పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, ఆగస్టు 2012, గురువారం

భమిడిపాటి // బికారి బ్రతుకు //


వేకువ దుప్పటిని దులిపేస్తూ
అప్పుడే రేగుతున్న దుమ్మును
రోడ్డున పోయే జనాల తిట్లను
గాలి పాటలా వింటూ మొదలైంది ....

మా దారి తెన్నులు లేని
యాచక దారి
సొంత పేరున్నా చెప్పుకోలేని
అందరికి తెలిసిన ఈ బికారి !

ఎవరి కన్న బిడ్డలమో ?
తెలియని అమ్మని
తెలిసి ఎంతో మంది అమ్మలాంటి అమ్మలని
ధర్మం చేయండంటూ ఛీ కొట్టినా వెంటపడుతూ ...

ఒక్కోసారి సిగ్గేస్తుంది
ఏ ఇంటి గడప తొక్కాలో తెలీని మా స్థితిని
ఇలాంటి జీవితాన్నిచ్చిన ఆ దేవుణ్ణి
దయలేని ఆ పైవోడి విదిరాతని !

మాకు మేమే అయ్యేమా !
ఎవరి ఆవేశపు ఆనందానికి రోడ్డున పడ్డామా
మా ఆవేశాన్ని అణుచుకోలేక
మా వారసులకి కూడా ఈ వారసత్వాన్ని కట్టబెడుతున్నామా !

మాలో ఎవరిని తట్టినా
గతంలేని తన జ్ఞాపకానికి మాలో మేమే సాక్షులమంటారు
ఆకలి మంటల కేకల చల్లార్చటానికి
చిల్లర డబ్బుల చప్పుళ్ళకి అలవాటుపడ్డం అని వెర్రిగా నవ్వుతారు ......

రానే వచ్చిన రాత్రికి
దొరికిన జాగాపై మాటేసి
చీకటి దుప్పటి కప్పేసి
రాత్రి చుక్కలకి రాజులం మేమే అంటూ ..మురిసిపోతూ ..కలలో మైమరచిపోతూ ..
.29-08-12

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి