అద్దం... వీడని అనుబంధం .. ! దశాబ్ధాలుగా నిన్ను చూస్తూ నేను.. నిశ్శబ్ధంగా నన్ను చూపుతూ నువ్వు.. రేయంతా కలల షికారుకెళ్ళి పొద్దున్నే తీపి గురుతులు నీలోనే.. పొద్దంతా బతుకు బాటల్లో పరుగులెత్తి చీకటింట మెరుగులద్దుకొనేది నీతోనే.. నిన్ను చూస్తూ నేను.. నన్ను చూపుతూ నువ్వు..! ఊహ తెలియని పసితనంలో జాబిల్లిని చూపిన కేరింతల నెరజాణవు నువ్వు పారాడే పాపాయికి పాల పళ్ళు చూపిన బోసినవ్వుల నెలబాలవు నువ్వు పరికిణీ ఓణీ వేసుకున్న తొలిరోజున తుళ్ళింతలు రేపిన దోరవయసు కన్నె పిల్లవు నువ్వు ఆ రోజుల్లో నువ్వే నా ప్రియనేస్తానివి.. పదే పదే కనులు వెతుక్కునే ఆలంబనవి సమస్యలతో సతమతమవుతున్న నా తలలో తొలి నెరసిన వెంట్రుక చూపిన జాలిలేని బూచాడివి నువ్వు కదలిపోతున్న కాలం నింపిన కనుల కింది నీలి నీడల్ని నిర్ధాక్షిణ్యంగా చూపిన నిస్తేజపు జాడవి నువ్వు.. ముడుతలు పడుతున్న దేహంలో ముంచుకొస్తున్న మృత్యువుని కర్కశంగా చూపుతున్న కసాయి పాశానివి నువ్వు ఈరోజుల్లో నువ్వు నాకు అనివార్య నేస్తానివి పదే పదే భుజాలు తడుముకునే అభద్రతకు ఆనవాలువి.. ఋతువుల గమనాల్లో రంగులు మారే ప్రకృతిలా జీవన గమకాల్లో జారే పొంగులు . . హంగులూ ఏమీ లేని నీలో ఎన్నెన్ని కన్నుల వన్నెలో . . ఏమెరుగని నువ్వు ఎన్ని రూపుల్ని మారుస్తావో ఊసరవెల్లిలా.. ఏమీ దాచలేని నువ్వు ఎన్ని పొంగుల్ని దోచేస్తావో నంగనాచిలా.. నీలోకి ఆశగా తొంగి చూసిన పాపానికే కదా... నన్ను ఆడించి, అలరించి, మురిపించి, మరిపించి , నవ్వించి, ఏడిపించి చివరికి లాలించి అతలాకుతలం చేస్తున్నావే.. అందుకే అద్దమా.. నా మొదటి మిత్రుడివి.. చివరి శత్రువువీ నువ్వే సుమా..! నువ్వు సత్య హరిశ్చంద్రుడికి ప్రతిరూపమని ఒప్పుకుంటా గానీ.. అద్దమా... ఒక్క సారి అబద్దం ఆడరాదూ..! రాలిపోతూ ఈ శిథిలమైన తోటను నే చూడలేను.. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి పరిపక్వపు జీవన పుష్పంపై తారాడే మనసు సీతాకోక చిలుక అందాల్ని చూపవా . . ! అనుభూతుల రెక్కల్తో ఆనందపు చుక్కల్లో.. ! వడలిన సడలిన తనువు మాటున దాచుకున్న వీడని పరిమళాల శ్వాసల్ని తనివితీరా ఆస్వాదించిన తృప్తితో ప్రశాంతంగా జారిపోతా జీవితపు అంచుల్లోకి ..! నిర్మలారాణి తోట [ తేది: 06.06.2014 ]
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pYXqpB
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pYXqpB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి