ll చిట్టి గుండెకెన్ని తపనలో ll తరువులన్నీ ఋతువులను మరచి వసంతపు శ్రీమంతాలే జరుపుకోవాలని విరిబాలల బోసినవ్వులతో వడిని నింపుకోవాలని, మధుపాలను అదిలించైనా మధువుల కడవులను నింపుకోవాలని తేనెటీగల వాకిట తేనెల కళ్ళాపి జల్లి మురిసిపోవాలని, తీయందనాల అలలపై తేలిపోవాలని, పేద గరికల చెంత చేరి ఊసులెన్నో చెప్పుకోవాలని గడ్డిపూలతో జతకలిపి ఆడిపాడాలని అడవిపూల సోయాగాల గుట్టువిప్పాలని, పూలపుప్పొడులెన్నో దోసిలి పట్టి రాసులుగా పోయాలని రాలిపోయే పత్రాల జాలి కధలన్నీ కంటి ముత్యాలుగా వడిసి పట్టాలని, చిగురుల పురిటి కందులకు లాలపోయాలని, మిణుగురులనేరి గుట్టలుగా పోయాలని మెరిసే జాబిలమ్మతో పోటీకి పెట్టాలని వెన్నెలరేడుతో వీధి దీపమెట్టాలని మెరుపులమ్మ తళుకులన్నీ మెలిపెట్టి హరివింటి పొదరింటికి కాపలా కంచెగా కట్టాలని , వెన్నెల కన్నెతో కలిసి నర్తించాలని శారద యామినిలో పులకించాలని పున్నమి నదిలో విహరించాలని శరత్చంద్రికల తోరణాలెన్నో కట్టాలని, మాపులపై దోబూచులాడే చిరుగాలుల సంగీతాలతో జతకలిపి పాడాలని కాకమ్మ గూటిలో ఊయలలూగే కూనలమ్మ తొలిపలుకులతో బాణీలే కట్టాలని , పడుచు గువ్వల కువకువల రాగాలెన్నో చైత్ర వేదికపై శృతి చేయాలని కలహంసల వయారి పాద సవ్వడులన్నీ "సిరి" మువ్వలకే రవళులుగా శృతి చేయాలని, పూల నెత్తావుల అత్తరులన్నీ పన్నీటి కల్లాపిగా చల్లేయాలని మకరంధపు అలలపై తేలిపోయే గడుచు తుమ్మెదల సోగకన్నుల చిత్తరువులెన్నో చిత్రంగా మలచాలని, మేఘమాలికనే కాటుక రేఖగా దిద్దుకోవాలని బాలభానునే కస్తూరిగా అద్డుకోవాలని సంజకెంజాయిలనే లత్తుకగా పాదాలకు పూయాలని వెన్నెలమామతో గారాలరాగాలెన్నో పాడుకోవాలని.....@సిరి ll సిరి వడ్డే ll 22-06-2014
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lghBPW
Posted by Katta
by సిరి వడ్డే
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lghBPW
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి