పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

25, మార్చి 2014, మంగళవారం

Usha Rani K కవిత

మరువం ఉష | ప్రవాస పునాదులు ---------------------------------- "ప్రవాసం" అంటే అనాధారిత ప్రతిపాదనలు, తుడవలేని అపోహలే కొన్ని మెదడు కొలతల్లో- పాదమిడిన ఉత్తర క్షణమే పట్టుపానుపుల పవళింపులని పాలరాతి మేడల నివాసమని ఎడతెరిపిలేక కురిసే కాసులని కడగండ్లు చొరని కాపురాలని: సగ జీవితం గడిపిన దేశాంతర వాసపు కథ కాని కథ- అనుభవాలే ఆత్మకథలు కాదా? నిరుద్యోగ భత్యపుయాచన తో మొదలైన యాత్ర ఇది! తొలినాళ్ళలో, తబ్బిబ్బయ్యే మనసుతో తడబడే ఉఛ్చారణతో, తెలియని భయాలతో కట్టుబొట్టు లో అమిరీఅమరని అసౌకర్యంలో తెగిపడిన జ్ఞాపకాల చిట్టాలివి యాంత్రిక వనాలలో మంద విడిన మేకలా నోరెండిన పసి బిడ్డని చంకనేసుకుని గుక్కెడు నీటికి అర్రులు చాస్తే "Dollar a bottle" అంటూ దాహపు వెల కట్టిన నేలలో నెర్రెలు విచ్చిన మానవత్వాన్ని పరిచయం చేసుకున్నాను అర్థరాత్రి నిద్రకొరిగిన ప్రపంచంలో నిర్జనమైన రైలుస్టేషనులో, చేతిలో సొమ్మున్నా చిల్లర ఇవ్వ/లే/ని యంత్రపర నిబంధనతో ఎటూ తోచని విధిలో, అపరిచితుని వెదుక్కుని "do you have 2 dollars" అన్నదానికి అర్థాంతరం ఉన్నదని, అది యాచకుల ఊతపదమని దినపత్రిక వెనుగ్గా వినవచ్చిన విసుగు, ఎగిరొచ్చిపడిన డాలరు కాసుతో నిర్విచేష్టురాలినయ్యాను అమ్మ ఉత్తరమో, ఉద్యోగ ప్రకటనలో రావాలని అర్రులు చాస్తే, పేపరు కట్టలు వేలు వస్తాయి: మెయిల్ బాక్సుల్లో కొత్త ఉత్పత్తుల వార్తలు, ఊరి వారి వేడుకల వార్తలు మోస్తూ. 'ఇంతంత కాగితపు అచ్చువేత కి ఎక్కడిదయ్యా సొమ్ము?' "Junk Mail" అని చెత్తకుప్పల్లోకి విసిరిపడే శ్రమ నష్టం బేరీజు వేసాను అందుకే ఎవరు వీసా వచ్చిందని వార్త పంపినా రెండుమాటలతో కార్డుముక్క రాసిపడేసేదాన్ని అప్పట్లో, డాలర్ పైన పోస్టల్ స్టాంప్ అతికించి మరీ! "నీళ్ళు కొనుక్కోవాలి రా అబ్బీ, చిల్లర మార్చుకుని వెంట ఉంచుకోవాలి సుమీ!!!" అంటో "నీ చిరునామాకి ఎక్కువగా వచ్చి చేరేది నీకక్కరలేని వార్తలేనని" కలుపుతూ- (1994 అనుభవాల నుంచి) 25/03/2014

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h2qr1c

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి