పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

Shivaramakrishna Penna కవిత

సమాంతర ప్రవాహాలు..... "We read the world wrong and say that it deceives us" ఎందుకైనా మంచిది, ఈ పద్యానికి ముగింపు ముందే చెప్పేస్తాను. సామాన్యులు జీవితం నుంచి పాఠాలు నేర్చుకుంటారు; మేధావులు గుణపాఠాలు నేర్చుకుంటారు. ఏ కొమ్మా తాను మోయలేనంత బరువైన పూవును పూయదు. ఆధునిక వసుదేవుడు ట్రాఫిక్ యమున దారి ఇస్తుందని వేచి ఉండడు; నదికి తానే దారి ఇస్తూ స్వప్న శిశువులను ఆవలి తీరం చేరుస్తాడు. రాయి విసిరితే దోసిట్లో రాలే పండు కాదు సూర్యుడు. శిలువలైన కలలన్నీ ద్రోహమూర్తులే ! నీడలో నిల్చుని ఒకడు వెలుగును వెక్కిరిస్తుంటాడు ! మరొకడు నీడల కొలతలు తీస్తూ వెలుగుకు వెలకడుతుంటాడు ! వెలుగులోనే వ్యవసాయం చేసే వాడికి నీడలు గడియారపు ముళ్లు ! ఒకడికి అశ్రుబిందువు, ఎటునుంచి చూడాలో తెలియని నైరూప్య చిత్రపటం. మరొకడు అశ్రువులో ఒకవైపు సముద్రాన్నీ, మరోవైపునున్న సప్తవర్ణ రంగవల్లినీ ఒకేసారి చూస్తుంటాడు. గాయం, బ్రతుకు ప్రియురాలు తీర్చిన గోరింట ! వాంఛా పుష్పంలో వేదనా మకరందం ! ఏకాంతంలో కన్నీటి బృందగానాన్ని వినలేని వాడు ఎత్తిన పిడికిళ్ళ ప్రవాహంలో రాలుతున్న ఒంటరి కన్నీటి బొట్టులోని రోదసిని చూడలేడు ! నింగి ఎడారిలో సూర్యుడు కూడా నగ్నపాదాల బాటసారి ! క్షతగాత్ర వేణువు, ఆర్తనాదమే స్వరప్రస్తారం ! "కన్నీరొకచుక్కున్నచో ఏకష్టమైనా భరియింతును" అనే గోరటి వెంకన్నకు కోరస్ పాడతారు, కనులున్నంత కాలం కన్నీరు ఉంటుందని అనుకునేవారు ! వారు క్షణంలో నడిచే నిలువెత్తు కన్నీటి చారికైపోతారు. మరు క్షణం కన్నీటి కొలిమిలో పదునెక్కి కాంతి ధారల ఖడ్గాలై అవతరిస్తారు. స్వేద బిందువులను తుడుచుకున్నంత అప్రయత్నంగా కపోలాల మీది రెండు జీవనదులను తుడిచేసుకుంటారు. ఇక ఉపోద్ఘాతాన్ని ఆపి పద్యాన్ని ప్రారంభిస్తాను ! మేధావులకు తమకలల చుట్టూ అల్లుకున్న సాలెగూడు ఒక కాంతి పరివేషం. ఇతరులు తొలిపొద్దు లేలేత కిరణాల దువ్వెనలతో కనుల మీదికి జారుతున్న కలల ముంగురులను సవరించుకొని నిత్య నూతన సంగ్రామానికి సన్నద్ధమవుతారు ! ***************** "దీప ఖడ్గం" (2008) కవితా సంపుటి నుంచి.....

by Shivaramakrishna Penna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gqvYOs

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి