కవిత: ( అంతర్జాల సాహిత్య పత్రిక 'కౌముది' ఈ జూన్ సంచిక ప్రచురణ ) ......// మళ్ళీ రాయాలి మలిపి మరో కొత్త గీతం //...... ఈ ఉదయం --- గాలి ఒక ఈల పాట ! నేల ఒక పద్య పాదం! నింగి భావాంబరం! సంద్రం స్వరార్ణవం ! సృష్టి ఒక దృశ్య కావ్యం ! సర్వం రసరమ్యకవిత్వం! అదిగో, అందుకే ఆ రసావేశంతోనే నేను అక్షరం అయింది! ఆలోచనకు అంబుదాలను అలది పద్యానికి పక్షి పాదాలను అతికి పాటకు పవన పక్షాలు తొడిగి ఎగిరేశాను నా గీతాన్ని ఆకాశంలోకి రెక్క విప్పే రిక్క ఔతుందని ! కాని, నా కవిత గువ్వపిట్ట లా ముడుచుకుంది గూటికే పరితమయింది శూన్యాకాశం పాటను పరిహసించింది! నా అక్షర విహంగ సృష్టిలో ఏదో జీవద్రవ్యం లోపించి ఉంటుంది గుప్త జీవన ధాతువేదో లుప్తమై ఉంటుంది అంగరాగమే తప్ప ఆత్మస్పర్శ కొరవడినట్టుంది ప్రాణప్రతిష్ఠ చేయడం నేను మరచినట్టుంది అస్మితాసంకుచితమైన నా అక్షర రేఖ అనంత కళాత్మకు హద్దులు గీచినట్టుంది అందుకే సృష్టించుకోవాలి మరో సృజన ప్రాణ పతంగాన్ని, రెక్క సాచని నా అక్షర వర్ణాల అచల జీవన చిత్రాన్ని మలిపి మళ్ళీ రాసుకోవాలి మరో కొత్త గీతాన్ని ! ---నాగరాజు రామస్వామి. Dt:21.06.2014.
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qBooGZ
Posted by Katta
by Ramaswamy Nagaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qBooGZ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి