాంటిదీ ఖాలి
జీవితాంతం ఇల్లుకోసం కష్టపడి కూడపెట్టినా
కట్టలేకపొయిన ముసలి మాస్టారి
కబ్జా అయిన స్తలంలాంటిదీ ఖాలి
ఆలస్యమయినా అహింసతోనే సాధించుకున్న స్వరాజ్యానికి
రాజకీయం పులిమిన రక్తపు మరకలను
తుడిచి తుడిచి పీలికలైన మువ్వన్నెల జెండాలాంటిదీ ఖాళీ
స్వార్ధమనే మధుమేహ వ్యాధి
కబలిస్తే నిలువెల్ల డొల్లపడిన సంఘంలాంటిదీ ఖాళీ
సమాజంలో ఎటు చుసినా
చెదల పుట్టల చేరుకున్న
ఈ ఖాళీ
అస్తమానం నా నరాలను తొలుస్తుంది
అంతరాత్మను పొరలు పొరలుగ వలుస్తుంది
దీన్ని పేరకడానికి
ఏదొ ఒకటి చెయ్యాలి
ఒక్కడిగా నైనా ఎంతో కొంత చెయ్యాలి
........
వ్యక్తిలో ఖాళీ
నింపడం సులభం
కొద్దిపాటి సాన్నిహిత్యం చాలు
కాని వ్యవస్తలోని
ఖాళీతనాన్ని పూడ్చడం చాలా కష్టం
అందుకు సాహిత్య సమరం అవసరం
సామాన్యుడు చేయలేని సాహసం
సమూహంతో సాధ్యం
బిగిసిన పిడికిలి
బిగపట్టిన కవిత్వం
కట్టలు తెగాలి
*10.7.2012
జ్యోతిర్మయి మల్ల॥తెర॥
తెర లేచింది
సినిమా మొదలయ్యింది
ప్రేమ అనుబంధం
పంచుకోడాలూ పెంచుకోడాలూ
ఆహ్లాదభరితం
కొంతసేపు...
స్నేహం బంధుత్త్వం
కలవడాలూ కనుమరుగవడాలూ
సహజాతిసహజం
మరికొంతసేపు..
అనుభవం అవగతం
పశ్చాత్తాపాలూ ప్రాయశ్చిత్తాలూ
అంతర్మధనం
ఇంకొంత సేపు...
వేదంతం వైరాగ్యం
ఉపదేశాలూ ఉపశమనాలూ
ఆత్మావలోకనం
మిగిలున్నంతసేపు ...
సినిమా అయిపోయింది
తెరపడింది!!
*10.7.2012
పులిపాటి గురుస్వామి॥నడక వెంట పడితే॥
కొన్ని ఆలస్యంగా తెలిసినా సరే
నిక్కచ్చిగా నిను తూకం వేసి
నీ సమర్ధత ఎన్ని మిల్లీమీటర్లకంటే తక్కువో కొలిచి
సజ్జనుల ముందర
నువు దాచుకోబోయిన
శూన్యాన్ని నివేదించక మానవు.
అయితే
ఒక్కడివే ఉన్నప్పుడు
వేసే ప్రశ్నలకి ఉక్కిరి బిక్కిరై
మందిలో ఒకడివై
మరిచిపోయే ప్రయత్నాన్ని లాగి లాగి
కొనసాగించుకొని తృప్తిగా
ఆగిపోతావు .....ఆ రోజుకి
బోరియల్లోకి,అక్కడినుండి చెట్లమీదికి,
ముల్లకంపల్లోకి,పూల తోటలోకి,
మల మూత్రాల వెంట
నిను మోసపుచ్చిన కోరికల మీదుగా
పచ్చని గడ్డి వాగుల వెంట
విశాల మైన మర్రి నీడ మీదికి....
నిన్ను వెతుక్కుంటూ
నీ వేయికాల్లనీ
నీ అదనపు ముఖాల్నీ
నీ అక్కరకు రాని చేతుల్ని
దాటి వచ్చిన శిబిరాల్లో మరిచి వచ్చిన
నటించిన చిత్రాల్ని
ఎంత తిరగేసినా గుర్తుపట్టవు
తేనె మండలం పైకి
భ్రమరాల ఆహ్వానాన్ని
ఆశపడతావు
నీ మాధుర్యమే దోచబడుతుందని
ఎప్పుడు తెలుసుకుంటా..... వో.!
*10.7.2012
మోహన్ రుషి॥తాళం చెవి॥
వందల మాటలు దొర్లుతాయి
ఒక్క సందేహమూ తీరదు
వెయ్యిన్నొక్క ఎపిసోడ్ లోనూ
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది
సుదీర్ఘ మేధోమథనం తర్వాతా
పరిష్కారం ప్రశ్నార్థకమే
రాత్రి రాజీ తెల్లవారితే మాయం
ఏ శస్త్ర చికిత్సతోనూ మానని గాయం
నిన్ను నువ్వు పునర్ నిర్వచించుకుంటే తప్ప
నిన్ను నువ్వు కొత్తగా నిర్మించుకుంటే తప్ప
సమస్య తెగదు
తెగిపడ్డ జీవితం ముక్క
నీ వంక ప్రేమగా చూడదు!
