పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Aruna Naradabhatla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aruna Naradabhatla లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Aruna Naradabhatla కవిత

మేల్కొలుపు ___________అరుణ నారదభట్ల రాత్రంటే కేవలం చీకటే కాదు అందంగా ఆకాశాన్ని చుట్టుకునే నక్షత్రాలూ కావు! చల్లని వెన్నెలలా చేరే జాబిల్లే కాదు! ఎందరి ప్రయాసలనో ఒడిలో చేర్చుకొని లాలించి నిదురపుచ్చే నేస్తం! ఎన్ని హృదయాలనో ఒకటిగా కలగలిపే అమృత హస్తం! ఎన్ని మౌనాలనో మేల్కొలిపే తీయని రాగం! ఎన్నో జ్ఞాపకాలను కొత్తగా హత్తుకునే జ్ఞాననేత్రం! రాత్రంటే కేవలం భయమే కాదు ధర్యాన్ని రంగరించే తండ్రి! అలసిన ప్రకృతి మూగబాస రాత్రి! ఇంటిపక్కన గోరీలు నేర్పిన గుండె నిబ్బరం రాత్రంటే! కేవలం నలుపే కాదు రాత్రంటే కోట్ల దీపాలనూ స్వయంగా వెలిగించుకునే శక్తి! నీకు నువ్వుగా ఓ ప్రచండ కాంతి రవికి తెలియని కొత్తలోకం రాత్రి! నిశ్శబ్దంగా వీచే చెట్ల గుసగుసలు రాత్రి! పురుడు పోసుకునే వేకువకు నొప్పుల చీకటి రాత్రి! వెలుగుకు గుర్తింపు నిచ్చేది ఎన్నో కలాలకు...కలలకు పనిచెప్పేది ప్రశాంతంగా పడకగదికి మోసుకెళ్ళేది వెచ్చని దుప్పటై అల్లుకునేది! తీరని కోరికలను మధురస్వప్నమై వీక్షింపజేసే సుందర క్షణం రాత్రి! ప్రతినిత్యం కొత్తపదాలతో తెల్ల కాగితంపై చీకటిని చీల్చేది రాత్రి! రాత్రంటే నా ప్రియమైన నేస్తం నన్ను వింతగా మేల్కొలిపే ఆపన్న హస్తం! 23-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UyuU46

Posted by Katta

22, జూన్ 2014, ఆదివారం

Aruna Naradabhatla కవిత

మంచుగడ్డ _________అరుణ నారదభట్ల బాల్యం ఎప్పటికీ బలమైనదే... ఎదురీదటం అనే భావమే స్పృశించదు! కల్లకపటం మాట దరిచేరదు అనుభవాలు చేదుగానూ ఉండవు! అమ్మ తిట్టినా హాయిగానే దులిపేసుకుంటాం మరుక్షణం ఎలాగూ ప్రేమగా హత్తుకుంటుందని! నేనూ అనేతనానికి తావే ఉండదు వెర్రి చేస్టలైనా...ఉపాయాలైనా గొప్పగా ఉప్పొంగే ఆప్యాయతల నడుమ మనసు గడ్డకట్టడమనే మాటే ఉండదు! మట్టి తిన్నా....మతాబులు కాల్చినా కేరింతలు కొడుతూ ఎగిరే కళ్ళను చూస్తూ మురిసిపోయే నాన్న హృదయం ధైర్యాన్నే నేర్పుతుంది! రాత్రీ...పగలు పెద్దగా తేడాలేదని సమానంగా వచ్చిపోయే చుట్టలనీ అమ్మ నడవడి....జీవిత సత్యం బోదిస్తుంది! పెంచుకున్న పెరటి మొక్కల్లాంటి మంచితనాలను పూచే పువ్వుల్లా వికసింపచేస్తూనే ఉండాలి ! కానీ ఇప్పుడెందుకో ఈ మొహమాటాలూ...మొట్టికాయలూ! ఉన్నది చెప్పలేని తనం... అధైర్యాన్ని అరువు తెచ్చుకోవడం! లేని మౌనాలను తొడుక్కొని బ్రతకటం చేతకాని తనాలను అద్దెకు తీసుకొని ఆకళింపు చేసుకోవడం! పెద్దతనమంటే ఏమో అనుకున్న... అన్నీ దిగమింగి కరుగుతున్న మంచుగడ్డలా బ్రతకాలని ఒప్పుకోలేని మనసును చూస్తుంటేనే ఎప్పటికీ జాలే వేస్తుంది...! ఇంకో కొత్తమాట వెదకాలి రహదారిని ...రహదారిలాగే ఉంచాలి! 22-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uTnymT

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Aruna Naradabhatla కవిత

రైతన్నా...జెరాగే ____________అరుణ నారదభట్ల ఇప్పుడిప్పుడే కదా మొలకెత్తుతున్నది ఈ చిన్ని పిట్ట! గాయాలతో కొట్టుకుపోయిన మట్టి రెక్కలు ఇప్పుడే తొడిగింది! మూకుమ్మడి బ్రతుకులను కొమ్మలు తొడగని లేతకాండం మీద తోసేస్తే ఎట్లా! పుట్టినప్పటినుండీ చేసిన రుణం తీర్చమనడం ఎంతటి భారం! నోరెండుకుపోయిన మట్టిని సంస్కరించాలా... నీకూ ఓ ముద్ద పెట్టాలా... అక్షరాలకు ఊతమివ్వాలా... నిరుద్యోగిని నీడకు చేర్చాలా.. కాలువగట్లు...ఆకాశానికి నిచ్చెనలూ... అన్నీ అనుభవం లేకున్నా సవరించాలా.... కుటుంబ భారం ఒకటే సారి నెత్తినపడింది! తెగిన తీగలకు కరెంటునివ్వాలా... చేదుతున్న బొగ్గుకు ఊపిరి పోయాలా... గొంతెత్తి పలికిన పాటలకు నా అడుగులనూ...తోడిచ్చినడవాలా... అరె.. కొంచం ఆగు... అరిచీ ...అరిచీ.... గిప్పుడే గెలిచింది! కొద్దిగ శక్తి రానీ! ఉన్నదంతా ఒక్కసారే మీదికి తోయకు! మోసేటోడికి తెలుసు కావడి బరువు! ఉన్నం గదా...అన్ని జూస్తం అన్యాయం జెయ్యం అట్లని...అతీ జెయ్యం! ఎంతియ్యాన్నో అంతిస్తం... రైతన్నా...జెర ఆగే... పుట్టినకాడ్నించి ఇయ్యమంటే ఎట్టనే! నన్ను గుడ జూడూ ఎనక బస్తల ఎంతున్నదో జూడనీ కొద్దిగ నా గోనసంచి గుడ నిండద్దా...!! 18-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/U92cXt

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Aruna Naradabhatla కవిత

వెనుకడుగు ___________అరుణ నారదభట్ల ఒక్కసారి నిజం లోకి తొంగి చూడు గతాన్ని మరో మారు తడుముకొని చూడు నీకోసం నడిచొచ్చిన కాలం ఎన్ని మెట్లు దిగజారిందో! పేజీలు మరోమారు తిప్పిచూడు ఏ క్షణాలు నీ పాదాలవాలాయో ఎన్ని చేతులు నీ గొంతును తడిపాయో ఏ రాగం నిను కొత్తగా పలికించిందో ఏ కాలం నీతో నడిచి వచ్చిందో ఒక్కసారి తరికించి చూడు! ఎవరి కలలు నీకు తోడైనాయో ఎన్ని నొప్పులు నిను ఓదార్చాయో! ఒక్కసారి మేల్కొని చూడు మనసు...మనిషి అర్థం ...పరమార్థం కనికరం లేని కాలానికేసి చూడు చేసిందీ...చేయాల్సింది విజ్ఞతతో నీ అడుగులవైపు చూడు! పున్నమిలూ...చీకట్లు నీడలోని సంతోషాలు పుట్టిన నీవో... పుట్టించిన సృష్టివొ ఒకింత ఓపికగా చూడు! చిక్కుకున్న నడవడిలో గమనం భారం కాకుండా కాసింత అహం కోల్పోయి చూడు! క్షణంలో జారిపోయే కాలానికి కనికరంలేదని గమనించి నడు! నిజంలోకి ఒక్కసారి తొంగి చూడు! ఉనికిని కాపాడే జాడ చూడు! ముందు పదిలమవడానికి వెనకకు తిరిగి చూడు! 17-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oAjt9B

Posted by Katta

16, జూన్ 2014, సోమవారం

Aruna Naradabhatla కవిత

కల _____అరుణ నారధభట్ల సూరీడిని మింగే సముద్రం ఎంత అగ్గిని కడుపులో దాస్తుంది! శ్వేతవర్ణం చుట్టుకున్న జాబిలి మసక చీకట్లను గుండెలో ఎంత ముద్దుగా పొదువుకుంది! ఉబికే లావాను భూమాత ఎంత గుట్టుగా బంధిస్తుంది! శూన్యంతో నిండుకున్న ఆకాశం ఎన్ని పాలపుంతలను మోస్తుంది! మూడొంతులూ పరుచుకున్న నీరూ జాలిగా కాసింత నేలను ప్రాణులకోసం వదిలేసింది! తాను లేనిదే నడవదని తెలిసి గాలి.... ఆగకుండా వీస్తూనే ఉంది! పంచభూతాలు మనిషికి ఎంతటి నిర్వచనం! తల్లి కడుపున వొత్తిగిలి అన్నీ ముందే సమ్మేళనం చేసుకొని పసిముద్దగా బాల్యాన్ని హాయిగా పలకా బలపంతో దిద్ది దారిలో కొనుక్కొచుకున్న పిప్పరమెంట్లా తీయగా మింగేస్తాం! మిసిమిగొలిపే పాలబుగ్గలు ఎరుపెక్కే యవ్వనాలు.... లేత చిగురు పూతకొచ్చినట్టు! పరవళ్ళు తొక్కే గోదారి అగాధ సముద్రంలోకి కలిసి పోతుంది! ఈతకొట్టడం ఇక్కడే మొదలు! మంచినీళ్ళ ఆనవాళ్ళు మచ్చుకైనా కనిపించవు! ఒడ్డున పడే కోర్కెలగుర్రం కాళ్ళు నరికినట్టుగా చతికిలబడుతుంది! చిరునవ్వులతో ఆకాశానికెగసిన పక్షి గుంపొకటి ముసురుకుంటుంది! కూలిన ఆనవాళ్ళను వాసన చూస్తూ! దేహం మౌనంగా కసాయి ప్రేమను చూసి లోలోపల నవ్వుతుంది! నిర్మలత్వం చచ్చుబడ్డ కాళ్ళకు తెలుస్తుంది! అత్తగారింటికి వెళ్ళిన చెల్లి ముఖం కేసి చూస్తూ పెళ్ళికాని అక్క అలిగి...అలిసి లోపలే ముఖం దాచేసుకుంటుంది! మొగ్గ పువ్వవ్వాలనుకోవడం.... పువ్వు రాలిపోవాలనుకోవడం... చిత్రమంతా మనసుదే ఎక్కడా నిలవదు! 16-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ovFINV

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

Aruna Naradabhatla కవిత

కాలం _______అరుణ నారదభట్ల నిన్న వెంట రాదు రేపు ఏంటో తెలియదు కేవలం ఈక్షణం మాత్రమే ఈ గుప్పిట్లో దాగుంది! పడి లేచే కెరటం లా ఎన్ని ఉదయాలు చీకటిలో చిక్కుతున్నాయి! గాలి సవ్వడిలో గంభీర రాగం పరుగెత్తే మేఘం రాలుతున్న ఆకులకేసీ చూస్తూ భయం దొసిలిలోకి వెలుగు! ఆ మట్టి ఎందుకో బలి కోరుతుంది నది మంచు ముక్కలకు బదులుగా మనుషుల్ని మోస్తుంది! హిమపాతంతో నిండుకోవాల్సిన కొండలు శవాలను కప్పుకుంటున్నాయి! చేతివేళ్ళు.... నిద్రపోయిన తుఫానును లేపినందుకేమో విహారం పై విహారం నీరు గొంతు తడపడమే కాదు.... పీక నొక్కుతుందని తెలియదు...పాపం! ఇప్పుడు కొట్టుకుపోయింది దేహాలే కాదు ఆకాశానికి ఎగరాల్సిన గొంతుల గుండెకోత...జాతి భవిత ! ఉత్తరానా పచ్చదనం చల్లగా ప్రశాంతంగా పరవళ్ళు తొక్కుతుందనుకుంటే ఉరుముతున్న ఆకాశంలా ఆ భూమి ఎరుపురంగునద్దుకుంటుంది! గత జూన్ అక్కడ డేంజర్ జోన్ ఇప్పుడూ అంతే.... అప్పుడు కేదారం ఇప్పుడు బియాస్ ద్వారం! ముంచేయడం బాగా నేర్చిన నేల ప్రకృతికి దూరంగా మరోసారి మనిషిని తరిమి కొట్టడం! మర మనిషిలా జీవితానికి నాలుగు కరెంటువైర్లు చుట్టుకోవడమే చివరికి మిగిలింది! 10-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qt797S

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Aruna Naradabhatla కవిత

అమృతం ________అరుణ నారదభట్ల ఇంకా పొగ సూరుతూనే ఉంది ముప్పై యేళ్ళ కింద తగలేసిన చితి! సెగలు ఇంకా పచ్చిపచ్చిగానే జీవితం ఎంత తేలిక క్షణికానికి ఆహుతి కావడమేనా!! పవిత్రత అంటే రక్తపాతమా... అమృతం నిండిందనుకుంటే మతం విషం కక్కుతుంది! గురువులను పూజించడం అంటే రాగద్వేషాలకు అతీతమని తెలుసు! వెనకా ముందూ... ఓపికా....సహనం నీకంటూ ఎదురుచూసే వారు ఒక్కసారైనా గురుతుకు రారెందుకో! నీ ఇంటి సమస్య పొరుగిల్లు ఏమని తీరుస్తుంది ఖల్సా చెప్పిన గురువు ఇప్పుడు తెరమరుగయ్యాడు కొన్ని నిశ్శబ్ద హస్తాలు కూల్చిన కలలు రాశులుగా ఇంకా అక్కడే తిరుగాడుతున్నాయి గుంపుల పోరాటం ఎంతటి అస్తవ్యస్త కదలిక రాజ్యం ఆనవాళ్ళను మళ్ళీ ప్రపంచానికి చాటే ప్రయత్నం మతమంటే మానవత్వం మతం అంటే మంచి తనం మతమంటే సంప్రదాయం మనిషి మనుగడను సవ్యమార్గంలో నడిపించేది మహా యోగాలను లోకానికి చాటేది! 7-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1omwkJQ

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Aruna Naradabhatla కవిత

నిశ్శబ్దం ______________అరుణ నారదభట్ల నేనూ ...నా ఈ చిన్ని ప్రపంచం ప్రతి క్షణం కొత్త వేకువే జీవితం! అమ్మ కడుపులో తొమ్మిది నెలలూ మౌనంగానే లోలోపల మాటాడుకున్న పరుగెత్తే రక్తమాంసాలలో కూరుకుపోయి! అమ్మను మరణశయ్యదాకా మోసుకుపోయీ ఊపిరిపోసుకున్న...ప్రపంచానికి నా కాళ్ళనూ పరిచయం చేయాలని! తన ఒడిలో పాపగా ఉన్నపుడు లాలిగా జోల పాడి ప్రేమగా అలుముకున్న స్పర్శ ఇంకా వెన్నంటి నడిపిస్తూనే ఉంది! దోసిలిలో వొంపిన కలలు కడలి ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెలు! ఇంకా గంట మోగుతునే ఉంది ఎక్కడో జారిపోయిన డాల్ ఫిన్ చేపలా...ఆశ కాంతిని ఇనుమడించుకున్న దేహం వెనుక క్రీనీడలా కాలం ఎప్పుడూ మౌనమే వెంట నడుస్తున్నదెందుకో గాలి సోకని చెట్టులా! అప్పుడప్పుడూ కొండచెరియలూ విరిగిపడతాయి... చెట్టూ ఆకులు రాల్చేస్తుంది... తెల్లని మబ్బులూ మసకబారతాయి నేనూ అంతే....చిన్నిచిన్ని చినుకులను రాలుస్తుంటాను! అందుకే....టైం మిషిన్ ఉంటే బాగుండు మళ్ళీ అమ్మవొడిలోకే వొదిగి పోయేందుకు! 5-6-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Swajw9

Posted by Katta

27, మే 2014, మంగళవారం

Aruna Naradabhatla కవిత

అస్త్రం ______అరుణ నారదభట్ల తాజాగా ఎగిరింది సీతాకోక చిలక! మట్టిగూటిని తొలిచివేసిన గొంగళీపురుగు! తేయాకు తోటలో గుప్పుమన్న పొగ మెదడునరాల్లో చిక్కింది! నాట్లు వేసే రైతు పదికాలాల తరువాతి కొత్త చినుకు! పొడిబారిన లోకానికి గొంతు తడిపే వానలా తను! వారసత్వపు కోరల్లో చిక్కిన మువ్వన్నెలను పిడికిట బంధించిన మట్టివాసన...! అంతర్వాహిని పెల్లుబికి పంటకాల్వలుగా విస్తరించింది! కలం..గళం స్వర్ణకమలమై విరిసింది! కొలనులోని పువ్వు.. సరస్సులో నవ్వులు ఆకాశాన మెరిసిన తారాజువ్వలా చీకటిలో వెలుగో.... కళ్ళు చీకట్లు కమ్మే మెరుపో కాలం ఇచ్చిన అస్త్రం వాడే విధానంలోనే గురి....గురుతు తెలిసేది! ఏమైనా అది మట్టి గొంతుక కన్నీళ్ళూ...మంచినీళ్ళూ.. అన్నింటీ రుచి తెలిసిన పచ్చని ఆకుల విస్తరి! 27-5-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oFZhQa

Posted by Katta

21, మే 2014, బుధవారం

Aruna Naradabhatla కవిత

సాధికారం-స్వాధీనం ______________అరుణ నారదభట్ల ఊరేగింపుకు బయలుదేరిన ఉత్సవవిగ్రహంలా...పేరుకే నేను! కారుతున్న చెమటచుక్కలను కొంగుకద్దుకుంటూ ఏదో సాధించాలని ఆరాటపడతాను! సాధికారత పోరులో చింగు చెక్కుకొని కొంగు బిగించి అడుగులను వడివడిగా నాట్యమాడించాలని కలలు గంటాను...! వేసే ప్రతి అడుగూ నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానని అనుకుంటాను...పేరుకుపోతున్న దుమ్ము సాక్షిగా! క్షణకాలం తీరిక లేకుండా అలుపెరుగక నడుస్తూనే ఉన్నా...కానీ నెల ప్రారంభపు జీతం ...నెలాఖరు జీవితం... గమనిస్తే నా ఈ విప్లవం ముసుగు నిజరూపం తెలుస్తుంది! ఉద్యోగం చేసేది ఎవరో ఇప్పటికీ తెలియదు... చేతిఖర్చులకు చేయిచాచినప్పుడల్లా ఈ జీతం...జీవితం మరోసారి వెక్కిరిస్తుంది...నేను భరిస్తున్న శ్రమదోపిడి వైపు చూసి! సంపాదనలో సమానత్వాన్ని ఆహ్వానించిన మనసు చూసుకునే బాధ్యతలనీ సమంగా పంచుకుంటుందా...!?! మంచినీళ్ళూ...మురిపాలూ అన్నీ చేతికందించనిదే ముద్ద గొంతును దాటదు! ఇక రాజకీయమైతే సరేసరి! నిలబెట్టేది నన్నూ...ఏలుకునేది నువ్వూ! పెద్దరికంగా తెల్లకాగితంపై నల్లగీతలా సంతకం నాదే....సమ్మతి మాత్రం నీది! ఎలాగైతేనేమి నా ఆర్థిక స్వాతంత్రం నీకు పరిపూర్ణ స్వేచ్చనిచ్చింది! సంపాదించినా ఇంటికి ఇచ్చే పని లేదు... వ్యసనాలకు కొదవ లేదు! లెక్కలడిగి ఎదిరించేవారూ లేరు! స్వేచ్చా నీ జన్మ హక్కు... నిన్ను పెంచిన తల్లినీ నేనే... లాలించిన ష్త్రీమూర్తినీ నేనే! నీ అవసరాలకు నలుగుతున్న నాయికనూ నేనే! సమానత్వం....సాధికారం అన్నీ కూర్చుని కబుర్లు చెప్పినంతవరకే... లోపలంతా పాతప్రపంచమే! ఎదురీదితే అన్నీ అనుమానాల దుప్పట్లే ... వొంటినిండా చుట్టుకున్న పరువును... కలుషిత పదజాలంతో కాలరాచే కలిపురుషుడవు..... ఆత్మాభిమానంపై దెబ్బతీయడమే నీకు తెలిసిన చివరి అస్త్రం... మాటలతో లొంగదీయడం నీ అభిమతం... అందుకేనేమో విరుచుకుపడుతున్న విప్లవంలా ఆడతనం... సంస్కృతీ...సాంప్రదాయాలకు స్వస్తి చెబుతుంది... స్వేచ్చగా బతకడానికి పిడికిలి బిగించింది! ఈరోజే అంతం కాకపోయినా..... శిశుపాలుడూ కృష్ణుని చందానా తప్పులను జమచేస్తూనే ఉంది! అరాచకం కాలగర్భంలో కలిసేవరకూ... అలుపెరుగక పయనిస్తూనే ఉంది... ఆడతనం ..అమ్మతనం పక్కన బెట్టిన అగ్ని కణం! 21-5-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ndGFK7

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Aruna Naradabhatla కవిత

విలువలు _________అరుణ నారదభట్ల పరుగుపందెం కొద్దిగా పుంజుకుంది... కాళ్ళూ నావే...చేతులూ నావే! కాలం కళ్ళు తెరిపించిన చరిత్రా నాదే! నేనో మూలబడిన పుస్తకాన్ని... పేజీలనిండా బోలెడన్ని కలలు! సద్దిమూట నుండి విప్పిన ఎర్రని పచ్చడిమెతుకునూ... రంగూ...రుచీ తో పాటూ నోరూరించే అందచందాల సుగంధాలూ నావే! విజ్ఞాన సర్వస్వంలా ఇంటితోటకే పూలై పూసాను ఇంతకాలంగా! "పరిమళాలను పీల్చేసుకొని నాలుగు గోడలకే అంకితం చేసే ఈ సంసృతికి ఇప్పుడు నేనో దూరపు బంధువును!" "నా సేవలకు విలువ కట్టని ఈ లోకానికి నేనిప్పుడో చక్కని జవాబుదారిని!" "లోకం ఉనికిని చాటుతున్న మాతృత్వానికి విలువ లేనప్పుడే మానవధర్మం అంతరించింది!" "ఉదయాన్నే టీ కప్పునుండీ కళ్ళకు నిద్దుర కమ్మే వరకూ... నీకూ నీ బీజాలకు క్రీనీడనైనా నా ఉనికిని ఒక్కసారైనా గమనించని సమాజానికి ఇప్పుడు నేనో కొత్త పోటీని!" "కళ్ళాపు చల్లిన వాకిలిలో ముగ్గుగా ముడుచుకొని మల్లెపూవులా ఉండాలనుకున్న... నీ అడుగుజాడనై!" "అనుక్షణం అణచివేసిన ఆరాటాలు పెద్దమూటై గుట్టగా మారుతున్నాయి!" "మళ్ళీ పూర్వపు వాసనలు"!!! "ముక్కంటి తెలివిగా బంధించాననుకొన్నాడు... ఇప్పుడు మూడు కళ్ళూ మూడు ప్రళయాలై అన్ని రంగాలనూ దట్టంగా ఆలింగనం చేసుకుంటున్నాయి!" "నరాల్లో పరుగెత్తిన రక్తం ఒక్కసారిగా ఉవ్వెత్తున పారుతుంది!" "పొలం నాటువేసే పడతినుండి దేశాన్నేలే నేత దాకా.... మళ్ళీ అంతా నేనై ఆవహిస్తున్నా!" "ఆడది...అబల...స్వాతంత్రమా.. అని నవ్విన నోళ్ళు ఇప్పటికే గుక్కపట్టుకొని ఏడ్వడం ప్రారంభించాయి!" "విలువలను వెదుక్కుంటూ వెళ్ళే ప్రయాణంలో ప్రస్తుతం నువ్వో పాత్రవు మాత్రమే అయ్యావు!" "కేవలం ఆర్థిక స్వాతంత్రనికే" దాసోహమైన పురుష ప్రపంచానికి ఇప్పుడు నేనో గట్టి పోటీని! "అన్ని కార్యాలనూ అవలీలగా చక్కదిద్దే భారతనారీని!" "ఇప్పుడు ఆకాశమూ నాదే... అంతుచిక్కని అద్భుతమూ నేనే!" "ప్రకృతిని చదవడానికి ఇకపై ఎన్ని జన్మలు ఎత్తాలో నీ ఉనికి మళ్ళీ పూవులా పరిమళించాలంటే!" 20-5-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jkZmro

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Aruna Naradabhatla కవిత

ఊహ ______అరుణ నారదభట్ల నువ్వున్నావో లేవో అన్న సందిగ్దం చెలరేగినప్పుడల్లా...మౌనం అలజడిలో కొట్టుకుపోయి నిశ్శబ్దం లోపల గారడి విద్య నేర్చుకుంటుంది! ఉన్నట్టుగా మెరిసే సంతోషంలో క్షణం నేనూ క్షణం నీవూ... పూవుల్లో నిండుకున్న తేనియలా చీకటికి వెలుతురులా....! గడిచే ప్రతి క్షణం నీవల్లే అని అనుకున్నప్పుడు నాలోనేను కూడగట్టుకున్న ధైర్యమే అయినా భ్రమపడుతున్నది మాత్రం నిన్నే! లోలోపల జాలువారే జలపాతాలను చల్లని మేఘం స్పృషించినట్టు తేలికగా వేసిన అడుగులనానుకొని నీవులేకున్నా... ఓ సంతృప్తి నీ చూపు సోకిందేమోనని! ఒక్కోసారి అద్దంలో నా ప్రతిబింబంలో మెరిసే అందానివీ నీవేనని కలగంటానా చేజారిన గాజుపాత్రలా అతకడానికీ వీల్లేనంత ముక్కలవుతుంది మనసు! నాలోనేనా...నాలో నువ్వా... అన్న మాటే ఇంకా తేలడం లేదు! దేవుడేమొ అనుకున్న..స్తబ్దుగా చలనమే లేదు! పోనీ దయ్యమనుకొని వదిలేసా..నీడలా వెంటే ఉంది! నేనున్నంతవరకూ నాతోనే ఉంటుందేమో... ఈ నా ఆశ రేకులు రాలిపడగా మిగిలిన పుప్పొడిగుచ్చంలా మోడువారినా పరిమళాలు మాత్రం ఎప్పటిలాగే! 29-4-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1frTo8j

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

Aruna Naradabhatla కవిత

స్త్రీత్వం _______అరుణ నారదభట్ల ఆడతనమంటే ... ముడుచుకొని కూర్చోవడం కాదు! కేవలం నగలూ...బట్టలూ కాదు! అలక ఆర్భాటం అంతకన్నా కాదు! మగాడిని వయ్యారంగా ఆకట్టుకోవడం అస్సలే కాదు! ముసిముసి నవ్వులతో ముగ్ధులను చేయడమూ కాదు! రెచ్చగొట్టే మాటలతో కుటుంబాలను కూల్చడమూ కాదు! అన్యూన్యతలను దెబ్బతీయడమూ కాదు! భార్యంటే బంధాలను తోసిపుచ్చడం కాదు! తనవారికే పెద్దపీట వేయడమూ కాదు! ఆడదంటే అణచివేతకు గురవడమూ కాదు! సహనం కోల్పోయి హత్యలూ ... ఆత్మహత్యలు చేయడమూ కాదు! ఆడతనమంటే అవసరాలకు వాడుకోవడమూ కాదు! ఆటబొమ్మలు అంతకంటే కాదు! ఓర్పు వహించడము చేతకాని తనమూ కాదు! బంధాలకు విలువనిచ్చే మంచితనం! సృష్టిని నడిపే అమ్మతనం ఆడతనం! చిన్నపాటి ప్రేమకు దాసోహమయ్యే మరువం లాంటి మగువతనం! ఆడతనమంటే ఆత్మవిస్వాసం! అవగాహన....అణకువతో కూడిన ఆలోచన! ఓర్పు ...సహనంతో పాటుగా అవసరమొస్తే తెగింపు! ధైర్యంతో కూడిన నమ్మకం! అనిర్వచనీయమైన ప్రేమ తత్వం! తోడినకొద్దీ ఉబికే నీటి చెలిమెలా సహనం త్యాగం...ఆలోచనా విచక్షణ తొందరపాటుకు తావివ్వని ముందుచూపు ఆడతనం! ఒక్క శారీరక బలం తక్కువైనా మానసిక బలం చాలా ఎక్కువ!

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k8KZFS

Posted by Katta

21, ఏప్రిల్ 2014, సోమవారం

Aruna Naradabhatla కవిత

అనుబంధం _______________అరుణ నారదభట్ల నాలుగు చేతులు కలిసి నీడై కట్టుకున్న గూడులా మా అమ్మమ్మాతాత! సెలవులొస్తే మాకోపండగలా ఆ ఇల్లు! వెళ్ళగానే స్వచ్చమైన ముత్యంలా మా అమ్మమ్మ చిరునవ్వుల పలకరింపులూ...తీయని కబుర్లు! చేతిలో అడకత్తెరతో టిక్కుటిక్కుమంటూ అరుగు మీదే తాత నివాసం! తాను చెప్పే కథలు వింటుంటే కాలం ఇట్టే గడిచి పోయేది! కథల్లోని నీతంతా వొంటబట్టినట్టు జీవితపు విలువలు అక్కడే తెలిసేవి! బంధాలూ ..అనుబంధాలూ కష్టసుఖాలూ...మానం...అభిమానం ఆ ఇంటి గోడలు! పందిరినిండుగా పరుచుకున్న జాజితీగలా అక్కడంతా ప్రేమ సుగంధాలే! హాయిగా ఊగే ఉయ్యాలపాట... చప్పరం నిండుగా నిండిన గుమ్మి.. తీయగా శ్రీకండు రుద్దే మా తాత చేయి అన్నీ కనుమరుగయ్యి ఉలకక పలకక ఖాళీగా ఉన్నాయి! ఆ ఇల్లు మూలబడింది ప్రేమలు కరువైన దేహంలా! చెదలెక్కకుండా వాసాలకు వేసిన జాజు ఇప్పుడు నెమ్మదిగా రంగు వెలసిలిపోయింది! సోనాసి గూటిలోని బాగాలడబ్బా నిశ్శబ్దంగా మూతిబిగించుకుంది! పువ్వులా నవ్వే అమ్మమ్మాతాత మిద్దెగోడకు వేలాడే ఫోటోలో కూర్చున్నారు! ఇంటిని కాపాడాల్సిన దూలాలు భరువెక్కి బీటలు పడ్డాయి! గోడలు పర్రెలు వాసి పై కప్పు పందిరిలా పెంకులు రాలి బైటి వెలుతురు లోనికి చొరబడుతుంది! దీపం లేని గుడిలా ఆ ఇల్లు ఆప్యాయతలు మిద్దె బారంగీ మీద ఉంచిన ఇత్తడి డబ్బాలో పడిపోయాయి! వాళ్ళు చూపిన ప్రేమ ఇప్పటికీ మా మనసుల్లో చినుకులై రాలుతూనే ఉంది! ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు పేరుకుపోయిన బూజు దులిపితే మా ఆ ఇల్లు అందమైన హరివిల్లే! 21_4_2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rdJBTe

Posted by Katta

16, ఏప్రిల్ 2014, బుధవారం

Aruna Naradabhatla కవిత

మెరుపు కల _____________అరుణ నారదభట్ల ప్రేమాక్షరాలు రాలిపడుతుంటే నాకే అంకితమనుకున్న అక్షరానికే పరిమితమని తెలిసి వెనుదిరగలేనందుకు మౌనంలో మునిగిపోయా! ఆకాశం హరివిల్లై విరిసినప్పుడల్లా అన్ని రంగులు జీవితంలో పండుతాయనుకున్న! నువ్వు ఎరుపు రంగై కాలుస్తుంటే నేను ఊదారంగై మిగిలి పోయా! వర్షం కురిసినప్పుడల్లా అహ్లాదంగా ఆహ్వానించినందుకేమో నేనే ఓ వర్షంలా చినుకులు రాలుస్తూనే ఉన్న! ఎగిరే పక్షులను చూసినప్పుడల్లా నా స్వేచ్చా వృక్షంలా విశాలమైనదనుకున్నా మూడుముళ్ళ పంజరాన ముడుచుకుని కూర్చున్న! వెన్నెల రాత్రుల్లో చందమామ మనమధ్యన ఎందుకనుకున్న నువ్వే నా చందమామవని చీకటినిండిన శూన్యాకాశానివని నాలోకి నిండుకున్నాకగానీ తెలిసింది! పిల్లగాలిలో చల్లగా నడిచినపుడు ఆశలూ...ఆశయాలూ స్వచ్చంగా నిండుతాయనుకున్న ప్రకృతి కరువైన కంకర రోడ్డులా ఉత్తి రాళ్ళై గుచ్చుతున్నాయి! విరిసే పూలతోటలో తిరిగినప్పుడల్లా పరిమళాల పలకరింపులు జీవితాంతం నిండుతాయనుకున్న మండే సూరీడై వాడిన పూదోటలా మార్చే ఆయుధమవుతావని కలగనలేదు! మెరుపులా వచ్చే పిడుగులాంటి "ప్రేమ" వెలుగులో చీకటవడమె మనసున్న మనిషి వంతేమో! 16-4-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hK4Ooa

Posted by Katta

15, ఏప్రిల్ 2014, మంగళవారం

Aruna Naradabhatla కవిత

చార్ పత్తర్ __________అరుణ నారదభట్ల నాలుగు డబ్బాల్లో నాలుగు ఎజెండాలు గెంతడం అలవాటైన "ప్రాణం"! అడుగులకు అస్తిత్వాన్నిస్తే ఓకే జామపండు తిన్న చిలకలా పలికేదంతా తీయగా ఆ గది మాటే! సోప్ పేపరులా పట్టిన జిడ్డు వదిలేదాకా నీటుగ వడుకొని చింతామణి ఎక్కువున్న సబ్బుబిళ్ళను నిలబెట్టి యూస్ అండ్ త్రో బాటిల్ లా ఖాళీగా నిన్ను పడేసినప్పుడే అసలైన చార్ పత్తర్ ఆట మొదలయ్యేది! పక్క డబ్బాలోకి దూకగానే ఇంద్రజాలం ఆరంభం! అప్పటివరకూ తిన్న పండ్ల బలం పేకముక్కల్లా రాలిన ఆశల గురుతుల గాబరాలో చిలక గొంతు గబ్బిలంలా ఫుట్ బాల్ ఆడుతుంది! పాతాళభైరవుడి కథలోని మాంత్రికుడి చేతిలోని మాయా జాలం ఇప్పుడు రాజకీయమై రెంకలేస్తోంది! మ్యాజిక్ చేసే వారిచేతిలోని మాయలకర్రకు కోడిగుడ్డు పిల్లవుతుందేమోనని భ్రమపడేలోపే పాపం ఆంలేటుగా వేడి పెనమై నిప్పులు కురిపిస్తుంది! రేసుగుర్రం ఎక్కి దూసుకుపోవాలనుకున్న ఆశ మధ్యలోనే జారిపడి ఆసుపత్రిపాలయింది! నిన్నటివరకూ గులాబీ పాట నేడు మువ్వన్నెల జెండా బాట అక్కడా అడుగులు గట్టిపడకుంటే రేపు మరో పక్క గది ఖాళీగానే ఉంది... గెంతడం ఎలాగూ తెలిసిన విద్యే కానీ గాయపడకుండా గమ్యం చేరినప్పుడే ఉనికి తెలిసేది....నిలకడని తేలేది! సోప్ పేపర్ కంటే సబ్బు బిళ్ళే రాజకీయానికి అవసరం బరువు ఉంటేనే కదా బాగా అరగదీసేది 15-4-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eIMeqx

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

Aruna Naradabhatla కవిత

కొత్త పంట ____________అరుణ నారదభట్ల గట్టిగా హత్తుకున్న రెండు రేకుల బీజం ఇప్పుడెవరో భూమిలో వేసారు! గింజ మట్టిలో పడ్డందుకేమో బాగానే నానింది! ఒక్క విత్తు రెండు ముక్కలైంది... కొత్తగా రెండు లేత ఆకులకు జన్మనీయడం కొత్తసృష్టే గానీ అసలు పండగ ఇప్పుడే మొదలైంది! కలల పంటలు పండిస్తామంటూ గీసిన సరిహద్దు రేఖ రంగురంగుల రంగవల్లిలా మనసులలో కళకళలాడుతుంది! ఎవరికి వారై కూడగట్టిన మబ్బులు మంచు మేఘాలో....లేక గాలికి విచ్చుకు పోయే ధూళి రేణువులో మరి! ఊహాచిత్రాలను ఊరికే కలలు గంటే సరిపోదు! పేరుకుపోయిన చెత్తనంతా తట్టా...పారా నీవై మారి శుద్ధి చేయాలి! మంచి నీళ్ళతో కళ్ళాపుజల్లి అలంకరిస్తేనే సంక్రాంతి పండగలా పచ్చదనం నిండేది! నాలుగు గులాబీలను మెళ్ళో హారంగా జమచేయడం కాదు....రాజ్యమంటే! నాలుగు పచ్చతోరణాలు ఒంటికి చుట్టడమూ కాదు! ఇల్లు అడివికెక్కకుండా కాపలా కాయాల్సింది నీకు నువ్వే! పేరుకుపోయిన చాందసాన్నీ మూసుకుపోయిన ద్వారాలనూ శుద్ధి చేసే ఆయుధం "మేధస్సు" జనం గుండెల్లో నింపే ప్రయత్నం చేస్తావో లేక నీ గుమ్మినింపే గారడిలో పడతావో! ఇప్పుడు రెండు చిగురాకులూ రెండు వైపులా బిక్కు మంటూ ఉగ్గబట్టి చూస్తున్నాయి! వృక్షంలా ఎదగనిస్తారో ....లేక సర్కారు తుమ్మలా ముళ్ళలోకి తోస్తారో! కర్తవ్యం గురించి ఎంతైనా మాటాడు నీ ఎజెండాను జాతీయ జెండాలా స్వేచ్చగా ఎగిరేలా చూడు! సింగపూరో ...జపానో ప్రజలు రాజకీయ సునామీలో కొట్టుకుపోకుండా కంటినిండా నిద్దుర పోగలిగితే చాలు! 14-4-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qvWgT2

Posted by Katta

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Aruna Naradabhatla కవిత

ఉత్తిమాట _________అరుణ నారదభట్ల రాలిపడుతున్న ఆకుల సవ్వడిలా సమానత్వం ...సందడి చేస్తూనే ఉంది! తర తరాలుగా పేరుకు పోయిన అణచివేత మళ్ళీ అన్ని తరాలు ముందుకు నడిచినా తేరుకోలేకపోతుంది... కలం పట్టి గళం ఎత్తగలం గానీ చుట్టుకున్న బంధంలో ఆ తాత్వికత చూపగలమా! ఇంటి గడపనుండే మొదలవుతుంది... నీ...నా అనే తత్వం! ఎందరో మేధావులు ఏళ్ళతరబడిగా పేజీలు నింపుతూ...ఆదర్శాలు వల్లెవేస్తున్నారుగానీ ఇంట్లోని మనుషులకు కూడా ఆ మాటలు వర్తింపజేస్తున్నారా! తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు అక్షర బాణాలూ..మాటలతూటాలూ పూల జల్లులా వెదజల్లి సమాజాన్ని ముందుకు నడిపే దిశలో పాత్ర పోషిస్తున్నట్టు జాగృతి ముసుగులో భ్రమింపజేస్తూనే ఉన్నారు! కాటికాపరిగా జీవితాలను ఆహుతి దిశలోకి నెమ్మదిగా తోసేయడం చూస్తుంటేనే కలం చెప్పే కహానీలు ఎన్ని కలలను కూల్చేస్తున్నాయో గురుతొచ్చేది! గురివిందగింజ సామెతలా వెన్నంటే ఉండే నీడలనూ తమలో తాము ముందు సంస్కరించుకోవడం నేర్చుకునేదెప్పుడో ! గుమ్మానికి వేలాడే మామిడి తోరణంలా మహిళ జీవితం...పేరెన్నిక గన్న పెద్దల చాటున గొంతు దాటలేని మనసుతో మౌనపోరాటం చేస్తూనే ఉంది! పచ్చదనం కోసం కొందరు మగువలు జీవం లేని ప్లాస్టిక్ తోరణంలా అన్ని సందర్భాలనూ ఆర్టిఫిషియల్ గా స్వాగతిస్తుంటేనే చూడలేని కాలం వేప పూతలా ముందే రాలిపోతుంది! 11-4-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBpKzG

Posted by Katta

24, మార్చి 2014, సోమవారం

Aruna Naradabhatla కవిత

మారుతున్న భారతం __________________అరుణ నారదభట్ల ఇవాళే మొదలైందా ఈ పోరాటం! నాడు ప్రపంచ దేశాల నడుమ అటుపై రాష్ట్రాల నడుమ ఇప్పుడు ప్రాంతాల నడుమ..! జీవుల పుట్టుక మొదలైనప్పుడే పోరాటమూ మొదలైంది! మీరట్లో ఆరంభించిన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది! ఉప్పు చేతబట్టి దీక్ష పూని డూ ఆర్ డై అంటూ కూడబెట్టిన స్వతంత్ర్యం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇప్పుడు ఈ రాజకీయ రాబందుల చాటున రూపాన్నే మార్చుంకుంది! పెద్దల సభ చిన్నల సభగా మారిపోయింది! నోళ్ళెత్తి తెచ్చుకున్న స్వేచ్చావృక్షం ప్రజాస్వామ్యం ధాటిలో పదాల పదనిసల్లో ఓటు బాంక్ రాజకీయంగా డబ్బే తమ జబ్బుగా... సంక్షేమం...స్వరాజ్యం చాపకింది మడతలే! న్యాయం కావాలనే వారి పాలిట అంతా ఆశల నీటి మూటలే! కలలు గన్న రాజ్యం కసాయీల చేతుల్లో ఇప్పుడు బలిపశువే!1 24-3-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OQMTzJ

Posted by Katta

22, మార్చి 2014, శనివారం

Aruna Naradabhatla కవిత

అంతర్జాతీయ కవిత్వ దినోత్సవం సందర్భంగా గోల్డెన్ త్రిషోల్డ్ లో జరిగిన కవిసమ్మేళనంలో సీనియర్...జూనియర్ కవులంతా చక్కని భావాలను ఆవిష్కరించారు! ఒక అహ్లాదకరమైన వాతావరణం చోటుచేసుకుంది. ముఖ్యంగా గమనించిన విషయం ...చాలా నచ్చినవిషయం ఏంటంటే సర్వమత....కుల....జాతి...ప్రాంతం...వయసు...ఆడా...మగ...హొదా...ఈపదాలకు అతీతంగా సమభావం కనిపించింది! అక్కడ ఉన్నది కేవలం ఒక్కటే కులం "కవికులం" కవిత్వం మనిషిని మనోవికాసం వైపు నడిపిస్తుంది అనడానికి ఇది నిదర్శనంలా తోచింది! కవిత్వం విషయానికొస్తే "మనసుకు ప్రతిబింబమే కవిత్వం". ఒక్కొక్కరి మనసును చదివి వినిపించినట్టుగా అనిపించింది! ఇంత మంచి అవకాశాలను కొత్త కవులకు బాటగా తీర్చిదిద్దినందుకు యాకూబ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు!

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1plz7R4

Posted by Katta