నెప్పుల నెమలీకలు..!! ~~~~~~~~~~~~~~ పల్చగా సుతారంగా, కేవలం స్పర్శ మాత్రమే కాదు నెప్పి కూడా ప్రయాణిస్తుంది.. ఒకానొక సమయంలో సహస్ర ఘంటికానాదం గుండెల్లో కొట్టుకొని, తెగని శ్లేష్మంలా ఎంత ఇబ్బంది పెడుతుందో, ఆగక చూసే కాంక్షా చూపులా బాధ ఎంత బాధిస్తుందో చెప్పలేము.. కలుస్తారు ఎవరో, నమ్మకంగా చెప్తారు, నెప్పిలో కూడా నీతోడుంటాం అని.. ఎలా ఉంటారో అర్ధం కాకపోయినా వినటానికి బాగుండి, కృతజ్ఞతగా అనిపిస్తుంది. ఆ భావం కొంచం ఎక్కువ అవగానే, కొంచం భారంగా ఉంటుంది, మరో కొత్త నెప్పి మొదలవుతుంది. ఎందుకొచ్చిన ప్రయాసలే ఇదంతా ! ఆణువణువూ విచ్చుకోవటం, శృంగారంలోనే కాదు, శారీరక బాధలో కూడా తెలిసొస్తుంది. అలాగే ఉన్నాడో లేడో తెలీని దేవుడి జాడ కూడా.. కనబడని దేవుడు , వినపడని ఆకాశవాణి , నరనరాన ముంచేసి ... కదనరంగం చేసే ఒకానొక సమయాన ... భలే యాతన వంటి నవ్వు కూడా వస్తుంది ... నిజమే.. మానసిక బాధ ముందు శరీరం ఏముంది ? ఈక ముక్క అంటారా ? కానివ్వండి. కొత్తగా చెప్పేదేముంది.. ఒక్కోచోట ఒక్కోబాధ, ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ, వొళ్ళంతా నేప్పెట్టే సూదుల మయమై, మనమంటే శరీరమే అనిపించే ఓ క్షణాన .. పొడి దగ్గు కి ఒకటే హడావిడి పడి మందు తీసుకుంటున్న స్నేహితురాలిని అడిగాను.. ఎందుకంత గాభరా పడుతున్నావు? కొంచం టైం ఇవ్వు తగ్గుతుంది’ నా టైప్ మోటివేషన్ కొంచం అరగదీసి పోసి, నేనేదో ఇరగదీద్డామనుకున్నా..!! సిగ్గుపడి, మొహమాటపడి, అసహ్యపడుతూ చెప్పిందామె... నన్ను దగ్గరకి తీసుకుంటే , నా దగ్గు మావారి మూడ్ ని పాడుచేస్తోందట.. తిట్టే తిట్లకు, ఎదిగిన పిల్లలముందు అభాసు అవుతోంది.. ఆహా ..ఆడతనమా, నువ్వంటే ఎంత మర్యాద! ఆహా మనిషితనమా, మగాళ్ళకి వచ్చిన దగ్గులు వొగ్గు కథలు కాబోలు, ఓ రెండు తగిలించాలన్నంత కోపం వచ్చింది. దగ్గు రావటం ఏదో , పాతివ్రత్యం లా కనబడని విషయం కోల్పోయినట్టు బాధ పడుతున్న ఆ ముగ్ధ సుందర నారీమణి ని చూస్తే, తరతరాలుగా మేము బానిసలమే, కుక్క గొలుసులాగ, సూత్రపు పటకా అక్షయ తృతీయ నాడు కొనుక్కున్నామంతే అని .. ఇల్లెక్కి కూస్తున్న మోడరన్ మహాలక్ష్మిలను తలచి, వగచి, గతించితిని..!! నెప్పి సీతాకోక చిలుక లాంటిది కూడా... భరించలేని లార్వా దశ భరించాలంతే ... మూలన పెట్టి మూల విరాట్వి , మూల పుటమ్మవి అంటూ మెడ పాశాలు పెడుతూ ఉంటె భరించటం లేదూ.. ఇది కూడా అలాంటిదే..!! కొన్ని నెప్పులు నెమలీకల లాంటివి, ఎంత సమయం పుస్తకాల్ల్లో పెట్టినా ,అలానే ఉంటాయి. పిల్లలు పెట్టవు, అది ఎంత పెద్ద హాయో అనుభవిస్తే గానీ తెలీదు..!! చురుక్కుమనిపించే మాటల తోటల్లో, రాలిన పిందేల్లా అపర్ణాహ వేళల్లో, కళ్ళముందు కదలాడే నిశిలా శరీర స్పృహ తెలిసే నెప్పులు , కాస్సేపు మనసు మనస్సాక్షి లాంటి పడికట్టు మంత్రజాలాల్లోంచి మనల్ని బయట పడేస్తాయి శరీరం లేనిది మనసెక్కడుంది? చెంపదెబ్బ కొట్టి , మాటలతో అనునయిస్తే నేనే , సర్వ జగన్నియామక భవానీ భర్గ పాదాంబుజ ధ్యానైకాత్మికనేని .. ఇలా ఎన్ని శపధాలు చేస్తే ఏం లాభం ? అర్ధమవుతోందా... శమించని శరీరమా ? --సాయి పద్మ
by Sai Padma
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fW6Avv
Posted by Katta
by Sai Padma
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fW6Avv
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి