పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

సిరి వడ్డే కవిత

ll ఎంత స్వచ్చమైనదంటే నీమనసు ll పచ్చకోక చుట్టుకున్న మా కోనసీమ పరువమంత తెల్లవారే తొలిసంధ్యలోన తుళ్ళిపడే పల్లెపడుచు ప్రాయమంత మమతలు అల్లుకున్న పల్లెసీమ మనసులంత ప్రతి లోగిలిలో దిద్దుకున్న రంగవల్లుల సోయగమంత అమ్మవడిలో కొసరి కొసరి తిన్న పాలబువ్వంత చదువులమ్మ బడిలో పట్టి పట్టి విద్యను నేర్పిన గురువులంత పెదవులపై పదిలమై నిలిచిన ఆత్మీయపు చిరునవ్వంత మదిలో నింపుకున్న నిండైన నీ ప్రేమంత మాపంట చేలపైన వీచే పైరగాలంత ఏటి అలలపై ఊయలూగే తెరచాప నావ అంత సెలఏటిపై తేలియాడే తరగల పాల నురుగులంత ఇసుకతిన్నెలతో కట్టుకున్న గుజ్జనగూళ్ళంత మా పల్లె పరవశించి పాడుకునే జానపదమంత చిగురుటాకుపై జారిపడే మంచుబిందువంత నాన్న ప్రేమలోని బాధ్యతంత అమ్మ మనస్సులోని స్వచ్చతంత అన్నదమ్ముల అనురాగమంత అక్కచెల్లెళ్ళ అభిమానమంత పాపికొండల మాటున తొంగి చూసే జాబిలంత అంబరాన వెలిగే తారా దీపమంత హరివిల్లులోని వర్ణమంత హంసల్లలే తేలియాడే తెలిమబ్బులంత. గుమ్మపాలు తాగి గెంతులేచే లేగదూడలంత గున్నమావి కొమ్మపైన గూడులల్లిన బుల్లిగువ్వలంత మధువులకై వేటాడే తుమ్మెదల మురిపమంత రెమ్మన ఊయలలూగే కమ్మని పాటల కోయిలమ్మలంత మా పెరటిలోన ముద్దు పూబాలలంత మా ఇంటి గడప తోరణమంత మా ఇంట పెరిగే బుజ్జి కూనలంత మా ఊరి కోవెల గంటల సవ్వడంత గోధూళివేళ సింధూర వర్ణమంత ఆమనిలో పూవని అందమంత తొలకరి పరిమళమంత మలయమారుతాల చల్లని స్పర్శంత ధరణిని చీల్చుకువచ్చే చిట్టి అంకురమంత వెన్నెల్లో గోదారి అందమంత కొనేట విరిసిన కలువభామ సౌందర్యమంత "సిరి"మల్లెలోని తెల్లదనమంత గరికపూలతో చెలిమి చేసే చిన్ని క్షీరదమంత అలుపెరుగక గూడునల్లే సాలీడు నేర్పంత వయారంగా అల్లుకుపోయే కుసుమలతలంత పిల్లగాలితో ఊసులాడే వరికంకులంత నీ నవ్వులకు దొర్లే ముత్యమంత నీ కన్నుల మెరిసే నీలమంత నీ చెక్కిలిపై జారిపడే కెంపులంత నీ పదాలకు మురిసే పగడమంత మచ్చలేని జాబిలంత వెచ్చగ తాకే తొలి కిరణమంత పసిపాపల బోసినవ్వులంత వసివాడని పూవులంత. ll సిరి వడ్డే ll 20-03-2014

by సిరి వడ్డే



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qYxbkR

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి