గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత - 10 ----------------------------------------- నా పేరే నా మరణ శాసనం - - - - - - - - - - - - - - - - - - - - - - - ఖాదర్ మొహియుద్దీన్ నా పేరులోంచి చావు వాసన పుట్టబోయే బిడ్డకు నేను పెట్టబోయే పేరులోంచి చావు వాసన నలభై అయిదేళ్ళ క్రితం చచ్చిపోయిన మా అమ్మ సమాధిలో కాలుతూన్న కడుపులోంచి కమురు వాసన పురిటికి చావుకీ ఒకటే నొప్పి, ఒకే వాసన భీరువుని కాదు గానీ చావుకి చేరువలోనే అనునిత్యం నా సంచారం అత్యాచారాలకీ, అఘాయిత్యాలకీ అందుబాటులో నా నివాసం నాకూ నా చుట్టూ త్రిశూలాలు త్రిశూలాలుగా సమాయత్తమవుతూన్న సంఘానికి మధ్య చావుకీ బతుక్కీ మధ్య నున్నంత దూరం అపారకృపాశీలుడూ అనంత కరుణామయుడూ అయిన అల్లాకూ విశాల హృదయంతో విధించిన ఆంక్షకు మారు పేరు నా జీవితం చావుని చంకనేసుకుని బావిలాంటి బతుకులో సంచరిస్తుంటానని చెప్పాను గదా పుట్టి పెరిగిన చీమలపాడులోనో బతుకు తెరువు కోసం బెజవాడ వీధుల్లోనో, హైదరాబాద్ గల్లీల్లోనో తిరుగుతుంటాను గదా రంగురంగుల దృశ్యాల మధ్య ఆహ్లాదకరమైన వాణిజ్య ప్రకటనల మధ్య నర్మగర్భంగా మాత్రమే అయితేనేం నా చావు కబుర్లని చల్లగా చేరవేస్తాయి ప్రసార మాధ్యమాలు ఉన్నట్టుండి, గుజరాత్‌లో ఊళ్ళకి ఊళ్ళనీ నగరాలకు నగరాల్నీ పిచ్చెక్కిన కాషాయపు కుక్కల ముందుకి మాంసపు ముద్దల్ని చేసి విసిరేస్తున్న దృశ్యం నా గుండెల చుట్టూ మంటలు నా గొంతుల్లోంచి హాహాకారాలు ఆర్తనాదాలు చూస్తూ చూస్తూండగానే ఊరికో చుండూరు వాడకో కారంచేడు క్షణంలో ఒక మిలియన్ జలియన్‌వాలా బాగ్‌లు సకుటుంబ సంఘపరివారం ప్రయోగశాలలో నిండు గర్భిణీ కడుపుని స్క్రూడ్రైవర్‌తో చీల్చినపుడు ఆర్తనాదపు అంతిమరూపం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు గర్భస్థ శిశువుని త్రిశూలం మొనమీంచి మంటల్లోకి విసిరేయటానికి అవసరమైన ఒడుపుల్ని తెలుసుకున్నారు పసిపిల్లల్ని మంటలో కాల్చినపుడు పాలగిన్నెలో మాడిపోయే వాసన రాదని మరీ మరీ తెలుసుకున్నారు భర్త కళ్ళముందు భార్యనీ, తలిదండ్రుల కళ్ళముందు కూతుళ్ళనీ అన్నదమ్ముల కళ్ళముందు అక్కాచెల్లెళ్ళనీ వివస్త్రల్ని చేసి సామూహిక మానభంగం చేస్తే వాళ్ళ తలలు అవమానంతో ఎన్ని డిగ్రీలు వంగిపోతాయో తెలుసుకున్నారు పదిమంది పిల్లల్ని మంటల్లో వేస్తే ఒక దీర్ఘకాయుడైన వ్యక్తి దేహం పోతపోసుకోదని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు మృత్యువు ముంచుకొచ్చినపుడు మనిషి కళ్ళలో మిరుమిట్లు గొలిపే భయాన్ని ఏకకాలంలో కోటి కోణాల్లో చూడటమెలాగో తెలుసుకున్నారు సజీవ దహనానంతరం బూడిద కుప్పల్లో మిగిలిన బొమికెల తునకల్లో ఇప్పుడు నేను నా ఉనికిని వెతుక్కుంటున్నాను 74 మంది కుటుంబ సభ్యుల్ని కోల్పోయి కూడా సహనం వీడని సలీమ్ భాయి కళ్ళలో నేనొక ఇమామె హుసేన్‌ని సందర్శిస్తున్నాను * * * ఇళ్ళనీ ఊళ్ళనీ విడిచిపెట్టి వచ్చిన వాళ్ళారా గడ్డీగాదం తిని ప్రాణాలు నిలబెట్టుకున్నవాళ్ళారా పిడచగట్టుకుపోతూన్న గొంతుకని పశువుల ఉచ్చతో చల్లబరుచుకున్న వాళ్ళారా గౌరవంగా జీవించే హక్కును కాదు మానమర్యదల్తో ఖననమయే అవకాశాన్నయినా కనీసంగా మిగల్చమని కాళ్ళా వేళ్ళా ప్రాధేయపడిన వాళ్ళారా అమ్మానాన్న ఆప్యాయంగా పిలిచే స్వంత పేరును చెప్పుకోవటాని క్కూడా వీల్లేని వాతావరణంలో ఊపిరి పీలుస్తున్న వాళ్ళారా నేర్చుకుందాం రండి చావుని చూపించి నన్ను భయపెట్టలేవు సజీవ దహనాలతో నా నామరూపాల్ని నిర్మూలించలేవు చావు నాకు చిరస్మరణీయం చావు నాకు చిరకాల నేస్తం 'కుల్లుమన్ అలైహా ఫాన్' అన్నది నా విశ్వాసం చావు వార్త విన్న ప్రతిసారీ 'ఇన్నావిల్లాహి వయిన్నా ఇలైహి రాజిపూన్' అనటం నా ఆచారం కరడు గట్టిన కాషాయానికి కవిత్వం ప్రత్యామ్నాయం కాదు కాలం కలకాలం సంఘపరివారం చేతిలో కరవాలం కాదు కూలిపోయిన ఈ గోడలు లేచి ఎటువైపు నడిచి వెళతాయో తెలీదు గాయపడిన గుండెలకు ఏ మార్గం గుండా ప్రయాణిస్తే అసలైన ఔషధాలు చేతికందుతాయో తెలీదు అనుమానంలోంచి నమ్మకంలోకి తెరచుకునే మార్గం ఎక్కణ్ణించి మొదలువుతుందో తెలీదు (GUJARAT GAAYAM & AZAAN -Poetry on Gujarat Genocide -2002)
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lcvM7M
Posted by Katta
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lcvM7M
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి