పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Nirmalarani Thota కవిత

ఏదో పద సవ్వడి..వడివడిగా గుమ్మానికి వ్రేలాడుతూ చూపుల తోరణాలు . . వయ్యారి వసంతమా వచ్చేస్తున్నావా? నీ మూన్నాళ్ళ వగలన్ని మళ్ళీ ఒలికిస్తావా ? చివుళ్ళు వేయడం ఆనక చిదిమేయడం నీకే చెల్లు.. వినిపిస్తుందా నీకు ఎండుటాకుల గలగలలో అడియాశల ఆత్మ విలాపం కనిపిస్తుందా నీకు మోడుబారిన గుండెల్లో ఆత్మీయతల చరమ గీతం నా పిచ్చిగానీ . . గడిచిపోయిన నిన్నటి శిథిల శిశిరంలో రాలిపోయిన ఆశల ఆకులెన్నని ఈ వసంతాన్నడిగితే ఏం చెపుతుంది ? అది రాలిన చోటే తను పుట్టానని మిడిసిపడుతూ గర్వంగా చెపుతుందా..? లేక ఇదే ప్రశ్న రేపు నేను రాలిపోయాక వచ్చే వసంతాన్నడుగుతావా అని దిగులు పూల హారాలతో బదులిస్తుందా.? కాలానికి ఋతువులెన్ని మారినా అనుభూతుల చివుళ్ళ జాడేది? పంచ వన్నెల పంచాంగాలెన్ని పరచినా మస్తిష్కపు మంచు పొరలు తొలగవేం? యుగాలు దాటే ఉగాదులెన్ని ఎదురొచ్చినా ఎద కోయిల కూయదేం? పల్లవించని స్పందనల్లో గొంతు దాటని కూజితాలన్నీ నిశ్శబ్ధ సంగీతాలేనా? ఉదయించని స్తబ్ధ ఉగాదులేనా? నిర్మలారాణి తోట [ తేది: 30.03.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoeOBN

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి