||ఎడారిపూలు|| శీర్షిక : నవ సమాజంలో వేశ్యని చూస్తున్న తీరుని.. తన జీవితాన్ని ఆవిష్కరించే కోణాన్ని విపులంగా వివరంగా విన్నవించే ప్రయత్నమే నా ఈ కవితామాలిక.. "ఎడారిపూలు" దేవుణ్ణి పూజించి దారుణాల్ని ప్రోత్సహిస్తాం, మూగజీవాలను బలిచ్చి మొక్కుబడులని చెప్పుకుంటాం, దిక్కులేని బీద బాలికలలో దేవదాసీలను సృష్టిస్తాం, బలిపశువలను చేసి బరితెగించారని హేళన చేస్తాం, విధి వంచితలైన వనితలను వేశ్యలుగా మారుస్తాం, జీవితమనే పదానికి వికృతమనే అర్దాన్ని నేర్పిస్తాం, అయినాసరే మనుషలం మనం.. మంచివాళ్ళమని చెప్పుకుంటాం!! చీకటి నీడల్లో విరక్తిని మింగి మెతుకులకోసం బతుకుని వేలం వేసి ఋతువేదైనా రతీ రాణి తానై ఋతుక్రమమైనా రక్తిని పంచుతూ రాకాసి రోగం ఱంకెలు వేసినా, రక్తం విరిచినా రోదన చూపక రెక్కల కష్టాన్నే నమ్ముకుంటుంది.. వేశ్య కదా పాపం, ఎవరితోను చెప్పుకోదు!! ఎందుకంటే మంచి మనుషలం మనం..., ఏ క్షణంలో కూడా చెడుని వినం..!! తోడులేని ఒంటరితనంలో దిక్కులేక మౌనంతో కేకలు వేస్తుంటే వీచే గాలి సైతం జాలితో చూసి తన పైటంచుతో కల్లు తుడుస్తుంటే నడ్డినంటిన నాభిని చూడగ జాతిలేని వీధి కుక్కల గుంపు గుమ్మిగూడి మాంసపు ముద్ద ధరని అడిగి అంగటిలో సరుకని పదే పదే గుర్తుచేస్తున్నపుడు ప్రశ్నించలేదు.. వేశ్య కదా తన కష్టాయణం వినపడదు ఎందుకంటే మంచి మనుషలం మనం..., ఏ క్షణంలో కూడా చెడుని మాట్లాడం..!! చిగురించే విత్తుకి సూరీడే అండ కానీ తన ఆశలపైరులో కీచక పర్వాలు దుశ్శాసన దుర్మార్గాలే దారినిండా.. డబ్బిచ్చి కులుకు మగాడు రసికుడని దేహకూలీ అయిన తను జాతిహీనమని ఆధునిక సమజమిచ్చిన తీర్పుకి లెక్కలేనన్ని కన్నెరికాలను కానిచ్చింది వేశ్యే కదా తన గోడుని పట్టించుకోము ఎందుకంటే మంచి మనుషలం మనం..., ఏ క్షణంలో కూడా చెడుని చూడం..!! వికసించే మందారమే ప్రతి మగువ రంగులు వేరైనా అందానికి నిలయమే అతివ కానీ ఎంతందమున్నా.. ఎన్ని రంగులున్నా అంతులేని అంతరంగాల గతాలను మింగి తుమ్మెదలతో వ్యాపారం చేసే ఈ ఇంతి పెళ్ళిచేసుకోని ఒక గొప్ప పతివ్రత అవే లక్షణాలున్నా వివక్షకు గురై వాటి ఉనికినే మరిచాయి ఈ విరులు.. తేనెని కాక కన్నీటిని చిందే ఎడారిపూలు!! #సంతోషహేలి 09MAR2014
by Santosh Kumar K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ioArVc
Posted by Katta
by Santosh Kumar K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ioArVc
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి