" లోకంలో ఉన్న సౌందర్యం ఒక్కోసారి ఒక్కోలా హఠాత్తుగా దర్సనం ఇచ్చేస్తే ఆ సౌందర్యాన్ని వీక్షిస్తూ అనుభూతి చెందడం అనేది ఒక్కోసారి చాలా ఇబ్బందైన పని అనే అనిపిస్తుంది, ఆ సౌందర్యాన్ని చూసిన ఆనందం వల్ల కలిగిన తన్మయత్వపు స్థితిలో ఉన్నప్పుడు ఒక అందాన్ని మించి మరో అందం కంటిముందు కనిపించి కళ్ళెదుటే తిరుగాడుతూ ఉంటే పొందే బాధ స్వర్గమో,నరకమో ఖచ్చితంగా తెల్పలేని భావస్థితిలా తోస్తుంది " ఇంత స్థితి గురించి నేనెందుకు వర్ణించి చెప్తున్నాను అంటే , ఈరోజు జరిగిన ఒక సంఘటన గురించి ముందుగా వివరించాలి.... మా కాలేజులో అమ్మాయిలు ఎప్పుడు కూడబలుక్కుని ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ, ఈరోజు ప్రతీ అమ్మాయి " లంగా ఓణీలు " కట్టుకుని చక్కగా మన తెలుగు వస్త్రధారణలో తయారయ్యి కాలేజుకి విచ్చేసి మాకు కనువిందు చేసేసారు ఒక్కసారిగా...!!! ఉదయం లేచి ఏ ఏ సౌందర్యాలును ఈరోజు ఆస్వాదిస్తానా అని అనుకునే నాకు ఇంత ఊహించని సౌందర్యాలు ఎదురయ్యేసరికి ఏం చెయ్యాలో పాలుబోక అచేతనావస్థకు గురి అయిన వ్యక్తిలా అలా వాళ్ళని చుస్తూ ఉన్నాను అంతే.......!!! " ఈలోకంలో ఎన్ని గొప్ప సౌందర్యాలు ఉన్నాయి? వెతికే ఓపికా,ఆస్వాదించి స్పందించే మనసూ ఉండాలే కాని ఈ లోకంలో ప్రతీదీ సౌందర్యమే.. సౌందర్యం గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలంటే ఈ లోకంలో ముఖ్యంగా కనపడేవి రెండే సౌందర్యాలు. 1. ప్రకృతి తాలూకు సౌందర్యం 2. స్త్రీత్వం తాలూకు సౌందర్యం. నిజమే .....!!!!!! " ప్రభాతసమయాన ఒంటరిగాదారిలో నిశబ్దంగా నడుస్తున్నప్పుడు అప్పుడే వాయి తీసిన ఇడ్లీలు కక్కే పొగలాగ ఉండే పొగమంచూ సౌందర్యమే.! ఆ పొగమంచు కరిగి అప్పుడే విరిసిన పువ్వులపై తొలకరి జల్లులా నిలిచే నీహారికా బిందు సమూహాలూ సౌందర్యమే..!! దారిని, దారికి ఇరువైపులా ఉండే చెట్లను ,పంటపొలాలనూ కనపడనియ్యకుండా చేసే మంచుతెరలూ సౌందర్యమే...!!! ఆ మంచుతెరలు వెనకనుంచి మసగమసగ్గా కనిపించే ప్రభాత సూర్యుని ఆగమనమూ సౌందర్యమే....!!!! ఆ ఆగమనాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ కదిలే మేఘాల కదలికా సౌందర్యమే.....!!!!! రాత్రే ప్రాణంపోసుకుని అప్పుడే విచ్చిన సన్నజాజి పూలూ సౌందర్యమే......!!!!!! చెట్టునుండగానే ప్రాణం విడిచి కిందకి రాలిపడే పారిజాతపూల సొగసూ సౌందర్యమే.......!!!!!!! " ప్రకృతికి పర్యాయపదమైన " స్త్రీ "లో కుడా అంతే సౌందర్యం ఉంది. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఈ భూమికి ఎక్కువ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుందా? లేక ఈ భూమిపై తిరిగే ఈ అమ్మాయిలకి ఎక్కువ ఆకర్షణశక్తి ఉంటుందా అని? (ఎంతకాలం ఆ ఆకర్షణశక్తి ఉంటుందని కూడ ప్రశ్న కాదు). వాళ్ల మాటలు,చేష్టలు కొంటెగా ఉంటాయి,సిగ్గుగానూ ఉంటాయి...!!! స్త్రీలలో ఉండే ప్రధాన ఆకర్షణలలో ఇదోకటి కాబోలు...!!! తరచి తరచి చూస్తే వారి ప్రతీ కదలికా మనకేదో కవిత్వం చెప్తున్నట్లు ఉంటుంది. అందుకే మన పూర్వీకులు అంత గొప్పగా వర్ణనలు చేసేసి రాసేవారు స్త్రీ సౌందర్యం గురించి. సరే మా కాలేజ్లో అమ్మాయిలను క్లాసులు ఖాళిగా ఉండడంవల్లో,మరి అంత ఆకర్షణా వాళ్ల నుంచి నాకు తప్పించుకోవడం చేతకాకో తెలియదు కానీ ఎప్పుడూ అంతలా పట్టించుకోని నేను అలా పరిశీలిస్తూ ఉన్నాను చాలసేపు... " మన తెలుగు వస్త్రధారణలో అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారంటే అసలా అందం వారికి ఆ చీరకట్టుకోవడం వల్ల వచ్చిందా ? ( లేక ) వాళ్ళు కట్టుకోవడం వల్లనే ఆ చీరకట్టుకి అంత అందం ఆపాదించబడిందా అనేది తొలగని అనుమానంలా మనలని వేధిస్తూ ఉంటుంది మనల్ని. " అమ్మాయిలు అమ్మాయిలలా ఉంటేనే ఎంతో బాగుంటారు " అని అనిపించింది ఉదయం వీళ్లను చూస్తే... ప్రస్తుతం శిశిరఋతువు వెళ్తూ వసంతం ఆగమనం చెందే కాలం కదా ఇది? అలానే ఈ అమ్మాయిలు కూడా తమ కౌమారపు వయస్సును వదిలేసి యవ్వనంలోకి అడుగుపెడుతున్నారు కదా? వసంతఋతువు వస్తూంటే ఎంత అద్భుతంగా ఉంటుందో,ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంత ఆహ్లాదం నాకు కనిపించింది వీళ్లను చూస్తూ ఉంటే... " మాటిమాటికీ వారి ముఖపద్మాలపై పడే వారి నల్లని ముంగురులను చూస్తే నాకు అవి తుమ్మెదలేమో అని అనిపించింది. ఆ కన్నుల్లో కూడ కొత్తరకపు అందాలు చోటుచేసుకున్నాయి. క్ర్రీగంటిన ఆ చూపులు , కదిలే ఆ కనురెప్పలు మన్మధుడు గురిచూసి విసిరే బాణాలు.. సంపెంగ మొగ్గ లాంటి ఆ ముక్కుకి ఇంకా అందం తెచ్చిన ఆ ముక్కుపొడకని ఎంత వర్ణించినా తక్కువే, ఇక నవ్వులు... " నవ్వులా అవి నవపారిజాతాలు " అనే పాటని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి ఆ నవ్వులు. ముఖాలలో ప్రవహించే అ నవ్వుదొంతరల సౌందర్యం వర్ణించలేక ఎంతమంది కవులు గింగిరాలు తిరిగారో... నవ్వినప్పుడు సొట్టపడే ఆ బుగ్గలు,ముసిముసి నవ్వుల ముచ్చట్లు,అందులో ఒక అమ్మాయి చెప్పిన విషయాన్ని విని ఆశ్చర్యంగా కనుబొమ్మలు ఎగరేస్తూ తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అందుకు తగ్గట్టుగా అబినయించే సుందరమైన చేతికదలికలూ,మొహంలో ప్రకటించే హావభావాలూ,కదిలేటప్పుడు చేతికి ఉన్న గాజుల సవ్వడులూ ఇవన్ని చూస్త్తూ ఆనందలోకంలోకి వెళ్ళిపోయాను అలా... మెడల్లో ధరించిన ఆ ముత్యాలహారంలోని ముత్యాలకాంతి చందురుని వెన్నెలను ఎగతాళి చేసేలా ఉంది.... చుక్కలు మెరుపులై వాళ్ల చీరాంచుల చివరన మెరుస్తున్నాయి, ఒక అమ్మాయి ఆకాశంలో ఉన్న నీలాన్ని అరువుగా తెచ్చుకుని తన చీర రంగుగా చేసుకుంది, ఇంకొక అమ్మాయి ఏకంగా నీలం రంగు పరికిణీ కట్టుకుని వచ్చింది అందరికన్నా భిన్నంగా...!!! మాటిమాటికీ దోరనవ్వులు నవ్వుతూ నా వంక చూస్తోంది అప్పుడప్పుడూ తన స్నేహితురాలుతో మాట్లాడుతూనే , నవ్వు ఆపుకుంటూ నోటికి చెయ్యి అడ్డంగా పెట్టుకుని ఆ నవ్వునంతటినీ కళ్లచూపులతోనే వెళ్లగక్కుతోంది. ఇక ఆ అమ్మాయిలలో కొందరు తమ వాలుజడలకి పెట్టుకున్న మల్లెలు సూర్యుని ఎండకి కరగని మంచు స్పటికాలు అన్నట్లు ఎంతో తెల్లగా అందంగా ఉన్నాయి. వారి జడలలో ఉండే అదృష్టం పొందిన ఆ పూల సోయగాలకి,వీరి సుకుమారానికి అట్తే తేడా ఏం ఉన్నట్లు అగుపించలేదు నాకు... వారు తలత్రిప్పిన ఒక్కక్షణం అటు చూస్తే చాలు,బెర్ముడా ట్రయాంగిల్ కి కూడా అంత ఆకర్షణ ఉండదనిపించింది,అంత ఆకర్షణ కలిగి ఉన్నారు ఈ రోజు ఈ అమ్మాయిలు మన తెలుగు వస్త్రధారనలో ఉండి. ఎంత ముచ్చత కలిగిందో మొత్తానికి వారి సౌందర్యాన్ని చూసాకా, ఎంతైనా " దమయంతి " వారసురాళ్ళుగా వీళ్ళు, ఇంకో " శ్రీహర్ష నైషదం" రాసే అవసరం మన మగవాళ్లకి ఎప్పుడూ కలిగిస్తూ ఉంతారు వీళ్ళు తమ సౌందర్యంతో.....!!! " - Kks Kiran
by Kks Kiran
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dl9zkA
Posted by Katta
by Kks Kiran
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dl9zkA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి