శృతిలయలు కాలం నిద్రపోయిన నీలి సరస్సులో తడిసి పురాతన సుగంధాలు వెదజల్లే నీ కేశాల నీడలు క్రమంగా..నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎప్పుడు కొండ దిగాయో తెలియదు లోయంతా పరుచుకుంటాయి చిరుగాలి తీయదనంలో నిండా మునిగి గడ్డిదుబ్బుల కంకుల మీద కవ్వించుకుని ఉన్మత్తంగా ఎగిరే తూనీగల వెంట పరుగెడుతూ... గడ్డి మైదానాల మీది ముత్యాల పంటని దోసిళ్ల కొద్దీ ఎత్తుకుని చీరచెంగులో పోసుకుని మురిసిపోతూ.. నీ కేశాల నీడలు ఎప్పుడు కొండ దిగాయో తెలియదు లోయంతా పరుచుకుంటాయి చెట్ల తలలల్ని నిమురుతూ గడ్డిపరకల కుదుళ్లని అల్లుకుంటూ.... నీ వ్యోమ కేశాల నీడల్ని తాగి అల్లిబిల్లిగా వట్టివేళ్లు మట్టిలో కమ్మని పరిమళాలతో అల్లుకున్న బుట్టలనిండా చల్లని వడగళ్ల పళ్లు నీ వ్యోమ కేశాల మీంచి మహాశూన్యంలో ఎగురుతూ తేనెల ఆవిరులు నీ కేశాల నీడల వెంటే కొండ దిగుతూ గడ్డిపువ్వుల నుదిటిమీద ముద్దులు కురిపిస్తూ... లోయంతా నీ మేని నీలివర్ణమే అవరించి లోయంతా నీ నీలి మేనివర్ణమే ఆక్రమించి నీ నీలి మేనివర్ణమే లోయ శిరస్సు మీది ఆకాశంలో కరిగిపోయి అనంతమై వ్యాపించి ఉంది. ఈ అనంతమే లోయలతో సహా నన్నూ తనలోకి తీసుకుని జోలపాడి ఓలలాడిస్తుంది ఈ అనంతమే నాలోంచి తొంగిచూస్తూ లోయల నిండా పరివ్యాప్తమవుతూ తూనీగల ఉన్మత్త శృతిలో నిశ్శబ్దంగా ప్రతి ధ్వనిస్తుంది ఈ అనంతమే నీ అర్థ నిమీలిత నీల నేత్రాలలోని ఝుంకారంతో శృతిచేసుకుని లయిస్తుంది. ---వసీరా
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1olkC1J
Posted by Katta
by Vakkalanka Vaseera
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1olkC1J
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి