పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Kks Kiran కవిత

" అమ్మాయిల వల్ల ఒక్కోసారి మన అబ్బాయిలలో మనకే తెలియని కొన్ని గొప్ప టాలెంట్స్,క్వాలిటీస్ బయటపడిపోతూ ఉంటాయి.అవి ఎలాంటివి అంటే మనకే ఆశ్చర్యం కలిగించేవిలా ఉంటాయి నిజమా అని నమ్మడానికి. " ముఖ్యంగా ఇష్టపడే అమ్మాయి మెప్పుకోసం , మన తెలివితేటలను నిరూపించుకునే ప్రయత్నాలు మనం చెసేటప్పుడు మనలో మనకే తెలియని కొన్ని యాంగిల్స్ బయటపడిపోయి ," నాలో ఈ రకమైన ప్రవర్తన కూడా ఉందా " అని మనలనే ఆశ్చర్యంలో ముంచేసేలా ఉంటాయి కొన్ని సంఘటనలు . చాలాసార్లు ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు నాకు అనుభవంలోకి వచ్చాయి,మచ్చుక్కి ఒక సంఘటన చెప్తాను ఇప్పుడు. " నేను కాలేజ్లో ఉన్నప్పుడు సంవత్సరం చివర ఎగ్జాంస్ దగ్గర పడుతున్నాయని రివిజన్ చేయిస్తున్నారు మాకు,ఆ రోజు బాగా గుర్తు నాకు,ఫిజిక్స్ చదువుతున్నాం బయట మేము. నాకు ఇష్టమైన అమ్మాయి నాపక్క బెంచ్ పై కూర్చుని మాథ్స్ మేడం చెప్పే లెక్కలు ఏవేవో చేసుకుంటోంది. ఫిజిక్స్ ఆల్రేడి వచ్చేసింది,అయినా చదువూ చదువూ అని చంపుతూ ఉంటే ఇక తప్పక అక్కడ కూర్చున్నా, ఇంతలో మాథ్స్ మేడం బోర్డ్ పై చెప్తున్న లెక్కలను చూసి తలని ఒద్దికగా కిందకి వంచి లెక్కలను చేసుకుంటున్న ఆ అమ్మాయిని చూశాను నేను...!!! ఆహా...!!! ఎంత సౌందర్యవతి ఈమె...? అప్పుడంటే ప్రభంధాలు అవీ చదివేవాడిని కాదు కాబట్టి ఆ సమయంలో ఆ సౌందర్యాన్ని చూసినప్పుడు ఏమీ వర్ణనలు వర్ణించి రాయలేదు కానీ,ఇప్పుడు అప్పటి సీన్ గుర్తుకొస్తూ ఉంటే బహుశా ఇలా రాసి ఉండేవాడినేమో....!!! ఆమె ఫాలబాగం(నుదురు)ని చూసి "అర చందమామ నేలిన దొరగా నెన్నుదురు నెన్నుదురు చిత్తరికిన్ " అంటూ చేమకూర వెంకటకవిలా వర్ణించలేమో కానీ,నేనూ ఏదో తోచిన వర్ణనలు చేసి ఉందును. నుదిటిపై లలటలిఖితంగా బ్రహ్మ ఏదో రాతలు రాస్తాడు అని అంటారు కదా...!!! అలానే "బ్రహ్మ తను సృష్టించిన సౌందర్యమైన వనితలలో ఈమె ఉత్తమమైనది " అని ఒక పలకమీద రాసి దానిని ఈమె విశాలమైన నుదురుగా అతికించి ఉంటాడు అని అనుకుందును అప్పుడు. " చంద్రునిలోని కాంతిని దొంగిలించి ఈమె ముఖంలో నింపి ఉంటాడు ఆ బ్రహ్మ,దానితో కళావిహీనుడు అయిన తన భర్త ప్రాణాలను కాపాడమని కొంతమంది ఆ చంద్రుని భార్యలు బ్రహ్మ దేవుడిని వేడుకుంటే అతను వాళ్ల మొర విని ఈమె చేతి,కాళ్ల నఖాలుగా (చేతి గోళ్ళలా) అమర్చి ఉంటాడు,అందుకే ఆ అమ్మాయి గోళ్ళు అంత కాంతిలీనుతూ ఉంటాయేమో " అని అనుకుందునేమో. గొంతు నుంచి ఏదో 1000 చీమలు కలిసి ఒక్కసారి మాటాడుకున్నట్లు పీలగా,తక్కువ స్థాయి మంద్రంతో మాట్లాడే ఆమె మాటలుచెరకు రసాలను ఆద్యంతం ఓడించేంత నేర్పుకల మాధుర్యాన్ని కలిగి ఉంటాయని భావిద్దునేమో....!!! ప్రభందాలలో వరూదిని,దమయంతి,రంభ,ఉలూచి,సుభద్రాదేవిలను గొప్ప సౌందర్యవతులులా వర్ణించి కావ్యాలు రాసేసిన ఆ కవులు అందరూ ఈమెను ఒకసారి చూసి ఉంటే వెంటనే తమ మనసు మార్చేసుకుని ఈమెనే తమ కావ్యనాయకిగా ఊహించుకునీ తమ కావ్యాలు రాసెయ్యరా ? అనే ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆ మాథ్స్ మేడం చెప్పే ఆ లెక్కలో ఒక లాజిక్ మిస్స్ అయ్యిందని అనిపించింది నాకు. ఆ మేడం " ఒక క్వాయిన్ని పైకి ఎగరేస్తే అది తిరిగి కింద పడినప్పుడు బొమ్మ వైపు పడుతుందా? లేక బొరుసు వైపు పడుతుందా అనే ప్రోబబిలిటీ చెప్పే లెక్క ఏదో కొన్ని కాల్యుక్లేషన్స్తో