*10.7.2012
కె.కె ॥పరస్పర వైరుద్యం॥
నింగినెగిరే గువ్వల్ని చూస్తే
నేలపైనున్న మనకనిపిస్తుంది
అవి అందానికి ప్రతిబింబాలని
కాని దాని రెక్కల కింద ఉన్న
పచ్చిగాయాలు కానరావు.
నేలలో పాతుకుపోయిన
రాతి శిల్పాలని చూస్తే మనకనిపిస్తుంది
అవి ఆకర్షణకి, ప్రత్యక్ష తార్కాణాలని
కాని వాటి చర్మం చెక్కిన
వేనవేల ఉలిదెబ్బలు కనిపించవు.
సాయంత్రం చల్లగా తాకే
పిల్లగాలిని చూస్తే మనకనిపిస్తుంది
హాయికి మరోపేరు సంద్యాసమీరేనని
కాని కాసేపు విశ్రమించే యోగం లేని
నిరంతర కారాగారవాసులవి.
నిశ్శబ్దాన్ని ధరించిన రాత్రి
ద్వనితరంగం దరిచేరితే శబ్దాన్ని వరిస్తుంది
నిదురపుచ్చే నిశ్శబ్దం చూస్తే మనసు పరవశిస్తుంది
శబ్దం లయబద్దమయితే కర్ణం స్వరవశిస్తుంది
సృష్టి మొత్తంకలిగివుంది పరస్పరవైరుద్యం
ఎన్నో అపసృతులు,మరెన్నో ద్వంద్వ ప్రవృత్తులు ఉన్నాయి
అయినా భూమి తిరుగుతూనే ఉంది
సమదృష్టితో సమన్వయించుకుంటూ...
*10.7.2012
కిరణ్ గాలి ॥ప్రేమ లేఖ! ప్రేమ లేక?॥
ప్రేమ లేఖంటే ప్రణయ శిల్పం
మాటలలో చెప్పలేని దాన్ని
మనసు ఉలితో చెక్కడం
కాని ఎం రాయను?
గుండె కింద గడ్డకట్టిన ఙ్నాపకాన్నా?
పెదవి చివర చిక్కుపడిన తడి పలకరింపునా
రెప్ప మూస్తే గుచ్చుకునె నీ రూపాన్నా
రేయి వీస్తే తగలబడే నా దేహాన్నా
నీ చిరునవ్వుల ధ్వని తరంగాలను
గుప్పిల్లలొ పట్టి గుండెకు హత్తుకున్నక్షణాలు
మారె నీ పెదవుల చుట్టుకొలతలను చూస్తు
గడిపిన అసంఖ్యాక యుగాలు ...
నీ ముని వేళ్ళ కొసలకు
బంధించ బడ్డ సున్నితమైన స్మ్రుతులు
నీ దేహ ధ్యానంలో
జ్వలించి స్కలించిన మధురానుభూతులు
అన్ని ...
కాలంతో పాటు బొట్టు బొట్టుగ రాలి పడుతున్నాయి
మౌనం ఘనిబవించే ద్రుశ్యాన్ని
ఙ్నాపకాలు ఉరితీయబడి
ఉపిరాడక పొవటాన్ని
అనుభందాలు కాలబిళంలో
కలిసిపొవటాన్న్ని కళ్ళరా చూడగలిగాను కాని
అణువణువు నా ఆత్మలో ఇంకిన
నీ తనువు స్పర్శను ఎలా మరిచేది
ఎరుపంటే నీ పెదాల రంగనె
తెలుపంటే నీ చిరునవ్వు తళుకనే
నలుపంటే నీ కాటుక కళ్ళగానే తెలుసు
కాని వలపంటే రంగులు మారుతుందని తెలియదు
శీలమంటే చిరిగిన చర్మపు పొర కాదు
చెదిరిన నమ్మకపు అర
గుండెల్లో వాయు గుండాలు
సుడులు తిరుగుతున్నాయి
రెప్పల మాటు వర్శంలో
హ్రుదయం తడిసెదెప్పుడో
-----
కన్నీటి సాంద్రత
ఒంటరితనమ్ వైశాల్యమ్
ఓటమి విస్తిర్నం తెలియలంటే
ప్రేమలొ "పడా"ల్సిందే
*10.7.2012
కరణం లుగేంద్రపిళ్ళై॥ చిగురులు॥
ఏదో మూగతనం
మాట గొంతులోనే
ఆగిపోతూ..మరణిస్తోంది..
ఏదో అవిటితనం
అడుగు తీసి వేసేంతలోనే
మడుగు మింగేస్తోంది..
తరతరాల తలరాతలు
మార్చాలనుకున్నా
చెరగని దాని ఆనవాళ్ళు
తిరిగి తిరిగి మొలకెత్తుతున్నాయి
ఎదిరించలేనితనం
ఎవరూ చేశారీ గాయం
రక్త స్రావం తప్ప
అత్మార్మణ తప్ప
తిరిగి కొడదామన్న
స్పృహను రానివ్వడం లేదు
మోడుబారిన కొమ్మలపై
పచ్చిని చిగురులు
మరణశయ్యపైనుండి
లేస్తున్న శ్రామికుడి మూల్గులు
ఇకనైనా ఆలోచనకు రెక్కలు వస్తాయేమో?!
*10.7.2012
వాడ్రేవు చినవీరభద్రుడు॥ఒక కాంతికోశం॥
పొద్దున్నే మేమా జలపాతం దారిపట్టాం. ఊరువదిలి
అడివిబాట.వానకు తడిసిన కొండలు.రెండు మలుపులు
తిరిగామో లేదో గుప్పున తాటిపళ్ళసువాసన.ఊపిరితిత్తులు
దొన్నెచేసి నా అదృశ్యబాల్యాన్ని ఆబగా ఆఘ్రాణించాను
'నిన్న చూసామే మబ్బులు, అవి ఇక్కడివే' అన్నారొకరు
నిన్నరాత్రే మేఘమాల నేలకి దిగివచ్చినట్టు కొండవాగు-
జపనీయ సాధుకవిశ్రేష్టుడు సైగ్యొ ఇక్కడికి వచ్చివుంటే
ఈ సెలఏటితో చెలిమి చేసి ఒక కవిత చెప్పివుండేవాడు.
జలపాతం కూడా ఈ మాటే చెప్పింది: చుట్టూ పచ్చదనం
పరుచుకున్నప్పుడు రాళ్ళు కూడా కావ్యగానం చేస్తాయని.
అంతటా ఆవరించిన నిశ్శబ్దం మధ్య ఉరికే నీటి చప్పుడు
నా హృదయధ్వనిని నాకు మరింత స్పష్టంగా వినిపించింది.
లేఎండవేళ పచ్చికదారులమీద పూలుచల్లినట్టు వేనవేల
సీతాకోకచిలుకలు.ఏ చిరుగాలికో ఒక కాంతికోశం
పగిలినట్టుంది.వెలుతురుపోగులు నన్ను కమ్ముకోగానే
అందాకా నా చుట్టూ అట్టకట్టిన ఒక పెంకు చిట్లిపోయింది.
*10.7.2012
నందకిషోర్॥మనవి॥
కుడితే కుట్టావ్ పో!
మళ్ళీ ఎందుకు
ఇక్కడే తిరుగుతావ్?
నొప్పిలేదనో,
బాగున్నాననో
తప్పిరాలేదనో,
బాగున్నావనో
నేనెపుడైనా
అబద్దం చెప్పానా?
ఆలస్యం చేయకుండా పో!
నే రాలిపోవాలి.
పుప్పొడి దారుల్లో
మళ్ళీ కలుద్దాం..
సెలవు.
*10.7.2012
మెర్సీ మార్గరెట్॥మిస్డ్ కాల్॥
ఏంటి గుండె ఉమ్మేసింది
నా వాలిడిటి ఎక్స్పైర్ అయిందా ?
కొన్ని పరిచయాల గాయాలు అలాగే వున్నాయి
కాని ..
మానిపోయే గాయం కన్నా ఏడ్పిస్తూ ఎక్కిరించే
వాతల అంకెలని చూస్తే
మళ్ళీ మళ్ళీఅస్తమించమని
బలవంతంగా నన్ను సముద్రంలోకి
విసిరి కొడుతూ ఆడుకోవద్దని
విన్నవిస్తూ మనసు తివాచి పరిచా
ఇప్పుడు
నా పిలుపు ఏడుస్తుంది
ఎందుకు జీవితకాలం దూరం చేసావని ?
ఏ అరణ్యంలో దాక్కున్నావ్
నా మనసు కుడా చేరలేని ప్రదేశమా?
ఏ ఎడారిలో ఇసుక దిబ్బ వయ్యావ్?
నీ అడుగుల జాడలు తుడిచేసి దాక్కున్నావ్
నా పాదాలు నిను చేరకుండా
కాలం దోసిటిలో పట్టుకున్నా
బొట్టు బొట్టుగాదారులెతుక్కుని
మరీ జారి పోతుంది
ఎం చేయను ?
మిస్డ్ కాల్స్ లా మిగిలిపోయే నన్ను
ఎప్పుడో ఒకప్పుడు నీ చూపు తడుముతుందని
తిరిగి స్పందించేంతలో నిజంగానే నేను
నీ గుండె అర నుంచి
బయట పడేసే సిమ్ కార్డునయిపోతానని
భయం
అందుకే జీవితమే మిస్ అవుతున్నా
నా పిలుపుకి నువ్ స్పందించేంత వరకు
నీ గుండెను తెరిచే అంకెలని వల్లే వేస్తూ
నీ గడప దగ్గరే
తలుపు తెరిచే వరకు తడుతూనే ఉంటా..
*10.7.2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)