పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Rvss Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rvss Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Rvss Srinivas కవిత

|| తొలకరొచ్చేసింది || జ్వలించే గిరులపై నీటిపూలు చల్లేస్తూ రేగడినేలపై పరిమళాలు మొలకెత్తిస్తూ పచ్చని చెట్లకి అభిషేకాలు చేసేస్తూ చాపిన నాలుకపై ముత్యంలా నర్తిస్తూ కొండ'జారుపాతాలకి' కొత్తపాట పల్లవిస్తూ సెలయేటి నడకలకి వయ్యారం అందిస్తూ జీవనదుల జీవితాన్ని జీవంతం చేసేస్తూ బడుగురైతు ఆశలపై పన్నీటిని చిలకరిస్తూ గోదావరి పరుగులకి ఉరకలెన్నో నేర్పిస్తూ కదులుతున్న క్రిష్ణమ్మలో కులుకులెన్నో కుమ్మరిస్తూ గంగోత్రి గలగలలకి గజ్జెలెన్నో కట్టేస్తూ యుమున నడుము వంపుల్లో కొత్త సొబగులొంపేస్తూ... @శ్రీ 23jun14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V3Aj3L

Posted by Katta

21, జూన్ 2014, శనివారం

Rvss Srinivas కవిత

|| "నా ప్రాణం" || నీ సౌందర్యం నన్నెప్పుడూ చిత్తరువుని చేసేస్తుంది నిన్ను నఖశిఖ పర్యంతం చూస్తున్న విషయం ఎప్పుడూ గ్రహించలేదు రెప్ప వాల్చడమే చేతగాని నా అ'మాయకపు' కళ్ళు . అతిధ్వనులకంటే వేగంగా శోధించేస్తాయి నా కళ్ళు నీ సౌందర్యాల సాగరంలో దాగిన నిధులన్నిటినీ నా కళ్ళూ సిగ్గుపడతాయి నిన్ను చూస్తున్న నన్ను అంతా చిత్రంగా చూస్తున్నారనే విషయం గమనించిన క్షణాలలో. వేలమందిలో ఉన్నా నాకళ్ళు ఆలాపించే మౌనారాధనా గీతికలు నీకు మాత్రమే నిశ్శబ్దంగా వినిపిస్తాయి. వాటికే లిపి ఉంటే కృష్ణశాస్త్రి భావగీతికలను తోసిరాజనవూ? ఒక్క నిమిషంలో నా కనుపాపలు తీసిన నీ ఛాయాచిత్రాలను ముద్రించాలంటే ఎన్ని రీముల ఫోటో పేపర్లు కావాలో? వాటిని శాశ్వతంగా భద్రపరచాలంటే ఎన్ని "టెరా బైట్ల హార్డ్ డిస్క్ డ్రైవ్" లు కావాలో? ముత్యాల సరాలంటే గురజాడవనుకున్నాను నీవు విసిరే నవ్వులమాలలని చూసేంతవరకూ ఎన్ని మల్లెల్ని మింగావో మరి మాటలలో పరిమళాన్ని వర్షిస్తూ మదిని తడిపేస్తావు నా తపస్సు ధన్యమైంది తపోఫలంగా నీవు దొరికాక తేనెవాకలో తానమాడింది మనసు... ఎంతమందినో వారించిన నీమనసు నన్నే వరించిందని తెలిసాక. గతజన్మలో నాతోడున్నానన్నావు ఈజన్మలో వీడనని మాటిచ్చావు మరుజన్మలో జత కడతానని బాస చేస్తున్నావు నీవు మాట తప్పుతావనే ఊహ మదిలో మెదిలితేనే పోతుందేమో నిన్నే ప్రాణమనుకుంటున్న "నా ప్రాణం" ...@శ్రీ 21jun14.

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1poFxQB

Posted by Katta

19, జూన్ 2014, గురువారం

Rvss Srinivas కవిత

|| బాల్యం || మళ్ళీ పుట్టాలనుంది (నా)బాల్యాన్ని అనుభవించేందుకు. బాల్యం నిడివి పెంచమని అడగాలి ఈసారి దేవుడు కనబడితే. మనసులో దాగిన బాల్యం పరుగులెడుతోంది కాయితప్పడవల కోసం... తొలకరి తరుముకొస్తుంటే. వడివడిగా పరుగులెత్తేసింది బాల్యం బరువులెత్తే పెద్దరికాన్ని తొందరగా అందుకోవాలని... ఇప్పుడు మనసు మాత్రమే పరుగెడుతోంది గతంలో బాల్యం చిందేసిన బాటలో దేవుడిని ఒక్కటే కోరాలని ఉంది నా బాల్యాన్ని నాకిచ్చేయమని. అంతే స్వఛ్ఛంగా... అంతే అల్లరితో మళ్ళీ పయనించాలని ఉంది పసితనం గడిపిన పల్లెల్లోకి. నా నేస్తాల నిష్కల్మషమైన మనసులలోనికి. ...@శ్రీ 19jun14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pm9Mtf

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Rvss Srinivas కవిత

|| భూమాతకి ఉరి || తలారి అవసరం లేకుండానే తలా ఒక చేయి వేస్తున్నాము భూమాత ఉరికి కన్నతల్లిని వధించే నైజం మా(దా)"నవ" జాతిదే అంటూ ఎలుగెత్తి చాటుతున్నాం కాల్చేస్తున్నాం దావానలంలా జీవనాన్నిచ్చిన ప్రపంచాన్ని విశ్వాసఘాతకులమైపోతూ భూమిని క్షణక్షణం 'చిత్ర'వధిస్తోంది మనం పెంచి పోషిస్తున్న కాలుష్యపు కోరల రక్కసి తనదైన రీతిలో ఉరితాడుతో సన్మానం చేసేస్తున్నాం మన మనుగడను రక్షాసూత్రంతో బంధిస్తున్న వసుధకి. మనకి మనమే ఉరి బిగించుకుంటున్నాము ప్రకృతిని మాత్రమే సంహరిస్తున్నామనే భ్రమలో...@శ్రీ 10/06/2014.

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oa2rie

Posted by Katta

31, మే 2014, శనివారం

Rvss Srinivas కవిత

|| పెంచుకో నీ ఆయుర్దాయాన్ని || (say no to tobacco) నీ చితికి మొదటి కట్టె నీవు కాల్చి పారేసిన తొలిసిగరెట్టే అట్టహాసం చేస్తుంది నీ చితాభస్మం చూసి. కాలికింద నలిపి పారేసిన సిగరెట్ల 'నుసి' "లాస్ట్ పఫ్" ని ఆస్వాదిస్తావు నువ్వు నీ "లాస్ట్ ఫైర్ " లో చలికాచుకుంటాయి నువ్వు కాల్చిన ప్రతి సిగరెట్టు. రింగులు రింగులుగా పొగను వదులుతావు నీ ఉరితాటిని నీవే బిగించుకుంటావు నీ వినోద యాగానికి సమిధని చేస్తావు సిగరెట్టుని... కాలం చేస్తున్న మారణహోమంలో నీవే ఆహుతి అయిపోతూ శరీరంలోకి వ్యాధిని పంపుతుంటావు శ్వాసలో మృత్యువుని నింపుకుంటావు ఇకనైనా ఆపు నీ వ్యసనాన్ని పెంచుకో దేవుడిచ్చిన ఆయుర్దాయాన్ని.... ....@శ్రీ 31/05/2014

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jCOWPH

Posted by Katta

14, మే 2014, బుధవారం

Rvss Srinivas కవిత

|| పారిజాతం || నందనవనం చిన్నబోయిందిట నీ నవ్వుల ఎగుమతి ఆపేసావని పారిజాతాలని చూసినప్పుడల్లా గుర్తొస్తాయి పారాణి పూసిన నీ తెల్లని పాదాలు. పారిజాతాలకి నీకు సారూప్యం ఉంది సుమా చిరుసిగ్గుల్లో అందం ఒలకబోయడం మీకిద్దరికే తెలుసు గడ్డిపూలు సైతం నీ పాదాలు తగిలి పారిజాతాల పరిమళాన్ని వెదజల్లుతాయి నీవు ఊయలలూగినప్పుడు ఆ నవజాతాలు ...నీ పాదాలను ముద్దాడుతూ ఎర్రని రంగుని పూసుకుంటాయి పాదాలకి... లత్తుకలా నీవు నడిచే బాటలో పరిచాను పారిజాతాలని కాడలమీద పాదం మోపకు సుమా! తొలగించాలంటే ... పట్టు సూదులు కావాలి గాయాలకి లేపనాలు పూసేందుకు పున్నమి వెన్నెల తేవాలి ...@శ్రీ 14/05/2014

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mU2C0H

Posted by Katta

11, మే 2014, ఆదివారం

Rvss Srinivas కవిత

|| ముగ్గురూ తల్లులే || వాసుదేవా !బంగారు తండ్రీ! అంటూ పిలుస్తూ అప్పుడే చిలికిన వెన్నని తినిపించేది పాలదాలిలో కాచిన కమ్మనిపాలు ఒడిలో కూర్చోబెట్టుకు తాగించేది కొంగుతో మూతి తుడుస్తూ రాజుల సారెలలోని పూతరేకుల్ని నాకొక్కడికే తినిపించేది అందరి కళ్ళు కప్పుతూ ఎంత తిన్నా ఎన్నిసార్లు తిన్నా తాను తినేడప్పుడు పెట్టే ఒక్కముద్దతోనే కడుపునిండేది నాకు. మనసు వెన్నపూస మాట వెన్నెల జల్లు అమ్మలా నన్ను పెంచింది పదహారేళ్ళు అమ్మకి అమ్మ మా అమ్మమ్మ. _/\_ *** *** *** మా చదువులకోసం నాన్నకి దూరంగా ఉంటూ అమ్మ చేసిన త్యాగం మరపురానిది మార్గదర్శి ...మా అమ్మ నడిపిస్తూ నడవడికలు నేర్పుతూ లక్ష్యాన్ని చేరుకోడంలో అనుక్షణం సాయపడింది. మాకు ఆశీస్సులు అందించి స్వర్గంలో దేవతలకి అనురాగామృతం పంచేందుకు వెళ్ళిపోయింది _/\_ *** *** *** నాన్నా తిన్నావా! అంటూ పలకరిస్తుంది ఎక్కువసేపు కంప్యూటర్ మీద కూర్చోకండి. టైంకి తినండి ...మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఆరిందాలా కబుర్లు చెప్తుంది చిన్నప్పటినుండి ఒక్కక్షణం నన్నొదిలి ఉండక, చదువులకోసం ఇంటినుండి వందల మైళ్ళు దూరంలో ఉన్న నా చిట్టి'తల్లి' ...@శ్రీ 11/05/14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RB9JwZ

Posted by Katta

2, మే 2014, శుక్రవారం

Rvss Srinivas కవిత

|| నీ నీడే ...నేను || నీ నీడని వదలకు వెన్నెల్లో నిన్ను గుర్తించడం కష్టం నీ నీడ చూసాకే తెలిసింది వెన్నెలనిచ్చే నీడలుంటాయని నీ నీడ నిన్నొదలదు వెన్నెల వెనుక చీకటిలా నీడని భ్రమిస్తావు నీ తోడుగా ఉన్న నన్ను వీడమని వేడకు. నీడలా నిన్ను వెన్నంటే నన్ను నాకెంత అసూయో అనుక్షణం నీ తోడుండే నీ నీడంటే నీ నీడకి సిగ్గులేదు నీవు పొమ్మన్నా నీనుండి పోలేని నా మనసులా. నీ నీడంటే నాకు ప్రేమే నాకు ప్రతిరూపంగా కనబడుతూ. పోల్చుకోలేకున్నావు. నిన్నైనా నేడైనా...నీ నీడగా ఉండేది నేనేనని ప్రతిజన్మకీ నిను వీడని చల్లని తోడు నేనేనని... ...@శ్రీ 02-05-14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1n93k6Q

Posted by Katta

16, ఏప్రిల్ 2014, బుధవారం

Rvss Srinivas కవిత

|| నా వసంత కౌముది || ఏ నీలిసాగరాల తరంగాలు నేర్పాయో నీ కురులకి ...నా ఊపిరుల వాయులీనాలకి నాట్యమాడమని ఏ విలుకాడు నేర్పాడో శరప్రయోగాలు నీ కన్నులకి ...గురితప్పకుండా నా మదిని భేదించమని ఏ నదులు నడుం బిగించాయో నీ నడుముకి కొత్త ఒంపులు నేర్పేందుకు మావి చివుళ్ళు మెక్కిన ఏ కోయిల నేర్పిందో గానాలు నీ గళానికి...మత్తెక్కించే గానంతో నన్ను వశపరుచుకోమని ఏ దివ్యసుమాల మకరందం గ్రోలాయో జుంటితేనెల మాధుర్యాన్ని మాటలలో కలిపే నీ అధరాలు ఏ లతల వద్ద నేర్చాయో నీ బాహువులు ఇంత చక్కని అల్లికలు...నను వదలని పెనవేతలు ఎన్ని పున్నములు కలగంటున్నాయో నీ వన్నెల నృత్యానికి యవనికగా మారాలని ఎన్నెన్ని వసంత కౌముదులు పోటీ పడుతున్నాయో నాలో నీవు కుమ్మరించిన వసంతాలకి నీడగానైనా ఉండాలని నా కన్నులు ఎన్ని స్వప్నాలు చూస్తున్నాయో నీతో కలిసే ప్రతి స్వప్నం...స్వప్నంలో కూడా అసత్యం కాకూడదని...@శ్రీ 16/04/14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p8IlVV

Posted by Katta

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Rvss Srinivas కవిత

||జయ ఉగాది || మావిచివుళ్ళను ఆరగించిన గండుకోయిల మత్తెక్కి మధురగీతాలు ఆలపిస్తుంటే వగరు మామిడిపిందెలను కొరుకుతూ తీపి పలుకులు వల్లిస్తూ చిలుకలు సందడి చేస్తుంటే ప్రతితరువు చిత్రసుమాల సొబగులద్దుకుంటూ వసంతునితో కళ్యాణానికి ముస్తాబులౌతుంటే ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర చుట్టుకొని ప్రతి మార్గంలో సుమాలు వెదజల్లుతుంటే కొమ్మల కొప్పులెక్కిన సిరిమల్లెలు పలుదిశల పరిమళనృత్యం చేస్తుంటే తుంటరి తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ విరికన్నెల ప్రసాదాలకై ప్రదక్షిణలు చేస్తుంటే చెరకు విల్లుతో మదనుడు సుమశరసంధానం చేస్తూ తేనెటీగల అల్లెతాడును ఏకబిగిన మ్రోగిస్తుంటే శ్రీగంధం పూసుకొని సుమలతలు చుట్టుకొని చైత్రరథం చక్రాలధ్వనితో పుడమిని పులకింపజేస్తూ తరువులన్నిటినీ పలకరిస్తూ…సుమగంధాలను ఆఘ్రాణిస్తూ శిశిరాన్ని తరిమి కొడుతూ…విజయదుందుభి మ్రోగిస్తూ జయకేతనం ఎగురవేస్తూ…విచ్చేసాడు ఋతురాజు అపజయమెరుగని ‘జయ’నామధేయుడు. - శ్రీ. 31/03/14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPfxvK

Posted by Katta

31, మార్చి 2014, సోమవారం

Rvss Srinivas కవిత

||జయ ఉగాది || మావిచివుళ్ళను ఆరగించిన గండుకోయిల మత్తెక్కి మధురగీతాలు ఆలపిస్తుంటే వగరు మామిడిపిందెలను కొరుకుతూ తీపి పలుకులు వల్లిస్తూ చిలుకలు సందడి చేస్తుంటే ప్రతితరువు చిత్రసుమాల సొబగులద్దుకుంటూ వసంతునితో కళ్యాణానికి ముస్తాబులౌతుంటే ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర చుట్టుకొని ప్రతి మార్గంలో సుమాలు వెదజల్లుతుంటే కొమ్మల కొప్పులెక్కిన సిరిమల్లెలు పలుదిశల పరిమళనృత్యం చేస్తుంటే తుంటరి తుమ్మెదలు ఝుంకారాలు చేస్తూ విరికన్నెల ప్రసాదాలకై ప్రదక్షిణలు చేస్తుంటే చెరకు విల్లుతో మదనుడు సుమశరసంధానం చేస్తూ తేనెటీగల అల్లెతాడును ఏకబిగిన మ్రోగిస్తుంటే శ్రీగంధం పూసుకొని సుమలతలు చుట్టుకొని చైత్రరథం చక్రాలధ్వనితో పుడమిని పులకింపజేస్తూ తరువులన్నిటినీ పలకరిస్తూ…సుమగంధాలను ఆఘ్రాణిస్తూ శిశిరాన్ని తరిమి కొడుతూ…విజయదుందుభి మ్రోగిస్తూ జయకేతనం ఎగురవేస్తూ…విచ్చేసాడు ఋతురాజు అపజయమెరుగని ‘జయ’నామధేయుడు. - శ్రీ. 31/03/14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iPfxvK

Posted by Katta

21, మార్చి 2014, శుక్రవారం

Rvss Srinivas కవిత

"క"ల్పనాప్రపంచపు "వి"రించి ..."కవి" "క"న్నులు చూడలేని "వి"చిత్రాలను "కవి"తల్లో తనకళ్ళతో చూపే అద్భుతమే..."కవి"... ..@శ్రీ21MAR14. (ప్రపంచ కవితాదినోత్సవం సందర్భంగా )

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ODqJB8

Posted by Katta

17, మార్చి 2014, సోమవారం

Rvss Srinivas కవిత

|| హోలీ || మకరందపానం చేస్తూ... మాధుర్యాన్ని అందించిన సీతాకోక చిలుకలకి సిగ్గులభారాన్ని లెక్కచేయక... వాటి రెక్కలకి తమ వర్ణాలని అద్దుతూ ప్రతి సుమం నిత్యం ఆడుతుంటుంది రంగుల హోలీ ఉదయకిరణాలను క్షణానికో రంగులోనికి మార్చేస్తూ ప్రతివర్ణాన్నీ తూరుపు సంధ్యకు పులిమేస్తూ అస్తాద్రి చేరుతూ వీడ్కోలు పేరుతో సంధ్యాసుందరి బుగ్గలకి సిందూర వర్ణాలు పూసేస్తూ ఆదిత్యుడు నిత్యం ఆడుతుంటాడు రంగుల హోలీ ప్రతి తరువునీ తపనతో తాకేస్తూ ప్రతి కొమ్మపై రంగుపూలు చల్లేస్తూ పుడమి నిండా సందడి చేస్తూ ఋతురాజు ఆడేది రంగుల హోలీ సంధ్యా సమయాలలో మేఘమాలికలు కురిపించే చిరుజల్లులను ప్రభాకరుని కిరణాల సాయంతో అల్లరి పెడుతూ ఆ నీలాలగగనం ఆడేది సప్తవర్ణాల హోలీ. క్రోధంలో కెంపురంగుని విసురుతూ నవ్వులతో ముత్యపువర్ణంలో తడుపుతూ ప్రేమలో సతతహరితాన్నందిస్తూ నా మదిలో లెక్కలేనన్ని వర్ణాలు నింపుతూ నీవాడేది రంగురంగుల హోలీ...వేల వసంతాల కేళి. ...@శ్రీ 17/03/14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p14twb

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Rvss Srinivas కవిత

|| జ్ఞాపకాల అడుగులు || నా తలపులలో నిలుస్తావు నీ జ్ఞాపకాలతో బాధిస్తావు నిన్ను నేను తలపుగా భావిస్తున్నా, జ్ఞాపకంగా మిగిల్చావు నన్ను జ్ఞాపకాల జ్వాలల్లో కాలిపోతున్నా చందనపు చల్లదనం మదిని తాకుతోంది హాయిగా వలపుశరాలతో నీవు చేసేవి తీయని గాయాలు మదిని ప్రేమగా పలకరించేవి నీవైన జ్ఞాపకాలు. మదిలోయల్లో నీకోసమే అన్వేషిస్తున్నా నీ జ్ఞాపకాలనే సోపానాలుగా చేసుకుంటూ నిన్ను అందుకోవాలనే ప్రయత్నంలో విఫలమైనా సాలెపురుగునే ఆదర్శంగా తీసుకుంటూ... మునుముందుకి సాగిపోతున్నా. నీ అడుగులో అడుగు కలపాలనే తపనలతో అనుక్షణం పరుగులే నా పాదాలకి అడుగులో అడుగు కలిపితే గమ్యం సుగమమౌతుందని నమ్మకంతో. ఎదసంద్రంలో నీ అడుగుల సవ్వడితో అలలను సృష్టిస్తున్నావు ధమనుల్లో తేనెవాగులా పరుగులిడుతున్నావు చేరాల్సిన గమ్యం దూరమైనా సమస్యలు విపత్కరమైనా నీ సహకారంతోనే నా ముందడుగు నీవే లేని నాకు అడుగు కూడా యోజనమే నీతో జత కడితే యోజనమైనా మారేది అడుగులలోకే...@శ్రీ 15/03/2014

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oW69qH

Posted by Katta

9, మార్చి 2014, ఆదివారం

Rvss Srinivas కవిత

||జీవన సంగీతం || నీ మదిలో నాకు స్థానమున్నా లేకున్నా నీ కలలో కాసింత చోటిస్తే నా కలవరాలు తీర్చే 'కల'...వరమై నన్నుగ్రహించినట్లే నీ మదిలో రవంత చోటిస్తే నా మనసులోని ప్రతిపరమాణువును నీవు ప్రణయవిస్ఫోటనం చేసినట్లే నన్ను మనస్పూర్తిగా ఒక్కసారి ప్రేమిస్తే నా ప్రేమకి ప్రతిరూపంగా నీవు మదిలో కొలువై ఉండిపోయినట్లే నీరాకతో సాధారమైన మదిగది... అపురూపమైన ప్రేమమందిరంగా మారిపోయినట్లే జీవనయానంలో నీతో నడిచే భాగ్యమున్నా లేకున్నా నీ అడుగుల చప్పుళ్ళలో ఒక్క రవాన్నైతే చాలు నా జీవితమాసాంతం మధురసంగీతమాలపించినట్లే ...@శ్రీ 09MAR14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lipLF8

Posted by Katta

20, ఫిబ్రవరి 2014, గురువారం

Rvss Srinivas కవిత

||రాత్రికి స్వాగతం|| రాత్రంతా చీకటిని చీలికలు చేస్తూనే ఉంటాయి కలలను వెదికే కనురెప్పల అంచులకత్తులు చీకట్లు నల్లని రుధిరాన్ని స్రవిస్తూనే ఉంటాయి కొత్తవేట్లకి అప్రయత్నంగానే సంసిద్ధమౌతూ కన్ను మూస్తే కనబడే దుస్వప్నాల కుత్తుకలను తెగనరుకుతుంటాయి సుస్స్వప్నాల కాల్పనిక ఖడ్గాలు తీయని స్వప్నసాక్షాత్కారం పొందని బాధతో కళ్ళు కక్కే ఆమ్లాల దాడులకి చెక్కిళ్ళు కాలిపోతూనే ఉంటాయి. మండుతున్న కలల పొగలు సుడులు తిరుగుతూ ఊపిరాడకుండా చేస్తాయి కళ్ళని. నిశను చీల్చినా రేయిని కాల్చినా కలలని వ్రేల్చినా కన్నులు నిప్పులు చిమ్మినా విషాదమే గెలుస్తుందని తెలిసినా... మడమ తిప్పని యోధునిలా కొత్త ఆశలు నింపుకుంటూ రెట్టించిన సమరోత్సాహంతో స్వాగతిస్తున్నాయి నా కన్నులు...మరో రాత్రిని సాదరంగా. ...@శ్రీ 20/02/2014

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eawLOE

Posted by Katta

6, ఫిబ్రవరి 2014, గురువారం

Rvss Srinivas కవిత

|| పాదాల గుర్తుల కోసం || మరువలేకున్నాను నీమోముపై ముంగురుల సోయగానికి కెరటాలు సైతం చిన్నబోయిన విషయం నీ పాదాలు కడిగి ప్రతి కెరటం పావనమైన సంగతి. నీ కాలి మువ్వలతో తరగలకి సవ్వడి నేర్పిన దృశ్యం నీ వేళ్ళ సవరింపులకి ఫక్కుమన్న కెరటాల నురుగులని మనం విశ్రమించిన ఏకాంత తీరాలలో ప్రతి రేణువు పులకించిన మనోహర చిత్రాన్ని కలిసి నడిచిన సప్తపదుల మొత్తాన్ని సాగరుడు అలలతో నేర్పుగా దొంగిలించడం... అందుకే తీరమంతా జల్లెడ పడుతున్నా మనం కలిసినప్పుడు జాలువారిన నీ నవ్వుపూలకోసం... సంద్రంలో వల వేస్తూనే ఉన్నా ఇసుకలో కలిసి నడిచిన మన పాదాల గుర్తుల కోసం... ...@శ్రీ 06/02/14

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jhBrdt

Posted by Katta

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

Rvss Srinivas కవిత

|| అస్తిత్వం || నీలో ఉన్నది నేనైతే నీతోడుంటానంటూ నీతోడంటూ నా తోడైనది నీవే ప్రతి నిమిషం నిన్ను నీడలా వెంబడించేది నేనైతే, నా నీడై నాకు తెలియకుండానే నన్ను అనుక్షణం అనుసరించేది నీవే నిన్ను ప్రేమిస్తున్నది నేనైతే నా ప్రేమగా మారిపోయింది నీవే. నీవు ప్రాణప్రదమన్నది నేనైనా నాలో ప్రాణదీపమై అఖండ కాంతులు వెదజల్లేది నీవే. నీ మదిలో చిత్రించుకున్నది నా రూపమైనా చిత్రంగా మదినే నీ చిత్రంగా మార్చేసుకున్నది మాత్రం నీవే...నీ ప్రణయమే. "నీవు సగం నేను సగం" అనే అర్ధనారీశ్వర ఆరాధనం నీదైతే... నీవే నేను... నేనే నీవు ఒకరు లేకుంటే వేరొకరికి అస్తిత్వం లేదనే రాధామాధవీయతత్వాన్ని నిత్యం స్మరించేది నేను...@శ్రీ 03/02/2014

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nH6IXx

Posted by Katta

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Rvss Srinivas కవిత

|| అస్తిత్వం || నీలో ఉన్నది నేనైతే నీతోడుంటానంటూ నీతోడంటూ నా తోడైనది నీవే ప్రతి నిమిషం నిన్ను నీడలా వెంబడించేది నేనైతే, నా నీడై నాకు తెలియకుండానే నన్ను అనుక్షణం అనుసరించేది నీవే నిన్ను ప్రేమిస్తున్నది నేనైతే నా ప్రేమగా మారిపోయింది నీవే. నీవు ప్రాణప్రదమన్నది నీవైనా నాలో ప్రాణదీపమై అఖండ కాతులు వెదజల్లేది నీవే. నీ మదిలో చిత్రించుకున్నది నా రూపమైనా చిత్రంగా మదినే నీ చిత్రంగా మార్చేసుకున్నది మాత్రం నీవే...నీ ప్రణయమే. "నీవు సగం నేను సగం" అనే అర్ధనారీశ్వర ఆరాధనం నీదైతే... నీవే నేను... నేనే నీవు ఒకరు లేకుంటే వేరొకరికి అస్తిత్వం లేదనే రాధామాధవీయతత్వాన్ని నిత్యం స్మరించేది నేను...@శ్రీ 03/02/2014

by Rvss Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nH6IXx

Posted by Katta