చెప్తోంది. " వెంటనే నేను ఆమె చెప్పే ఆ లెక్కలో తప్పుని కనుక్కుని " మేడం...!!! మీరు చెప్పే లెక్కలో ఒక తప్పు ఉంది, ఒక క్వాయిన్ని పైకి ఎగరేస్తే అందులో బొమ్మ వైపు ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి దానిపై భూమియొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా పని చేసి ఆ క్వాయిన్ కింద పడేటప్పుడు ఎక్కువగా బొరుసుపడే చాన్సే ఉంటుంది. మీరు ఆ ప్రదేశంలోని గురుత్వాకర్షణ శక్తిని,ఆ క్వాయిన్ బరువుని,గాలి నిరోధకతని పరిగణలోకి తీసుకోకుండా ఇలా సైన్ / కాస్ అంటూ లెక్కలు చేస్తే వచ్చే ఆన్సర్ తప్పుది అవుతుంది " అని అన్నాను. వెంటనే క్లాస్లో అందరూ " వీడెవడ్రా బాబూ...!!! ఏదో సైంటిస్ట్లా లెక్కలు ఏవేవో అంటూ చెప్తున్నాడు " అన్నట్లు చూసారు నావైపు. మేడంకూడా నాదగ్గరకి వచ్చి విషయం అడిగి తెలుసుకొని " అవునామ్మా...!!! నువ్వు చెప్పినట్లు చేస్తే ఈ లెక్క మొత్తం మార్చెయ్యాలమా,అలా అయితే నాకు ఈ రివిజన్ అవ్వదు.ఈ సారికి ఇలానే చేసేనీ వీళ్ళని " అని నన్ను మెచ్చుకుని కాసేపు మాట్లాడింది నాతో . పక్కనే ఉన్న ఆ అమ్మాయి మేడం మాటలు మాటలు విని పకపకా నవ్వింది అప్పుడు, " గలగలాపారే గోదావరి అంత అందంగా ఉంది ఆ నవ్వు. ఆ నవ్వుకి ఉన్న ఆకర్షణ శక్తి ముందు బహుశా ఆ కృష్ణబిలాల ఆకర్షణ శక్తి కూడా తక్కువేనేమో " అని అనిపించింది అప్పుడు. అంత అందమైన నవ్వు ఆ అమ్మాయిది. ఆ నవ్వుని చూడటానికి అప్పుడు నేను ఉపయోగించిన నా క్రియేటివిటీ,నా ప్రయత్నం అప్పుడే నాలోని కొత్త యాంగిల్ని పరిచయం చేసింది. అందుకే అంటున్నా అమ్మాయిల వల్ల మన అబ్బాయిలలో తెలియని టాలెంట్లు బయల్ఫడి మనం ఉన్నతులు అయినా అయిపోతామని. అమ్మాయిల విషయంలో నేను బొత్తిగా పిరికివాడిని.ఆ అమ్మాయితో నేను ఇంత వరకూ మాట్లాడలేదు,కాని తనకు " వీడు అనుకున్నంత వెధవ ఏం కాదు,పర్లేదు మంచోడే,తెలివైనవాడే " అనే అభిప్రాయం నాపై కలగాలని ఇంకా ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేసాను,చేస్తూనే ఉన్నాను. పర్లేదు నాపై మంచి అభిప్రాయమే కలిగిఉంటుందని అనుకుంటున్నను,అయినా అప్పుడే ప్రపోజ్ చెయ్యను,మినిమం 100000 రూపాయలు కూడ సంపాదించకుండా " నేను నిన్ను ప్రేమిస్తున్నాను,నన్ను కూడా నువ్వు తిరిగి ప్రేమించవా ? " అని అనేంత మూర్ఖుడిని కాదు నేను. " నేనేంటో నాకే పూర్తిగా అర్దంకానప్పుడు ఇదిగో నేను ఇది " అని నన్ను నేను ఎలా తనకి పరిచయం చేసుకోగలనన్నది నా ప్రశ్న. ప్రతీ వ్యక్తి తాను ఇంకో వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆమె భాద్యత కూడా తీసుకోగలిగి ఉండాలి.అందుకు సిద్దమైతేనే " ఇదిగొ అమ్మాయి ,నిన్ను నేను ఇలా ప్రేమిస్తున్నాను " అని తన ప్రేమను ప్రకటించే అర్హత వస్తుంది అని అనుకుంటున్నాను. అందుకే ఇంకా ఏం చెప్పలేదు తనకి. ఇంకా ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి,తర్వాత ఎప్పుడైనా రాస్తాను వీలుంటే ఇలా, మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయా ? అంటే ఇష్టపడిన వ్యక్తిని ఇంప్రెస్ చెయ్యడానికి మీరు చేసిన పనులు? ఉంటే చెప్పండి? నా ఇంత పోస్ట్ ని ఓపికగా చదివినందుకు మీకు నా థాంక్స్, మీ స్పందన తెలిపితే సంతోషిస్తాను. - Kks Kiran

by Kks Kiran



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMP7LM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి