# నాకు తెలుసుగా...! # నాకు తెలుసుగా...! నువ్వు కూడా సముద్రమంత లోతు అని కానీ ఒడ్డున నిలబడి ఎగసి పడుతున్న అలలే సముద్రమనుకునే జనాలకి మనసు లోతుల్ని తడమకుండా పెదవి మాటలు కొలిచే మనుషులకి పెద్ద తేడా ఏముందని? వాళ్ళని కవ్వించటం మాత్రం తప్పేముందని? పాషాణంలా కనిపిస్తుంది కానీ నీ మనసెప్పుడూ నవనీతమే చిన్నరాయికే భయపడుతుందా సంద్రమెప్పుడైనా...? ఆ రాయి కున్న కల్మషాన్ని కడిగేసి బయట పడేస్తుందిగాని... నీ మనసు మాత్రం ఏం తక్కువ? ఉన్మాదుల మాటల శరాలనే మెత్తని శయ్యగా మార్చుకుంటూ అక్షరాల అంకుశాలతోనే వాళ్ళ మనసుల నగ్నత్వాన్ని బయల్పరుస్తుందిగా... నాకు తెలుసుగా...! నీకు జీవితాలని చదవటమే ఇష్టం అని మనిషితనాన్ని ఆరాధించటం ఇంకా ఇష్టమని ముసుగేసిన మనసులంటే అసహ్యమని ఎంతసేపైనా నీ మనసును చదువుతూ ఉండిపోవాలనిపిస్తుందేమిలా విసుగూ విరామం లేకుండా...! నాకెప్పుడూ నీ మనసులోకి రావాలనిపించదు...! ఒక వేళ వద్దామనుకున్నా బయటకు తోలేస్తావని మనసుల్ని చదువుతూ మనిషిగా ఉండమంటావని తెలుసు కదా మరి ఎక్కడెక్కడి నీ అక్షరాలు నన్ను తమ వద్దకే లాక్కుంటున్నా... ఇంతేనా... ఇంకెక్కడైనా చల్లావేమో అనుకుంటూ వెతుకుతూనే ఉంటా నిశ్శబ్దం నుండి నిశ్శబ్దానికి పరుగులిడే నా ప్రతి క్షణం నీ శబ్దాన్ని తడమకుండా వెళ్ళటమెప్పుడైనా చూసావా? నిన్ను తాకి వస్తున్న ప్రతి క్షణాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా... ‘మనిషి తనం’ గురించిన ఆలోచన ఆ మనిషి మానేసిందా అని? అసంభవాల గురించి అడుగుతావు నీకేమైనా పిచ్చా అన్నట్లుగా వెటకారంగా నవ్వుతూ నన్ను దాటి సాగిపోతుంటాయి మళ్ళీ మళ్ళీ తరచి తరచి చూస్తూనే ఉంటాను నీ మనసుకేసి ఎందుకో ఎప్పుడూ అది నాకు సంద్రం లానే అనిపిస్తుంది పైకి గంభీరంగా కనిపిస్తూ ఎన్నెన్ని దాచుకుంటుందని...! పైపై అలలు చూసి సాగరాన్ని అంచనా వేసే అజ్ఞానపు లోకమిది నీ అక్షరాలని మాత్రం సవ్యంగా అర్ధం చేసుకుంటుందా... ‘మీ వెనకే మేముంటాం...’ ‘నీ తోడుగా నేనుంటా’ లాంటి పడికట్టు పదాల మనుషులతో నీకేం పని? ‘మనిషితనం’ చచ్చిన ఈ మనసులు ప్రక్షాళన కావాలంటే ఈ పడికట్టు పదాల సహచెరులెవ్వరూ పనికిరారు అచ్చంగా నీ లాంటి ‘నువ్వు’ లే లోకమంతా కావాలి... ... సురేష్ రావి 02.02.2014
by Suresh Babu Raavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LCJrat
Posted by Katta
by Suresh Babu Raavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LCJrat
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి