రెహాల్ ``````` కన్నీటి దారాల్తో జీవన వస్త్రానికి మాసికలేస్తూ తరాల చీకటి కమ్మేసిన గోషా లో పాలిపోయిన చంద్రశిలా దేహంతో అనుక్షణం 'బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీమ్' అనే కదులుతుంది అమ్మీజాన్ మొహంపై వేలాడుతున్న నైరాశ్యాన్ని 'వజూ' నీళ్ళతో పుక్కిలించి తలనిండా చిరుగుల 'దుపట్టా' కప్పుకొని నమాజ్ చదువుతున్నపుడు... మెరుపు వెలిసిన అమ్మీ దోసిలిలో రాలిన కన్నీటి తడిపై ఏ దేవుడూ సాక్షాత్కరించడు ఒక అపనమ్మకాల బొమికల గూడు ప్రతిబింబిస్తుంది అస్తమయం వైపుకు మోకరిల్లి ప్రార్ధిస్తూ మా జిందగీల్లో సుర్యోదయమౌతున్దనుకుంటుంది అమ్మీ మాకోసం 'దువా' చేసి చేసి అమ్మీ గొంతు తడారిపోతుందే తప్ప... ముందు కూర్చున్న నీడ విస్తరించి కటిక రాత్రై పరచుకుంటుందే తప్ప... ....... ......... ......... ......... .......! 'తల్లి పాదాల వద్ద స్వర్గం ఉందంటారు' మా అమ్మీ పాదాలకై వంగిన ప్రతిసారీ చెమరిన నా చూపు ఆమె పాదాల పగుళ్ళలో చిక్కుకుని గిలగిలలాడుతుంది అబ్బాజాన్ అసహాయత చెల్లిని ఎవడికో రెండో పెళ్ళాంగా అంటగడితే ఆ చిట్టితల్లి కళ్ళల్లో ఉబికిన కన్నీళ్ళ మీద వణికే దృశ్యమై తల్లడిల్లుతుంది అమ్మే కాన్వెంట్ కు బదులు కార్ఖానా కెళ్ళే తమ్ముడు సాయంత్రానికి కమిలిన దేహంతో అల్లుకుపోతే పగిలిన లేత స్వప్నం గుచ్చుకొని విలవిల్లాడేదీ అమ్మే కడుపులో మా భారాన్ని మోసి కష్టాల మా బాధ్యతలు మోసి కళ్ళ గుమ్మానికి కట్టిన పరదాల వెనక ప్రాతివత్యాన్ని మోసి తన కనుబొమ్మల నెలవంకల మీద చీకటి రాశుల్ని మోస్తున్న అమ్మ చివరకు ఖురాన్ ను మోసే 'రెహాల్' మిగిలిపోవలసిందేనా ? (రెహాల్ : వ్యాస పీఠం)
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v8dQPi
Posted by Katta
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v8dQPi
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి