పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, జూన్ 2014, ఆదివారం

Kapila Ramkumar కవిత

సాంస్కృతికోద్దీపనలో తెలంగాణా కవిత్వం Posted on: Sun 08 Jun 05:39:17.157405 2014 తెలంగాణా ఉద్యమంలో కవిత్వానికి ఒక ప్రధాన భాగం ఉంది. ఈ సాహిత్యం ప్రధానంగా తెలంగాణా ఆకాంక్షని వ్యక్తం చేసినప్పటికీ, ఈ క్రమంలో సాంస్కృతికాంశాల పునరుజ్జీవనానికి ఇది హేతువయింది. అనేకానేక మార్గాల ద్వారా సాంస్కృతికాస్తిత్వాల ద్వారా తనదైన ఉనికిని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పాట, వచన, కవిత, ఇతర లఘు కవితా ప్రక్రియలు ఇందుకు దోహదపడ్డాయి. పాట గానానికి అనుగుణంగా ఉండే మాత్రాబద్ధమైన లయతో ముడిపడిందే కాని అది కవిత్వం నుంచి సంపూర్తిగా వేరుపడదు. మలి దశలో సాగిన ఉద్యమంలో భాగంగా వచ్చిన కవితా సంకలనాలు ఇటు ఉద్యమాన్ని, అటు కవిత్వాంశని, మరోవైపు సాంస్కృతికాంశని వ్యక్తం చేశాయి. జూలూరి గౌరీ శంకర్‌ 'పొక్కిలి', సుంకిరెడ్డి నారాయణరెడ్డి 'మత్తడి' ఎస్‌. జగన్‌రెడ్డి 'జులుస్‌', సుంకర రమేష్‌ కొన్ని సంవత్సరాలపాటూ తెచ్చిన 'తెలంగాణా కవిత', వేముగంటి మురళీ మిత్రులు తెచ్చిన 'మునుం' ఇంకా జిల్లాల నుంచి వచ్చిన సంకలనాలు వల్లుబండ (కరీంనగర్‌), ఎల్గడి (ఆదిలాబాద్‌), మెతుకు సీమ (మెదక్‌)... మొదలైనవి ఇందుకు దోహదపడ్డాయి. ఇంకా అనేక పత్రికలు తెచ్చిన ప్రత్యేక సంచికలు, వ్యక్తుల సంపుటాలు ఈ అంశాలని చిత్రించాయి. ప్రధానంగా ఈ కవిత్వం సామాజిక సంప్రదాయాలను, మత వైరుధ్యాలకు అతీతంగా జీవించడాన్ని, జాతిని ఉన్నతీకరించే సామాజిక, సాంస్కృతిక ప్రతినిధులను పోరాట యోధులను సంస్మరించి చిత్రించింది. ప్రాంతాలలో ప్రఖ్యాతి గాంచిన ప్రదేశాలను కళలను తలకెత్తుకుంది. ప్రధానంగా తెలంగాణా నుడికారాన్ని ప్రధాన పరికరంగా వాడుకుంది. ఈ అంశాలన్నీ తెలంగాణా కవిత్వంలోని సాంస్కృతిక భాగాన్ని వ్యక్తం చేశాయి. ప్రధాన చారిత్రక సన్నివేశంలో తెలంగాణాలో హిందూ, ముస్లిం మతాలు ఇక్కడ ఉమ్మడిగా గడుపుతున్నాయి. రెండు మతాలకు సంబంధించిన రాజరిక వాతావరణాల వల్ల ఈ రెండు మతాలకు చెందిన అభివర్గాలు ఒక నూతన సాంస్కృతిక దిశగా నడవటం దీనికొక కారణం కావొచ్చు. వేములవాడలాంటి అనేక దేవస్థానాలల్లో ఇలాంటి ప్రాధాన్యతలు కనిపిస్తాయి. మతాలకతీతంగా ఈ నమ్మకాలు తెలంగాణా నలుచెరగులా కనిపిస్తాయి. ఈ భావన అనేకసార్లు కవిత్వంలో వ్యక్తమయింది. 'తెల తెల వారుతున్నప్పుడు దర్గా దయకోసం మోకరిల్లిన అన్ని మతాల వారినీ చూశాను' 'మతాతీత దర్గాలే వెలిస్తే గతాలన్నీ సహజీవన గీతాలై విరిస్తే అప్పుడు మనుషులంతా మారాజులు బతుకులన్నీ సంక్రాంతులు, రంజాన్‌లు' (దర్గాదయ - యాకూబ్‌ - తెలంగాణా కవిత 2009) హైదరాబాద్‌ లాంటి నగరాలను, పట్టణాలను ఈ రెండు సంస్కృతులకు దగ్గరగా కవిత్వం చూసింది. కవితాత్మక వచనంలో ఈ మమేకత్వం కనిపించిన సందర్భాలున్నాయి. 'హైదరాబాద్‌ నగరం / ఆత్మీయతకు నిలయం/ ఖైరియత్‌ అడిగే/ 'ఇఫ్తార్‌ 'ఆతిథ్యం' (నెమలికన్ను - ఆశారాజు - ఎ పోయట్‌ ఇన్‌ హైదరాబాద్‌) 'షీర్‌ కూర్మా తీపిలాగా / బోనాల నాటి పరిమళం / పండగలా బతికే కలలుగంటాను' -(వెన్నెల దర్పణం- ఆశారాజు - ఎపోయట్‌ ఇన్‌ హైదరాబాద్‌) ఈ మత సంబంధమైన సంస్కృతికత వ్యక్తమైన సందర్భాలు అనేకం. ఎక్కువగా ఉర్దూ పదాలను శీర్షికలుగా రాయడం... హిందీ, ఊర్దూ వాక్యాలు కవిత్వంలో రాయడంలోనూ ఈ అంశం వ్యక్తమౌతుంది. తెలంగాణాలో హైదరాబాద్‌ లాంటి మహానగరాలున్నా.. దీని వెనుక బలమైన పల్లె సంస్కృతికి చెందిన సంస్కృతిక వాతావరణం ఒకటి ఉంది. బోనాల పండగ జీవితానికే ప్రధాన భాగం అయిన నేల తెలంగాణా. 'బలువూరి కొండన్న, సర్వాయి పాపన్న/ సై అంటే సై అంటూ ఎగిరి దూకిన రోషాల తాంబూర / గొల్ల సుద్దులేయి/ మందెబ్బ కథలేయి/ గోసంగి మాతంగి భాగోతాలేయి/ కంగాలి సినిమాల జంగిలి పాటల్దప్ప' 'బొడ్రాయి పోశమ్మ, అమ్మ ముత్యాలమ్మ/ బోనాల గంపల్ల బర్కతేమాయే' -(దాలి - సుంకిరెడ్డి నారాయణ రెడ్డి) ఇది తెలంగాణా సంస్కృతిక వాతావరణాన్ని చెప్పేది. తెలంగాణా సామాజిక వాతావరణాన్ని చెప్పిన వాక్యాలూ కనిపిస్తాయి. 'మెట్ట భూములు, అయిందపు లొట్టలు/ సజ్జజొన్నలు సర్పాలు తేళ్లు/ తాడెత్తు జీవధారలు/ నవ్విన పువ్వులు/ పసుపు తంగెళ్లు/ పచ్చటి బతుకులు/ పండుగ బతుకమ్మలు/ సిర్రగోనెలు సిలువ మోసిన రైతులు / అంబరాసాలు / అయిరేణి కుండలు' -( యాది - మనాది... అల్లం నారాయణ- మునుం) ఇవన్నీ తెలంగాణా సామాజిక జీవనంలో సంస్కృతికి ప్రతిబింబాలు. ఇవన్నీ పారదర్శకంగా తెలంగాణా సమాజంలోని జీవనస్తిత్వాన్ని చెప్పినవే. కొన్ని గ్రామాలు, ప్రాంతాలు కొన్ని కళలకు, వృత్తి పనులకు ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. ఇవి ఆయా సంస్కృతుల మాధ్యమాలుగా ప్రపంచానికి పరిచయమౌతాయి. సిల్వర్‌ ఫిలిగ్రీ పనులు, ఆదిలాబాద్‌ రంజన్లు, నిర్మల్‌ బొమ్మలు, ఇవన్నీ ఇలాంటివే. ఈ దృష్టి కూడా కవిత్వంలో కనిపిస్తుంది. 'వెండి కమ్మీల్ని బొక్జ్కలు తెల్లగవుతున్నా / పట్టుదారాల్లా సాగదీసి / తీగల్ని కత్తిరించి సుడుగులు చుడతాడు ఫిలిగ్రీ వర్కర్‌' -(సిల్వర్‌ ఫిలిగ్రీ వర్కర్‌ - ఎర్రోజు వెంకటేశ్వర్లు - కరీంనగర్‌ కవిత 2012) 'మానవ మూలాలైన అడవుల్లోని/ ఆదివాసి సంస్కృతిని / పులిమిన కుండలు / ఎదులాపురంలోని ఎద్దులా కష్టించే /అమాయక మట్టి జీవుల/ స్పర్శను తాకిన కుండలు' -(ఆదిలాబాద్‌ రంజన్లు - మునిమడుగుల రాజారావు - మునుం) తెలంగాణా సమాజంలోని జీవితాలను కవిత్వీకరించినట్టే అక్కడి ప్రధానాంశాలనూ కవిత్వం చేయడం కనిపిస్తుంది. ఈ కాలానికి బాగా గమనించాల్సింది భాషా వినిమయం గురించి గతానికంటే ఎక్కువగా ఈ కాలం కవులు తమ నుడికారంపై దృష్టి పెట్టారు. ఒక ప్రధాన సాహిత్య పరికరంగా ఇక్కడి వ్యవహార భాషని ఉపయోగించడం కనిపిస్తుంది. పల్లెల్లో మిగిలిపోయిన తెలంగాణా నుడికారం సాహిత్యంలో అనేక మార్గాల్లో ప్రతిఫలించింది. ఈ నుడికారంపై మమకారం కూడా ఖండికలుగా వ్యక్తమైంది. '/జనం నోట్లెకెల్లి ఊడిపడిన పదం / నిఘంటువుల పదఘట్టనల్లో నలిగిపోయింది/ ఏ పదబంధ ప్రబంధంలోనూ నా యస లేదూ బాస లేదు / వాక్యం నా పలుకు వల్లించదు / అక్షరాల్లో నా నుడికారపు శబ్దం లేదు' -(అన్నవరం దేవేందర్‌ - తెలంగాణా వ్యాకరణం - మునుం) ప్రధానంగా కళాత్మక దృష్టితో తెలంగాణా నుడికారంలోనే రాసినవి కూడా కనిపిస్తాయి. 'ఊర్లకు అనలత్తన్నయంటే / సెట్లన్నీ పోషమ్మ గుడికాడ ఊగే / శివ సత్తుల లెక్క ఊగుతాయి / ఊర్లల్ల అచ్చే ఆనసినుకులు / రేకుల ఇండ్ల మీద పడితే / గరీబోని పెండ్లికి పెట్టిన / సప్పుల్ల లెక్కుంటయి' - (టి. కృష్ణమూర్తి యాదవ్‌- వివిధ. ఆంధ్రజ్యోతి 8.3.2004) ఈ కాలానికి ప్రపంచీకరణ వల్ల తెలంగాణాలో దళిత, బహుజన కవిత్వం ఎక్కువగా వచ్చింది. అందువల్ల వృత్తి సంబంధమైన పదాలు, పదబంధాలు కవిత్వంలో ఎక్కువగా ఊపిరి పోసుకున్నాయి. పుస్తకాలకు శీర్షికలుగా, కవితా ఖండికలకు శీర్షికలుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగంలోకి వచ్చిన భాషా సంపద పల్లె వాతావరణానికి, ఆయా కుల వృత్తులకు వ్యవసాయానికి సంబంధించినదే అనటం అతిశయోక్తి కాదు. మత్తడి, పొక్కిలి, మునుం, వల్లు బండ, తండ్లాట, చిన్నాయి, పోగుల గూడు, ఇరువాలు, మొగురం.. లాంటి పదాలు పదబంధాలెన్నో శీర్షికలుగా కనిపిస్తాయి. అనిశెట్టి రజిత, రామాచంద్రమౌళి, పొట్లపల్లి శ్రీనివాసరావు వంటి వరంగల్‌ కవుల శీర్షికల్లోనూ వైవిధ్యం ఉంటుంది. పల్లె పదాల్లోని మాధుర్యం, ఉద్వేగం, ప్రేమ, మమకారం అన్నీ కవిత్వ వచనంలో జీవం పోసుకున్నాయి. ప్రధానంగా పరిశీలిస్తే ఈ భాషలోనూ పూర్తి తెలంగాణా ప్రజా జీవనంలోని భాష, ఉర్దూ సమ్మిళితమైన భాషగా రెండు వర్గీకరణలు చేయవచ్చు. నిజానికి భాషా, సాంస్కృతిక భాగాలకు సంబంధించి ఈ దశాబ్ది కాలం పునరుజ్జీవన భాగం. ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అన్ని ప్రాంతాల నుండి కవిత్వం సంకలితం చేయబడ్డట్టుగానే సాంస్కృతికాంశాలని వ్యక్తం చేసేవి కూడా రావాలి. అప్పుడు ఈ సాంస్కృతిక దీప్తి ఇంకా సాహిత్యాకాశంలో ప్రకాశవంతంగా విశదమౌతుంది. - ఎం నారాయణ శర్మ రచయిత సెల్‌ : 9177260385

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oyrQzW

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి