పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Challa Ssj Ram Phani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Challa Ssj Ram Phani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Challa Ssj Ram Phani కవిత

నేరం ఋజువైంది! శిక్ష వెయ్యి నేస్తం! మానవత్వానికి సరిహద్దు మంచినీళ్ళు పుట్టని చోటనీ చిరునవ్వులో సైతం సైనైడుంటుందనీ ఉచ్చ్వాశ నిశ్వాసాల్లో విషవాయువులుంటాయనీ తెలిశాక... ప్రేమ ద్వేషిస్తుందనీ, ద్వేషం ప్రేమిస్తుందనీ వేషం వేరుగానీ, వేరొకటేననీ తెలిశాక ... మనిషిగా పుట్టడం నేను చేసిన నేరమని ఋజువైంది నేస్తం! శిక్షయినా, చిటికెడు ప్రేమభిక్షయినా నీ చేత్తోనే నా హృదయభిక్షాపాత్రికలో పడాలనే నా నేరం ఋజువైందని తలవంచాను! తరతరాలుగా తీరాన్ని తాకడానికి కెరటాలు కేకలేస్తూ; 'చెలి'- ‘యాలి’ కట్టను చేరాలని ముందుకు దూకడం లేదూ! నేల తాకిన చినుకు ఆవిరై నింగిని చేరి వానై వర్షించట్లేదూ! పడిలేచినా, ఓడి గెలిచినా నీ చేతిలోనే! పరవశించినా, పది మందిలో పరిమళించినా పసితనంలోంచి పసిడితనంలోకి ప్రవహించినా పతనంలోంచి పునరుత్థానంలోకి పయనించినా నీ ధ్యాసలోనే! నేరం ఋజువైనా ఇంకా నీ స్మృతులే శ్వాసిస్తోంది - శిక్ష కూడా నువ్వే వేస్తావన్న ఆశతోనే! -చల్లా రామ ఫణి 14.2.2014

by Challa Ssj Ram Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cDFRn7

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Challa Ssj Ram Phani కవిత

నిర్నిద్ర వ్యూహం నేలమీద జారిపడ్డ నిర్లిప్త పదాల గోళీల మీద కాలేసి జారిపడతాం! ఓ వెర్రి నవ్వు వెనక హిపోక్రటిక్ శిఖరాలను దాచుకుంటాం! అక్షర శతఘ్నుల దాడికి దాక్కునే దారి శూన్యం! శబ్ద నదుల ఘోషకు లాకులు మూసేసి స్వర ప్రవాహాల్లో జలకాలాటలకు వెంపర్లాడతాం! ఉత్తేజించే ఆరాధనా వ్యూహంలో అతలాకుతలం! నిర్నిద్ర జపాలు చేస్తూ నిబద్ధీకరణకు నీళ్ళొదులుతాం! అబద్ధాలకు ఆయువు పోసి ఆత్మవంచనల ఇనుప కచ్చడాల్లో దాక్కుంటాం! ఆత్మరక్షణకు అజ్ఞానమే అవరోధం! దు:ఖీకరించాల్సిన భావాలకు అక్షరాలు కరవు! చిత్తచాంచల్యాన్ని విత్తీకరించుకునే విఫల యత్నం! నోటి జైల్లో ఖైదీ అయిన శబ్ద విముక్తికి చేపల మార్కెట్టైన బతుకు! విధించుకున్న విధి నిషేధాలని అధిగమించే ఒడుపు తెలియనితనం! ఓడిపోవడానికి ఒప్పుకోలేని ఉడుకుమోత్తనం నిద్రమాత్రలుగా మింగి, నిర్నిద్ర వ్యూహాలకు తెర దించి ఆత్మను నిద్రపుచ్చే యత్నంలో అలసిపోయి ఒళ్ళు వాలుస్తాం!

by Challa Ssj Ram Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbsrnK

Posted by Katta

Challa Ssj Ram Phani కవిత

మరణించిన మాట స్మృతిలో... మాటలు కత్తులుగా మలచి కుత్తుకలు తరగడానికి కడుపులో ఎవడెన్ని శబ్దాలు దాచుకున్నాడో! ఎవడెన్ని శబ్దాలను మాటలుగా సైతం మలచలేక కడుపులోనే దాచుకుని నిలువెత్తు కన్నీటి బొట్టయ్యాడో! * * * కాలచక్రంలో కాళ్ళ కింద చీమల్లా నలిగిపోయి నేల రాలి రోడ్డు ప్రమాదాల్లో ఆవిరైపోయిన కోట్లాది బిలియన్ల మాటల ఆత్మశాంతి కోసమే నేనిది రాస్తున్నాను! మనిషితనం మలిగిపోయి హృదయం మాయమైన మాట మన చుట్టూ దయ్యమై తిరుగుతుంటుంది! ఏ కిరీటాలు, ఆర్భాటాలు లేని మాటల నగ్నత్వం నన్ను మరణంలా ఓదారుస్తుంది! మాటలకు ఆత్మను తొడిగే వ్యర్ధ యత్నంలో మైకు ఖద్దరు టోపీ తొడుక్కుని కూడలిలో కురిపించే వాగ్దానాల మూటలే తార్రోడ్డులోంచి తన్నుకొచ్చిన కంకర్రాళ్ళు! ఇరానీ హోటల్లో మాటలు చాయ్ లో మలాయ్ లా తేలుతూ చెరువులో జలకాలాడే పశువు మీద పరచుకున్న నాచులా నానుతుంటాయి! పాన్ షాపు చెట్టుకి పూసే మాటలు - నోటి డ్రైనేజీలో ఎర్ర బురద అవుతాయి! భజంత్రీవాడి అంగడిలో మాటలు కత్తెర్ల అరుపులలో సెన్సారైపోయి ఏడుకొండలవాడి ఖాతాకు ఎగుమతి అయ్యే తలనీలాలవుతాయి! ఆత్మకు అంటని మాట హృదయాన్నైనా చేరలేక జేబులోంచే జారిపోయి అకాలంలో రోడ్డెక్కి లారీ కింద పడ్డ పిచ్చి కుక్క మెదడులా చితికి నజ్జు నజ్జవుతుంది! ఆత్మ లేని మాట ఆశలు మోసులెత్తకుండా బతుకు గాడిపొయ్యిలో అడుగంటిపోయిన బాల్యం! పసిగుడ్డుకు పాలిచ్చే వేళ రొమ్ము దాచుకోవడానికి జానెడు గుడ్డ చేతికందక కలవరపడే తల్లి! సిగ్గు దాచుకోవడానికి చీరముక్కైనా దక్కని దేశంలో పుట్టిన చెల్లి! ఆత్మీయతల రక్షణ కవచంలా ఆత్మను హత్తుకోలేని మాటలకు శ్రాద్ధంపెట్టి తిలోదకాలొదిలి ఎలిజీ రాసేశాను! ఏడవకండి! మాట మరణిస్తే కన్నీళ్ళు పెట్టకూడని మాటల అక్షయపాత్రలం మనం! మాటలు నిధుల్లా దాచుకున్న నడిచే సముద్రాలం మనం! ఆప్యాయతల దేహంతో అనురాగాల ఉడుపులు తొడుక్కుని ఆత్మతేజంతో బూడిదలోంచి ఫినిక్స్ లా మళ్ళీ పుడుతుంది మాట! సృష్టిలోని నగ్నత్వాన్ని తొడుక్కుని పసిపాప బోసినవ్వులా మళ్ళి పుడుతుంది మాట! అప్పుడు మానవత్వపు హరివిల్లు మనసు నింగిలో స్వయంభువు!

by Challa Ssj Ram Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bbsrnz

Posted by Katta

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Challa Ssj Ram Phani కవిత

ప్రేమకు కళ్ళొస్తే... శిలాజ శరీరంలో గర్భీకరించుకున్న కలలకు ఆకారమైన నీవే కదా అక్షరాలకు ఊపిరైంది! అనిబద్ధ శాఖాచంక్రమణాల అహమహమికతో అలమటించిపోయే ఆకలి క్షణాల ఆఖరి దశలో అక్షరాలకు తొడగడానికి భావాల ఉడుపులైంది! చక్రంతో రమించే తార్రోడ్డును కొలుస్తూ తూగుటుయ్యాల్లా ఊగే గూడుబండిలో సమయానికి గుడికి చేరాలనే తపన నీ నేత్ర దర్పణాల్లో ప్రతిఫలించిన ఆరాటమే కదా అక్షరాలకు ఆయువంది! ప్రేమకు పునాది ద్వేషమని తెలియనితనంలో తెలీక తూలిన మాటల తూటాలు చేసిన గాయాల మాలల్ని మల్లెదండల్లా మోస్తూ అశృపుష్పాలై నీ ముంగిట్లో పూసి అక్షర పరిమళాలై ప్రవహించాను! అగమ్య నాటకాలకు, అక్షర ఘాతుకాలకు ఆదిమపునాది నీ అంతరంగ గుహాంతస్సీమలని తెలిసిన మరుక్షణమే కలం తన్ను తాను గిల్లి చూసుకుని కాలం చేసిన స్ఫూర్తి కోసం అక్షర మౌనం పాటించింది! ఇప్పుడు నాకూ ద్వేషించడం తెలుసు! విషాదినితో వినోదించడమూ తెలుసు! అఖండమవుతున్న అనంత రూప ద్వేషాగ్ని శిఖలకు ఆది భాష్యకారుణ్ణి! విద్వేష ప్రేమలు అభేదాలని నిరూపించగల మాంత్రికుణ్ణి! అంతే! నా అక్షరాలకు కాళ్ళొచ్చాయి! ప్రేమకు కళ్ళొచ్చాయి! * * *

by Challa Ssj Ram Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fAdZ74

Posted by Katta