పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఆగస్టు 2012, గురువారం

మామిడి హరికృష్ణ || గుప్పిట్లో ఆకాశం.. ||

వేకువ వెలుగులు ముగ్గులల్లడానికి ముందే
రాత్రి మేఘాలు విచ్చిన్నమవడానికి ముందే
నిద్రానిద్ర, కల-మెలకువల ఊగిసలాట సమయాన
ప్రేమైక వాణివై 'సెల్' లో ఆహ్వాన గీతాన్ని పాడుతావు

తొలి ఉదయ వేళనే ఆహ్లాదంగా పలకరించి
స్వర్గాన్ని నా ఎదుట పునర్ప్రతిష్ట చేస్తావు

స్వప్నాస్వప్న జగత్తులోకి చేయిపట్టి తీసుకెళుతూ
అనురాగ కౌగిలిలో వివశున్ని చేస్తావు..

ఇక,
స్వర్గాన్ని చేతితో, కళ్ళతో, నాలుకతో, పెదాలతో
తడుముతూ,చూస్తూ,స్పృశిస్తూ, చుంబిస్తూ
ఆకాశాన్ని గుప్పిట్లోకి ఒడిసి పట్టి
సముద్రాన్ని పుక్కిట్లోకి బిగియ పట్టి
వ్యోమ కాలాల వెంట యెగిరి వెళుతూ
Time- Spaceల భౌతిక పరిమితులను అధిగమించి
పారభౌతిక-పాంచ భౌతిక అవతారాన్ని ఎత్తుతాను..

బింబ ప్రతిబింబాల దోబూచులాటలు
దేహ కోణాల కంపన-ప్రకంపనల-ప్రచోదనాల శ్వాసలు
శరీర మంతనాలు-మనో మధనాల అద్వైతంలో
స్వర్గ ఫలాల తేనియలని
చప్పరిస్తూ, జుర్రుకుంటూ, గ్రోలుకుంటూ ...
అర మోడ్పు కన్నుల మాయాలోకంలో విహరిస్తూ..
అర్దాతీత మూలుగుల స్వర ప్రపంచంలో తేలియాడుతూ..
దాన్నే కొనసాగిస్తూ...
29 August,2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి