మరువం ఉష | ప్రస్థానభేరి -------------------------- పదాల కట్టలు పదిలంగా- నారుమళ్ళలో ఊడ్పులంత శ్రద్ధగా విడదీసి భావాల మళ్ళలో గుచ్చుతావు. "తెగి రక్తమోడే వేలిని అదిమిపట్టినట్లుగానే, ఇలాగే, ఈ గాయపడిన లోపలి మనిషిని ఒడిసిపట్టగలిగితే అన్నపు పొంగు మీద జల్లిమూకుడు మూసి, కుండలో మెతుకు పోకుండా ఒడుపుగా గంజివార్చినట్లు, వెల్లువౌతున్న వేదనకి మరొక మనసు మూత ఉంటే, బండబారకుండా కోలుకునేలా బాసట గా నిలిస్తే బాగుంటుంది" మెదడు కి మాట అప్పగిస్తే పెదాల గట్లు దాటి జారే పలుకులవి. వెలుపలి పొరల్లో మనిషితనం ఇంతే! యాంత్రికత లో అబ్బిన వస్తుగుణం ఇదే కదు?! గుండె కి గుట్టు నేర్పగలిగితే- నిన్ను నువ్వు వినటం, ఊరడించడం సాధించగలిగితే... నీవే ప్రకృతి అవుతావు లయమౌతూ, సృజించబడతావు శ్రుతి చేసుకుని జీవనగానం పాడుతావు నీలోని వేవేల విధులలో నిమగ్నమౌతావు బాగుం/టుం/ది ఊహ, కానీ చెదిరి బద్దలైన గుండెని, బెదిరి చిన్నాభిన్నమైన 'నేను' లనీ వెదికి తీసుకురావాలి గాలికి, నీటికీ నడుమ నిష్పత్తిలా, నేలకి, నింగికి మధ్య ముడిలా నియమాలు నేర్పుకోవాలి, నిలిచి ఉండటం అలవరచుకోవాలి. కూడలి కి చేరితే ఎపుడూ ఇంతే- దారీతెన్నూ తెలీనట్లే, నాలుగు దిక్కులూ పిలుస్తున్నా... యంత్రఖచిత వనాల్లో అనాధగా అలమటించనా? నిరంతర వాహిని లో సింధువునై తరించనా? పిపాసతో బ్రతుకు స్వరాలు సర్పాల్లా బుసకొడుతున్నాయి సరళమైన రచన రాసుకోవాలి నేను జీవించాలి ఒక 'నేను' జీవచ్ఛవమైతే పది 'నేను' ల కాంక్షతో రగలాలి బతుకు యాగానికి 'నేను' సమిధనవ్వాలి ఇంతకీ 'నేను' /మిగిలి/ఉన్నానా, ఉన్నానన్న భ్రమలో ఉన్నానా!? అంతిమ ప్రస్థానం వరకు యింతేనా, చివరకు మిగిలేది యిదేనా... 27/03/14
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fpQhbj
Posted by Katta
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fpQhbj
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి