గోదావరి ఇదే చిక్కు తన గురించి రాద్దామనుకున్నపుడల్లా.. నేనేమో ఏరికోరి మంచి మంచి శబ్దాలు పోగేసుకుని పెద్ద వీరుడిలా సిద్ధమవుతాను తానేమో ఇలా మౌనంగా ప్రత్యక్షం మోనాలిసాలాగా, శిరిడీ సాయిలాగా నవ్వీ నవ్వనట్లుగా నవ్వుతోందో? లేక మౌన గంభీరం నిశ్చల నిర్వికల్పంగా ఉందో? ఏ సంగతీ ఎంతమాత్రం బయటికి తెలియనివ్వదు తన గురించి రాయాలంటే నిజానికి అర్థం పర్థం లేని అద్దంలాంటి అక్షరాలు కావాలి ఒక వేళ అటువంటి నిశ్శబ్దాక్షరితో వెళ్తే తనేం చేస్తుందో తెలుసా!!! పర్వతాలను ఒరుసుకుంటూ బండరాళ్ల చర్మం మీద మృదంగం వాయిస్తూ రాళ్లలో నిదురోయే పువ్వుల్ని పలకరిస్తూ తాను ఎప్పుడో ఎక్కడో భద్రంగా దాచిన గజ్జెలు తీసి కాళ్లకు కట్టుకుంటుంది నడకో నృత్యమో పరుగో తెలిసేలోగా గలగల పకపకా నవ్వుతూ పిట్టల పాటల్ని వెంట తరుముతూ పిచ్చిదాన్లా ఉరకలేస్తుంది ఇంత తీయగా కవ్వించి మరీ అందీ అందక వేధించే ఆమెతో నేనెలా వేగేది? చప్పుడు లేకుండా పాపికొండల్లో ఈమెగారి సిగపాయల్లో పాకే పడవలోంచి హఠాత్తుగా ఓ పుష్పం గాలిలో వికసించి ఈమెని తాకిన మరుక్షణాన్నే ఓ వృత్తాన్ని వదిలిమాయమవుతుంది. నది బుగ్గమీద సొట్టలా మెరిసిన వృత్తమూ అదృశ్యమవుతుంది ఈ డింపుల్ బేబీ అందాల్ని పట్టుకునే వల ఇంకా పుట్టలేదు శబ్దాలు పనికి రావు...పోనీ మౌనమా అంటే మన అందరి మౌనాన్నీ మింగేసే మహాగంభీర మౌనం తనది పోనీ శబ్దాలా అంటే అన్ని శబ్దాలనూ ముంచేసే మహోధృత గర్జన ఆమెది ఈమె గురించి రాయడానికి ఒక్కటే దారి ఒక్కొక్కటీ పూర్తిగా బట్టలన్నీ విప్పెయ్యాలి ఒక్కొక్కటీ పూర్తిగా శబ్దాలన్నీ విప్పేసి గట్టున పారెయ్యాలి నిశ్శబ్దభారాన్ని నెమ్మదిగా దించి ఇసుక తీరం మీద వదిలెయ్యాలి ఒకే ఒక్క గెంతులో దూకెయ్యాలి ఈతకొట్టే కాళ్లూ చేతులూ కేరింతలూ ఈదే కొద్దీ వాటి చుట్టూ గుత్తులు గుత్తులుగా వికసించి... జలజల రాలే నీటి నవ్వుల పారిజాతాలూ జీవనదిని వర్ణించడానికి కావాల్సిన శబ్దాలూ నిశ్శబ్దాలూ జీవనదిలోనే నా చేతులు చుట్టూనే ఉన్నాయి పట్టుకోమంటూ ఊరిస్తాయి పట్టబోతే ఇంకెంతో అందంగా ఆనందంగా అందీ అందకుండా ఉడికిస్తాయి వసీరా
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dF6dWj
Posted by Katta
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dF6dWj
Posted by Katta