మరువం ఉష | యుగాల పర్యంతం విస్తరించే క్షణం లో... ----------------------------------------------------- జీవితపు సుసంపన్నతని దోచుకోగలిగేది కవులే- అనేకానేక కొమ్మలుగా విస్తరించినా వరదకి తోడుగా ఈదురుగాలి దండెత్తి వస్తే ఒక్కొక్క కొమ్మా కంపిస్తూ వేర్వేరు దిశల్లో ఒరిగితే మేను జలదరించేలా భూమిని చీల్చుతూ వేళ్ళు వెలికి వచ్చి, అల్లాడుతూ ఆచూకీ దొరకని మూలకి కనుమరుగై పోతుంది అనేకానేక తరాలుగా విస్తరించిన ఓ వృక్షం నీలోనూ విస్తరిస్తుంది మరొక శాఖగా వేదన తీరాన్ని తాకకుండానే విరిగిన అల, లేదూ, ఒడ్డు న తునిగిపడి ఉన్న ఎండ్రగబ్బ కావచ్చు కడలి లో ఊగిసలాడే నావ లా నిన్ను మార్చేందుకు తరతరాల వంశచరిత్ర ఆ గోడల్లో నిక్షిప్తమై- పునాది రాళ్ళలో పగుళ్ళుగా మారటం చూస్తావు- తట్టలలోకి మార్పిడి జరిగిన భవంతి తో అంతమై చదునుచేసిన నేల లో కొత్త కథ కి శంకుస్థాపన జరుగుతుంది నీలోకి పాదుకున్న విత్తు రక్తపుమడిలో నానుతూ ముళ్ళ తీగ గా, బలురక్కసి పొద గా మారుతుంది భారాన్ని దించుకోడానికి వెచ్చని ఒడి, లేదూ, వణికే నీ అరచేతిని బిగించి పట్టుకున్న హస్తమో కావచ్చు భూమిని తొలుచుకు పొయే తుట్టపురుగు గా నిన్ను మార్చేందుకు మూటగట్టిన అనుభవాలు నీటిబుడగలై నీలో తేలుతుంటాయి, గాలివాటు బతుకుల తాకిడికి పగిలి పదాలుగా జారుతూ. చిల్లుపడ్డ బొక్కెన లోకి కుళాయి నుంచే కారే నీటి బొట్లుగా నీలోంచి నిరంతరం నీలోకి తరగని తడి కంటి ధారలుగా... ఉషస్సులో ఉనికి లేని సంభవాలు నిశివేళ కి చోటుచేసుకుంటూ- క్రౌంచ మిథునం తల తెగిపడి కసాయి కడుపులో కావ్యమైనట్లు పురుగులు మెసిలే పుట్టలో పదాలుగా పురుడు పోసుకున్నట్లు- అహర్నిశలూ నీలో కాంతి పుంజాలు ప్రజ్వలిస్తూ నీ వాచక సరోవరాల్లో ప్రకృతి పద్మమై పరవశిస్తూ... జీవితపు సుసంపన్నతని నిజంగా దోచుకోగలిగేది కవులే, జీవితపు నగ్నత్వాన్ని దాచగలిగేదీ కవులే- అదెలాగ అన/లే/వు- ఎందుకంటే అదంతే! పెల్లుబుకిన డొల్లతనం తో ఎన్నో మెదళ్ళు వివస్త్రలై ఎదురౌతాయి అనాఛ్ఛాదిత భావనలు నీ మది ప్రాంగణం లో వివశ నృత్యం చేస్తాయి నగ్నత్వాన్ని కప్పుకున్న నగ్నత్వమై, అందులో అంతర్లీనమైన ఆత్మ వికసన ఛాయ లో దాగిపోతావు జీవితపు నగ్నత్వాన్ని నిజంగా దాచగలిగేది కవులే- కనుగొంటే నీవూ, నేనూ, ఎవరెవరో ఒక్కొక్క క్షణం లో ఉద్భవించే కవులం అనుకోని ఉత్పాతం లో అలమటించేవారం రెక్కమాను మీద రవ్వంత సేపు ఆగిన స్వేఛ్చా విహంగాలం! 07/03/2014
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dzj8MT
Posted by Katta
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dzj8MT
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి