పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఆగస్టు 2012, గురువారం

నగరంలో పద్యం మరణిస్తుంది //కోడూరి విజయకుమార్ //


శిరసు చుట్టూ ప్రదక్షిణలు చేసే
రంగురంగుల సీతాకోకలు కొన్ని
సీతాకోకల చుట్టూ అల్లుకునే
కొన్ని అక్షరాలు...

పద్యం ప్రాణం పోసుకొంటోన్న అలికిడి
చెవుల్లోంచి గుండెలోకీ, శిరసులోకీ దూసుకొచ్చి
సీతాకోకల్ని చెదరగొట్టే
గడియారం అలారం మోత
ప్రాణం పోసుకొంటోన్న పద్యం కంపిస్త్తుంది

కాసేపు దినపత్రికలు మోసుకొచ్చిన లోకాల్లోకి....
పాలితుల దయనీయ వెతలనార్పే
చల్లని మాటలు ప్రవహించాల్సిన పవిత్ర ప్రాంగణం
ఒకరి బాగోతాల లెక్కల్ని మరొకరు విప్పుకున్న
రాబందుల రాకాసి శబ్దాల నిలయమైన విషాదం
గుక్కెడు నీళ్ళివ్వని మహానగరాన్ని శపించి
మృత్యుబిలంలోకి జారిన ఒక పేదలబస్తీ
నాగరిక జీవనశైలి మొహాన్ని వెక్కిరిస్తూ
పట్టపగలు పగలబడి నవ్విన యాసిడ్‌ బాటిల్‌
లేచి నిలబడి పద్యాన్ని అందుకోవాలని చూస్తాను
ఆఫీసుటైము కాలరు పట్టుకుని ఆపేస్తుంది

మహానగర రహదారుల మీద పరుగులు
నగర జీవితాన్ని కమ్మేసిన పరుగుకు ప్రతీకలు
పరుగుల మీద బ్రేక్‌ వేసే ట్రాఫిక్‌ రెడ్‌లైట్‌
కరెన్సీ కట్టల్ని మింగి పుట్టిన లగ్జరీకారు
రొట్టెముక్క కోసం చేయిసాచే పసిపాప
పద్యం కోపంతో వూగిపోతుంది
పరుగుల్ని గుర్తుచేస్తూ వెలిగే పచ్చలైటు
పద్యం మీద నీళ్ళు గుమ్మరిస్తుంది

దైనందిన నగరజీవిత పరుగుల నడుమ
పద్యం అప్పుడప్పుడూ నాకై చేతులు చాపుతుంది
అందుకోలేని అశక్తత యేదో వెనక్కి లాగుతుంది

రాత్రి పక్కమీద అలసటగా వాలే దేహం
ఉదయపు సీతాకోకల కోసం వెదుకుతుంది
లోపలెక్కడో యేదో కుళ్ళిన వాసన
పద్యం మరణించి వుంటుంది...
ఇక రాత్రంతా శవ జాగరణ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి