అ . . అమ్మ . . అక్షరాలు.. ! ఏం రాయను? అమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్పను? నాలుగు వేల ఏళ్ళ నా భాషను ఏమని వర్ణించను? త్రిలింగ దేశాన పురుడు పోసుకున్న తెనుగు తెలంగ మై పారాడి తెలంగాణమై నడిచి తెలంగానమై తెలుగైన వైనం . .! అన్నమయ్య గళం అద్వైతమై ఆలపించిన భాష "దేష భాషలందు లెస్స" అని అందలాన అందంగా ఊరేగించి ఆముక్త మాల్యద ముక్త కంఠంతో కొనియాడిన భాష ఆష్ట దిగ్గజాల పెదాల అలరించిన పదాల తేట బమ్మెర పోతన్న పోత పోసిన పూదోట యోగి వేమన పద్యాలతో యోగిత్వం ఆపాదించుకున్న భాష సుమతి శతకమై సు మతి నేర్పిన సుస్వరాల భాష శ్రీ శ్రీ హృదయ కలమై కలకలమై నినదించిన భాష తేనె కన్న తీయనైన తెలుగు భాష మల్లె కన్న తెల్లనైన మధుర భాష ఆత్మలను పలికించే నిజమైన భాష ఆత్మీయత ఒలికించే రారాజ భాష రెండు పెదాలను ఒద్దికగా కలిపే అజంత భాష మనసు భాష . . మనసున్న భాష ! పారే సెలయేరులో పశ్చిమపు పాకురేదో తగిలినట్లు సాగే వెన్నెల వెలుగుకు గ్రహణమేదో పట్టినట్టు అరువు తెచ్చుకున్న ఆంగ్ల భాష చుట్టమై వచ్చి దయ్యమై కూర్చుంది అమృతప్రాయమైన "అమ్మ" అనే పిలుపును . . మృత కళేబరపు సమాధుల "మమ్మీ" ని చేసింది అమ్మతనాన్ని అంగట్లో పెట్టి అడుగుల్ని అమ్మ జూపింది "చిట్టి చిలకమ్మ" పలుకులను "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్" గా మార్చింది నేల తల్లిని విడిచి నింగి వైపు సాగే చూపులకు తెలియదు ట్వింకిల్ స్టార్లు రాత్రి పూట చీకట్లోనే మెరుస్తాయని మనసులెప్పుడూ తల్లి ఒడిలోనే మురుస్తాయని.. మైమరుస్తాయనీ . . మేకప్పు వేసుకున్న ముద్దు గుమ్మ "మమ్మీ" అని వగలు పోయినా పగిలిన మోకాలి చిప్ప "అమ్మా..! " అనే తల్లడిస్తుంది . . ! ! ఆవు అంబా అనడం ఎంత సహజమో తెలుగు వాడు "అమ్మా" అనడం అంతే సహజం పులి "మ్యావ్" మన్నా.. పిల్లి గాండ్రించినా పృకృతి విరుద్దమే కదా ! సహజత్వాన్ని వీడి చలించే యే గమనమైనా నేల విడిచి సామే . . కన్న తల్లిని, పుట్టిన గడ్డను, మాతృ భాషను మరచిన నాడు పుత్ర పౌతృలున్నా పుట్టగతులు లేని పున్నామ నరకమే . . ! "పర ధర్మో భయావహ " అన్న గీతా సారమే అనుసారమైతే పరభాష ఙ్ఞాన సముపార్జనకో యానకము కావాలే గాని మాతృ భాషను కలుషితం చేసే, కనుమరుగు చేసే మహమ్మారి కారాదు ! రండి . . రండి . . తెలుగు తమ్ముల్లారా . . అన్నలారా .. అక్క చెల్లెల్లారా పాశ్చాత్యపు మోజు తుఫాను తాకిడికి వణికి పోతున్న తెలుగు భాషను తేట తెలుగు పలుకుల చేతులను అడ్డుపెట్టి గుండెలకు పొదువుకొని కల కాలం కాపాడుకుందాం ! అమ్మ కడుపు నుంచి అపుడే పుట్టినంత స్వచ్చంగా కొమ్మ చివర పూచిన వెన్నెల వన్నెల పూవంత ఇష్టంగా ఆకాశం దాక రెక్కలు చాచి ఎగిరే గువ్వంత స్వేచ్చగా . . ! ఏ దేశమేగినా ఎందు కాలిడినా నిండు మనసుతో మన తెలుగు పావురాయిని విశ్వమంతా ఎగుర వేద్దాం ! ! నిర్మలా రాణి తోట తేది: 10.04.2014
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pJwVZ0
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pJwVZ0
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి