భాష వేరు .. రాజకీయాలు వేరు … ” మా తెలుగు తల్లికి మల్లె పూదండ ” లో ’ రుద్రమ్మ భుజ శక్తి ’ అన్న ఒక్క పదం తప్ప, మా ప్రాంత ప్రశస్తి ఏదీ లేదంటూ కొందరు తెలంగాణ ప్రాంతీయులు నిరసించిన సంగతి విదితమే ! అయితే శంకరంబాడి సుందరాచారి కవి ఆ గీతాన్ని రచించింది 1939లో. కోస్తా, రాయలసీమలతో కూడిన తెలుగు ప్రాంతం మరి కొన్నాళ్ళకు మరో తెలుగు ప్రాంతమైన తెలంగాణంతో కలిసి ’ఆంధ్ర ప్రదేశ్’ ఏర్పడుతుందన్నది అప్పటికి ఊహించి, గీతాన్ని రచించాలి – అనుకోవడం అత్యాశే అవుతుంది. పైగా, ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు కవులకు తెలంగాణ ప్రాంత ప్రశస్తి, ఇతర చారిత్రిక వివరాలు తెలిసే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ. కాబట్టి ఆ కవిని తప్పు పట్టవలసిన పని లేదని, ఆ గీతాన్ని నిరసించవలసిన అవసరం లేదని అందరూ గ్రహించాలి. ఆ గీతంలో – రెండవ చరణంలో తెలుగు వారు గర్వించ దగ్గ మహనీయుల ప్రశస్తిని అద్భుతంగా అందించారా కవి. ఆ చరణాన్ని ఒకసారి చూద్దాం - ” అమరావతీ నగరి అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై, నిఖిలమై నిలచి యుండే దాక … (*) రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక … (*) నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “ అయితే, ఇందులో (*) గుర్తు పెట్టిన పాదాలు రెండూ దాదాపుగా ఒకే అర్థాన్ని ఇస్తూ పునరుక్తి అవుతోంది. అందులో మొదటి దాని బదులు (అదే ట్యూన్ లో) – ” పోతన్న కవన మందార మకరందాలు ” అని అంటే … ఏ గొడవ లేక పోను ! అసలు సుందరాచారి కవి ఈనాడూ జీవించి ఉంటే, ఈనాటి వాదోపవాదాలకు నొచ్చుకొన్నా – తెలంగాణ ప్రాంత ప్రశస్తిని వర్ణిస్తూ ఇంకో చరణం వ్రాసి ఉండే వారని నాకనిపించింది. ఆ తలంపు రాగానే, తెలంగాణ ప్రాంత మహనీయుల ప్రశస్తిని వర్ణిస్తూ, పై చరణం ట్యూన్ లోనే, అదే శైలిలో ఒక చరణం నా గుండెలోనుండి తన్నుక వచ్చింది. ” రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు గోపన్న గొంతులో కొలువైన రాగాలు పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు పోతన్న కవన మందార మకరందాలు రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి, మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక … నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “ రాష్ట్రాలుగా విడిపోయినా … నా మనసులోని మాట ఒకటే - ” జై తెలుగు తల్లీ !!! “ సవరించిన గీతం మొత్తంగా ... మరొక్కసారి - మాతెలుగు తల్లికీ మల్లెపూదండ - మాకన్నతల్లికీ మంగళారతులు - కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి! ||మాతెలుగు తల్లికీ|| గల గల గోదారి కడలి పోతుంటేను… బిర బిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను… బంగారు పంటలే పండుతాయి! మురిపాల ముత్యాలు దొరలుతాయి! ||మాతెలుగు తల్లికీ|| అమరావతీ నగర అపురూప శిల్పాలు - త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు - తిక్కయ్య కలములో తియ్యందనాలు - నిత్యమై నిఖిలమై నిలిచియుండే దాక - మొల్ల కవితా శక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి - మాచెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలే ఆడుతాం! – నీ పాటలే పాడుతాం! ||మాతెలుగు తల్లికీ|| రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు - గోపన్న గొంతులో కొలువైన రాగాలు - పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు - పోతన్న కవన మందార మకరందాలు - రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి, మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి - మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక … నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం - జై తెలుగుతల్లి ! జై తెలుగుతల్లి !! జై తెలుగుతల్లి !!! — *** — ఇది 2008లో "Dr. Acharya Phaneendra" అన్న నా బ్లాగులో నేను ప్రచురించిన నా పాత టపా. రాష్ట్ర విభజన జరుగుతున్న ఈ సందర్భంలో దానిని మళ్ళీ ప్రచురించాలని అనిపించింది. చివరలో మొత్తం గీతాన్ని ప్రచురించాను. - డా. ఆచార్య ఫణీంద్ర
by DrAcharya Phaneendra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ko6MZr
Posted by Katta
by DrAcharya Phaneendra
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ko6MZr
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి