పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Abd Wahed లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Abd Wahed లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Abd Wahed కవిత

నేను కవిత్వం గురించి రాస్తున్న పంక్తులు కవిత్వ నిర్మాణ రూపాలను అర్ధం చేసుకోడానికి, కవిత్వ నిర్మాణానికి అవసరమైన మరిన్ని టూల్స్ సముపార్జించుకోడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అర్ధం చేసుకోవాలని మనవి. కవిత్వం గురించి లోతుగా తెలిసిన వారు నా పోస్టులకు ప్రతిస్పందించడం నాతో పాటు గ్రూపులో రాస్తున్న అనేకమంది కవులకు అది ఊపయోగకరంగా ఉంటుందన్నది నా ఆలోచన. ఇంతకు ముందు పోస్టులో రాసిన కవితను సెల్ఫ్ ఎడిటింగ్ ద్వరా మరింత పదునుగా మార్చకోవచ్చని అనుకున్నాం. కవిత్వం ఆవేశప్రధానమైనదని తెలుగులో చాలా సార్లు విన్నాను. కవిత్వం బాధ, ఆవేదన ప్రధానమైనదని ఉర్దూలో విన్నాను. క్లుప్తంగా చెప్పాలంటే కవిత్వం మన భావావేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని అర్ధం చేసుకోవచ్చనుకుంటాను. కాబట్టి కవిత మన భావావేశాల వ్యక్తీకరణ. సాధారణంగా రాసిన వెంటనే పోస్టు చేయాలనిపిస్తుంది. కాని ఆ కవితను ఒక రెండు మూడు రోజులు పక్కన పెట్టి, దాని గురించి మరిచిపోయి, ఆ తర్వాత మళ్ళీ ఆ కవితను చదివితే మనం చేసిన కొన్ని పొరబాట్లు మనకు ఖచ్చితంగా కనబడతాయి. పొరబాట్లు వ్యర్ధపదాలకు సంబంధించినవి కావచ్చు. లేదా అనవసరపు ప్రతీకలు, పోలికలు, ప్రాసలకు సంబంధించినవి కావచ్చు. వీటిని తొలగించడం వల్ల కవిత్వంలో చిక్కదనం పెరుగుతుంది. కాని వ్యర్ధ పదాలేవో తేల్చడం ఎలా? ఈ విషయమై సీనియర్ కవులు సూచనలందిస్తే బాగుంటుంది.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1syd7cp

Posted by Katta

Abd Wahed కవిత

ఎం.నారాయణ శర్మ గారు మంచి ప్రశ్నలు లేవదీశారు. ఈ ప్రశ్నలపై చర్చ జరగడం చాలా అవసరం. ఆయన అడిగిన ప్రశ్నలు మళ్ళీ ఇక్కడ పోస్టు చేస్తున్నాను. ’’ కవిత్వ వచనం సాధారణ వచనం వేరుగా వుంటుందా..? సాధారణ వచనాన్నించి కవిత్వ వచనాన్ని వేరుగా ఎలా చూడాలి...కవిత్వం నిర్దిష్ట భావాన్ని చేరవేస్తే కవిత్వం కాదా..?మెరుగైన కవిత్వం అని నిర్ణయించడానికి ఖచ్చితమైన విలువలున్నాయా..?చర్చ కోసమే ఈ ప్రశ్నల్ని ముందుకు తెస్తున్నాను.‘‘ ఇందులో ముఖ్యంగా నన్ను ఆకర్షించిన ప్రశ్న ’’కవిత్వం నిర్దిష్టభావాన్ని చేరవేస్తే కవిత్వం కాదా?‘‘... ఈ ప్రశ్నకు జవాబిచ్చే స్థాయి నాకు లేదు. ఎందుకో ఈ ప్రశ్న చదవగానే ఎప్పుడో చదివిన ఒక చైనీస్ కథ గుర్తుకు వచ్చింది. ఆ కథేమిటంటే.... కొందరు వికలాంగ పిల్లలకు పరుగుపందెం జరుగుతోంది. చిన్నపిల్లలు, నడవలేని కుంటివారు. అందరు ఎలాగో పరుగెత్తుతున్నారు. అందులో ఒక చిన్నపిల్ల పడిపోయింది. కిందపడిన పిల్ల లేవలేకపోయింది. కుంటుతూ పరుగెత్తుతున్న పిల్లల్లో ఒక పిల్లవాడు చూశాడు. వెనక్కి వచ్చి ఆమెను లేవడానికి ప్రయత్నించాడు. శక్తి చాలడం లేదు, పైగా కుంటివాడు. ఇది చూసి మరో ఇద్దరు పిల్లలు వచ్చారు. వారితో పాటు, మిగిలిన పిల్లలందరూ వచ్చారు. అందరూ కలిసి ఆ పాపను లేపారు. అందరూ ఒకరి చేతులొకరు పట్టుకుని పరుగుపందెం ముగిసే లైన్ వరకు వెళ్ళారు. అందరూ గెలిచారు. ఇది కథ. ఎక్కడా పరుగు పందెం ఇలా జరగదు. అది వికలాంగ పిల్లలదైనా సరే, పోటీలో గెలిచేవారు ఒక్కరే ఉంటారు. అందరూ గెలిచేదైతే పోటీయే అవసరం లేదు. కాని ఈ కథలో పరుగుపందెంగా చెప్పింది నిజమైన పరుగుపందెం కాదు, సమాజంలో నిత్యజీవితాన్ని చెప్పారు. వికలాంగ పిల్లలుగా సూచించింది సమాజంలో సభ్యులనే, ప్రతి ఒక్కరికీ ఏవో లోపాలుంటాయి. ఒకరికొకరు సహాయపడడం ద్వారా ఒక మెరుగైన సమాజం ఏర్పరచడమే అందరూ గెలవడం. అంటే ఈ మొత్తం కథ, ఇందులో పాత్రలు, సన్నివేశఆలు భావచిత్రాలని భావిస్తే...ఇది కథా? లేక కవిత్వమా? కవిత్వ నిర్వచన పరిధిలోకి ఇది వస్తుందా?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V2zlEW

Posted by Katta

22, జూన్ 2014, ఆదివారం

Abd Wahed కవిత

కొన్ని రోజుల క్రితం కవియాకూబ్ గారు ఒక పోస్టు చేశారు. అందులో కొంతభాగం : ’’ కవిత్వవిమర్శ కవి ఎదుగుదలకు ఉపయోగపడ్తుంది.!!! ఇప్పటివరకూ 'కవిసంగమం' లో కేవలం ప్రశంసల పద్ధతిలోనే వ్యాఖ్యలు కానీ,సూచనలు కానీ చేస్తూ, ప్రోత్సహించడమే పద్దతిగా సాగాం. : ఒకవిధంగా కవిత్వాన్ని రాసేందుకు ఎంతోమంది ముందుకు వచ్చేట్లుగా కామెంట్స్ లోనూ,ప్రశంస లోను జాగ్రత్తలు తీసుకుంటూ కవిత్వవిమర్శ చేయగలిగినవాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరించారు. : ఇకపై కవులు ఇంకా మెరుగైన కవిత్వం రాయడానికి ,ఆయా కవితల విశ్లేషణలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. '' కొందరు బాగులేదనగానే, అలాంటి విమర్శలకు ఎంత మాత్రం స్పందించరు. లేదా ఆవేశంతో సమాధానాలిస్తుంటారు" అని నవుదూరి మూర్తి గారు భావించినట్లు ఆ రకమైన పద్ధతులు కవులకు అనుసరణీయం కాదు.....‘‘ ఈ పోస్టుకు కామెంటుగా నేను సదాశివ గారి పుస్తకం నుంచి ఒక పేరాగ్రాఫ్ పెట్టాను. అది : ’’ యాకూబ్ భాయ్, మీ నిర్ణయం బాగుంది. మీ పోస్టు చదివిన తర్వాత నేను తెలుగు గజల్ గ్రూపులో పెట్టిన ఒక పోస్టు కొంతభాగం ఇక్కడ పెట్టాలనిపించింది. ఇక్కడి చర్చకు అది ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం డాక్టర్ యస్. సదాశివ మాస్టారు రాసిన ఉర్దూ సాహిత్యం పుస్తకంలో చివరి ముగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ కవిత్వం గురించి కొంత సమాచారమిచ్చారు. అప్పటి కవులు, వారి విశేషాలు తెలియజేశారు. అందులో కొంత భాగం మిత్రుల కోసం ఇక్కడ ఇస్తున్నాను. సదాశివ మాస్టారు పుస్తకం నుంచి ... ’’చివరి ముగల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా సారస్వత ప్రియుడే కాక కవిత చెప్పే సామర్థ్యం కూడా కలవాడు. ఆనాటి మహాకవి షాహ్ నసీర్ చేత యువరాజుగా ఉండగానే తన కవితలు దిద్దించుకుంటూ జఫర్ అన్న కలంపేరుతో రాసేవాడు. షేక్ ముహమ్మద్ ఇబ్రాహీం జోఖ్ చేత తన కవితలు దిద్దించుకోవడం మొదలుపెట్టాడు. జోఖ్ మరణించిన తర్వాత బహదూర్ షా జఫర్ తన గజళ్ళను మీర్జా గాలిబ్ చేత దిద్దించుకున్నాడు. ’దిద్దించుకోవడం‘ అనే మాట తెలుగు వాళ్ళకు వింతగా వినిపించవచ్చు. హిందూస్తానీ సంగీతంలో (కర్నాటక సంగీతంలో కూడా) గురు శిష్య పరంపర ఉన్నట్టే ఉర్దూ కవనంలోను గురు శిష్య పరంపర ఉన్నది. గురువులేని విద్య కూసువిద్య. ఎవరో ఒక ఉస్తాదుకు (గురువుకు) తన కవితను చూపించి దిద్దించుకోనిదే ఆ కవితను ముషాయిరాల్లో వినిపించడం కాని, పత్రికలకు పంపించడం కాని ఉర్దూ కవుల సంప్రదాయం కాదు. డా. ఇక్బాల్ వంటి మహాకవి కూడా తన కవితను దాగ్ చేత దిద్దించుకునేవాడు. ..... ఉస్తాదుల చేత దిద్దించుకోవడం ఉర్దూలో గర్వకారణం. ఈ సంప్రదాయం ఉర్దూలో ఉన్నట్లుగా ఇతర భాషల్లో ఉన్నట్లు కనిపించదు. తెలుగులో నయితే మార్పులు సూచించే వాళ్ళను రంధ్రాన్వేషులని నిందిస్తారు. ఎవరేది రాసి వినిపించినా చాలా బాగున్నదనగలవాడే సత్పురుషుడు. సాహిత్య మర్మజ్ఙుడు.‘‘ ఇవి సదాశివ మాస్టారు రాసిన పంక్తులు. మనం గమనించవలసిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయనుకుంటున్నాను...‘‘ ఇవి రెండు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, కవిత్వం, కవిత్వ విమర్శల గురించి మనం హృదయపూర్వకంగా ఆలోచించవలసి ఉంది. హృదయపూర్వకంగా అని ఎందుకంటున్నానంటే, కవిత్వం రాసేది పెన్నుతో కాదు హృదయంతోనే కాబట్టి. సాధారణంగా ఒక కవిత రాసిన తర్వాత వెంటనే దాన్ని పదిమంది చూడాలని, దాన్ని ప్రశంసించాలని, ఆ కవితపై మాట్లాడాలని ప్రతి కవి భావిస్తాడు. అది సహజం. అందువల్ల వెంటనే పోస్టు చేయడం జరుగుతుంది. కాని రాసిన కవితను కాస్త పరిశీలించి, స్వయంగానే ఎడిట్ చేసుకుంటే, అది మరింత పదునునెక్కుతుంది. పదును అన్న పదం కావాలనే వాడాను. ఎందుకు వాడానంటే... దీనికి కాస్త వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చేంత పాండిత్యం నాకు లేదనుకోండి. వినేవారుంటే చెప్పేవాడికి లోకువన్న సామెత తెలుసు కదా.. అలాగే అనుకోండి.. కాని కాస్త వినండి. నాకున్న కొద్దిపాటి పరిజ్ఙానం పంచుకోవాలనిపించింది. మైకులా కవిసంగమం చేతికి దొరికింది, కాబట్టి చెబుతున్నాను... కవిత మరింత పదునెక్కడమంటే ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకునే ముందు మరో రెండు మాటలు భాష గురించి చెప్పాలి. మనం మన మనసులో ఉన్న మాటలను ఇతరులకు చెబుతాం. చెప్పాలనుకున్న విషయానికి అవసరమైన పదాలు వాడుతాం. అంటే మనం వాడే పదాలు నిజానికి మనం అనుకున్న భావానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆ పదాలు స్వయంగా భావాలు కాదు. ఉదాహరణకు ’’గులాబీ కొన్నాను‘‘ అన్న పదాలు చూడండి. ఇందులో గులాబీ అన్న పదం, గులాబీ అనబడే పువ్వుకు బదులుగా మనం వాడాము. అలాగే ’’కొన్నాను‘‘ అన్న పదం ’’కొనడం‘‘ అన్న పని జరిగిందని సూచించడానికి బదులుగా వాడాము. అంటే పదాలన్నీ నిజానికి representative. కొందరు తాము చెప్పదలచుకున్న విషయానికి తగిన పదాలను ఎన్నుకుంటారు. చక్కగా చెబుతారు. అలాంటి వారిని articulative అంటాం. అలాగే రాసే భాషలో పదాలకు సంబంధించిన ఈ ప్రాతినిధ్య స్వభావం మరింత ఎక్కువగా ఉంటుంది. మాటల్లో అయితే చెప్పే మనిషి హావభావాలు ఉంటాయి. రాతలో హావభావాలుండవు కాబట్టి, పదాలే తమ పని చేసుకోవాలి. అందువల్లనే పదాల ఈ స్వభావాన్ని, అంటే ఇవి కేవలం ప్రతినిధులే కాబట్టి, అనుకున్న భావానికి తగిన ప్రతినిధులను, అంటే పదాలను ఎన్నుకోగలిగిన వారు చక్కగా రాస్తారు. ఇదే సూత్రం కవిత్వానికి కూడా వర్తిస్తుంది. కవిత్వంలో చెప్పదలచుకుంది, ఎలా చెప్పదలిచామో అలా చెప్పామా లేదా అన్నది మనం తెలుసుకోవాలంటే మనం వాడిన పదాలు మన భావానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయా లేదా అన్నది మనం సరిచూసుకోవాలి. అందువల్లనే సెల్ఫ్ ఎడిటింగ్ అనేది అవసరమవుతుంది. నేను రాసిన కవితను నేనే ఎడిట్ చేసుకోవాలంటే, నాకు వచనానికి కవితకు మధ్య తేడా తెలియాలి. నాకున్న పరిమిత పరిజ్ఙానంతో ఈ రెండింటికి మధ్య తేడాను ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకున్నాను. ఇందులో లోపాలు ఉండవచ్చు. పెద్దలు వాటిని సూచిస్తే సరిదిద్దుకుంటాను. ఆ ఉదాహరణ ఏమంటే... చీకటిలో మన చేతిలో ఒక టార్చిలైటు ఉందనుకోండి. టార్చి లైటు ఆన్ చేస్తే వెలుతురు ఒక బీమ్ లాగా కొంత ప్రాంతంపై పడుతుంది. అక్కడ ఉన్న వస్తువులు మనతో ఉన్న వారికి కనబడతాయి. ఆ కొద్దిపాటి ప్రాంతం తప్ప మిగిలినదంతా చీకటే ఉంటుంది. వచనం ఇలాంటిదే. మనం కొంత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలనుకున్నప్పుడు ఆ సమాచారంపై వెలుగు పడేలా పదాలను వాడుకుని వారికి చెబుతాం, లేదా రాతపూర్వకంగా ఇస్తాం. దాంతో నిర్దిష్టంగా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది వారికి అర్ధమవుతుంది. అదే చీకటిలో ఒక దీపం వెలిగించామనుకోండి. ఆ దీపం చుట్టు కొంత మేరకు ఉన్న వస్తువులన్నీ మనకు కనబడతాయి. దీపం ఎంత తేజోవంతంగా ఉంటే అంత ఎక్కువ పరిధి వరకు అందరూ చూస్తారు. ఇందులో కొందరు కొన్ని వస్తువులను చూడవచ్చు. కొందరు వేరుగా మరి కొన్ని వస్తువులను చూడవచ్చు. కొందరు చెట్లు చూడవచ్చు, కొందరు వాటిపై ఉన్న పూలను, మొగ్గలను కూడా చూడవచ్చు. ఇది దృష్టిపై ఆధారపడి ఉంటుంది. కవిత్వం ఇలాంటిదే. ఇది టార్చిలైటులా కేవలం నిర్దిష్ట ప్రదేశాన్ని మాత్రమే చూపించదు. ఒక విస్తృత పరిధిని చూపిస్తుంది. ఆ పరిధిలో చూపులకున్న శక్తి మేరకు చూసే అవకాశం ఉంటుంది. కవిత్వం భావ విస్తృతి కలిగి ఉంటుంది.. అన్ని కోణాల నుంచి వస్తువుపై వెలుగును ప్రసరిస్తుంది. అన్ని కోణాల నుంచి దర్శించే అవకాశాన్నిస్తుంది. దీపం చిన్నదే ఉంటుంది. కాని వెలుగు చుట్టూ ప్రసరిస్తుంది. అలాగే కవిత చిన్నదే కావచ్చు, కాని ఒక గ్రంథాన్ని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. ఈ ఉదాహరణ నాకు వచనానికి, కవిత్వానికి మధ్య కొంతవరకు తేడా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడింది. కాబట్టి నేను రాసే పంక్తలు కవిత్వం అనబడతాయా లేదా అన్నది తేల్చుకోవాలంటే, నేను రాసిన పంక్తులు నేననుకున్న భావాలను పూర్తిగా పాఠకులకు చేరవేస్తున్నాయా? నేను అనుకోని, నా ఊహకు కూడా తట్టని భావాలు కూడా ఆ పంక్తుల్లో ఉన్నాయా? అన్నది నేను చూసుకోవడం నా కవిత పదునెక్కడానికి అవసరం. ఇంతకీ పదునెక్కడమంటే ఏమిటో చెప్పలేదు కదా... అసలు నేను రాసిన ఈ పంక్తులు మీకు నచ్చితే అప్పడు మరో పోస్టులో ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సెలవు.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lXrMo8

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Abd Wahed కవిత

మొన్న కవిసంగమం సమావేశంలో పాల్గొనడం ఒక మధురమైన అనుభూతి. కవిమిత్రులను కలుసుకోవడం, ఉర్దూ కవిత్వ నజరానా గురించి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, మరింత మెరుగ్గా ఉర్దూ కవిత్వ నజరానాను తీర్చిదిద్దడానికి నాకెంతో తోడ్పడే విషయం. ముఖ్యంగా గాలిబ్ సిరీస్ పై చాలా మంది ఆసక్తిగా ప్రశ్నించారు. గాలిబ్ కవిత్వం పట్ల ఉన్న ఆసక్తి చూసిన తర్వాత శుక్రవారం ఎప్పుడు వస్తుందా, మరో పోస్టులో మరిన్ని గాలిబ్ కవితలను పరిచయం చేసే అవకాశం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురుచూడ్డం నా పనయ్యింది. చివరకు శుక్రవారం రానే వచ్చింది. ఇక గాలిబ్ కవితలు ఆస్వాదిద్దాం... ఈ రోజు గాలిబ్ కవితా సంకలనంలోని 20వ గజల్ మొదటి షేర్. ఇది మత్లా కాబట్టి రెండు పంక్తుల్లోను రదీఫ్ నియమం కనబడుతుంది. దోస్త్ గమ్ ఖోరీ మేం మేరీ, సయీ ఫర్మావేంగే క్యా జఖమ్ కే భర్నే తలక్, నాఖున్ నా బఢ్ జావేంగే క్యా నా బాధలకు మిత్రుల సానుభూతి ఎలా పనికొస్తుంది? గాయం మానేలోగా, గోళ్ళు పెరగకుండా ఉంటాయా? ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. గమ్ ఖోరీ అంటే సానుభూతి చూపడం, బాధలో ఉన్నప్పుడు బాధ తగ్గించడానికి ప్రయత్నించడం. సయీ అంటే ప్రయత్నాలు. ఫర్మావేంగే అనేది పాత ఉర్దూ, ఫర్మాయేంగే ఇప్పటి రూపం. ఈ వాక్యంలో సయీ ఫర్మాయేంగే అంటే ప్రయత్నాలు చేస్తారా అని. జఖ్మ్ అంటే గాయాలు. భర్నా అంటే మానడం. నాఖున్ అంటే గోళ్ళు. భడ్ జానా అంటే పెరగడం. ఈ కవితకు భావం చూద్దాం. ప్రేమలో గాలిబ్ అనేక గాయాల పాలయ్యాడు. మిత్రులు, హితులు, శ్రేయోభిలాషులు సానుభూతి చూపి బాధ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. కాని స్వయంగా గాలిబ్ తన గాయాలను మాననీయడం లేదు. తన గోళ్ళతోనే పచ్చిగా చేస్తున్నాడు. మిత్రులు ఆయన గోళ్ళు కత్తిరించడం ద్వారా ఆ గాయాలు తగ్గేలా చూద్దామనుకున్నారు. కాని గోళ్ళు మళ్ళీ పెరుగుతాయి కదా అప్పుడేం చేయగలరు? ఇక్కడ గోళ్ళను గాలిబ్ ప్రతీకగా వాడుకున్నాడు. ప్రేమ విఫలమైన నిజమైన ప్రేమికుడు ఆ ప్రేమను ఎన్నటికీ మరువలేడు. ఎంతకాలమైనా ఆ విషాదాన్ని సజీవంగా ఉంచుకుంటాడు. మిత్రలు అందులోంచి బయటకు లాగాలని ఎంత ప్రయత్నించినా అతను స్వయంగా అందులోంచి బయటకు రావాలని భావించడు కాబట్టి ఆ ప్రయత్నాల వల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు. ఈ కవితలో కొందరు సూఫీతత్వాన్ని వివరిస్తారు. మనిషిని చెడు మార్గంపై నడిపించడానికి సైతాను మనిషికి మిత్రుడి రూపంలో వస్తుంటాడు. దేవుడిని ప్రేమించే మనిషి కష్టనష్టాలను ఎదుర్కుంటున్నప్పటికీ దైవప్రేమలో స్థిరంగా ఉంటాడు. ఆ కష్టాలను నవ్వుతూ భరిస్తాడు. మిత్రుడి రూపంలో వచ్చిన సైతాను ఎలాంటి సానుభూతితో దారి మళ్ళించాలని ప్రయత్నించినా, దేవుడిని మరిచిపోతే బాగుపడతావని, భవిష్యత్తు బాగుంటుందని ఎంత నమ్మబలికినా దైవప్రేమ గుండెల్లో నింపుకున్న మనిషిపై ఆ మాటల ప్రభావం ఉండదు. రెండవ కవిత గాలిబ్ సంకలనంలోని 20వ గజల్ 2వ కవిత. బే నియాజీ హద్ సే గుజరీ, బందా పర్వర్, కబ్ తక్ హమ్ కహేంగే హాల్ దిల్, ఔర్ ఆప్ ఫర్మావేంగే ’’క్యా‘‘ మీ ఉదాసీనత పరాకాష్ఠకు చేరింది, మహరాణీ, ఎంతకాలం? నేను మొరపెట్టుకుంటున్నాను మీరు ’’ఏమిటీ‘‘ అంటున్నారు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. బేనియాజీ అంటే ఉదాసీనత, నిర్లక్ష్యం, అలక్ష్యం వగైరా అర్ధాలున్నాయి. హద్ అంటే హద్దు. హద్ సే గుజరీ అంటే హద్దులు దాటింది. బందా పర్వర్ అంటే సేవకులను కాపాడే వ్యక్తి. నిజానికి దేవుడిని బందా పర్వర్ అంటారు. దాసులను కాపాడేవాడు, పోషించేవాడు ఆయనే కాబట్టి. కబ్ తక్ అంటే ఎప్పటి వరకు అని అర్ధం. హాలె దిల్ అంటే మనసు పరిస్థితి, అంటే బాధలు. క్యా అంటే ఏమిటి అని అర్ధం. చెప్పిన ప్రతిసారి ఏమిటి అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం. ఈ కవిత భావం చూద్దాం. గాలిబ్ ప్రేయసిని ఉద్దేశించి ఈ మాటలంటున్నాడు. నిజానికి తన బాధ చెప్పుకుంటున్నాడు. బందా పర్వర్ అని కూడా సంబోధించాడు. అంటే తనలాంటి దాసుడిని కాపాడే మహారాణి లాంటిది. ఆమె ముందు మొరపెట్టుకుంటున్నాడు. కాని ఆవిడ ధ్యాస మరెక్కడో ఉంది. సింగారించుకోవడంలోనో, మరింత అందంగా తయారై గాలిబ్ వంటి ప్రేమికులను మరింత పిచ్చివాళ్ళను చేయడంలోనో ఆమె ధ్యాస ఉంది. అందువల్ల ఆమె గాలిబ్ మాటలు వినడం లేదు. ఆయన తన బాధనంతా వెళ్ళగక్కిన తర్వాత ఆమె ఏం చెప్పావో మరోసారి చెప్పు అంటోంది. ఈ నిర్లక్ష్యం, ఉపేక్ష చూసి గాలిబ్ ఇక భరించలేకపోయాడు. ఇక నిర్మొహమాటంగా చెప్పేశాడు, మహారాణీ, ఈ నిర్లక్ష్యం ఇక భరించలేను. తలకు మించి పోయింది. ఇది ఇలా నిరంతరంగా ఎంతసేపు ఇలా కొనసాగాలి. నేను నా బాధలు చెప్పుకోవడం, మీరు మళ్ళీ మళ్ళీ ఏం చెప్పావని అడగడం. ఇది చాలా ప్రచారం పొందిన కవిత. చాల సందర్భాల్లో కోట్ చేయడానికి అనువైన కవిత. ఇక్కడ ప్రేయసి అన్న పదాన్ని కవితలో గాలిబ్ ఉపయోగించలేదు. అందువల్ల ఎవరిని ఉద్దేశించి అయినా ఉపయోగించడానికి వీలుంది. అయితే ముఖ్యంగా ప్రేమికుల మధ్య చిరు కలహాల్లో కూడా కోట్ చేయడానికి అనువైన కవిత తర్వాతి కవిత గాలిబ్ సంకలనంలోని 20వ గజల్ 3వ షేర్ హజ్రతె నాసిహ్ గర్ ఆవేం, దీదా దిల్ ఫరషే రాహ్ కోయీ ముఝ్ కో ఏ తో సమఝాదో, కె సమఝావేంగే క్యా ప్రబోధకుడు వస్తుంటే స్వాగతం, మా గుండెను తివాచీగా పరిచేస్తాం కాని, ఆయన చెప్పేదేమిటో, ఎవరైనా నాకు వివరిస్తారా కాస్త ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. నాసిహ్ అంటే ప్రబోధకుడు, హజ్రత్ అనేది గౌరవవాచకం. దీదా అంటే కళ్ళు, దిల్ అంటే హృదయం. ఫరషె రాహ్ అంటే బాటగా పరచడం. సమఝానా అంటే వివరించడం, చెప్పడం. ఈ కవితకు భావం చూద్దాం. గాలిబ్ ప్రేమలో పిచ్చివాడిగా మారిపోయాడని ఒక ప్రబోధకుడికి తెలిసింది. ప్రేమలో పడి దేవుడిని కూడా మరిచిపోయాడని తెలిసింది. గాలిబ్ కు హితబోధ చేయడానికి వెళ్లాలనుకున్నాడు. ఆ విషయాన్ని గాలిబ్ మిత్రులకు చెప్పాడు. ఆ విషయాన్నిమిత్రులు గాలిబ్ కు చెప్పారు. ఆయన వస్తుంటే చాలా సంతోషం. ఆయనకు స్వాగతం. ఆయన కోసం కళ్ళను, హృదయాన్ని తివాచీగా పరిచేస్తాను. చాలా గౌరవంగా ఆయన్ను పిలుస్తాను. కాని, అసలు ఆయన వచ్చి నాకు ఏ విషయం గురించి మాట్లాడుతాడో ఎవరైనా చెబుతారా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే అర్ధం. గాలిబ్ తనలో ఉన్న ప్రేమ ఒక అగ్నిగా భావిస్తున్నాడు. హితబోధల నీళ్ళు చల్లినంత మాత్రాన దాన్ని చల్లార్చడం సాధ్యం కాదు. కాబట్టి ప్రబోధకుడు వచ్చి హితబోధ చేసినా ప్రయోజనం ఏమీ లేదని ముందే తేల్చేశాడు. ఇది ఈ వారం గాలిబానా. వచ్చే శుక్రవారం మరిన్ని గాలిబ్ కవితలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UiH94M

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Abd Wahed కవిత

మీర్ తకీ మీర్ రాసిన ’’అష్క్ ఆంఖోం మేం కబ్ నహీ అతా... లహూ అతా హై జబ్ నహీ అతా‘‘ గజల్ ను ఆధారంగా చేసుకుని రాసింది. ఇది అనువాదమూ కాదు, అనుసృజనా కాదు. కన్నీళ్ళకు కంటిలోన కరువన్నది లేనె లేదు వాటిలోన మననెత్తుటి జాడన్నది లేనెలేదు తెలివి నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు ఏనాడూ అందుకనే గుండెగదిలొ వెలుగన్నది లేనెలేదు మనసుతోటి జ్ఙాపకాల ముచ్చట్లే బాగు బాగు వాస్తవాల ఎండల్లో నీడన్నది లేనెలేదు హృదయానికి ఆశలన్ని వీడ్కోలును చెప్పాయా కనుపాపల ఎడారిలో తేమన్నది లేనె లేదు ప్రేమంటే ధైర్యానికి మారుపేరు తెలుసుగాని ఒక్కసారి నోరిప్పే తెగువన్నది లేనెలేదు చూపుల్లో నాటుకున్న పలుకులెన్ని ఉన్నాయో పెదాలపై ఒక్కమాట మొలకన్నది లేనెలేదు దూరాలను దియా మనం గౌరవంగ చూడాలీ సభ్యతయే లేకుంటే ప్రేమన్నది లేనె లేదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdtsyS

Posted by Katta

Abd Wahed కవిత

మీర్ తకీ మీర్ రాసిన ’’అష్క్ ఆంఖోం మేం కబ్ నహీ అతా... లహూ అతా హై జబ్ నహీ అతా‘‘ గజల్ ను ఆధారంగా చేసుకుని రాసింది. ఇది అనువాదమూ కాదు, అనుసృజనా కాదు. కన్నీళ్ళకు కంటిలోన కరువన్నది లేనె లేదు వాటిలోన మననెత్తుటి జాడన్నది లేనెలేదు తెలివి నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు ఏనాడూ అందుకనే గుండెగదిలొ వెలుగన్నది లేనెలేదు మనసుతోటి జ్ఙాపకాల ముచ్చట్లే బాగు బాగు వాస్తవాల ఎండల్లో నీడన్నది లేనెలేదు హృదయానికి ఆశలన్ని వీడ్కోలును చెప్పాయా కనుపాపల ఎడారిలో తేమన్నది లేనె లేదు ప్రేమంటే ధైర్యానికి మారుపేరు తెలుసుగాని ఒక్కసారి నోరిప్పే తెగువన్నది లేనెలేదు చూపుల్లో నాటుకున్న పలుకులెన్ని ఉన్నాయో పెదాలపై ఒక్కమాట మొలకన్నది లేనెలేదు దూరాలను దియా మనం గౌరవంగ చూడాలీ సభ్యతయే లేకుంటే ప్రేమన్నది లేనె లేదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qdtsiq

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Abd Wahed కవిత

(నాకు జ్వరమొచ్చిన ప్రతిసారీ ఈ పంక్తుల కషాయం అందరితో చదివించాలని డిసైడ్ అయిపోయా) హమ్మయ్య.. జ్వరమొచ్చింది... నరనరాన పొగలు కక్కుతున్న అగరుధూపం మంచుగడ్డలా వణుకుతున్న కణకణం కంబళి చలిమంటలో వలపులాగా అల్లుకుంది జ్వరం... కంటితెరపై ప్రతిరోజు వాలే రంగురంగుల దృశ్యాలు అమృతాంజనం కాల్పులకు కన్నీటిబొట్లుగా రాలిపోయాయి రహదారిని ఈదే కాళ్లు కట్టెముక్కల్లా, పడకేసిన నదిలో కొట్టుకుపోయాయి... గాలిపటం ఎగిరేది స్వంతరెక్కలతో కాదని తేలిపోయింది... చిరుగాలికి వణుకుతున్న పచ్చగడ్డి రేకులా ఆత్మీయత దోసిళ్ళలో పట్టుబడ్డ మిణుగురులా ఈ జైలు కూడా బాగుంది... గుంజకు కట్టిన తాడు ఎంత పొడుగున్నా ... కట్టుతాడే స్వేచ్ఛ ... కనిపించని కట్టుతాడు...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SQ9Apj

Posted by Katta

Abd Wahed కవిత

ముళ్ళు (ఎన్నికల సందర్భంగా వినిపించిన విద్వేష ప్రసంగాలు ప్రేరణగా...) అన్నీ ముళ్ళే నమ్మకాలు, విశ్వాసాల ముళ్ళు గులాబీలపై కూడా ముళ్ళు పూస్తున్నాయి ప్రతి గుండెలో దిగబడుతున్నాయి... ప్రేమమొలకలు నేల ఒడిలోనే ప్రాణాలొదిలేస్తున్నాయి చురకత్తుల చినుకులు కురుస్తుంటే పండేది ముళ్ళపంటే... ఒకటి రెండు పాటల సెలయేర్లన్నా ప్రవహిస్తే బాగుండును ఊళ్ళో కాస్త మనిషి గాలి వీస్తే బాగుండును.. పూలతోట పెంచేదెవ్వరిప్పుడు? సువాసనలను పంచేదెవరు? ప్రతిచెట్టుపై నెత్తుటి ఆకులే కన్నీటి పూలెక్కడ? ఊరిలో అక్షరాలన్నీ చచ్చిపోతున్నాయి ప్రతి వీధిలో వాటి కళేబరాలే కనబడుతున్నాయి కత్తులపై చిరుగాలి తెగి వేలాడుతుంది... నల్లగాలికి ఉరికంబం ఊగుతుంది.. పాట వధ్యశిలపై ఊపిరి వదులుతుంది.. కరువొచ్చిపడింది. నోరెత్తే గొంతులకు కరువు... లేచే చేతులు చొక్కాజేబుల నుంచి మొలకెత్తడం లేదు చలనం లేని ప్రతిమలే అన్నీ ఇప్పుడు రాతిదెబ్బలు పడినా కదలవు మెదలవు... అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ముల్లు భయపడుతుందా?

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1sjbpf3

Posted by Katta

15, జూన్ 2014, ఆదివారం

Abd Wahed కవిత

వృద్ధాప్యదినోత్సవం సందర్భంగా రాసిన నా కవిత ఫాదర్స్ డే రోజున కూడా పోస్టు చేయాలనిపించింది. మలిసంధ్య నెత్తురంతా చెమటై వెలుగునిచ్చింది దీపం మిణుకు మిణుకు మంటోంది నరాల పొడుగునా నడిచి నడిచి, నడిచి నడిచి ... కాయం గాయమై కరిగింది అడుగడుగున లెక్కలు, వడి వడిగా చిక్కులు కనుకొలకుల్లో మొలకేసిన మొక్కలను కన్నీళ్ళతో సాకి సాకి, సాకి సాకి... కనురెప్పల దుప్పటిలో పరచుకున్న ఆశలు ఊపిరిని మూటగట్టి పంటి కింద దాచిపెట్టి నడిచి,నడిచి ... నడిచి, నడిచి... చివరకు ఆవిరిగా మిగిలానని తెలియరాలేదు స్వంత నీడలు చెప్పేవరకు... దారిలో కూలబడ్డానికి ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే ఎంత బాగుండు గుండె తునకలను సానబెట్టాలని చూస్తే ఆ మెరుపులే కళ్ళను పొడుస్తాయని చీకటి పడ్డాకే తెలిసింది నెర్రెలు పడిన బీడు చర్మం చుక్క నీటి కోసం దిక్కులు చూస్తోంది (వృద్ధులైన మీ తల్లిదండ్రుల ముందు విసుగ్గా – ఊఫ్ – అని కూడా అనవద్దు : ఖురాన్)

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1loDRlW

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

Abd Wahed కవిత

నడుస్తున్న చీకటిలో కాస్త తోడు వస్తావా చిరునవ్వుల దీపంతో కాస్త తోడు వస్తావా పగటివేళ నీడ తోడు నావెంటే ఉంటున్నది ఒక్క రాత్రి నా కలలో కాస్త తోడు వస్తావా మత్తెక్కిన మద్యంలా తూలుతున్న బాటపైన జారుతున్న అడుగుల్లో కాస్త తోడు వస్తావా ఒక్క క్షణం మనిషిలాగ బతుకుదాం ఇకనైనా ప్రతిరోజు మరణంలో కాస్త తోడు వస్తావా మరణించిన ఎడారిలో ప్రాణమేదొ మెరుస్తుంది ఎండమావి జీవితంలొ కాస్త తోడు వస్తావా ప్రయాణమే గమ్యమైతె దియా బాట వెదకాలా తరగని ఈ మార్గంలో కాస్త తోడు వస్తావా

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lb0gZF

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Abd Wahed కవిత

శుక్రవారం కాస్త ఆలస్యంగా రాకూడదు. మరీ కొంపలంటుకున్నట్లు ఇలా పరుగెత్తుకు రావాలా? కవిసంగమంలో గాలిబ్ గురించి ఈ సారి ఏం రాయాలన్నది తేల్చుకోకముందే వచ్చేసింది. ఇక తప్పదు కాబట్టి గత వారం మొదలుపెట్టిన గజల్ లోని మిగిలిన షేర్లు ఇప్పుడు చూద్దాం.. గతవారం గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ షేర్లు కొన్ని చూశాం. ఈ వారం ఇదే గజల్ లోని ప్రారంభ షేర్లు చూద్దాం. నేను గజల్ షేర్లను గాలిబ్ ఇచ్చిన క్రమంలో కాకుండా నాకు వివరణ రాయడానికి అనువుగా ఉండే క్రమంలో రాస్తున్నాను. గజల్ లో షేర్లను ఇలా క్రమం మార్చడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రతి షేర్ దేనికదే స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు గాలిబ్ సంకలనం 18వ గజల్ మత్లా చూద్దాం. మత్లా అంటే మొదటి షేర్, రెండు పాదాల్లోను రదీఫ్, ఖాఫియాలుంటాయి. షబ్, ఖుమారె షౌఖే సాకీ రస్తఖీజ్ అందాజ్ థా తా ముహీతె బాదా సూరతె ఖాన యే ఖమియాజా థా రాత్రి నిషా కొరకు నిరీక్షణ ప్రళయంలా గడిచింది మద్యపాత్ర అంచు ఒళ్ళువిరుచుకుంటున్న పానశాలయ్యింది తెలుగు అనువాదం అసలు కవితకు ఆమడదూరంలో ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. వివరణ ఇచ్చే ముందు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. షబ్ అంటే రాత్రి. ఖుమార్ అంటే మత్తు లేదా హాంగోవర్. సాకీ అంటే మద్యం పోసే వ్యక్తి. షౌకె సాకీ అంటే సాకీ కోసం నిరీక్షణ. సాకీ మద్యం పోయకుండా ఎవరికి వారు పాత్రల్లో మద్యం పోసుకోవడం మర్యాద కాదు. అలా ఎవరూ మద్యం తమ పాత్రల్లో పోసుకోవడం జరగదు. కాబట్టి సాకీ రాకపోతే నిరీక్షణ తప్పదు. రస్తఖీజ్ అంటే ప్రళయం. అందాజ్ అంటే పోలిక, అలా ఉందని చెప్పడం. రస్తఖీజ్ అందాజ్ అంటే ప్రళయాన్ని పోలి ఉండడం. ముహీత్ అంటే పరిధి. మద్యపాత్రలో మద్యం నింపే గరిష్ట పరిధి సూచించే గీత అనవచ్చు. బాదా అంటే మద్యం. ముహీతె బాదా అంటే మద్యపాత్రపై మద్యం నింపడానికి సూచనగా ఉన్న గీత. సూరత్ అంటే పోలిక, అలా ఉందని చెప్పడం. ఖానా అంటే గృహం. ఖమియాజా అంటే ఒళ్ళువిరుచుకోవడం. బద్దకంగా మసలడం. ఇప్పుడు ఈ కవిత భావం చూద్దాం. మద్యశాలలో మద్యప్రియులు గత రాత్రి సాకీ కోసం ఎదురుచూస్తున్నారు. సాకీ వచ్చి మద్యం పాత్రల్లో నింపాలి. వారిలో హాంగోవర్ పోవాలంటే కొత్తమద్యం కావాలి. కాని సాకీ రావడం ఆలస్యమవుతోంది. సాకీ కోసం తీవ్రమైన నిరీక్షణ ప్రళయాన్ని గుర్తుకు తెస్తోంది. సాకీ రాకపోవడం వల్ల ఎంతగా నిరుత్సాహం, నిస్తేజం అలుముకున్నాయంటే బద్దకంగా మద్యశాలలోని మద్యం కూడా ఒళ్ళు విరుచుకుంటుంది. మద్యపాత్రలో మద్యం నింపే గరిష్ఠ పరిధిని సూచించే గీతలను దాటుకుంటూ ఒళ్ళు విరుచుకుంటుంది. మొత్తం మద్యశాల బద్దకంగా ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంటున్నట్లే ఉంది. ఈ మద్యశాలల నియమం కాస్త గమనించాలి. ఇక్కడ సాకీ వచ్చి మద్యం పోయకపోతే ఎవరు తాగడానికి వీలు లేదు. అలా ఎవరికి వారు మద్యం పోసుకుని తాగడం మర్యాద కాదు. సాకీ రాకపోతే వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. మద్యశాలలో మద్యం సీసాల్లోను, డ్రమ్ముల్లోను కావలసినంత ఉన్నప్పటికీ తాగడానికి లేదు. ఇంతకు ముందు తాగిన మద్యం మత్తు (హాంగోవర్, ఖుమార్) దిగని వారికి కొత్త మద్యం తాగడమే విరుగుడు. కాని సాకీ రాకపోతే వారు మద్యపాత్రను ముట్టుకోలేరు. ఇదేదో మద్యప్రియుల వ్యవహారంలా కనబడుతుంది. కాని నిజానికి ఈ కవితలో కొన్ని లోతయిన భావాలున్నాయి. మన చుట్టు మనల్ని ఆకట్టుకునే, ఆకర్షించే, చేతికి దొరికితే బాగుండుననిపించే అనేక విషయాలుండవచ్చు. కాని మద్యశాలలో సాకీ మద్యం పోయకుండా తాగడం ఎలా సాధ్యం కాదో, అదేవిధంగా లోకంలో దేవుడు కరుణించి ఇవ్వకుండా ఏదీ మనకు లభించదు. అన్నీ అందుబాటులో ఉన్నట్లే కనబడతాయి, కాని చేతికి దక్కవు. మద్యశాలలో సాకీ వచ్చేవరకు నిరీక్షించడం ఎలా తప్పదో, అదేవిధంగా దేవుడు కరుణించేవరకు నిరీక్షించడం కూడా తప్పదు. ఈ లోగా ఈ నిరీక్షణ మనకు కష్టం కావచ్చు. బోరుగా మారవచ్చు. పై కవితలో మద్యశాల బద్దకంగా ఒళ్ళువిరుచుకుంటూ ఆవులిస్తుందన్నాడు గాలిబ్. నిజానికి ఆయన దృష్టిలో యావత్తు ప్రపంచం బద్దకంగా ఆవులిస్తూ దేవుడెప్పుడు కరుణిస్తాడా అని ఎదురుచూస్తోంది. ప్రతి మనిషి తనపై దేవుడి కరుణ ఎప్పుడు ప్రసరిస్తుందా అని చూస్తున్నాడు. ఫక్తు తాగుబోతు కవితలా కనిపించే షేర్ ద్వారా లోతయిన సూఫీ భావాన్ని పలికించడం గాలిబ్ కి మాత్రమే సాధ్యం. తర్వాతి కవిత గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ 2వ షేర్ ఏక్ ఖదమ్ వహషత్ సే, దర్సె దఫ్తరె ఇమ్ కాం ఖులా జాదా, అజ్ జాయె దో ఆలమ్ దష్త్ కా, షీరాజా థా ఒక్కడుగు పిచ్చిగా వేస్తే, అవకాశాల తలుపులు తెరుచుకున్నాయి రెండు ఎడారిలోకాల పుస్తకపుటలను కలిపి కుట్టిన దారం దారులు తెరుచుకున్నాయి ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. ఏక్ ఖదమ్ అంటే ఒక్క అడుగు. ఒక చిన్న అడుగు అని కూడా చెప్పుకోవచ్చు. వహషత్ అంటే పిచ్చి, ఉన్మాదం. దర్స్ అంటే పాఠం. దఫ్తర్ అంటే కార్యాలయం. ఇమ్కాం అంటే possibility. దఫ్తరె ఇమ్కాం అంటే అవకాశాల నిలయం అని చెప్పుకోవచ్చు. జాదా అంటే దారి. అజ్ జా అంటే విడిభాగాలు, ముక్కలు, అవయవాలు వగైరా అర్ధాలున్నాయి. దో ఆలమ్ అంటే రెండు ప్రపంచాలు. మనం నివసిస్తుంది ఇహలోకం. ఇది ఒక ప్రపంచం. ఇక్కడి దేవుడు మనిషిని పరీక్షించడానికి పంపించాడు. ఈ పరీక్షా కాలం ముగియగానే మనిషి మరణిస్తాడు. మరణించిన తర్వాత మనిషి పరలోకంలో ప్రవేశిస్తాడు. అది రెండవ ప్రపంచం. మనిషి మంచి పనులు చేస్తే పరలోకంలో స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం లభిస్తాయి. ఈ రెండు ప్రపంచాలనే దో ఆలమ్ అంటూ గాలిబ్ సూచించాడు. దష్త్ అంటే ఎడారి. దో ఆలమె దష్త్ అంటే రెండు ఎడారి ప్రపంచాలు. రెండు ప్రపంచాలలోను బీడుబడిన ఎండిపోయిన ఎడారులు తప్ప మరేమీ లేవట. షీరాజా అంటే విడిభాగాలను లేదా పుస్తకంలోని పుటలను కలిపి కుట్టే దారం. ఈ కవితలో భావం చూద్దాం. ప్రపంచాన్ని మార్చిన చాలా మంది మేధావులను ప్రపంచం పిచ్చివారిలా చూసింది. సాధారణ ప్రజల మాదిరిగా కాకుండా డిఫరెంట్గా ఆలోచించేవారిని పిచ్చివారిగానే చూస్తారు. అలా పిచ్చిగా వేసిన అడుగులే కొత్త మార్గాలను తెరుస్తాయి. గాలిబ్ అలాగే ఒక పిచ్చి పని చేసాడు. ఆ వెంటనే ఆయన ముందు అనేక విషయాలు, అవకాశాల తలుపులు తెరుచుకున్నాయి. కొత్త పాఠాలు నేర్చుకున్నాడు. ఆయన అడుగుపెట్టిన మార్గం ఎలా ఉందంటే, రెండు ప్రపంచాల పుస్తకం పుటలను కలిపి కుట్టిన దారంలా ఉంది. ఆ రెండు ప్రపంచాలు ఎడారి ప్రపంచాలే. అసాధారణమైన నిర్ణయాలు, ప్రజలకు పిచ్చిగా కనిపించే పనులు చేయగలిగితేనే వాస్తవాలు, నిజాలు తెలుస్తాయంటున్నాడు. గాలిబ్ ఉపయోగించిన ఎడారి అన్న పదం కూడా గమనించదగ్గది. పిచ్చిగా చేసే పనుల వల్ల ఎడారి లాంటి కష్టాలు కూడా తప్పవన్న సూచన ఈ పదం వాడడం వెనుక ఉంది. కాని రెండు లోకాల వాస్తవాలు తెలుసుకోవాలంటే కొన్ని పిచ్చి పనులు చేయాల్సిందే. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 3వ షేర్ మానా, వహషతె ఖరామిహాయే లైలా, కౌన్ హై ఖానాయే మజ్నూనె సహ్రాగర్ద్ బే దర్వాజా థా లైలా పిచ్చి అడుగుల మందగమనాన్ని ఆపిందెవరు? ఎడారిసంచారి మజ్నూ ఇంటికి తలుపులు లేవుగా ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. మానా అంటే ఇక్కడ అర్ధం నివారించేవాడు, అడ్డుకునేవాడు, వారించేవాడు అని చెప్పాలి. వహషత్ అంటే పిచ్చి. ఖరామీ అంటే మందగమనం, ఉబుసుపోక చేసే పచార్లు, వహషతె ఖరామీ అంటే ఏదీ తోచక తిరగడం. ఇక్కడ ఖరామీహాయే అని బహువచనంలో ఉపయోగించాడు ఇదే పదాన్ని. ఖానా అంటే ఇల్లు. మజ్నూ అంటే లైలా మజ్నూ ప్రేమ కథలో నాయకుడు. లైలా అంటే అదే ప్రేమకథలో నాయిక. నిజానికి మజ్నూ అసలు పేరు ఖైస్. కాని ప్రేమలో పిచ్చివాడైన అతడిని ప్రజలు మజ్నూ అనేవారు. మజ్నూ అంటే పిచ్చివాడని అర్ధం. లైలా కూడా అసలు పేరు కాదు. లైలా అంటే రాత్రి అని అర్ధం. నల్లని అని కూడా భావం. లైలా కళ్ళు, కురులు చిమ్మచీకటిలా నల్లగా ఉండేవట అందుకే ఆమెను లైలా అనేవారు. అమె అసలు పేరు అమీరియా. సహ్రాన్ గర్ద్ అంటే ఎడారిలో సంచరించేవాడు. ఖానా అంటే ఇల్లు. దర్వాజా అంటే తలుపు కవిత భావాన్ని చూద్దాం. మజ్నూ ఇంటికి తలుపులే లేవు. ఎడారిలో నివసించేవాడు. ఎడారిలోనే తిరగడం అక్కడే పడి ఉండడం కాబట్టి ఎడారే ఇల్లు. ఆ ఇంటికి తలుపులెక్కడ? అలాంటప్పుడు, మజ్నూను గాఢంగా ప్రేమించిన లైలా, మజ్నూను కలవాలని పరితపించిన లైలా అక్కడికి వెళ్ళకుండా ఆపిందెవరు? తలుపుల్లేని ఇంటిలోకి ప్రవేశించకుండా ఆమెను అడ్డుకున్నదెవరని ప్రశ్నిస్తున్నాడు. గాలిబ్ ఈ కవితలో సహ్రాన్ గర్ద్ అని మజ్నూను పిలవడం ద్వారా మజ్నూ నివాసం ఎడారి అని సూచించాడు. లైలా చాలా సార్లు ఒంటెపై మజ్నూను కలవడానికి బయలుదేరింది. కాని ఆమె ఒంటెను నడిపిన వ్యక్తి ఈ విషయాన్ని ముందే ఆమె తండ్రికి చెప్పడం వల్ల ఆమె ప్రియుడిని కలవలేకపోయింది. ఈ నమ్మకద్రోహాన్ని గాలిబ్ కవితలో పేర్కొన్నాడు. ఈ కథను సూచించడం ద్వరా గాలిబ్ కేవలం లైలా మజ్నూ ప్రేమకథను మనకు చెప్పడం లేదు. నమ్మిన వారే మోసాలకు పాల్పడతారని హెచ్చరిస్తూన్నాడు. లైలా తాను మజ్నూను కలవడానికి బయలుదేరినప్పటికీ ఆ విషయం బయటకు పొక్కుతుందని అప్రతిష్ఠకు భయపడి వెనక్కి మళ్ళింది. నిజానికి ఆమెను ఆపినవారెవ్వరు? ఆమె స్వయంగా వెనక్కి మళ్ళేలా చేసింది ఆమెలోని ఆలోచనలే. ఇది ఈ వారం గాలిబానా. వచ్చేవారం మరిన్ని కవితలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TP3qH9

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

Abd Wahed కవిత

రాలిపోదాం... కొన్ని మల్లెలు లేదా గులాబులు, సంపెంగలు, సన్నజాజులు, నందివర్ధనాలు ఏవైనా గాని, అవి పూలు.. వాటికి తెలిసింది అల్లరి సుగంధాలు విరజిమ్మడం... పిల్లనగోవిలా ప్రవహిస్తున్న ప్రకృతిలో అల్లనల్లన సువాసనల కేరింతలు నీకు తెలుసా పుట్టినప్పుడు ఏడుపే అద్భుతమైన అలౌకిక రాగంతో... కన్నవారిలోను, విన్నవారిలోను తన్మయీ భావన అవి పూలే కాదు.. జలపాత సారంగీ తీగలు సుడిగాలి ఈలపాటలు ఉప్పొంగే నదీజలధారల జలతరంగిణీ ఝరులు అయినా అవి పూలే పుస్తకాల పుటల్లో మనం దాచుకున్న పూలే అక్కడి జ్ఞానాన్ని తెమ్మెదల్లా గ్రోలుతున్న పూలే.. సువాసనల కట్టడాలే... మనం చిరిగిపోయిన కనురెప్పలకు క్షణాల కుట్లు వేసుకుంటున్నాం కన్నీళ్ళను చూపుల్లో మూట కట్టేస్తున్నాం చచ్చిపోయిన మన నెత్తుటిలో పాతపంచెలు ఉతుకుతున్నాం అక్కడ జలధి కెరటాలుగా ఎగిసిపడినా అవి పూలే.. తెలుపులో ఏడురంగులుంటాయని వాటికి తెలుసు కాని నలుపును చూడలేని పూలు... నిర్లక్ష్యపు దుర్గంధం నష్టపరిహారం గేట్లు ఏత్తేస్తుందని తెలియదు గడ్డకట్టిన చెడురక్తం ఉప్పెనలా వచ్చిపడిరది అవి అమాయకపు పూలు నెమలీకల వీణా నాదాలు దుర్గంధం చీకటిలో ఆర్తనాదాల నీడలై పోయాయి ఇస్త్రీ మడతనలగని సానుభూతి అరిగిపోయిన గ్రాంఫోన్‌ రికార్డు తిరుగుతుంది మనం ఇక్కడ ‘‘అయ్యో..’’ల పద్దులు రాస్తున్నాం లెక్క లక్షలు కోట్లు దాటింది.. శిశుపాలుళ్ళ సంఖ్య పెరుగుతోంది నల్లనయ్య ఒక్కడూ లేడు నలుపును కడిగేవాడూ లేడు చేతులు చొక్కా జేబులయ్యాయి. కాళ్ళు పట్టెమంచం పరుపులయ్యాయి అవి పూలే ప్రకృతి వాటికిష్టం పిల్లనగోవిలా ప్రవహించే ప్రకృతిలో సప్తస్వరాలు పలికించే రంధ్రాలుగా మారిపోయాయి... మనం సువాసనలను కాపాడలేక దుర్గంధాల జెముడువనంలో చెంపలపై మురికికాల్వలుగా ప్రవహిస్తున్నాం...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uSJWi6

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Abd Wahed కవిత

ఎదురుచూపు దాహం కంటినీరు అడుగుతుంది అద్దంలో రూపం అసలు పేరు అడుగుతుంది సాయంత్రం నుంచీ మనసు ఆరిపోయిందా గుండెలోని దీపం ప్రేమ చమురు అడుగుతుంది సముద్రాలే దాటీ రెండుకాళ్ళు ఎగురుతాయి చేతిలోని గీతా స్వంత ఊరు అడుగుతుంది మరకపడిన చూపులు వెలుగునీట కడగాలని మనిషితనం కాస్తా మననెత్తురు అడుగుతుంది గాలిబుడగ లాగా తేలుతున్న కవితలోని అక్షరాల జ్ఞానం ఇంటి చూరు అడుగుతుంది కనుపాపలొ కాస్తా మబ్బుపడితె బాగుండును మనసులోని మెరుపూ వాననీరు అడుగుతుంది దియా మనకు వెన్నెల తెల్లగానే కనబడినా మచ్చపడిన జాబిలి నలుపురంగు అడుగుతుంది

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qjjQCm

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Abd Wahed కవిత

నివురు అలిగిన ప్రేయసిలా వాన ముఖం చాటేసింది శరపరంపరలా కురుస్తున్నాయి నిప్పుకణాలు ప్రతి పగలు నడినెత్తిన పొయ్యి వెలుగుతోంది మధ్యాహ్నపు వంటలోన మరికాస్త నిప్పు వేస్తోంది... కొత్త వేడి పుట్టించే పాత మద్యమేదో కొండల్లో లావాలా సెగలు కక్కుతోంది గడ్డిపరక పచ్చగా మిగులుద్దా ఇప్పుడు... ఎండిన సెలయేరు, నెర్రెల నాల్కలతో పెదవి తడుపుకుంది మండుతున్న కళ్ళతో రోదించే దుమ్ము ధూళి... జ్వర తీవ్రత పెరిగిన నేల పడకేసింది నిట్టూర్పుల గాడ్పులతో అలమటిస్తోంది ఎండిన పొలంలో ఒంటరి సుడిగాలి కామాంధుల చేతుల్లో కన్నెపిల్ల ... బండబారిన గుండెలపై ముక్కలవుతోంది కన్నీటి చీర కాలిపోయిన చెరువు తడి జాడలు వెదుకుతోంది పిచ్చివాడు విసిరిన రాయిలా కడుపులోని ఆకలి కాలుతున్న రోడ్డులా పరచుకుంది ఇంత ఎండలో సూర్యుడెలా తిరుగుతున్నాడో? తుపాకి గుండులా నిప్పులు కక్కుతూ పరుగెడుతున్నాడు భూమి అస్తమిస్తే బాగుండనుకుంటున్నాడా?! నిప్పుల్లో పడవేస్తే ధాన్యపు గింజ కూడా తిరగబడుతుంది చటపటా పేలుతూ గింజలన్నీ యుద్ధం చేస్తాయి మర్యాదల ఆచ్ఛాదనలు విసరికొట్టి అణగారిన మనోబలాన్ని చూపిస్తాయి ఒంటరి సుడిగాలి ఎడారి వీధుల్నే జయిస్తుంది విప్లవాల వెల్లువగా మారుతుంది అందులో మండుతున్న ధూళికణాలున్నాయి సూర్యుడు ఎండలో పడి తిరుగుతున్నది అందుకే బీదరికం కణకణాన్ని మండిస్తోంది అందుకే పగలు వేడి సెగలు వండుతోంది అందుకే ఎడారి కుంపటిలో ఇసుకరేణువులే ఆయుధాలు ఎండలో సూర్యుడిలా చెమటలు కక్కడం గర్వకారణం...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UmrYaU

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Abd Wahed కవిత

ఉర్దూ కవిత్వ నజరానాలో గతవారం గాలిబ్ సంకలనంలోని 18వ గజల్లోని కొన్ని షేర్లు చూశాము. ఈ రోజు కూడా అదే గజల్లోని మరి కొన్ని షేర్లు చూద్దాం. మొదటి షేర్ గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ 6వ షేర్ లే గయే ఖాక్ మేం హమ్, దాగె తమన్నాయె నిషాత్ తూ హో, ఔర్ ఆప్ బ సద్రంగ్ గులిస్తాం హోనా నేను ఆనందపు ఆకాంక్షల మచ్చలను కూడా సమాధిలోకి తీసుకుపోయాను ఇప్పుడు నువ్వున్నావు, వందలాది రంగుల పూదోట మాదిరిగా ఈ కవితలో ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఖాక్ అంటే దుమ్ము, మట్టి, సమాధి అని అర్ధాలున్నాయి. దాగ్ అంటే మచ్చ, బాధ అని అర్ధాలున్నాయి. తమన్నా అంటే అకాంక్ష. నిషాత్ అంటే ఆనందం. తు అంటే నువ్వు. తూ హో అంటే నువ్వున్నావు. బ సద్రంగ్ అంటే వంద రంగులతో అని అర్ధం. గులిస్తాం అంటే పూదోట, ముఖ్యంగా గులాబీపూదోట. ఇప్పుడు ఈ కవితకు భావం చూద్దాం. గాలిబ్ జీవితాన్ని ఆనందంగా గడపాలని అసంఖ్యాక ఆకాంక్షలు పెట్టుకున్నాడు. కాని ఒక్కటి కూడా నెరవేరలేదు. జీవితం ముగిసిపోయింది. ఆ ఆనందాల ఆకాంక్షల మచ్చలను కూడా తీసుకుని సమాధిలోకి వెళ్ళిపోయాడు. కాని తన ప్రేయసి మాత్రం వందల రంగుల పూదోట మాదిరిగా అందమైన, ఆనందదాయకమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాడు. పైకి చాలా సరళమైన కవితగా కనబడుతుంది కాని గాలిబ్ రెండు పంక్తుల్లో చాలా లోతయిన భావాన్ని చెప్పాడు. పైకి కనబడే భావం తాను జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాడు. ప్రేమ విఫలమైంది. ప్రేమ మచ్చను తీసుకుని సమాధికి చేరుకున్నాడు. కాని తన ప్రేయసి మాత్రం సంతోషంగా శతవర్ణభరితమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాడు. కాని ఈ రెండు పంక్తుల్లో కాస్త ఆలోచిస్తే మరిన్ని భావాలు ధ్వనిస్తాయి. మనిషి కోరికల పుట్ట. అనేక ఆకాంక్షలు మనసులో పెంచుకుంటాడు. కాబట్టి మనిషి సమాధిలోకి వెళ్ళే సమయంలో అంటే మరణించే సమయంలో కూడా నెరవేరని అనేక ఆకాంక్షలతోనే ఉంటాడు. తాను సాధించలేకపోయినవి, తాను పొందలేకపోయినవి తాను ప్రేమించేవారికి దక్కాలని కోరుకుంటాడు. ఇక్కడ గాలిబ్ తన ప్రేయసిని ఉద్దేశించి ప్రేమను తిరస్కరించడం ద్వారా నువ్వు నన్ను నెరవేరని ఆకాంక్షలతో మరణించేలా చేస్తున్నావు, నాకు నెరవేరని కోరికలు నీ విషయంలో నెరవేరాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఆ విధంగా ఆమె పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఉర్దూలో ఒక సామెత ఉంది. దిల్ బాగ్ బాగ్ రహ్నా. అంటే సంతోషంగా ఉండడం అని భావం. ఈ సామెతనే మరో విధంగా గాలిబ్ ఈ కవితలో వాడుకున్నాడు. నిజానికి ఈ కవితలో ప్రేయసి వైఖరి పట్ల వ్యంగ్యం కూడా ఉంది. ప్రేమించే తనను కాదని ప్రేయసి తిరస్కరించింది. తాను ఇక మరణించాడు కాబట్టి ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, జీవితం పూదోటలా ఉంటుందని ఒకవిధమైన ఎత్తిపొడుపులాంటి వ్యాఖ్య కూడా ఇందులో ఉంది. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 8వ షేర్ కి మేరే ఖతల్ కే బాద్, ఉస్నే జఫా సే తౌబా హాయ్, ఉస్ జూద్ పసీమాం కా పషీమాం హోనా నన్ను హతమార్చిన తర్వాత తాను అయ్యో అనుకుంది అయ్యో, ఎంత త్వరగా మనసు మార్చుకుంది... ఈ కవితలోని ఉర్దూపదాలకు అర్ధాలు చూద్దాం. ఖతల్ అంటే హత్య. జఫా అంటే క్రూరత్వం,దౌర్జన్యం వగైరా అర్ధాలు చెప్పవచ్చు. తౌబా అంటే పశ్చాత్తాపపడడం. జూద్ అంటే త్వరగా. పషీమాం అంటే బాధపడడం. ఈ కవితలోని భావాన్ని పరిశీలిద్దాం. ప్రేయసి అతడిని హతమార్చిన తర్వాత అయ్యో అనుకుంది. ఇంకెప్పుడు ఎవరినీ బాధపెట్టకూడదని నిర్ణయించుకుంది. అబ్బా, ఎంత త్వరగా ఆమె పశ్చాత్తాపపడిందో, ఎంత త్వరగా అయ్యో అనుకుందో అంటున్నాడు. ఎంత త్వరగా మనసు మారిందో కదా అని కూడా అంటున్నాడు. ఇందులో వ్యంగ్యం గమనించదగ్గది. నిజానికి తనను చంపకముందు ఇలా మనసు మార్చుకుని ఉంటే బాగుండేది. జూద్ పషేమాం అంటే త్వరగా పశ్చాత్తాపపడిన వ్యక్తి అని అర్ధం. ఏదైనా తప్పు, పాపం చేసి వెనువెంటనే తప్పు గ్రహించి అలాంటి తప్పు మరెప్పుడు చేయనని దేవుడిని వేడుకుంటూ పశ్చాత్తాపపడే వాడు జూద్ పషీమాం. తన ప్రేయసి అలాగే వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడింది. అబ్బా, ఎంత త్వరగా పశ్చాత్తాపపడి, అయ్యో అనుకుందో కదా.. అని వ్యంగ్యంగా అంటున్నాడు. గాలిబ్ కవితల్లో ఈ షేరు చాలా ప్రసిద్ధి పొందిన షేర్. సాధారణంగా గాలిబ్ ఒక కవితలో ఒకే పదాన్ని రెండుసార్లు వాడడం జరగదు. కాని ఈ కవితలో ఒకే పంక్తిలో రెండుసార్లు పషీమాం అన్న పదాన్ని వాడాడు. ఇందులో జూద్ పషీమాం అన్నది ఒక పదబంధం. ఉర్దూ పలుకుబడి వంటిది. జూద్ పషీమాం అనేది ఒక వ్యక్తి గుణవాచకం. ఒకే పంక్తిలో ఈ పదాన్ని ఇలా రిపీట్ చేయడం కవితకు కొత్త అందాన్ని ఇచ్చింది. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవిత గురించి వివరిస్తూ, ఆమె కోపంతో ఆవేశంతో అతడిని హతమార్చడానికి క్షణం ఆలోచించలేదు. ఆ తర్వాత అయ్యో ఎంత పని చేశాను అని వెంటనే మనసు మార్చుకుని బాధపడిపోయింది. ఇదొక నిలకడలేని మనస్తత్వం. అలాంటి మనస్తత్వాన్ని సూచిస్తూ ’’జూద్ పషీమాం‘‘ త్వరగా పశ్చాత్తాపపడే వ్యక్తి అన్న పదబంధం వాడడంలో తీవ్రమైన వ్యంగ్యం ఉంది. ఈ కవితలో లోతయిన భావం ఉంది. ముఖ్యంగా జూద్ పషీమాం అన్న పదం వాడడం ద్వరా గాలిబ్ ఈ కవిత పరిధిని పెంచేశాడు. చాలా మంది చాలా తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత చాలా పశ్చాత్తాపపడ్డాడు. బౌద్ధాన్ని స్వీకరించి హింసకు దూరంగా ఉన్నాడు. కాని కళింగ యుద్ధంలో మరణించిన వారి బంధువులు ఏమనుకుని ఉంటారు. అశోకుడిలో ఈ మార్పు యుద్ధానికి ముందే వచ్చి ఉంటే ఎంత బాగుండును అనుకుని ఉంటారు. అలాగే తప్పు చేసే ఏ వ్యక్తయినా ఎంత త్వరగా పశ్చాత్తాపపడినా, నిజానికి ఆ తప్పు వల్ల జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఈ కవితలో ఉన్న సూఫీ కోణం ఇదే. స్వచ్ఛమైన మనసుతో, నిజాయితీగా చేసిన తప్పుల పట్ల పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తానంటున్నాడు. తప్పు జరిగిన వెంటనే దాన్ని గుర్తించి, క్షణం ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపపడాలి. అలా చేసేవాడు జూద్ పషీమాం. కాని గాలిబ్ ఈ విషయం గురించే మాట్లాడుతూ ఎంత త్వరగా పశ్చాత్తాపపడినా, జరగవలసిన నష్టం ఎలాగూ జరిగిపోతుందంటున్నాడు. ఇక్కడ తప్పులు రెండు విధాలు కావచ్చు. ఉద్దేశ్యపూర్వకంగా చేసేవి, అనుకోకుండా జరిగేవి. ఉద్దేశ్యపూర్వకంగా చేసే తప్పుల్లో తనకు నష్టం కలిగించేవి, ఇతరులకు నష్టం కలిగించేవి ఉంటాయి. ఇతరులకు నష్టం కలిగించే తప్పులు, పాపాల విషయంలో నష్టపోయిన వారు క్షమించనంత వరకు దేవుడు తాను కూడా క్షమించనన్నాడు. కాబట్టి ఇక్కడ గాలిబ్ చెబుతోంది తనకు నష్టం కలిగించిన తప్పు గురించి మాత్రమే. ఈ విశ్లేషణ తర్వాత ఈ కవిత అర్ధమే మారిపోతుంది. ప్రేయసి అతడిని హతమార్చింది. దాని వల్ల గాలిబ్ చనిపోయాడు. కాని దాంతో పాటు ఆమె స్వయంగా ఒక గొప్ప ప్రేమికుడిని కోల్పోయింది. అది ఆమెకు జరిగిన అతిపెద్ద నష్టం. వెంటనే పశ్చాత్తాపపడింది. కాని ఏం లాభం ఎంత త్వరగా పశ్చాత్తాపపడినా జరగవలసింది జరిగిపోయింది. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ హైఫ్, ఉస్ చార్గిరా కపఢేకీ ఖిస్మత్ గాలిబ్ జిస్ కీ ఖిస్మత్ మేం హో ఆషిఖ్ కా గిరేబాం హోనా అయ్యో, ఆ జానెడు వస్త్రం దురదృష్టం గాలిబ్ ప్రియుడి చొక్కా కాలరుగా బతుకుతోంది ఈ కవితలోని ఉర్దూ పదాలను చూద్దాం. హైప్ అనేది బాధను సూచించడానికి ఉచ్చరించే ధ్వని. గిరా అంటే ముడి లేదా గుప్పిట. చార్గిరా అంటే నాలుగు గుప్పెళ్ళు అని అర్ధం. గరేబాం అంటే చొక్కా కాలరు. ఈ కవితలోని భావాన్ని చూద్దాం. చార్గిరా అంటే నాలుగు గుప్పెళ్ళ పొడవున్న అని అర్ధం. నేను జానెడు వస్త్రమని పైన రాశాను. ప్రియుడి చొక్కా కాలరుగా వాడబడిన ఈ జానెడు వస్త్రం చాలా దురదృష్టం చేసుకుందంటున్నాడు. ప్రేయసి ప్రియులు కలిసినప్పుడు ఆమె ఉద్రేకంతో లాగడం వల్ల కూడా అది చిరిగిపోవచ్చు. ప్రేయసిని వదలి వెళుతున్నప్పుడు ప్రియుడు బాధగా తన కాలరునే పట్టుకుని లాగడం వల్ల కూడా అది చిరిగిపోవచ్చు. ప్రేమలో పడిన వ్యక్తి చొక్కా కాలరుగా మారడం కన్నా దురదృష్టం వస్త్రానికి మరొకటి లేదు. గాలిబ్ ఈ కవిత రాయడానికి కారణమైన ఒక సంఘటన గురించి ప్రస్తావన ’’ఆబె హయాత్‘‘ అన్న పుస్తకంలో ఉంది. జూదమాడుతూ ఒకసారి గాలిబ్ పట్టుబడ్డాడు. అతడికి జైలు శిక్ష పడింది. చీకటి కొట్టంలో పడేశారు. శిక్ష పూర్తయి బయట అడుగుపెట్టేసరికి అతడి చొక్కా మాసిపోయి పరమ మురికిగా తయారైంది. కాలరుపై నల్లులు, పేనులు పాకుతున్నట్లుంది. గాలిబ్ చికాగ్గా తన చొక్కా కాలరు వద్ద పట్టుకుని చించిపారేస్తూ ఈ కవిత చెప్పాడంట. ఈ కవితను పరిశీలిస్తే గాలిబ్ రెండు పంక్తుల్లో, పాతనిబంధన, కొత్తనిబంధన, ఖురాన్ గ్రంథాల్లోని ఒక ప్రవక్త కథను చెప్పేశాడు. జాకబ్ ప్రవక్త కుమారుడు జోసెఫ్. ఆయన్ను సవతి సోదరులు ఒక బావిలో తోసేశారు. అటుగా వెళుతున్న ఒక వర్తక బిడారు బావిలో ఉన్న జోసెఫ్ ను చూసి బయటకు తీశారు. ఆ వర్తకులు ఆయన్ను ఈజిప్టుకు తీసుకువెళ్ళారు. అక్కడ ఫారో రాజభవనంలో బానిసగా అమ్మేశారు. జోసెఫ్ యువకుడు, చాలా అందమైనవాడు. ఫారో దర్బారులో ఉన్నత సైనికోద్యోగి పోతిఫర్ భార్య జులేఖా ఆయన అందం చూసి మనసు పారేసుకుంది. ఒకరోజు రాజప్రాసాదంలో ఒంటరిగా దొరికిన జోసెఫ్ ను ప్రలోభపరచడానికి జులేఖా ప్రయత్నించింది. తనను పట్టుకున్న జులేఖాను విడిపించుకోడానికి జోసెఫ్ పెనుగులాడారు. ఈ పెనుగులాటలో జోసెఫ్ చొక్కా కాలరు చిరిగిపోయింది. అయితే తనపై నింద రాకుండా ఉండడానికి జులేఖా తన దుస్తులు చింపుకుని జోసెఫ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. జెసెఫ్ ను పట్టుకుని జైలులో పడేశారు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. చివరకు ఈ కేసు విచారణకు వచ్చింది. విచారించిన ఖాజీ (న్యాయమూర్తి) జోసెఫ్ చొక్కా కాలరు వెనక నుంచి చిరిగి ఉంది కాబట్టి, అతను విడిపించుకుని పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వెనక నుంచి పట్టుకోవడం వల్ల చిరిగిందని తీర్మానించి విడుదల చేయిస్తాడు. ఈ కథ దాదాపు మూడువేల సంవత్సరాల పాత కథ. ఇక్కడ గాలిబ్ కవిత ఆ కధను గుర్తు చేయడం మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా ప్రేమికుల మధ్య చొక్కా కాలరు బలవుతుందన్న హాస్యంతో కూడిన వ్యంగ్యాన్ని పలికించాడు. కవితలో చమత్కారం కూడా గమనించదగ్గది. మొదటి పంక్తిలో అయ్యో ఆ జానెడు వస్త్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది అన్నాడు. రెండవ పంక్తిలో ప్రేమికుడి చొక్కా కాలరుగా మారింది కదా అంటున్నాడు. రెండవ పంక్తిలో పలికే చమత్కారం గమనించదగ్గది. ఇది ఈ రోజు గాలిబానా. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. అంతవరకు అస్సలాము అలైకుమ్

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oxHYzX

Posted by Katta

2, జూన్ 2014, సోమవారం

Abd Wahed కవిత

అపరిచిత... గమ్యంపై నడుస్తూ నడుస్తూ చివరకు అపరిచితులమైపోయాం.. మరోసారి పరిచయం పెంచుకోడానికి ఎన్ని మౌనాలు మరణించాలో మైత్రిగంగ ప్రవహించాలంటే ఏ భగీరధుడు రావాలో? మచ్చలేని పచ్చదనం చినుకులను ప్రసవించే మబ్బులు మిగిలాయా? ఈ రక్తపు మరకలు కడగాలంటే ఎన్ని వానల్లో తడవాలో... మంచుగడ్డగా మారిన ప్రేమ వడగళ్ళవానే... నడుం విరిగిన బంగారు కంకులు... పంటపొలం పచ్చచీర కట్టుకునేదెప్పుడో... నగ్నంగా ఉదయించింది పగలు పెదాలపై సువాసనలేని కాగితం నవ్వులతో సరే, ప్రేమించడానికి కావలసింది దేహమే కదా... దుస్తులొదిలిన తర్వాత సిగ్గు సుగంధాలుండవులే... మెరుపుల్లేని మట్టిలాంటి ఆత్మవాసన దొరికేదెప్పుడో? ఓడిపోయే ముందు గుండెకు ఒక్క ఊపిరి దొరికినా బాగుండును కొన్ని నిందలు, మరికొన్ని రోదనలు, ఇంకొన్ని వేదనలు గుప్పెడు పూలు, దోసెడు ముళ్ళు పంచుకునేవాళ్ళం కదా... ఏవేవో చెప్పుకున్నాం ఏదో చెప్పాలని కలుసుకున్నాం దశాబ్ధాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇద్దరమూ మాట్లాడుతున్నాం ఎవరమూ వినలేదు... మాటలు కరిగిపోతే మౌనం గడ్డకట్టింది చెప్పాలనుకున్నది వినబడనే లేదు... సరే, ప్రేమ నుదుటిపై బాధలే కదా... మరోసారి చరిత్ర మొదలెడదాం...

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mITAyF

Posted by Katta

29, మే 2014, గురువారం

Abd Wahed కవిత

ఈ రోజు ఉర్దూ కవిత్వ నజరానాలో గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ చూద్దాం మొదటి షేర్ బస్ కే దుష్వార్ హై హర్ కామ్ కా ఆసాం హోనా ఆద్మీ కో భీ మయస్సర్ నహీ ఇన్సాం హోనా ప్రతి పని సులభంగా నెరవేరడం చాల కష్టం మనిషికి కూడా మానవుడిగా మారడం చాలా కష్టం చాలా సరళమైన పదాలతో గాలిబ్ చాలా లోతయిన భావాన్ని వ్యక్తం చేసిన కవిత ఇది ఇందులో ఉన్న ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. బస్కే అంటే అత్యధికంగా, చాలా ఎక్కువగా అని అర్ధం. దుష్వార్ అంటే అసాధ్యం, సాధ్యం కాని పని, చాలా కఠినమైన పని అని భావం. మయస్సర్ అంటే లభించడం, దొరకడం, ప్రాప్తం కావడం వగైరా అర్ధాలు చెప్పవచ్చు. ఆద్మీ అన్న పదం గమనించదగ్గది. ఆద్మీ అంటే మనిషి అన్నది భావం. ఆదమ్ నుంచి మానవాళి వ్యాప్తి చెందింది కాబట్టి మనిషిని ఆద్మీ అంటే ఆదమ్ సంతానం అంటారు. ఇన్సాన్ అంటే కూడా మనిషి, మానవుడు అని అర్ధం. ఇక్కడ మానవ లక్షణానికి ప్రాముఖ్యం ఉంది. ఇన్సానియత్ అంటే మానవత్వం. ఇన్సాం హోనా అంటే మానవత్వ లక్షణాలతో నిజమైన మనిషిగా మారడం. ఈ కవితలో భావాన్ని చూద్దాం. మనిషికి ఏ పనయినా చాలా కష్టంతో కాని పూర్తి కాదంటున్నాడు గాలిబ్. మనిషి ప్రతి పని చేయడానికి చాలా కష్టపడక తప్పదు. మనిషి మనిషిగా పుట్టాడు. ఉర్దూలో ఉన్న పంక్తిని గమనిస్తే, ఆదమ్ సంతానం కావడం వల్ల పుట్టుకతోనే మనిషిగా పుట్టాడు. ఇంకొక్క అడుగు ముందుకేస్తే చాలు మానవత్వ లక్షణాలున్న ఇన్సాన్ గా మారవచ్చు. కాని ఆ ఒక్క అడుగు ముందుకేయడం కూడా మనిషికి ప్రాప్తం కావడం లేదు. సాధ్యపడడం లేదు. ఒక తీవ్రమైన వ్యంగ్యం ఇందులో ఉంది. మనిషి మనిషిగా పుట్టాడు కాని, మనిషిగా మానవత్వంతో బతకడం మనిషికి సాధ్యపడడం లేదని అంటున్నాడు. ఇది నిజానికి చాలా చిన్నపనే కాని అది కూడా చాలా పనుల్లాగే సాధ్యం కావడం లేదంటున్నాడు. ఈ కవితలో గాలిబ్ ప్రయోగించిన పదాలు కూడా గమనించదగ్గవి. దుష్వార్ అన్న పదానికి పూర్తి వ్యతిరేకపదం ఆసాన్ ఉపయోగించి రెండవ పంక్తిలో ఆద్మీ అన్న పదం ఇన్సాన్ అన్న పదం ప్రాసగా వాడాడు. మొదటి పంక్తిలో రెండు పదాలు వ్యతిరేకార్థం ఉన్న పదాలు. కాని రెండవ పంక్తిలో రెండు పదాలు సాధారణంగా పర్యాయపదాలే, కాని వాటిని వ్యతిరేకార్థం కలిగిన పదాలుగా ప్రయోగించడంలో కవిత్వ నైపుణ్యం గమనించదగ్గది. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవితపై తమ అభిప్రాయం చెబుతూ మనిషికి ముఖ్యమైన లక్షణం మానవత్వం, మనిషి పుట్టుకతో మానవజన్మ ఎత్తాడు కాబట్టి ఇక మానవత్వం నిండిన మనిషిగా మారడం అతడికి చాలా సులభం. పశుపక్ష్యాదులకు ఇది సాధ్యం కాదు. కాని తనకు సులభమైన పని చేయడం కూడా మనిషికి సాధ్యం కావడం లేదు. ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమంటే, దేవుడు మనిషికి ఆలోచించే, తన ఇష్టం ప్రకారం నడుచుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. ఇతర ప్రాణులకు అలాంటి స్వేచ్ఛ లేదు. అవి ఎలా బతకాలని దేవుడు నిర్ణయించాడో అలాగే బతుకుతాయి. అవి తమ పరిస్థితిని మార్చుకోలేవు. కాని మనిషి పరిస్థితి అది కాదు. మనిషిని దేవుడు ’’అష్రఫుల్ మఖ్లూఖ్‘‘ అంటే సమస్త ప్రాణుల్లో అత్యుత్తముడిగా పుట్టించాడు. పైగా భూమిపై సమస్తమూ మనిషి కోసమే పుట్టించాడు. ఇన్ని సదుపాయాలున్నప్పుడు మనిషి, పుట్టుకరీత్యా తనకు లభించిన ఈ సానుకూలతలను ఉపయోగించుకుని మానవత్వం ఉన్న మనిషిగా మారడం చాలా తేలిక. కాని అది కూడా అతడికి అసాధ్యం అయిపోయింది. ఈ మాట అంటూ, అసలు మనిషికి ఏ పని కూడా సులభం కాదు అంటూ మనిషి ఎలాంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడో తేల్చి చెప్పేశాడు. రెండవ కవిత గిర్యా చాహే హై ఖరాబీ మేరే కాషానే కీ దరో దీవార్ సే టప్కే హై బయాబాం హోనా నా నివాసం నాశనం కావాలన్నదే రోదనల కోరిక గోడలు, తలుపుల నుంచి కారడవి కారుతుంది చూడు ఈ కవిత భావాన్ని పరిశీలించే ముందు ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. గిర్యా అంటే రోదనలు, దుఃఖం అని అర్ధం. కాషానా అంటే నివాసం, ఖరాబీ అంటే వినాశం. దర్ అంటే తలుపు. దరో దివార్ అంటే తలుపులు గోడలు అని అర్ధం. టపక్నా అంటే బొట్లు బొట్లుగా రాలడం. వర్షంలో ఇంటి పైకప్పు లీకేజి ఉంటే వర్షపు నీరు బొట్లు బొట్లుగా లోపల పడుతుంది దీని టపక్నా అంటారు. టపక్తా హై అంటే కారుతుంది అని అర్ధం. పాత ఉర్దూ వాడకంలో టప్కే హై అని కూడా ఉపయోగించేవారు. బయాబాం అంటే అడవి. బయాబాం హోనా అంటే అడవిగా మారడం (making of wilderness) అని చెప్పుకోవచ్చు. అంటే అడవిగా మారే ప్రక్రియ బొట్లు బొట్లుగా కారుతోందన్నది భావం. ఈ కవిత భావాన్ని పరిశీలిద్దాం. గాలిబ్ చాలా విషాదంలో ఉన్నాడు. రోదిస్తున్నాడు. అయితే ఈ రోదన తన ఇంటిని నాశనం చేయాలనుకుంటోందని మనకు చెబుతున్నాడు. తన ఇంటి గోడలు, తలుపుల నుంచి వర్షంలో నీరు కారుతున్నట్లు అడవి కారుతుందని చెబుతున్నాడు. ఇల్లు పాడుపడితే ఇంటిలో పిచ్చిమొక్కలు పెరిగి అడవిలా తయారవుతుంది. తన రోదన తన ఇంటి వినాశాన్ని కోరుతుందని, అందువల్ల ఇంట్లో వర్షపు నీటిలా అడవి కారుతోందని చెప్పాడు. ఈ కవితలోని పదచిత్రాలు, పోలికలు పరిశీలించదగ్గవి. రోదన వల్ల కంట నీరు వర్షిస్తుంది. ఆ రోదన అతని ఇంటి వినాశాన్ని కోరుతుంది. అందువల్ల ఆ నీరు అడవిగా ఇంటి గోడలనుంచి, తలుపుల నుంచి కారుతోంది. ఇలాంటి పోలిక బహుశా గాలిబ్ తప్ప మరెవ్వరూ చెప్పలేరు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్లో 4వ షేర్ వాయె దీవాన్గీ షౌఖ్ కీ హర్ దమ్ ముఝ్ కో ఆప్ జానా ఉధర్, ఔర్ ఆప్ హీ హైరాం హోనా అయ్యో, ప్రేమబాధ ఏం చెప్పేది ప్రతిక్షణం అటు వెళ్లడమూ, అయోమయంగా మరలడమూ ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. వాయ్ అంటే అయ్యో అని భావం. దీవాన్గీ యే షౌఖ్ అంటే ప్రేమ పిచ్చి. ప్రేమాతిశయం. హర్ దమ్ అంటే అనుక్షణం, ఈ పదానికి మరో అర్ధం ప్రతి ఊపిరిలో. ఇలాంటిదే మరో పదం ఏక్ దమ్ అంటే ఒక్కుదుటు అని అర్ధం. నిఘంటు ప్రకారం ఒక్కశ్వాసలో. దమ్ అంటే శ్వాస. హర్ దమ్ అంటే ప్రతిశ్వాసలో అని భావం. ఉధర్ అంటే ఆ వైపు. ఇక్కడ ఆమె వైపు అని భావం. హైరాం అంటే అయోమయానికి, గందరగోళానికి గురికావడం. ఈ కవిత భావాన్ని చూద్దాం. గాలిబ్ తన ప్రేమను వర్ణిస్తున్నాడు. ప్రేమలో పిచ్చివాడైపోయాడు. చివరకు తన ప్రేమపిచ్చి పట్ల తనకే అయ్యో అనిపిస్తోంది. ప్రేమపిచ్చిలో పడి అనుక్షణం ఆమె కోసం వెళుతున్నాడు. కనీసం ఒకసారి చూడాలని, అది సాధ్యం కాదని తెలిసి కూడా వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరరే ఇక్కడికి ఎందుకొచ్చాను అని అయోమయంలో పడిపోతున్నాడు. ఆమెను చూడడమైతే సాధ్యం కాదు. కాని ఏం చేస్తాడు, ప్రేమపిచ్చిలో పడ్డాడు కాబట్టి వేలసార్లు అక్కడికి వెళతాడు, మళ్ళీ నిరాశగా తిరిగివస్తాడు. ఈ కవితలో ప్రియుడి పరిస్థితిని వర్ణించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రేయసిని చూడ్డానికి ఆమె వీధిలో చక్కర్లు కొట్టడం మామూలే కదా. ఒక్కోసారి అదృష్టం కలిసొస్తే కనబడుతుంది లేకపోతే లేదు. ప్రేయసిని చూడాలన్నది ఒక అందమైన కల. ఆమె కనబడదన్నది వాస్తవం. కల వాస్తవాల్లో చిక్కుకుపోయిన పరిస్థితి. ఈ నిస్సహాయ పరిస్థితి చూసి అయ్యో అనకుండా ఎవరుంటారు? గాలిబ్ కూడా అదే అంటున్నాడు. తన నిస్సహాయస్థితి పట్ల అయ్యో అనుకుంటున్నాడు. ఇది కేవలం ప్రేమపిచ్చిలో పడిన వారి పరిస్థితి మాత్రమే కాదు, ఇలాంటి పిచ్చి ఇష్టం ఎవరి పట్ల అయినా ఉండవచ్చు. అభిమాన తారలను ఒక్కసారి చూడాలని పడిగాపులు పడేవాళ్ళు ఎంతమంది లేరు. అలాంటి వారిని చూసినప్పుడు కూడా అయ్యో అనిపించే జాలి మాత్రమే కలుగుతుందన్నది ఆలోచిస్తే గాలిబ్ కవితలో ఉన్న లోతు అర్ధమవుతుంది. గాలిబ్ ఇక్కడ తన ప్రేమపిచ్చిని గొప్పగా వర్ణించుకోవడం లేదు. ఈ పిచ్చి విషయంలో తనపై తానే జాలి పడుతున్నాడు. ఈ కవితలో గాలిబ్ వాడిన ’’హర్ దమ్‘‘ అన్న పదం గమనించదగ్గది. సాధారణంగా ఈ పదానికి అర్ధం అనుక్షణం. కాని దమ్ అంటే శ్వాస అని అర్ధం. హర్ దమ్ అంటే ప్రతిశ్వాస అని అర్ధం. ఇక్కడ ప్రతి శ్వాస అన్న భావం తీసుకుంటే, ఈ కవిత ఇష్క్ హకీకీ కవిత. ఉర్దూలో ప్రేమ అనేది రెండు తరగతులుగా విభజించవచ్చు. ఇష్క్ మజాజీ అంటే ప్రాపంచిక ప్రేమ. అంటే ఒక ప్రేయసి ఒక ప్రియుడికి మధ్య ఉండే ప్రేమ. ఇప్పటి వరకు ఈ కవితకు మనం అలాంటి కోణంలోనే భావం తెలుసుకున్నాం. కాని ఇష్క్ హకీకీ అంటే దైవం పట్ల ప్రేమ. అంటే నిజమైన ప్రేమ. ఇదే సూఫీతత్వం. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవితలో లోతయిన సూఫీతత్వం ఉందన్నారు. ప్రతిశ్వాస తీసుకుంటున్నప్పుడు నిత్యుడు, సృష్టికర్త అయిన దైవం వైపునకు పరుగెత్తి వెళుతున్నాడు. కాని దైవాన్ని చూడడం సాధ్యం కాదని తెలిసి అయోమయంగా వెనక్కి మళ్ళుతున్నాడు. దైవాన్ని చూడాలన్న కోరికతో వెళ్ళడాన్ని ఉచ్ఛాస్వగాను, చూడలేక నిస్సహాయంగా మరలడాన్ని నిశ్వాసగాను వర్ణించాడు. ఈ కల వాస్తవాల మధ్యనే బతుకుతున్నాడు. తీసుకున్న ఊపిరి పైకి పోతే మనిషి ఇహలోకాన్ని చాలిస్తాడు. ఆ తర్వాత దేవుడి ముందు జవాబు చెప్పుకునే పరలోకంలోకి ప్రవేశిస్తాడు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 5వ షేర్ జల్వా అజ్ బస్కే తఖాజాయె నిగా కర్తా హూం జోహరె ఆయినా భీ, చాహే హై మజగాం హోనా ఆమె అద్భుత రూపం అందరి దృష్టికి కేంద్రం అద్దంపై గీతలు కూడా కనురెప్పలై ఆమెను చూస్తున్నాయి ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. జల్వా అంటే వైభవం. అజ్ బస్కే అంటే అత్యధికంగా అని అర్ధం. తఖాజా అంటే డిమాండ్ అని అర్ధం. తఖాజాయే నిగా అంటే దృష్టి పడాలని డిమాండ్ చేయడం. జోహరె ఆయినా అంటే అద్దంపై ఉన్న గీతలు (scratches). పాతకాలంలో అద్దాలను చేత్తో పాలిష్ చేసేవారు. అందువల్ల అద్దంపై కొన్ని గీతలు ఉండేవి. అద్దాలు గాజుతో కాకుండా లోహంతో కూడా చేసేవారు. మజ్ గాం అంటే కనురెప్పకు ఉండే వెంట్రుకలు, రోమాలు ఇంగ్లీషులో eyelashes. ఈ కవితకు భావం చూద్దాం. గాలిబ్ ప్రేయసి సౌందర్యం వైభవోపేతమైంది. అందరి చూపులను తనవైపు తిప్పుకునే సౌందర్యం ఆమె స్వంతం. మరో విధంగా చెప్పాలంటే ఆమె సౌందర్యం అందరి చూపులను తనవైపు చూడాలని ఆదేశిస్తుంది. ఆ ఆదేశాన్ని అద్దంలోని గీతలు కూడా మన్నిస్తున్నాయి. అద్దానికి ఉన్న గీతలు కూడా eyelashes గా మారి ఆమెను చూస్తున్నాయి. ఈ కవితలో గాలిబ్ అద్దానికి కూడా ప్రాణం పోశాడు. ఆమె తన్ను తాను చూసుకోడానికి అద్దం వద్దకు వెళ్ళింది. కాని ఆమె సౌందర్యం అసాధారణమైనది. అందరి చూపులు తనవైపు తిప్పుకునే ఆ సౌందర్యం అద్దాన్ని కూడా తనవైపు చూసేలా చేసింది. అద్దం కూడా ఆమెను కళ్ళార్పకుండా చూస్తుంటే, అద్దంపై ఉన్న గీతలు కనురెప్పలపై రోమాలుగా మారిపోయాయి. ప్రేయసి సౌందర్యాన్ని ఇలా వర్ణించిన కవి మరొకరు ఎవరైనా ఉన్నారా? తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 6వ షేర్ ఇష్రతె ఖతల్ గయే అహ్లే తమన్నా మత్ పూచ్ ఈదె నజ్జారా హై, షంషీర్ కా ఉర్యాం హోనా వధ్యస్థలిలో ప్రియుడి సంతోషం గురించి అడక్కు నగ్నకరవాలం, పండుగ నాటి నెలవంకే అవుతుంది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఇష్రత్ అంటే సంతోషం, ఉత్సాహం వగైరా అర్ధాలున్నాయి. ఖతల్ గాహ్ అంటే వధ్యస్థలి. హతమయ్యే చోటు. అహ్లె తమన్నా అంటే ప్రేమించిన వారు. ఈద్ అంటే సంతోష సమయం. పండుగ. నజ్జారా అంటే దృశ్యం. షంషీర్ అంటే కరవాలం. ఉర్యాం అంటే నగ్నంగా అని అర్ధం. షంషీర్ కా ఉర్యాం హోనా అంటే ఒర నుంచి బయటకు దూసిన కరవాలం. నగ్నకరవాలం. ఈ కవితలో గాలిబ్ ఒక దృశ్యాన్ని వర్ణించాడు. ప్రేమపిచ్చిలో మునిగిపోయిన వారు చివరకు తమ ప్రేయసిని ఒక్కసారి చూడడానికి వధ్యస్థలికి కూడా చేరుకున్నారు. అంటే తమ ప్రాణాలు పోగొట్టుకునే ప్రదేశానికి కూడా వచ్చేశారు. అక్కడ చావు సమీపంలో, వధ్యస్థలిలో వారి సంతోషం గురించి అడగొద్దు, వారు చాలా ఉత్సాహంగా ఉన్నారంటున్నాడు. ఆమె చేతిలో హతమైన ఫర్వాలేదు, ఎందుకంటే అప్పుడు ఆమెను చాలా దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది కాబట్టి. ఆమె ఖడ్గాన్ని ఒర నుంచి పైకి లాగినప్పుడు వారికి ఆ కరవాలం పండుగ రోజున నెలవంకను చూసినంత సంతోషాన్నిస్తుంది. (రమజాన్ పండుగ నెలవంకను చూసిన తర్వాత ఉపవాసాలు విరమించి చేసుకుంటారు. నెలవంకను చూడడం అనేది మర్నాడు పండుగ ఉందన్న సంకేతం. కాబట్టి చాలా సంతోషకరమైన దృశ్యం). వధ్యాస్థలిలో ప్రియుడి సంతోషం ఎలా ఉంటుందో నన్నడక్కండి అంటున్నాడు గాలిబ్. అంటే అంత అతిశయించిన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే పరిస్థితి. ఆమె చేతి కరవాలం వంపు పండుగ నెలవంకలా వారికి ఆనందాన్నిస్తుంది. చివరి శ్వాస వదిలే ముందు అతి దగ్గరగా చూసే అవకాశం వారికి లభించిందన్న సంతోషం పట్టశక్యం కానంత ఉంటుందంటున్నాడు. ఉర్దూ కవిత్వంలో ప్రతీకల వైవిధ్యం, కొన్ని అతిశయోక్తుల ప్రయోగం తెలుగులో కాస్త కొత్తగా ఉండవచ్చు. ఉర్దూ కవిత్వంలో ప్రతీకలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ప్రేయసిని ఖాతిల్ (హంతకి) అని వర్ణించడం చాలా సాధారణం. ప్రేయసి కనుబొమలను కరవాలంగా పోల్చడమూ కనబడుతుంది. ఎందుకంటే వాటి పదునైన సౌందర్యం ప్రియుడి గుండెను ముక్కలు చేస్తుంది కాబట్టి. ప్రేయసి చూపులను చురకత్తులతో పోల్చడమూ సాధారణంగా కనిపిస్తుంది. గాలిబ్ ప్రత్యేకత ఏమంటే, కవితలో సూచనామాత్రంగా పదాలు ప్రయోగించడం వల్ల పాఠకులు తమ ఊహాశక్తికి పదును పెట్టి అక్కడ దృశ్యాన్ని అర్ధం చేసుకుంటారు. ఎవరి ఊహ ఎంతవరకు వెళ్ళగలిగితే అంతగా దృశ్యం విస్తరిస్తుంది. గాలిబ్ పై కవితలో నగ్నకరవాలం పండుగ నెలవంకలా ఆనందాన్నిస్తుందని మాత్రమే చెప్పాడు. ఇక్కడ నగ్నకరవాలం అనేది ఆమె కనుబొమలకు అన్వయిస్తే, ఆమెను కలిసిన స్థలమే వధ్యస్ధలిగా మారిపోయింది. ఎందుకంటే అందమైన ఆ కనుబొమలు నగ్నకరవాలాలకు తక్కువ కాదు, అవి ప్రియుడి గుండెను ముక్కలుగా ఛేదిస్తున్నాయి. కాని వాటి మెరుపులు (అంటే కనుబొమల కదలికలు) చూస్తుంటే పండుగ నెలవంకను చూసినంత ఆనందంగా అనిపిస్తుంది. ఈ కవితలో గాలిబ్ ప్రేమికులను ఆశావాదుల సమూహంగా కూడా పిలిచాడు. అహ్లె తమన్నా అంటే ఈ అర్ధం కూడా చెప్పుకోవచ్చు. ఈ కవితలో చాలా అర్ధచ్ఛాయలున్నాయి. ఇక్కడ ఈ సమూహం ప్రేమికులదే కాదు, ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వారి సమూహం కూడా కావచ్చు. దేశం కోసం, జాతి కోసం నడుంకట్టిన వ్యక్తుల సమూహం కావచ్చు. ఇలాంటి వారికి తమ లక్ష్యమే అత్యంత ప్రియమైనది. ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి ఏమైనా చేస్తారు. దేశాన్ని కాపాడే సైనికులకు దేశరక్షణే అత్యంత ప్రియమైనది. ఆ లక్ష్యం కోసం యుద్ధరంగంలో నగ్నకరవాలాన్ని చూసి భయపడడు, పండుగ నెలవంకను చూసినంతగా సంతోషిస్తాడు. గాలిబ్ ఉపయోగించిన వథ్యాస్థలి అన్న పదం చాలా సందర్భాలకు అన్వయించే పదం. ప్రేమికుడికి ప్రేయసిని కలుసుకున్న ప్రదేశమే వథ్యాస్థలి అయితే, సైనికుడికి అత్యంత ప్రియతమమైన దేశరక్షణకు యుద్ధరంగమే వథ్యాస్థలి. అలాగే నిరుపేదలను ఆదుకునే లక్ష్యాన్నే ప్రేమించిన వారికి బీదసాదల కోసం పాటుపడడంలో ఎదురయ్యే కష్టనష్టాల నగ్నకరవాలం పండుగ నెలవంకే అవుతుంది. ఒక విస్తృతస్థాయి వివరణకు అవకాశమున్న కవిత ఇది. గజల్ ప్రత్యేకత ఇదే. ప్రతి రెండు పంక్తుల షేర్ దానికదే స్వతంత్రంగా ఉంటుంది. గజల్ లోని మిగిలిన షేర్లతో దానికి ప్రత్యక్ష సంబంధం ఒక్కోసారి ఉండకపోవచ్చు. అంతర్లీనంగా ఒక భావం అన్ని షేర్లను పూలదండలో దారంలా దాగుంటుంది. ఇది ఈరోజు గాలిబానా వచ్చే శుక్రవారం మరిన్ని గాలిబ్ కవితలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు. అస్సలాము అలైకుమ్.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOtAV2

Posted by Katta

Abd Wahed కవిత

ఒంటరి చూపుల దారాలకు గాలిపటాల్లా సూర్యచంద్రులు. తెగితే చిత్తుకాగితాలే చీకటిపగళ్ళ చిక్కుముడులే ఆరిపోయిన మనసులా దారి మునగదీసుకు నిద్రపోతుంది బాధలు నడిచే బాటేది? విషాదాల పూలవనానికి సాగునీరు కరువు కాదు కంటిలో మంచుపొర మెరుస్తూనే ఉంటుంది రాళ్ళవాన కూడా కురవడం లేదే! ఉన్మాదపు హోరు పుట్టల్లోకి మళ్ళిందా? ప్రేయసి పెదవిలాంటి మెత్తనైన మట్టిరోడ్డు ఎక్కడికి పోయింది? చిరుగాలి పైటలా ఒక్కసారి స్పర్శిస్తే చాలు.. దౌర్జన్యాలు లెక్కపెట్టడం ఎందుకులే కన్నీళ్ళు లెక్కలేనన్ని ఉన్నాయి... హంతకుడిని చూసి భయపడేదేముంది కట్టిపారేసి లొంగదీయడానికి కాళ్ళు చేతులు మిగలకుండా చూసుకుందాం... మెడలు తెగిన పూలు రాలిపోతే పోనీ... నేల సువాసనతో పరిమళిస్తుంది... చీకటి విత్తనాలు చల్లిందెవరైనా మొలకెత్తక మానవు కదా అంధకారం మర్రిలా జడలు విరబోసుకుంది సూర్యచంద్రుల దారాలు తెగేలా లాగిందెవరు? బైరాగి జుట్టులా, ఫకీరు గెడ్డంలా చిక్కుపడిన చీకటి పగళ్ళను సంస్కరించే దువ్వెన ఎక్కడుంది? ఒంటరి గడ్డిపోచ గాలికి కొట్టుకుపోనీ ఎక్కడో ఒకచోట తోడు దొరక్కపోదు

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/TUAhL2

Posted by Katta