నువ్వూ నేనూ కలిసే
భూమి కోసం పోరాడుతున్న
వీరుల కోసం విప్లవగానం చేశాం -
నువ్వూ నేనూ కలిసే
కశ్మీర్, పాలస్తీనా, ఇరాక్
పోరాటాలను సమర్థించాం ..
చర్చలు.. సభలు.. ఉపన్యాసాలూ...
ఉద్యమ ఆవేశాల్తో ఊగిపొయ్యేవాళ్లం -
ఒకానొక సమయం ఇలా వచ్చింది
ముక్క దగ్గరా మగువ దగ్గరా
మనిషి మనస్తత్వం తెలుస్తుందంటారు..
నువ్వు ఆక్రమించిన నా నేల
ఉద్యమించేసరికి నీ నైజమూ బైటపడిపోయింది!
1
ఏకైక రక్తసంబంధాన్ని ఏడేడు సముద్రాలు దాటనిచ్చినవాడా!
అమ్మగల్లాడిన మా మట్టిమీది ప్రేమను అపహాస్యం చేస్తున్నావా?
మెత్తని నీ మాటకు మురిసిపోయేవాణ్ణి
అది చాకూ అని తేలి విస్తుపోతున్నాను
నీ ఆలింగనంలో గుండెలు విచ్చుకునేవి
ఇప్పుడు బ్రహ్మజెముళ్లు గుచ్చుకుంటున్నాయి
2
ఈ నేలే నిన్ను కవిని చేసిందంటావ్
ఇవాళ ఈ నేలే తన విముక్తికోసం పెనుగులాడుతుంటే
ట్రైటర్స్‌లో ఒకడివయ్యావ్
కుడి ఎడమల తలలూపేవాళ్ళే
ఎవడి ముందు వాడి పద్యం పాడతావ్
తడబడుతున్న నీ పదమే
నీ కలాన్ని నిలదీస్తుంది
3
ఏ నేల నిన్ను తన జవసత్వాల నిచ్చి
పెంచి పెద్ద చేసిందో
ఆ నేలనే తన్నేసి
పరాయి దేశం ఎగిరిపోగలిగిన గద్దా..
నీకు మా మాతృప్రేమ తండ్లాట
ఎలా సమజైతది?
4
ఒక అస్తిత్వం గురించి మాట్లాడుతూనే
మరొక అస్తిత్వాన్ని కాదనడం ఏమనిపించుకుంటుంది?!
మైనారిటీ అస్తిత్వ దీర్ఘ కావ్యమైనవాడా..
స్త్రీవాదపు రెమ్మలై రెపరెపలాడినవారలారా..
సోదర అస్తిత్వాని కొచ్చేసరికి
ఇంగితం ఆవిరైపోయిందా.. కపాలం డొల్లగా మారిందా..
*
కవి అన్నవారికి కన్నెలా మలుగుతుంది..
ఆమ్ ఆద్మీ రోడ్ల మీదికొచ్చి నినదిస్తుంటే
రక్తం ఉరకలెత్తకుండా ఎలా ఉంటుంది..
ఇన్నాళ్లూ విప్లవాల వేషాలేసీ
ఉద్యమాల శిగాలూగీ
ఇవాళ ముడుచుకుపోయారేం..
మిమ్మల్ని ఇన్నాళ్లూ గౌరవించినందుకు
మాకే తలవంపులుగా ఉంది-
సిగ్గూ శరం ఉన్నోళ్ళయితే
ఇన్నాళ్లూ రాసిన ఆ కలంతోనే పొడుచుకోండి
అట్లన్నా కవిత్వం పునీతమవుతుంది!