అస్థిత్వం - రాధ మండువ 1. శబ్ద కాలుష్యంతో వేడెక్కిన సాయంత్రం నియాన్ లైట్లలో మెరుస్తున్న సిల్కు చీరల డంబం హాయ్! హలో! అంటున్న రంగు పెదవుల వ్యంగ్యం అధికారాలను బట్టి చూపిస్తున్న కపటాభిమానం జీవితం మీద అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. 2. నల్లని కాటుకను మింగిన నిశాంధకారం 'నలుగురితో కలవడం తెలియదం'టూ చేస్తున్న అవమానం ఇష్టం లేకుండా దురాక్రమణం గావింపబడ్డ శరీరం లేడిని చంపి తింటున్న సింహంలా నవ్వుల వెటకారం జీవితాన్ని అంతం చేసుకోమంటున్నాయి. 3. చల్లని ప్రభాత గాలుల ఉదయం బాలభానుడి కౌగిలి వెచ్చదనం ఆశల అడియాశల బేరీజుతనం అంధకారపు ఆలోచనలను విడనాడమంటున్న స్థిరత్వం బిడియపు శృంఖలాలను తెగ్గొట్టుకోమంటున్న ధీరత్వం జీవితం పట్ల నిర్లిప్తతను తొలగిస్తున్నాయి. 4. నిశ్శబ్ద ప్రశాంత మధ్యాహ్నం ఎండలో నిగనిగలాడుతున్న ఆకుల పచ్చదనం రేడియోలో వినబడుతున్న ఆర్ద్ర స్వరం పక్కింటి పిల్లవాని మాటల్లోని అమాయకత్వం వంటింటి నేలపైనున్న చెమ్మదనం జీవితం మీద ఆశను కలిగిస్తున్నాయి 5. దారాన్ని తెంచుకుని ఎగురుతున్న గాలిపటం గూడుని వదిలి స్వేచ్ఛగా విహరిస్తున్న విహంగం గలగలమంటూ దూరతీరాలకు పరిగెడుతున్న ప్రవాహం పురివిప్పి ఆడుతున్న మయూరం జీవిత గమ్యాన్ని తెలియజేస్తున్నాయి. ****
by Radha Manduva
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN88F
Posted by Katta
by Radha Manduva
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN88F
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి