పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Patwardhan Mv కవిత

దేవుడు కనిపిస్తాడని: రాత్రి కలలో దేవుడు వినిపించాడు ఒరేయ్ భక్తా ! రేపు నీ వద్దకు వస్తాన్రా అని పాల ఉట్టీలోంచి కారిన పాలు మీద పడ్డట్లు తెల్లారి వెలుగు మీదబడే సరికి మెలకువొచ్చింది. ఇక ఆనాడు నన్ను చూడాలి దేవుణ్ణి చూడపోతున్న వాణ్ణి ఎలా ఉండాలి? నా ముఖాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలి? మొహానికి తాతల కట్టె సందుగ నుంచి ఇంత నిర్మలత్వాన్ని పూసుకున్నాను. నాన్న నేర్పిన నిజాయీతీని ఇంత నీళ్ళలో కలిపి లోపలికి పోసుకున్నాను. మరి దేవుడు ఇంటికి వస్తే మీ అమ్మేదని అడుగుతాడేమోనని హోంలో ఉన్న అమ్మను ఇంటికి తెచ్చి పెట్టుకున్నాను. భార్యను అలా చూస్తావేంరా వెధవా అంటాడేమోనని భయపడి తొలి సారి ఒక కడుపులోతు నవ్వును కానుకగా ఇచ్చాను. ఠంచనుగా ఆఫీసుకు పోయి చేయాల్సిన పనిని కాసింత ముందుకే కరక్టుగా చేసాను ఏమో అక్కడికే వచ్చి "ఏరా వెధవా! ఫుజూల్కు పుక్కడ్ జీతం కదరా" అంటే ఏం చెప్పాలి మరి? దారిలో వృధ్ధులను రోడ్డు దాటించడం అడుక్కునే వారికి బ్రెడ్డు ముక్కల్ని కొనీయడం..... సినిమా మంచి పనులన్నీ సిన్సియర్గా చేసాను. దేవుడొచ్చే దారి దరిద్రంగా ఉండగూడని ఇంటిపక్క చెత్త కుండీలూ,మురుక్కాల్వలన్నీ స్వయంగా శుభ్రం చేసాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు నేను పరిశుభ్రతా పిచ్కారి నయ్యాను. ఆయన ప్రకృతి స్వరూపుడని జ్ఞాపకం వచ్చి హడావిడిగా పూల కుండీలు కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. దూలం మీద పెట్టిన పిచ్చుక గూడును దులిపే దురాలోచనని బలవంతంగా విరమించుకున్నాను. ఆనాడైనా అసత్యాన్ని మేస్తే బాగుండదని నన్ను నేను నిజపు కొయ్యకు టాగ్ చెసుకున్నాను. ఎదురింటి కోడికి తెల్లరంగు వేసే ఆలోచనను బలవంతంగా బ్లాక్ చేసుకున్నాను. దేవుడైతే రాలేదు కానీ ఆనాడు మాత్రం మాంచి నిద్ర వచ్చేసింది. మర్చిపోయాడేమో కానీ మనలాగా మాట తప్పే మనిషి కాదాయె ఎన్నడు చెప్పాపెట్టకుండా వచ్చేస్తాడేమోనని ఆనాటినుంచీ అయిష్టంగానే ఈ ఆచారాలన్నీ కొనసాగించాను. కానీ ఏనాడూ దేవుడు ఎక్కడా ఎదురుపడలేదు. కొన్నేళ్ళయ్యాక నాకే సందేహమొచ్చింది నాకింకా దేవుడు కనిపించడమేమిటి? నేనే దేవుణ్ణి అయిపొయ్యాను కదా అని !!!. 31-01-2014,మంచిర్యాల్.

by Patwardhan Mv



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Lx0Xgm

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి