అనిల్ డ్యాని // నీకు దేనికీ పెత్తనం // ఐనా నీకు దేనికీ పెత్తనం యాదెచ్చుకో ఏనాడైనా ఊహించావా..ఊళ్ళేలావా ఏదో ఒక మూల చెట్టుకింద ఆరే,దారం,గుమ్మటం పట్టుకుని దొర్ల కాల్మొక్కుతూ ఉండక నీకెందుకీ పరేషాన్.... చిక్కటి రాతిరి ని కప్పుకుని చిరుగుల దుప్పటిలో చింతాకంత పొగాకు నముల్తూ ఏ వెనకబాటు రాగమో పాడుకోక నీకెవరు నేర్పిన ఆరాటం తెల్లర్తే నువ్ చూసేది సూరీడ్నే కాని నీకు మొదలయ్యే ప్రభాతాన్ని కాదు నీ కాళ్ళలో కాసిన్ని ముళ్ళని విరగొట్టుకోవాలి నీచేతులకి కాసింత కరుడుగట్టిన మట్టితనం అంటాలి అంగవస్త్రం లేని నీ వంటికి అసహనపు చూపుల చెమటని ఆంటించుకోవాలి నిన్న రాత్రి నీ గుడిసెలో నీవొదిలేసిన ఒంటరి రాగాన్ని నువ్వే పాడుకోవాలి ఏ ఊరికి పొయినా వీధిచివర నువ్ అగపడాలి వీధి చివర శ్మశానపు దారుల్లో నీ ఉనికి ఉండాలి కాలే కట్టెల నడుమ నీ చలి కాచుకోవాలి నాలుగు రూకలిస్తే నవ్వలే లేకుంటే , కాల్మొక్కాలే నీ పడుచుతనాన్ని పక్వానికి రాకముందే పగలగొట్టాలి చంపబడుతున్న నీ వ్యక్తిత్వం సాక్షిగా నీ కోరికలూ చంపబడాలి నువ్వు పుట్టినప్పుడే నీ దినఫలాలు వేరొకరింట్లో రాయబడ్డాయ్ నువ్ తినే గింజల మీద పేర్లు వేరొకరిచే నిర్ణయించబడ్డయ్ నువ్ పుట్టకముందే నీపేరు పాలేరు జాబితాలో చేర్చబడింది ఎక్కడో విన్న హామీనీ అక్కడే మరిచిపో తోలు మందం అనబడే నీకు తోళ్ళు ఒలిచే నీకు ఎవడిస్తాడు ఆధికారం నువ్వు అక్కడేఉండు .... అక్కడే...అక్కడే.....ఊరి చివర వెనుకబాటు గడపమీదే ఉండు ఇవతలికి రాకు అధికారానికి మైల అంటుతుంది ( ముఖ్యమంత్రి పదవి కోసం ఆశపడిన దళితులందరికి అంకితం) 04/06/2014
by Anil Dani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ndioka
Posted by Katta
by Anil Dani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ndioka
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి