పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, ఫిబ్రవరి 2014, బుధవారం

Sriramoju Haragopal కవిత

కొత్త తెలంగాణా నా మట్టితల్లి తెలంగాణా పాలపొత్తిళ్ళలో పొద్దు పొడిచింది నా కన్నతల్లి బంగరునేల పరాయితనం ఒడిసిపోయింది ఏండ్లసంది పూట పూటకు పడ్డ రంధి తీరిపోయింది ఏదెట్లనన్ని గాని కొత్తపురుడు పోసుకున్న తెలంగాణాకు కొత్త నెత్తురు నింపాలె, ప్రజల ఆశల, ఆశయాల ప్రాణం పొయ్యాలె బొమ్మ తెలంగాణా కాదు, మనకు అమ్మ తెలంగాణా కావాలె కనని కష్టాలు, కాని బాధలు పడ్డది ప్రపంచాన ఎవరికి రాని దుఃఖాలు మోసింది ఈ నేల లోకాన ఎరుగని శోకాలు ఓర్చింది ఈ నేల ఎందరు ఈ నేలను విముక్తికోసం ప్రాణాలనదులతో తడిపిండ్రు ఎందరు ఈ నేలమీద ఎన్నడులేని పోరు యుద్ధాలు నడిపిండ్రు వాళ్ళ రుణం ఎట్ల తీరాలె, వాళ్ళ కలలు ఎప్పుడు సాకారం కావాలె ఒకళ్ళను ఎత్తుకుని అమరనివాళులియ్యక మునుపే మళ్ళెందరిని బోనాలదీపాల్లెక్క ఎత్తుకోవాల్సి వొచ్చింది ఇంక ఏరువాక చెయ్యాలె, నాగేటిసాళ్ళల్ల మొలకకలలై వాళ్ళు జెండాలై రెప రెపలాడుతరు కొత్తలకు పెట్టాలె, అమరులకు తెలంగాణా నిండ గండదీపాలు పెట్టాలె గడప గడపకు వాళ్ళు చేసిన త్యాగాల పాటలె వినిపించాలె కొత్త తెలంగాణాకు కొత్తతొవ్వలు తియ్యాలె ప్రజల పెదవుల మీద తెలంగాణా చిరునవ్వుల ఎన్నీల కావాలె బెదిరిపోయిన మన మాటల గువ్వల్ని పిలిచి పలుకులు నేర్పాలె చెదిరిపోయిన మన చరిత్రరవ్వల్ని కూర్చి కొత్తపుస్తకాలు రాయాలె చీకట్లు, తాకట్లు, కనికట్లు లేని ప్రజలపాలన రావాలె తల్లులగర్భశోకాలు, ఉసురు తాకని తెలంగాణా కావాలె మన నదుల నీళ్ళల్ల మన పంటకలలు మెరువాలె కన్నీళ్ళు కడగండ్లు వుత్త యాదిలెక్క గావాలె కోటి రతనాల వీణ కాదు కొత్త ప్రజాకోటి తెలంగాణై నిలవాలె ¬¬¬కోరుకున్న నూతనజనవనమై వసంతాలు నిండాలె మోదుగులు పూసినయి, మామిండ్లు పూసినయి తెలంగాణా కొత్తకోయిల రాగాలు తీయాలె బతుకమ్మ తెలంగాణా, దసర తెలంగాణా పీర్ల తెలంగాణా, సబ్బండ జాతుల సకలతెలంగాణా ఆత్మగల్ల తెలంగాణా, మమతల తెలంగాణా మంచి మనుషుల తెలంగాణా, మహా తెలంగాణా

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1khnNEA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి