పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, జూన్ 2014, ఆదివారం

Abd Wahed కవిత

కొన్ని రోజుల క్రితం కవియాకూబ్ గారు ఒక పోస్టు చేశారు. అందులో కొంతభాగం : ’’ కవిత్వవిమర్శ కవి ఎదుగుదలకు ఉపయోగపడ్తుంది.!!! ఇప్పటివరకూ 'కవిసంగమం' లో కేవలం ప్రశంసల పద్ధతిలోనే వ్యాఖ్యలు కానీ,సూచనలు కానీ చేస్తూ, ప్రోత్సహించడమే పద్దతిగా సాగాం. : ఒకవిధంగా కవిత్వాన్ని రాసేందుకు ఎంతోమంది ముందుకు వచ్చేట్లుగా కామెంట్స్ లోనూ,ప్రశంస లోను జాగ్రత్తలు తీసుకుంటూ కవిత్వవిమర్శ చేయగలిగినవాళ్ళు కూడా ఆచితూచి వ్యవహరించారు. : ఇకపై కవులు ఇంకా మెరుగైన కవిత్వం రాయడానికి ,ఆయా కవితల విశ్లేషణలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. '' కొందరు బాగులేదనగానే, అలాంటి విమర్శలకు ఎంత మాత్రం స్పందించరు. లేదా ఆవేశంతో సమాధానాలిస్తుంటారు" అని నవుదూరి మూర్తి గారు భావించినట్లు ఆ రకమైన పద్ధతులు కవులకు అనుసరణీయం కాదు.....‘‘ ఈ పోస్టుకు కామెంటుగా నేను సదాశివ గారి పుస్తకం నుంచి ఒక పేరాగ్రాఫ్ పెట్టాను. అది : ’’ యాకూబ్ భాయ్, మీ నిర్ణయం బాగుంది. మీ పోస్టు చదివిన తర్వాత నేను తెలుగు గజల్ గ్రూపులో పెట్టిన ఒక పోస్టు కొంతభాగం ఇక్కడ పెట్టాలనిపించింది. ఇక్కడి చర్చకు అది ఉపయోగపడుతుందన్నది నా నమ్మకం డాక్టర్ యస్. సదాశివ మాస్టారు రాసిన ఉర్దూ సాహిత్యం పుస్తకంలో చివరి ముగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ కవిత్వం గురించి కొంత సమాచారమిచ్చారు. అప్పటి కవులు, వారి విశేషాలు తెలియజేశారు. అందులో కొంత భాగం మిత్రుల కోసం ఇక్కడ ఇస్తున్నాను. సదాశివ మాస్టారు పుస్తకం నుంచి ... ’’చివరి ముగల్ చక్రవర్తి రెండవ బహదూర్ షా సారస్వత ప్రియుడే కాక కవిత చెప్పే సామర్థ్యం కూడా కలవాడు. ఆనాటి మహాకవి షాహ్ నసీర్ చేత యువరాజుగా ఉండగానే తన కవితలు దిద్దించుకుంటూ జఫర్ అన్న కలంపేరుతో రాసేవాడు. షేక్ ముహమ్మద్ ఇబ్రాహీం జోఖ్ చేత తన కవితలు దిద్దించుకోవడం మొదలుపెట్టాడు. జోఖ్ మరణించిన తర్వాత బహదూర్ షా జఫర్ తన గజళ్ళను మీర్జా గాలిబ్ చేత దిద్దించుకున్నాడు. ’దిద్దించుకోవడం‘ అనే మాట తెలుగు వాళ్ళకు వింతగా వినిపించవచ్చు. హిందూస్తానీ సంగీతంలో (కర్నాటక సంగీతంలో కూడా) గురు శిష్య పరంపర ఉన్నట్టే ఉర్దూ కవనంలోను గురు శిష్య పరంపర ఉన్నది. గురువులేని విద్య కూసువిద్య. ఎవరో ఒక ఉస్తాదుకు (గురువుకు) తన కవితను చూపించి దిద్దించుకోనిదే ఆ కవితను ముషాయిరాల్లో వినిపించడం కాని, పత్రికలకు పంపించడం కాని ఉర్దూ కవుల సంప్రదాయం కాదు. డా. ఇక్బాల్ వంటి మహాకవి కూడా తన కవితను దాగ్ చేత దిద్దించుకునేవాడు. ..... ఉస్తాదుల చేత దిద్దించుకోవడం ఉర్దూలో గర్వకారణం. ఈ సంప్రదాయం ఉర్దూలో ఉన్నట్లుగా ఇతర భాషల్లో ఉన్నట్లు కనిపించదు. తెలుగులో నయితే మార్పులు సూచించే వాళ్ళను రంధ్రాన్వేషులని నిందిస్తారు. ఎవరేది రాసి వినిపించినా చాలా బాగున్నదనగలవాడే సత్పురుషుడు. సాహిత్య మర్మజ్ఙుడు.‘‘ ఇవి సదాశివ మాస్టారు రాసిన పంక్తులు. మనం గమనించవలసిన విషయాలు ఇందులో చాలా ఉన్నాయనుకుంటున్నాను...‘‘ ఇవి రెండు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, కవిత్వం, కవిత్వ విమర్శల గురించి మనం హృదయపూర్వకంగా ఆలోచించవలసి ఉంది. హృదయపూర్వకంగా అని ఎందుకంటున్నానంటే, కవిత్వం రాసేది పెన్నుతో కాదు హృదయంతోనే కాబట్టి. సాధారణంగా ఒక కవిత రాసిన తర్వాత వెంటనే దాన్ని పదిమంది చూడాలని, దాన్ని ప్రశంసించాలని, ఆ కవితపై మాట్లాడాలని ప్రతి కవి భావిస్తాడు. అది సహజం. అందువల్ల వెంటనే పోస్టు చేయడం జరుగుతుంది. కాని రాసిన కవితను కాస్త పరిశీలించి, స్వయంగానే ఎడిట్ చేసుకుంటే, అది మరింత పదునునెక్కుతుంది. పదును అన్న పదం కావాలనే వాడాను. ఎందుకు వాడానంటే... దీనికి కాస్త వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చేంత పాండిత్యం నాకు లేదనుకోండి. వినేవారుంటే చెప్పేవాడికి లోకువన్న సామెత తెలుసు కదా.. అలాగే అనుకోండి.. కాని కాస్త వినండి. నాకున్న కొద్దిపాటి పరిజ్ఙానం పంచుకోవాలనిపించింది. మైకులా కవిసంగమం చేతికి దొరికింది, కాబట్టి చెబుతున్నాను... కవిత మరింత పదునెక్కడమంటే ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకునే ముందు మరో రెండు మాటలు భాష గురించి చెప్పాలి. మనం మన మనసులో ఉన్న మాటలను ఇతరులకు చెబుతాం. చెప్పాలనుకున్న విషయానికి అవసరమైన పదాలు వాడుతాం. అంటే మనం వాడే పదాలు నిజానికి మనం అనుకున్న భావానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆ పదాలు స్వయంగా భావాలు కాదు. ఉదాహరణకు ’’గులాబీ కొన్నాను‘‘ అన్న పదాలు చూడండి. ఇందులో గులాబీ అన్న పదం, గులాబీ అనబడే పువ్వుకు బదులుగా మనం వాడాము. అలాగే ’’కొన్నాను‘‘ అన్న పదం ’’కొనడం‘‘ అన్న పని జరిగిందని సూచించడానికి బదులుగా వాడాము. అంటే పదాలన్నీ నిజానికి representative. కొందరు తాము చెప్పదలచుకున్న విషయానికి తగిన పదాలను ఎన్నుకుంటారు. చక్కగా చెబుతారు. అలాంటి వారిని articulative అంటాం. అలాగే రాసే భాషలో పదాలకు సంబంధించిన ఈ ప్రాతినిధ్య స్వభావం మరింత ఎక్కువగా ఉంటుంది. మాటల్లో అయితే చెప్పే మనిషి హావభావాలు ఉంటాయి. రాతలో హావభావాలుండవు కాబట్టి, పదాలే తమ పని చేసుకోవాలి. అందువల్లనే పదాల ఈ స్వభావాన్ని, అంటే ఇవి కేవలం ప్రతినిధులే కాబట్టి, అనుకున్న భావానికి తగిన ప్రతినిధులను, అంటే పదాలను ఎన్నుకోగలిగిన వారు చక్కగా రాస్తారు. ఇదే సూత్రం కవిత్వానికి కూడా వర్తిస్తుంది. కవిత్వంలో చెప్పదలచుకుంది, ఎలా చెప్పదలిచామో అలా చెప్పామా లేదా అన్నది మనం తెలుసుకోవాలంటే మనం వాడిన పదాలు మన భావానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయా లేదా అన్నది మనం సరిచూసుకోవాలి. అందువల్లనే సెల్ఫ్ ఎడిటింగ్ అనేది అవసరమవుతుంది. నేను రాసిన కవితను నేనే ఎడిట్ చేసుకోవాలంటే, నాకు వచనానికి కవితకు మధ్య తేడా తెలియాలి. నాకున్న పరిమిత పరిజ్ఙానంతో ఈ రెండింటికి మధ్య తేడాను ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకున్నాను. ఇందులో లోపాలు ఉండవచ్చు. పెద్దలు వాటిని సూచిస్తే సరిదిద్దుకుంటాను. ఆ ఉదాహరణ ఏమంటే... చీకటిలో మన చేతిలో ఒక టార్చిలైటు ఉందనుకోండి. టార్చి లైటు ఆన్ చేస్తే వెలుతురు ఒక బీమ్ లాగా కొంత ప్రాంతంపై పడుతుంది. అక్కడ ఉన్న వస్తువులు మనతో ఉన్న వారికి కనబడతాయి. ఆ కొద్దిపాటి ప్రాంతం తప్ప మిగిలినదంతా చీకటే ఉంటుంది. వచనం ఇలాంటిదే. మనం కొంత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలనుకున్నప్పుడు ఆ సమాచారంపై వెలుగు పడేలా పదాలను వాడుకుని వారికి చెబుతాం, లేదా రాతపూర్వకంగా ఇస్తాం. దాంతో నిర్దిష్టంగా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది వారికి అర్ధమవుతుంది. అదే చీకటిలో ఒక దీపం వెలిగించామనుకోండి. ఆ దీపం చుట్టు కొంత మేరకు ఉన్న వస్తువులన్నీ మనకు కనబడతాయి. దీపం ఎంత తేజోవంతంగా ఉంటే అంత ఎక్కువ పరిధి వరకు అందరూ చూస్తారు. ఇందులో కొందరు కొన్ని వస్తువులను చూడవచ్చు. కొందరు వేరుగా మరి కొన్ని వస్తువులను చూడవచ్చు. కొందరు చెట్లు చూడవచ్చు, కొందరు వాటిపై ఉన్న పూలను, మొగ్గలను కూడా చూడవచ్చు. ఇది దృష్టిపై ఆధారపడి ఉంటుంది. కవిత్వం ఇలాంటిదే. ఇది టార్చిలైటులా కేవలం నిర్దిష్ట ప్రదేశాన్ని మాత్రమే చూపించదు. ఒక విస్తృత పరిధిని చూపిస్తుంది. ఆ పరిధిలో చూపులకున్న శక్తి మేరకు చూసే అవకాశం ఉంటుంది. కవిత్వం భావ విస్తృతి కలిగి ఉంటుంది.. అన్ని కోణాల నుంచి వస్తువుపై వెలుగును ప్రసరిస్తుంది. అన్ని కోణాల నుంచి దర్శించే అవకాశాన్నిస్తుంది. దీపం చిన్నదే ఉంటుంది. కాని వెలుగు చుట్టూ ప్రసరిస్తుంది. అలాగే కవిత చిన్నదే కావచ్చు, కాని ఒక గ్రంథాన్ని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. ఈ ఉదాహరణ నాకు వచనానికి, కవిత్వానికి మధ్య కొంతవరకు తేడా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడింది. కాబట్టి నేను రాసే పంక్తలు కవిత్వం అనబడతాయా లేదా అన్నది తేల్చుకోవాలంటే, నేను రాసిన పంక్తులు నేననుకున్న భావాలను పూర్తిగా పాఠకులకు చేరవేస్తున్నాయా? నేను అనుకోని, నా ఊహకు కూడా తట్టని భావాలు కూడా ఆ పంక్తుల్లో ఉన్నాయా? అన్నది నేను చూసుకోవడం నా కవిత పదునెక్కడానికి అవసరం. ఇంతకీ పదునెక్కడమంటే ఏమిటో చెప్పలేదు కదా... అసలు నేను రాసిన ఈ పంక్తులు మీకు నచ్చితే అప్పడు మరో పోస్టులో ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సెలవు.

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lXrMo8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి