అఫ్సర్/ దాచలేనివి కొన్ని. 1 యింకా తెలియని కొన్ని దాపరికాలున్నాయి నీకూ నాకూ మధ్య- కలిసి నడిచేటప్పుడు కూడా కలవని క్షణాలు కొన్ని వుండే వుంటాయి రెండు వైపులా యిద్దరికీ- కలకీ కలతకీ మధ్య వొకింత మెలకువ జారిపడినప్పుడో యెప్పుడూ కువకువలాడే పక్షి కాసింత మౌనంలోకి వాలిపోయినప్పుడో తెలియక అరకన్ను విప్పే రవంత ఏమరుపాటులోనో ఎలాగో వొకలా ఇద్దరికీ దొరికిపోతుంటాం వద్దు వద్దనుకుంటూనే- అప్పుడు తెలుస్తుంది మనం దగ్గిరగా నడిచివచ్చిన క్షణాలన్నీ నిజంగా అనుకున్నంత దగ్గిరవేవీ కావని! 2 దాపరికాలు వుండకూడదని మరీ వొట్టేసుకుంటే చెప్పలేను కాని ఎంతో కొంత తెలియనితనమే మనిద్దరి మధ్యా ప్రవాహమైందని అనుకోకుండా వుండలేను. ఆ వెతుక్కునేదేమీ లేనే లేదనుకో నువ్వు నాదాకా నేను నీదాకా వచ్చేవాళ్లమే కాదేమో! యీ ప్రవాహపు గలగలల కింద దాక్కున్నదేమిటో తెలిసిందే అనుకో మనిద్దరి శరీరాలూ యే మూలనో రెక్కలు తెగిన సీతకోకలా పడి వుండేవేమో! దాపరికం వుంటే వుండనీ, ఎగిరే ఎగిరే నీ రెక్కల్ని ప్రేమించకుండా వుండలేను దూరంగా ఎటో వెళ్ళిపోతే పోనీ, నువ్వందుకునే నీ ఆకాశం అంటేనే నాకు ప్రేమ! నీ చూపు తాకినంత మేరా ఆకాశాన్ని గూడుగా ఎలా అల్లుకోవాలో నేర్చుకుంటా యిప్పుడు. 3 కాకపొతే, యిద్దరినీ వెతుక్కోవడంలో వున్న ఆ చిన్ని ఆనందం మరచిపోతామే, అదిగో అదీ- మన ఇద్దరి ఆకాశాలకి చివర, యెవరిదీ కాని జీవనరాహిత్యానికి మొదలు. ~ (ఎవర్నించి తీసుకున్నానో వాళ్ళని ప్రేమించకుండా/ తలచుకోకుండా ఉండలేను. రచన తెగని సందిగ్ధం అయి, ఈ కవితని ముందే షేర్ చేసుకున్నప్పుడు కవితకీ వచనానికీ మధ్య వుండే వొక సన్నటి గీతని గుర్తు చేసి, ఈ వాక్యాల్ని కనీసం పది సార్లు తిరగ రాయించిన వొక అద్భుత స్నేహ హస్తానికి...)
by Afsar Afsar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oXoXca
Posted by Katta
by Afsar Afsar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oXoXca
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి