గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -7 ----------------------------------------- పంచభూతాలు - దహన దృశ్యాలు - - - - -- - - - - - - - - - - - - - - - - - - - దేవిప్రియ మోడువారిన చెట్టు చిటారు కొమ్మన చిగురించిన ఒక ఆకు కిటికీలోంచి చూపించి కదా ఏమైనా రాయమన్నావు నువ్వు... ఇదిగో చూడు తలుపులు బార్లా తెరుస్తున్నాను... భూమీ, నీరు, ఆకాశమూ, గాలీ, నిప్పూ కూడా ఒకేసారి భగభగ మండుతూ తగలబడిపోతున్న దృశ్యాలు చూడు... భూమి కంపించి నెర్రెలు బారిన గుజరాతు నాగటి చాళ్ళలో మొలిచిన బారెడేసి కరవాలాల మీద కుండపోతగా కురుస్తున్న మనిషి రక్తం చూడు నినాదాలు ఏవైతేనేమి, వివాదాలు ఏవైతేనేమి, పచ్చి నెత్తురే కావాలనే కక్షుద్ర దేవతలు, మతోన్మత్త మత్తేభాల మీద విచ్చుకత్తులు ధరించి ఊరేగుతున్న పాశవిక ఉత్సవాన్ని చూడు... చెలరేగుతున్న ఎడారిగాలుల హోరు చూసి తడారిపోయిన గొంతుతో తల్లడిల్లుతున్న ఆమె ప్రాణాల అవస్థ చూడు... రక్తపు టేరుల్లో నెత్తుటి జండాలు ఎగరేసుకుంటూ తరలిపోతున్న పరిహాస ప్రజాస్వామ్యపు పడవల్ని చూడు కలలు గన్న ఘటనలు నిజమవుతున్న క్షణాలను కన్నుల పండుగగా ఆనందిస్తున్న అత్యాధునిక నియంతల్ని చూడు... కాసేపు జెండాలను మరిచిపోయి కాసేపు నాయకుల ముఖాలు మరిచిపోయి కళ్ళు మూసుకుని చూడు... అంతా రక్తం కాలి పైకెగసిన పొగ అంతా రక్తమాంసాల దుర్గంధం ఇళ్ళ గోడల మీద విద్వేషం ఇనుపగోళ్ళతో గీకిన అస్తిపంజరాల చిత్ర రచన... కళ్ళు తెరిచినా కనిపించే దృశ్యం ఇదే పాలరాతి మహళ్ళలో, చలువరాతి మందిరాలలో తేదీలు తప్ప ఏమీ మారవు... జీతగాళ్ళ, కూలి వాళ్ళ గూళ్ళలో, గుడారాలలోనే దృశ్యాలు మారిపోతాయి ఓట్లు వారికి పదిలమే కోట్లు వారికి పదిలమే... సిగ్గుతో తలవంచుకున్న దేశం సిగ్గుతో తలదించుకున్న మేధావులు సిగ్గులేని రాజకీయాల బరితెగింపు! మోడువారిన చెట్టు చిటారు కొమ్మ మీద చిగురించిన ఒక ఆకుని కిటికీలోంచి చూపించి కదా ఏమైనా రాయమన్నావు నువ్వు... ఏదీ, ఎక్కడ ఆ ఆకు? (AZAAN -Poetry on Gujarat Genocide -2002)
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUlsRB
Posted by Katta
by Sky Baaba
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eUlsRB
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి